రైతు భార్య
లఘు చిత్ర లోకం
రైతు భార్య
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
రైతుల
ఆత్మహత్యలు వారి కుటుంబాలను ఎలా అతలాకుతలం చేస్తాయో స్పష్టం చేసే మరాఠి లఘు
చిత్రమే ‘వైశాఖ్.’ జాను భర్త రైతు. ఇద్దరు మగపిల్లలు,ఒక ఆడపిల్ల వారి సంతానం. వారి కుటుంబం ఏ కరువు లేకుండా సక్రమంగా సాగిపోతుంది.
ఆ సంవత్సరం పంట చేతికి రావడంతో ఎద్దు పూజ ఉత్సవాన్ని చేసుకున్నారు.జాను భర్త ఆమె
కోసం కొత్త చీర,గాజులు తెచ్చాడు. ఆ తర్వాత పరిస్థితులు
మారిపోయాయి.
వర్షాలు
లేక పంట చేతికి అందలేదు.అప్పుల భారం ఎక్కువైంది. ఇక చేయడానికి ఏ పని లేక వారి
కూతురు,కొడుకు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నారు.
ఓ నాడు వారి కూతురు మీద ఆ ఊరి జమిందారి కన్ను పడుతుంది. ఆమెను ఆత్యాచార౦ చేయడంతో
పాటు ఆమెను,ఆమెతో పాటు ఉన్న ఆమె తమ్ముడిని కూడా హత్య
చేస్తాడు. కుటుంబాన్ని నడపలేక,అప్పుల భారం ఎక్కువై,జాను భర్త ఆత్మహత్య చేసుకుంటాడు.
ఆ
తర్వాత మిగిలిన ఒక్క కొడుకు కోసం జాను జమీందారు ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. ఆ
గ్రామంలో దాదాపు స్త్రీలంతా రైతులైన భర్తలు మరణిస్తే జమీందారు కోరికలు తీర్చి తమ
పిల్లల కడుపులు నింపుతున్నవారే. ఆ ఇంటి జమీందారు భార్య ప్రతి రోజు జానును
అవమానిస్తూ ఉంటుంది.ఆమె భర్త ఆమెను కోరిక తీర్చమని వేధిస్తూ ఉంటాడు.తమ
ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి వారి దగ్గర పని చేయడం కన్నా తమ మధ్య ఉన్న ఐకమత్యత ఉంటే
ఏదైనా సాధించవచ్చని భావించిన జాను ఆ ఊరిలో తనలా అవస్థ పడుతున్న స్త్రీలను సంఘటితం
చేసి తాము ఎలా కష్టపడి పనులు చేస్తూ ఈ జమీందార్ల
అకృత్యాల నుండి,వారి భార్యల అవమానాల నుండి తప్పించుకోవచ్చో
వివరిస్తుంది. వారంతా ఆమెతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకుంటారు.
రైతుల
ఆత్మహత్యలు చేసుకున్నాక వారి కుటుంబాల పరిస్థితులు చెల్లాచెదురు అవుతాయి. వారి
భార్యలు ఆర్థిక,మానసిక ఒత్తిడిని అనుభవించాల్సి వస్తుంది.అప్పటి వరకు
స్వతంత్రంగా బ్రతికిన వాళ్ళు అప్పుడు కుటుంబ గమనం కోసం తల దించుకుని అన్నీ
సహించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.ఇటువంటి పరిస్థితుల్ని స్పష్టం చేస్తూనే ఆ పరిస్థితుల
నుండి సమిష్టిగా ఎలా బయటపడే ప్రయత్నం చేయవచ్చో చెప్పే లఘు చిత్రం ఇది. ప్రాంతీయ బాషల
లఘు చిత్రాలను వీక్షిస్తే మనకు ఆ ప్రాంతీయ జీవన విధానం,వీరి సమస్యలు, దేశ సమస్యలకు ప్రాంతీయ సమస్యలకు మధ్య ఉన్న సామీప్యం వంటి ఎన్నో విషయాలు స్పష్టం
అవుతాయి. ఆలోచింపజేసే ఈ లఘు చిత్రం మీకు వీలున్నపుడు తప్పక చూడండి.
* * *

Comments
Post a Comment