ఉద్యోగం వర్సస్ ప్రేమ

 లఘు చిత్రలోకం

                ఉద్యోగం వర్సస్ ప్రేమ

                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          షార్ట్ ఫిలిమ్స్ లో  నేడు ఎన్నో యువత జీవితంలో ఎదుర్కునే సున్నిత సమస్యలను స్పృశిస్తూ వస్తున్నాయి .అలాంటివాటిల్లో ఒకటే 'ఇదేదో బాగుందే.' ఇంజనీరింగ్ పూర్తి చేసాక నాటి నుండి ఉద్యోగం దొరికే వరకు యువత ముఖ్యంగా ఎదుర్కునే రెండు సమస్యలు దీనిలో కథ ఆధారంగా చెప్పబడ్డాయి.

    కార్తీక్ బి.టెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.అప్పటికే అతను తన క్లాస్ లోనే చదివే చైత్రతో ప్రేమలో పడ్డాడు.వారిద్దరి  మధ్య పెళ్ళికి ఏ  అడ్డంకి వచ్చినా తానూ చూసుకుంటానని కానీ ఉద్యోగం మాత్రం తెచ్చుకోమని చెప్తుంది చైత్ర.మెరిట్ పర్సెంటేజ్ ఉన్నా సరే,ఎన్నో కోర్సులు నేర్చుకున్నా సరే అతనికి ఉద్యోగం రాదు. అప్పటికే ఎన్నో పెళ్లి సంబంధాలు కాదన్నా సరే చివరకు తల్లిదండ్రులు తెచ్చిన సంబంధానికి ఒప్పుకుంటుంది చైత్ర. పెళ్లి కొడుకు ఓ  మంచి కంపెనీలో హెచ్ ఆర్.కార్తిక్ కు విషయం చెప్తుంది.తాను ఎంతగానో ప్రయత్నించినా సరే ఇక తల్లిదండ్రులను నొప్పించలేనని చెప్తుంది ఆమె. దానికి సమాధానంగా కార్తీక్ ఆమె ఫియాన్సీ హెచ్ ఆర్ కనుక తనకో ఉద్యోగం అడగని చెప్తాడు.అలా ఆమె అడిగినప్పుడు సమాధానంగా ఫ్రెషర్ కు ఉద్యోగం ఇవ్వడం కష్టమని, ఓ సంవత్సర అనుభవమైనా లేకుండా ఉద్యోగం సాఫ్ట్ వేర్ రంగంలో దొరకడం కష్టమని అతను స్పష్టం చేస్తాడు.

          ఆ తర్వాత ఆమె వివాహమైపోతుంది. బాధ్యతతో ఆమె,బాధతో అతను ఒకరికొకరు దూరమవుతారు. మరి ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నకు ఓ సమాధానం యువత ఆలోచనల్లో ఈ లఘు చిత్రంలో ఇవ్వడం జరిగింది. కార్తీక్ వందో ఇంటర్ వ్యూ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో అతని జూనియర్,తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అతనికి తన కథ చెప్తాడు.

          అప్పుడే చదువు పూర్తి చేసిన కళాశాల విద్యార్ధులకు రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి ఉద్యోగం దొరకడం.అది తాత్కాలిక సమస్య.అది కొంతకాలానికి పరిష్కారమవుతుంది. రెండో సమస్య ప్రేమ. ప్రేమించిన అమ్మాయి ఎంతో కాలం ప్రేమించిన అతని కోసం తల్లిదండ్రుల అభీష్టం దాటి వేచి ఉండలేదు. ఉద్యోగం రాకపోతే ఆమె కూడా తన తల్ల్దండ్రులను ఒప్పించలేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రేమించకూడదా? అని జూనియర్ ప్రశ్నిస్తే అది కాదని, జూనియర్ లేదా సబ్ జూనియర్ ను ప్రేమిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే అని,అలాగే మన కన్నా చిన్న వయసులో ఉన్న వారు అయితే ఉద్యోగం వచ్చే వరకు వేచి ఉండే అవకాశం ఉంటుందని కార్తీక్ చెప్పడంతో ఈ లఘు చిత్రం ముగుస్తుంది.

          ప్రేమ-ఉద్యోగం మధ్య నలిగిపోయే విద్యార్ధుల కథ ఇది. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ ఇది. కాలేజీల్లో పుట్టే ప్రేమలు సుఖాంతాలు అవ్వాలంటే కచ్చితంగా అబ్బాయికి ఉద్యోగమైనా ఉండాలి.దీనిని తేలికైన విషయంగా కొందరు కొట్టేసినా ఇది యువ మనసుల్ని చిందర వందర చేసే సమస్య. ఈ పరిస్థితుల్లో ప్రేమ ఫలించకపోయినా యువత మూవ్ ఆన్ అవ్వాల్సిందే.

  *  *   *

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ