వృత్తి -ప్రవృత్తి

చదువరి

                వృత్తి -ప్రవృత్తి

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          క్రైమ్ థ్రిల్లర్ నవలలు రాసి పేరు పొందిన ప్రతి రచయిత ఆ నవలల్లో ఒక్కో నాయకుడిని సృష్టించారు. షెర్లాక్ హోమ్స్ ,పెర్రి మాసన్ అలాంటి నాయకులే. పాఠకులు ఆ రచయితను మర్చిపోయినా ఆ నాయకులను మాత్రం మర్చిపోరు. అలా జేమ్స్ పాటర్సన్ సృష్టించిన పాత్రే అలెక్స్ క్రాస్. జేమ్స్ పాటర్సన్ నవలల్లో అలెక్స్ క్రాస్ సిరీస్ నవలల్లో కిస్ ద గర్ల్స్ ‘,’ఎలాంగ్ కేమే స్పైడర్ తో పాటు ఇంకొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.అలా అలెక్స్ క్రాస్ సిరీస్ లో పాటర్సన్ రాసిన మరో నవలే ‘Pop goes the Weasel.’ఈ నవల ముఖ్యంగా హార్స్ మెన్ మూల అంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా మలచబడింది.ఇప్పటికే హార్స్ మెన్ మీద సినిమాలు,నవలలు ఎన్నో వచ్చినప్పటికీ పాటర్సన్ శైలి కోసం ఈ నవల తప్పకుండా చదవాల్సిందే.

          జెఫ్రీ షాఫర్ వాషింగ్టన్ లో బ్రిటిష్ ఎంబసీలో ఓ అధికారి. అతను,అతనితో పాటు ఇంకో ముగ్గురు ఎవరైతే అతనితో కలిసి బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అయిన ఎమ్ఐ6 లో పని చేశారో వారిలో ముగ్గురు తమను తాము హార్స్ మెన్ గా భావించుకుని సీరియల్ హత్యలు చేస్తూ ఉంటారు. బైబిల్ లోని న్యూ టెస్టమెంటులో ఈ హార్స్ మెన్ గురించి ప్రస్తావన ఉంది. యుద్ధానికి,కరువుకు,విజయానికి,చావుకు చిహ్నాలుగా భావిస్తారు. వీటిని యుగాంత సందర్భంలో అవతరించే శక్తులని నమ్మిక. జెఫ్రీ షాఫర్ తనను తాను చావుగా భావించుకుని హత్యలు చేస్తూ ఉంటాడు.

          ప్రతి గురువారం తన దగ్గర ఉన్న  నీలం రంగు జీప్సీ కారును టాక్సీగా వాడి అందులో ఎక్కే వారిని తన డైస్ ఆధారంగా నిర్ణయించుకుని వరుస హత్యలు చేస్తూ ఉంటాడు షాఫర్. అతను స్లమ్ ఏరియాల్లో ఉన్న స్త్రీలను ఎక్కువ హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ హత్యలకు ఒక్క ఆధారం కూడా ఉండదు. అలెక్స్ ఈ హత్యలు అతనికి అప్పగించకపోయినా సరే ఈ హత్యలను తన మిత్రుల సాయంతో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అలెక్స్ పై అధికారి అయిన పిట్స్ మన్ కు అలెక్స్ అంటే వృత్తి పరంగా ఈర్ష్య. దానితో ఈ కేసులు అతను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడని తెలిసి తన కింద పని చేసే పాట్సి హ్యాంప్టన్ ను ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమిస్తాడు.

          షాఫర్ కు బైపోలర్ డిజార్డర్ ఉంది.అతనికి సెక్స్ థెరపిస్ట్ ఉంది.ఆమె పేరు ఎలిజబెత్ బూ. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న హ్యాంప్టన్ కు ఆమెకున్న ఎఫ్.బి.ఐ స్నేహితుడి ద్వారా ఓ ఆన్ లైన్ గేమ్స్ చాటింగ్ లో హార్స్ మెన్ గురించి ప్రస్తావన రావడం గురించి తెలుస్తుంది. అలా ప్రస్తావించిన అతని చిరునామా కనుక్కుంటారు.అతను బాలుడు.అతనికి కంప్యూటర్ హ్యాకింగ్ వచ్చని,అలా ఆ హార్స్ మెన్ గేమ్ గురించి ఒకరు ప్రస్తావించారని చెప్తాడు.అతన్ని తాను హ్యాక్ చేశానని అతని పేరు జెఫ్రీ షాఫర్ అని చెప్తాడు.

          షాఫర్ ను వెంబడిస్తూ ఉంటుంది హ్యాంప్టన్. అదే సమయంలో ఒకరు బ్లూ కలర్ జీప్సీ కారు గురించి చెప్పడంతో అలెక్స్ క్రాస్ దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. భార్యను కోల్పోయిన అలెక్స్ కు ఓ పాప,బాబు.అలెక్స్,క్రిస్టిన్ ప్రేమించుకుంటారు.క్రిస్టిన్ భర్త హత్యకు గురైన సమయంలో వారిద్దరి మధ్య  సాన్నిహిత్యం ఏర్పడుతుంది. క్రిస్టిన్ అలెక్స్ కూతురు చదివే స్కూల్ ప్రిన్సిపల్ కూడా. అలెక్స్ పిల్లలు కూడా ఆమెనే తమ తల్లిగా కోరుకుంటారు. తనను కనుక్కోవడానికి అలెక్స్ ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న షాఫర్ అలెక్స్ ,క్రిస్టిన్ తో తన పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్ళిన సమయంలో ఆమెను కిడ్నాప్ చేస్తాడు.

          క్రిస్టిన్ ను కిడ్నాప్ చేసిన షాఫర్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నుండి తప్పుకోమని అప్పుడే ఆమె సురక్షితంగా ఉంటుందని హెచ్చరిస్తాడు. హ్యాంప్టన్ అలెక్స్ ను కలిసి తాను కనుక్కున విషయాలన్నీ చెప్తుంది. ఆ జీప్సీ కారు ఉన్న ఇంటికి వెళ్తాడు అలెక్స్. ఆ ఇంటిని ఒకతను అద్దెకు తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ ఇంటిని వెతికితే అందులో అలెక్స్ కుటుంబం ఫోటోలు ఉంటాయి. హ్యాంప్టన్ ,అలెక్స్ షాఫర్ ను వెంబడిస్తూ ఉంటారు. ఆ క్రమంలో అలెక్స్ ను క్రిస్టిన్ గురించి చెప్తానని ట్రాప్ చేసి, ఆ సమయంలో హ్యాంప్టన్ ను షాఫర్ హత్య చేస్తాడు. ఆ సమయంలో హ్యాంప్టన్ హత్యలో షాఫర్ దగ్గరకు వెళ్ళి అరెస్ట్ చేయబోతాడు అలెక్స్.కానీ తనకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉన్నా తనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినందుకు అతని మీద పరువు నష్టం దావా వేస్తాడు షాఫర్.

          షాఫర్ కు రిస్కు తీసుకోవడం చాలా ఇష్టం. తనకు తానుగా తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ట్రయల్ కు ఒప్పుకుంటాడు. ఆ కేసులో అతను నిర్దోషిగా బయటపడతాడు. క్రిస్టిన్ కిడ్నాపుకు గురై సంవత్సరం గడచిపోతుంది.

          షాఫర్ తమ రూల్స్ అతిక్రమించి ఆడుతున్నాడని మిగిలిన హార్స్ మెన్ భావిస్తారు. ఒలివర్ హై స్మిత్ ఈ హార్స్ మెన్ ఆటను ప్రారంభిస్తాడు. అతని దగ్గర ఈ ముగ్గురు బ్యాకాంక్ లో పని చేస్తున్న సమయంలో జార్జ్ బేయర్ (కరువు),జేమ్స్ (యుద్ధం ),షాఫర్ (చావు)లా నిర్ణయించి ఈ ఆటను మొదలుపెడతారు. ఈ ఆటలో ఇంకో అంకంగా మిగిలిన ముగ్గురు హార్స్ మెన్ షాఫర్ ను హత్య చేయడానికి వస్తారు. షాఫర్ ఆ ముగ్గురిని హత్య చేస్తాడు.అలెక్స్ క్రిస్టిన్ ఆచూకీ కనుక్కోగలుగుతాడు. అప్పటికే ఓ బిడ్డను కంటుంది అలెక్స్ వల్ల ఆమె.ఆమెతో,బిడ్డతో కలిసి తిరిగి వస్తాడు అలెక్స్.

          షాఫర్ ను పట్టుకోలేకపోతాడు అలెక్స్. అతనే దోషి అని తెలిసినా అతను తప్పించుకుంటాడు. తప్పించుకున్న అతను తన వేషాన్ని మార్చుకున్న షాఫర్ తన భార్య,బిడ్డలను హత్య చేస్తాడు.మళ్ళీ తన ఆట మొదలు పెట్టడానికి తన పేరు ,ఊరు మార్చుకుని మళ్ళీ బయల్దేరతాడు షాఫర్ అని చెప్పడంతో ఈ నవల ముగుస్తుంది.

          మీరు ఆంగ్ల నవలలు చదవడంలో ప్రారంభ దశలో ఉంటే మాత్రం తప్పకుండా జేమ్స్ పాటర్సన్ నవలలు చదవండి. దీని వల్ల మీకు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది.బాష కూడా ఎంతో సులభంగా ఉంటుంది అర్ధం చేసుకోవడానికి.హత్యా మూలాలను తెలుసుకోవడమే క్రైమ్ థ్రిల్లర్స్ లో చదివింపజేసే అంశం.షాఫర్ కు ఉన్న రిస్క్ తీసుకునే ప్రవృత్తి,ఎదుటి వారిని చంపడం ద్వారా తాను జీవితాల్ని ఎలా నియంత్రిస్తున్నాడో అన్న భావన,ఇంటెలిజెన్స్ లో పని చేసిన తెలివి ఇవన్నీ అతన్ని ఎటువంటి రిస్క్ తీసుకోవడానికైనా ప్రేరేపించాయి. సీరియల్ కిల్లర్ ప్రతీకారంతో చేయడం ఓ పద్ధతి అయితే ఎవరిని పడితే వారిని హత్య చేయడం ఇంకో పద్ధతి. ఆ రెండో పద్ధతిని షాఫర్ మరియు మిగిలిన వారు ఇక్కడ అవలంబించారు. ఈ సృష్టిలో అన్నిటికన్నా విచిత్రమైనది మనిషి మనస్తత్వమే. ఆ మూలాలే మంచి కథకు బలమవుతాయి. అదే పాఠకుల్ని ఆకర్షిస్తుంది. అలెక్స్ క్రాస్ సిరీస్ లో ఏ నవల అయినా సరే స్వతంత్ర కథగా సాగుతుంది కనుక ఏదైనా చదువుకోవచ్చు. 

*   *   * 

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ