నా గౌరవం
సినీ సంచారం
నా గౌరవం
-రచనశ్రీదత్త (శృంగవరపు
రచన)
ఈ ప్రపంచంలో
ప్రతి మనిషికి దక్కాల్సిన ఒకే ఒక హక్కు గౌరవం. ఆ గౌరవాన్ని వివాహ వ్యవస్థలో తమ
భద్రత కోసం తాకట్టు పెట్టే స్త్రీలనే వివాహ వ్యవస్థ పునాదులుగా మలచిన పరిస్థితులు
కూడా ఉన్నాయి.ఇది స్త్రీ విషయంలోనే కాదు, ఈ సృష్టిలో అధికుడైన
వ్యక్తి తనకన్నా బలహీనులను తన ఆధీనంలో ఉంచుకోవడమే అటు రాజ్యాల మూల సూత్రమైనా,ఇటు వ్యక్తిగత బలమైనా కూడా. సమాజంలో తమకు ఆర్థిక భద్రత ఇచ్చే
వివాహవ్యవస్థను గౌరవించడం కోసం తమ గౌరవాన్ని మరచిపోయే ఇల్లాళ్ళు ఎంతోమంది. ప్రేమ-కుటుంబం
ఇలా ఏ పేరు పెట్టుకున్నా సరే ఎప్పుడో ఓ సారి ఆలోచిస్తే ఏదో కోల్పోయామన్న భావన
కలుగక మానదు. అలా తాను తన గౌరవాన్ని కోల్పోయినప్పుడు అది ఎంత చిన్న విషయమైనా సరే,తన వ్యక్తిత్వం గురించి మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకున్న ఓ స్త్రీ కథే
2020 లో వచ్చిన ‘తప్పడ్ ‘సినిమా.
అమృత,విక్రమ్
భార్యాభర్తలు.బాల్యం నుండి నాట్యం అంటే అమృతకు ఎంతో ఇష్టం.కానీ వివాహమయ్యే
సమయానికి తనకు అది వద్దని,మంచి గృహిణిగా ఉందామనే నిర్ణయం
తీసుకుంటుంది. దానికే కట్టుబడి ఉంటుంది. ఆమె అత్తయ్య ఆరోగ్యం చూసుకోవడం,ఇంటిని చూసుకోవడం వరకే ఆమె లోకం. విక్రమ్ ఓ ప్రాజెక్ట్ మీద పని చేస్తూ
ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ సరిగ్గా ప్రెజెంట్ చేస్తే అతనికి లండన్ వెళ్ళే అవకాశం ఉంది.
దాని కోసం అతను ఏళ్ళ తరబడి శ్రమిస్తున్నాడు. మొత్తానికి ఆ ప్రెజెంటేషన్ ఇచ్చాడు.
అతన్ని లండన్ పంపడానికి కంపెనీ ఒప్పుకుంది.
ఈ
సంతోష సందర్భాన్ని పురస్కరించుకుని విక్రమ్ తన ఆఫీస్ స్టాఫ్ కు,తన
మిత్రులకు ఓ పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీ జోరుగా జరుగుతున్న సమయంలో ఆఫీసు
నుండి విక్రమ్ కు కాల్ వస్తుంది. ఆఫీసులో ఉన్న రాజకీయాల వల్ల అతను ఒకవేళ లండన్ కు
వెళ్తే అతను ఇంకో వ్యక్తి కింద పనిచేయాలని,అదే ఇక్కడే ఉంటే
అతను ఆ కంపెనీ హెడ్ గా ఉండవచ్చని దాని సారాంశం. దానితో
కోపంలో ఉన్న విక్రమ్ తన పై అధికారితో
గట్టిగా మాట్లాడుతున్న సందర్భంలో అది ఎక్కడ పెద్ద గొడవకు దారి తీస్తుందో అని అమృత
అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆమెను అతను చెంప దెబ్బ కొడతాడు.
అందరూ ఆ నిమిషం దాన్ని పట్టించుకున్నా, దానిని ఎవరు సీరియస్
గా తీసుకోరు. కానీ అప్పటి నుండి అమృత ప్రవర్తనలో మార్పు వస్తుంది. తాను ఏం చేయడం
వల్ల అతను ఆమెను కొట్టే స్థాయికి వచ్చాడు? అన్న విషయం
గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ ఇంట్లో ఆమెకు మనశ్శాంతి ఉండదని నిర్ణయించుకుని
పుట్టింటికి వెళ్ళిపోతుంది. విక్రమ్ ఎన్నో విధాలా ఆమెను తిరిగి ఆమెను ఇంటికి
తీసుకురావడానికి ప్రయత్నించినా ఆమె ఒప్పుకోదు.
తనకు
కొంత సమయం కావాలని విక్రమ్ తో చెప్తుంది అమృత. కానీ ఈ లోపే ఆమెకు లీగల్ నోటీసులు
పంపుతాడు అతను. అమృత అన్న పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి అయిన స్వాతి కూడా అమృత
పుట్టింట్లోనే ఉంటుంది. స్వాతి నేత్ర జయ సింగ్ అనే లాయర్ దగ్గర అసిస్టెంట్ గా
ఉంటుంది.
మనకు
అమృత కథ చూపిస్తున్న సమయంలోనే ఇంకో నలుగురు స్త్రీల జీవితాల్ని కూడా స్పృశిస్తాడు
దర్శకుడు. అందులో ఒకరు విక్రమ్ ఇంట్లో పని మనిషి అయిన సునీతా జీవితం.ఆమె భర్తతో
రోజు దెబ్బలు తింటూ ఉంటుంది. దానిని ఆమె సాధారణ విషయంగానే భావిస్తుంది. ఇంకొకరు
నేత్ర జయ సింగ్. ఆమె మామయ్య గొప్ప లాయర్ అవ్వడం వల్ల,ఆమె
పెళ్ళి వల్ల ఆమెకు ఐదేళ్ల ప్రాక్టీసులోనే గొప్ప పేరు వచ్చిందని ఆమె భర్త ఆమెతో
అంటాడు.ఆమె భర్త తనకు ఇవ్వని ఆత్మగౌరవాన్ని,ప్రేమను ఇంకొకరి
దగ్గర పొందుదామని ఓ చెఫ్ తో అప్పుడప్పుడు డ్రైవ్ లకు వెళ్తూ ఉంటుంది. ఇంకొకరు
స్వాతి. స్వాతి స్వతహాగా తన ఆత్మగౌరవానికి విలువ ఇచ్చే స్త్రీ. తన తోటి స్త్రీ
అయిన అమృతను అందరూ జరిగింది మర్చిపోయి జీవితంలో ముందుకు సాగమని సలహా ఇస్తే ఆమె
మాత్రం అమృత కోరుకున్న మార్గానికి సాయపడుతుంది. ఇంకొకరు శివాని. ఈమె విక్రమ్ ఇంటి
పక్కన ఉండే స్త్రీ.ఆమె భర్త మరణించినా ఆమె తన కూతురును పెంచుతూ,కూతురు ఆత్మగౌరవానికి విలువ ఇస్తూ, తన ఆత్మగౌరవాన్ని
కాపాడుకుంటూ జీవిస్తుంది.
అమృత
లాయర్ అయిన నేత్ర ఆమెను మెయింటెనెన్స్ ,అలాగే మనోవర్తి అడగమని
చెప్పినా సరే దానికి అమృత ఒప్పుకోదు. దానికి నేత్ర విక్రమ్ మీద,విక్రమ్ కుటుంబం మీద ఆమె చేసిన ఇన్వెస్ట్మెంట్ గురించి ఆ;లోచించమన్నప్పుడు దానికి సమాధానంగా అమృత తాను అవన్నీ ప్రేమతో మాత్రమే
చేసిందని, ఆ సంఘటనతో ఆ ప్రేమ విక్రమ్ మీద పోవడంతో తాను
అతనితో కలిసి ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది. ఆమె ఆ చిన్న కారణం గురించి విడిపోతే ఆ
నిర్ణయాన్ని సమాజం హర్షించదు అని నేత్రా అన్నప్పుడు మరి విక్రమ్ చెంపదెబ్బను సమాజం
హర్షిస్తుందా అని అమృత ప్రశ్నిస్తుంది.
ఈ
కేసు గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే అమృత గర్భవతి అవుతుంది. ఆ విషయం విక్రమ్
కు తెలియజేస్తుంది.విక్రమ్ తల్లి కోరిక మేరకు ఆమె గర్భవతి అయిన సందర్భంగా
చేస్తున్న పూజకు వెళ్తుంది. తనను విక్రమ్ తల్లి ఎంతగానో ప్రేమించిందని,తాను
ఆమెను కూతురులానే చూసుకున్నప్పటికీ,తాను పుట్టింట్లో
ఉన్నప్పుడూ ఆమెను చూడటానికి ఒక్కరూ రాలేదని,ఆమెకు అమృతగా
వ్యక్తిత్వ గౌరవం లేదని,వారి ప్రేమ విక్రమ్ భార్య పట్ల తప్ప
తన పట్ల కాదని అంటుంది.ఆమె అత్త కూడా ఆమె నిర్ణయాన్ని సమర్ధిస్తుంది. తన బిడ్డ మీద
తనకు కంప్లీట్ కస్టడీ ఉంటే చాలని అమృతకు ఓ ఇల్లు,మెయింటెనెన్స్
కూడా ఇవ్వడానికి సిద్ధపడిన అమృత ఒప్పుకోదు. ఈ విడాకుల కేసు నడుస్తున్న సమయంలో
విక్రమ్ కు లండన్ వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడకు వెళ్తాడు. చివరకు ఇద్దరికీ
విడాకులు మంజూరవుతాయి. ఆ సమయంలో విక్రమ్ అమృతతో తనకు ఆమెను కొట్టే హక్కు లేదని, ఆమె లేని జీవితంలో తనకు సంతోషం లేదని,అయినా ఆమె
మెచ్చే వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకుని తాను తిరిగి వస్తానని,తాను ఉద్యోగం వదిలేశానని తాను మళ్ళీ మొదటి నుండి మొదలుపెడతానని చెప్తాడు.
నేత్రా
తన భర్త నుండి విడిపోయి,తన మమ కంపెనీ లో కాకుండా తన సొంత ఫర్మ్ లో ప్రాక్టీస్ చేయడం
మొదలుపెడుతుంది. అలాగే ఆ చెఫ్ నుండి కూడా దూరమవుతుంది. సునీతా తన భర్తకు
ఎదురుతిరుగుతుంది. అమృత అన్నయ్య స్వాతి అమృతతో ఉన్న తీరుకు మెచ్చుకుని తాను అన్నగా
ఆలోచించలేదని తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడతాడు. ఇలా సినిమా ముగుస్తుంది.
ఈ
సినిమా ఎన్నో ప్రశ్నలను మాత్రం మనం మనసుల్లోకి సూటిగా సంధిస్తుంది. స్త్రీ వినమ్రత,కుటుంబం
కోసం పాకులాడటం,తనను తాను మర్చిపోవడం అన్నది ఆమె మీద ఆమె
భర్తకు ఏ హక్కునైనా ఇస్తుందా? అనే ప్రశ్న ఓ వైపు అయితే,అటువంటి సందర్భాలను ఎందుకు సాధారణంగా తీసుకునే మనస్తత్వం మనుషుల్లో
ఉంటుంది అనే ప్రశ్న ఇంకోవైపు,సర్దుకుపోవడం అంటే మనల్ని మనం
మర్చిపోవడమా?అనేది ఇంకో ప్రశ్న. వీటికి సమాధానాలు ఏవైనా
ఇద్దరు ఘర్షణ పడే సమయంలో ఇవి వర్తించకపోవచ్చు కానీ కేవలం అది సాధారణం అనే ధోరణితో
ప్రవర్తించే భర్తల విషయంలో మాత్రం ఇవి ఆలోచించాల్సిన ప్రశ్నలే.
*
* *

Comments
Post a Comment