స్లీవ్ లెస్
లఘు చిత్ర లోకం
స్లీవ్ లెస్
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
స్త్రీలపై జరిగే అత్యాచారాలకు స్త్రీలే కారణమని,దానిలో
భాగం వారి వేషధారణ కూడా అని భావించే వారికి చెంప పెట్టు లాంటి సమాధానమే ‘ స్లీవ్ లెస్’ షార్ట్ ఫిల్మ్. నిండు చీర కట్టుకున్నా,షార్ట్ వేసుకున్నా
సరే మగవాడి చూపులు కామంతోనే ఉంటే ఏదైనా ఒకటే అని స్పష్టం చేసే లఘు చిత్రం ఇది.
లలిత,జాన్వి
తల్లి కూతుళ్ళు. జాన్వి పాఠశాల విద్య పూర్తి చేసుకుని తర్వాతి రోజు నుండి కళాశాలకు
వెళ్లబోతుంది. ఆ సమయంలో లలిత
స్నేహితురాలైన సరిత జాన్వి కోసం విదేశం నుండి ఓ స్లీవ్ లెస్ డ్రస్ పంపిస్తుంది. ఆ
డ్రస్ చూసి ఎంతో ముచ్చటపడి అదే తర్వాతి రోజు వేసుకుంటానని చెప్తుంది జాన్వి
తల్లికి.
అదే
సమయంలో టీవీలో కొన్ని అత్యాచార ఉదంతాల గురించి వార్తలు చూస్తుంది లలిత. ఆ
అత్యాచారాలకు కారణం స్త్రీల వస్త్రధారణే అని చెప్పడం ఆమెను కలవరపెడుతుంది. ఆ రోజు
రాత్రి లలిత,జాన్వి పడుకున్నా సరే వారి వారి ఆలోచనల్లో ఉంటారు.
తాను
తర్వాతి రోజు ఆ డ్రస్ వేసుకుని వెళ్ళడం వల్ల తన మిత్రులు తనను ఎలా పొగుడుతారో,
తనను ఎలా ట్రెండీ అనుకుంటారో అనే ఉత్సాహంతో జాన్వి ఆలోచిస్తూ ఉంటే, ఆ డ్రస్ వేసుకోవడం వల్ల జాన్వి గురించి సమాజం ఏమనుకుంటుందో,అందరూ ఎలా తప్పు పడటారో అని లలితా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అర్ధరాత్రి లేచి
లలిత ఆ స్లీవ్ లెస్ డ్రస్ కు స్లీవులు కుడుతుంది. అది చూసి జాన్వి మండిపడుతుంది. తాను
వేసుకునే డ్రస్ వల్ల తన మీద గౌరవం తగ్గిపోతుందా? మరి తల్లి
చీర కట్టుకున్నా ఎందుకు బలాత్కారానికి గురైందని ప్రశ్నించి,జరిగిన
దానిలో తల్లి తప్పు లేదని చెప్పి కోపంగా వెళ్ళి హాలులో పడుకుంటుంది.
గతం
లలితకు గుర్తుకు వస్తుంది. లలితకు వివాహమై, జాన్వి పుట్టాక ఆ ఊరిలో
ఉండే అతనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడూ ఇంటికి వచ్చి బలాత్కారం చేస్తాడు.ఆమె భర్త ఆమెను
వదిలేస్తాడు. అప్పుడు అందరూ దానికి కారణం లలిత బెంగాలీ పద్ధతిలో చీరలు కట్టుకునే
విధానమే అని ఆమెనే తప్పు పడతారు. జరిగింది గుర్తుకొచ్చిన లలిత తాను చేసిన తప్పు
తెలుసుకుని ఆ డ్రస్సుకు స్లీవులు తీసేసి దానిని కూతురికి ఇస్తుంది. దానిని కూతురు
వేసుకున్నాక కాలేజీలో దింపడానికి బయల్దేరుతుంది. తరతరాలుగా పురుషులు స్త్రీలను
కామదృష్టితో చూస్తుంటే స్త్రీలు మాత్రం పరదాల చాటున ఉండిపోవాలని లలిత జాన్వితో
అనడంతో ఈ లఘు చిత్రం ముగుస్తుంది.
* * *

Comments
Post a Comment