సేల్స్ మ్యాన్

 సినీ సంచారం

                సేల్స్ మ్యాన్

                              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          క్ దే ఇండియా వంటి సినిమాలతో దర్శకుడిగా  తనదైన ముద్ర వేసుకున్న  షిమిత్ అమిన్ దర్శకత్వంలో వచ్చిన మరో బాలీవుడ్ ఆణిముత్యమే రాకెట్ సింగ్ -సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్. హాస్యాన్ని పండిస్తూనే ఎన్నో జీవిత సత్యాలను చూపించే సినిమా ఇది. సేల్స్ రంగంలో ఉండాల్సిన నైతిక విలువలను స్పష్టం చేసే సినిమా ఇది.

          బికామ్ లో పాసు మార్కులతో బయట పడ్డ హర్ప్రీట్ సింగ్ ఏవైఎస్ అనే పెద్ద కార్పరేట్  కంప్యూటర్ల కంపెనీలో సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం సాధిస్తాడు.కంపెనీ సేల్స్ పెంచాలంటే లంచాలు ఇస్తూ,కాంట్రాక్టులు ఇచ్చే వారి మెప్పు పొందాలని తెలియని హర్పృట్ సింగ్ ఓ క్లయింట్ దగ్గరకు వెళ్ళినప్పుడు లంచం అడిగినందుకు ఆ విషయాన్ని అక్కడి ఫిర్యాదుల బాక్సులో రాసి వస్తాడు. దానితో కంపెనీ యాజమాన్యం అతని మీద కోపంగా ఉంటుంది.హర్ప్రీట్ సింగ్ ఉత్పత్తులు సరిగ్గా ఉండి,కస్టమర్ తృప్తి చెందితే ఇలా లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించి అదే అభిప్రాయం మీద స్థిరంగా ఉంటాడు.కానీ దీని వల్ల అతనికి అవమానాలు,అవహేళనలు ఎక్కువవుతాయి.

          అదే హర్ప్రీట్ సింగ్ లో పట్టుదల పెంచుతుంది. ఆ కంపెనీలోని ఓ క్లయింట్ ను తీసుకుని ఆమెను తన కొత్త కంపెనీ అయిన రాకెట్ సేల్స్ కార్పరేషన్ కు క్లయింట్ ను చేస్తాడు. అదే కంపెనీలో అతనిలానే కంపెనీ పట్ల అసంతృప్తితో ఉన్న వారిని తనతో పాటు చేర్చుకుని రాకెట్ సేల్స్ పేరుతో తక్కువ ధరకు, 24 గంటల సర్వీసుతో అందరూ కస్టమర్లను ఆకట్టుకుంటాడు.

          రాకెట్ సేల్స్ కంపెనీ తమకు పోటీ కంపెనీగా నిలిచిందని ఏవైఎస్ సంస్థ  యజమానికి తెలుస్తుంది. మొత్తానికి ఆ కంపెనీని స్థాపించింది తన కంపెనీలో పని చేసే హర్ప్రీట్ అని తెలియగానే మొత్తానికి అతనితో పాటు ఉన్న మిగిలిన వారి జీవితాలు నాశనం చేస్తానని బెదిరించి రాకెట్ సేల్స్ ను తన పేరిట రాయించుకుంటాడు. దానితో పాటు హర్ప్రీట్ సింగ్ మూడేళ్ళ పాటు ఈ రంగంలో ఏ పని చేయకూడదని నిబంధన కూడా పెడతాడు. తనతో పాటు ఉన్న వారి జీవితాలు నాశనం అవ్వడం ఇష్టం లేక హర్ప్రీత్ సింగ్ ఒప్పుకుంటాడు.

          తర్వాత రాకెట్ సేల్స్ కంపెనీను అలా ఏవైఎస్ కంపెనీ నిర్వహించలేకపోతుంది. చివరకు దాని వల్ల వారికే నష్టాలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఆ సమయంలో ఏవైఎస్ కంపెనీ యజమాని తాను ఓడిపోయానని ఒప్పుకుని ఆ కంపెనీని హర్ప్రీట్ సింగ్ కు అప్పగిస్తాడు. దీనితో కథ సుఖాంతం.

          ఈ సినిమా ఒట్టి సేల్స్ కే కాదు మానవ జీవితంలోని అన్నీ అంశాలకు వర్తిస్తుంది. పేరు ప్రఖ్యాతలు,పని చేసే మనుషులు, అనుభవం దండిగా ఉన్న సంస్థ సైతం ఓ చిన్న కంపెనీను దానిని స్థాపించిన వ్యక్తి స్థాయిలో నడిపించలేకపోయింది.ఓ మనిషి లేదా సంస్థ ఏదైనా సరే రాణించాలంటే కావాల్సింది ఆ వ్యక్తి ఆశయంలో ధృఢత్వం,దీక్ష,అంకితభావం తప్ప బ్రాండ్ మరియు డబ్బు కాదు. మనలో శక్తే మనమేవరో నిర్ణయిస్తుంది తప్ప డబ్బు,కీర్తి కాదు అనే అంశం ఈ సినిమా స్పష్టం చేస్తుంది. ఈ సమాజంలో మనిషిగా జీవించటానికి విద్య ఒకటే కాదు, తోటి మనుషులు ఆశించే దానిని ఇవ్వగలిగే సత్తా ఉన్నవాడే గొప్ప సేల్స్ మ్యాన్ అవుతాడని గట్టిగా చెప్పే సినిమా ఇది. అవి ఇవ్వలేకే లంచాలు,బహుమతులు ఇవ్వాల్సి వస్తుంది తప్ప వాటి వల్ల నిజమైన సేల్స్ అయితే జరగవు,జరిగినా అవి తాత్కాలికమే అని కూడా ఈ సినిమా స్పష్టం చేస్తుంది. తప్పక చూడాల్సిన సినిమా ఇది.

             *    *    *

 

 

 

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ