వ్యూహం

 సినీ సంచారం

     వ్యూహం

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          స్టాలిన్ గ్రాడ్ రష్యాదేశంలో ఓ నగరం మాత్రమే కాదుస్టాలిన్ అధికారంలో ఉన్నప్పుడూ ఉన్న ఈ నగరం అతని వైభవాన్నిఅతని గొప్పతనాన్ని ప్రపంచానికి స్పష్టం చేసే ప్రదేశం కూడా. హిట్లర్ నిరంకుశంగా  దేశాలన్నింటిని  రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ధ్వంసం చేస్తున్న సమయంలో రష్యా లోని స్టాలిన్ గ్రాడ్ మీద అతని చూపు పడింది. ఆ నగరం అన్నది రెండు దేశాల మధ్య కాకుండా అటు హిట్లర్ కుఇటు స్టాలిన్ కు మధ్య వ్యక్తిగత  సమరంగా మారింది. ఆ సమయంలో రష్యా స్నైపర్ ,జర్మనీ స్నైపర్ ల మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తు వ్యూహాలను కాస్త నాటకీయంగా మలచిన సినిమానే 'ఎనిమీ ఎట్ ద గేట్స్ .యుద్ధ సినిమాలను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.  

           సినిమా ఆరంభ సీన్ కూడా అద్భుతంగా మలచారు ఈ సినిమాలో. రష్యన్ స్నైపర్ అయినా వెజిల్ కు తన తాత వేటాడేటప్పుడు ఎలా ఉండాలో చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. వెజిల్ తోడేళ్ళను వేటాడేవాడు. ఇక ఈ సీన్ తర్వాత సినిమా అంతా వెజిల్ యవ్వనంలో ఉన్నప్పుడూ జరుగుతుంది. హిట్లర్ స్టాలిన్ గ్రాడ్ నగరం మీదకు దండెత్తడానికి రావడంతో రష్యన్ యువకులందరిని ఓ రైలులో బలవంతంగా ఎక్కించి మరి  జర్మనీ పై పోరాడటానికి తరలిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆ యువకులకు ఛాయిస్ లేదు. తప్పక వెళ్ళాల్సిందే. అలా ఆ తరలింపులో నదిని పడవల్లో దాటుతున్న సమయంలో హిట్లర్ సైన్యం బాంబులతో ఆ పడవ మీద బాంబులు వేస్తూ ఉండటంతో కొందరు యువకులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నీటీలోకి దూకే ప్రయత్నం చేస్తారు. అలా చేసిన వారిని రష్యా దేశ ద్రోహులుగా భావించి వారిని రష్యా యుద్ధ నాయకులే చంపేస్తారు. ఇక తప్పించుకోకుండా యుద్ధం చేయాల్సిన పరిస్థితి అది. ఇక అక్కడ ప్రాణాలు కాపాడుకున్నవారు ఇక ప్రత్యక్ష యుద్ధం చేయాల్సిందే. అక్కడ ఉన్న యువకులందరికీ ఇవ్వడానికి తుపాకీలు కూడా లేవు. అందుకే ఒకరికి తుపాకి ,ఇంకొకరికి బులెట్స్ ఇస్తారు. తుపాకి ఉన్న వ్యక్తి యుద్ధంలో మరణించగానే బులెట్స్ ఉన్న వ్యక్తి ఆ తుపాకి తీసుకుని యుద్ధం కొనసాగించాల్సిందే. అలా ఆ యుద్ధంలోకి వచ్చాడు వెజిల్.

         ఆ యుద్ధంలో పాల్గొన్న యువకులందరూ  హిట్లర్ సైన్యం బులెట్లకు బలి అవుతారు. అదే సమయంలో ఆ స్థలానికి స్టాలిన్ ఆర్మీలో పని చేసే ఓ అధికారి ఓ కారులో వస్తాడు. అది గమనించిన హిట్లర్ సైన్యం ఆ కారు మీద బులెట్ల దాడి చేస్తారు. ఆ కారు బోల్తా పడటంతో అందులోని వ్యక్తి మెల్లగా పాక్కుంటూ అక్కడ వాటర్ పాండ్ దగ్గర ఉన్న రష్యన్ యువకుల శవాల్లో ఓ శవంగా పడుకుంటాడు.

        ఆ తర్వాత హిట్లర్ సైన్యం ఇంకోసారి ఆ శవాల గుట్ట మీద కాల్పులు జరిపి ఎవరూ బ్రతికిలేరని నిర్ధారించుకుని వెళ్ళిపోతారు. అక్కడ కొందరు జర్మన్ అధికారులు ఈ వాటర్ పాండుకు ఎదురుగా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్టాలిన్ ఆర్మీ అధికారి అప్పుడు లేచి చనిపోయిన ఓ యువకుని తుపాకి తీసుకుని దానితో వారిని పేల్చాలనుకుంటే దానిలో బులెట్లు ఉండవు. అప్పుడు చనిపోయినట్టు పడుకున్న వెజిల్ లేచి అతనికి బులెట్లు అందిస్తాడు. అదే సమయంలో ఇంకో ఇద్దరు జర్మన్ అధికారులు మిగిలిన అధికారుల దగ్గరకు వస్తారు. వెజిల్ బాంబులు పడే సమయంలో పేల్చమని సలహా ఇస్తాడు ఆ అధికారికి. అప్పుడు ఆ అధికారి అతన్నే పేల్చమని గన్ ఇస్తాడు. ఇక వెజిల్ దగ్గర ఉన్నవి ఐదు బులెట్లు. అక్కడ ఉంది ఐదుగురు. బాంబులు పడుతున్న సమయంలో అతను అయిదుగురిని ఎలా కాలుస్తాడంటే  మిగిలిన వారికి ఆ విషయం తెలియదు. ఇది హీరో ఓపెనింగ్ సీన్. ఆ నైపుణ్యాన్ని చూసి అచ్చెరువొందిన ఆ అధికారి తన పేరు డనిలోవ్ అని పరిచయం చేసుకుంటాడు. వెజిల్ గురించి డనిలోవ్ రష్యా పేపర్ లో రాస్తాడు. దానితో వెజిల్ కు అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అతన్ని గుర్తించినందుకు డనిలోవ్ ను జనరల్ స్టాఫ్ విభాగానికి పదోన్నతి మీద బదిలీ చేస్తారు. వెజిల్ ను స్నైపర్ విభాగంలో కి బదిలీ చేస్తారు.

        ఓ రోజు వెజిల్ షూటింగ్ చేశాక ఓ పిల్లవాడు (సాచి )అతన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అక్కడికి అతను వెళ్ళాక అక్కడికి డనిలోవ్ కూడా వస్తాడు. తర్వాత కాసేపటికి తనియా అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆమెను వెజిల్ మొదట తాను ట్రెయిన్ లో స్టాలిన్ గ్రాడ్ కు పయనమైన రోజు చూస్తాడు. అలా హీరోయిన్ ను పరిచయం చేయడం జరుగుతుంది. తనియాకు జర్మన్ వచ్చు. యుద్ధ సమయంలో జర్మన్ వచ్చిన వారు ఉంటే ఆఫీసులో మంచి ఉద్యోగం దొరుకుతుందని డనిలోవ్ ఆమెకు చెప్పిన ఆమె అక్కడే ఉండి తాను చేయగలిగింది చేయడానికి ఇష్టపడుతుంది. డనిలోవ్ ఆమె పట్ల ఇష్టం పెంచుకుంటాడు.వెజిల్ ,తానియా పరస్పరం ఒకరినొకరు ఇష్టపడతారు.

          ఇక వెజిల్ ను ఎదుర్కోవడానికి జర్మనీ తమ టాప్ క్లాస్ స్నైపర్ అయిన మేజర్ ఎర్విన్ కొనిగ్ ను రంగంలోకి దింపుతారు. ఎర్విన్ జర్మనీలో స్నైపర్ స్కూల్ డైరెక్టర్. అతని దగ్గర దాదాపు రష్యాలోని కొందరు  సైనికులు కూడా ముందు శిక్షణ  పొందారు. అంత గొప్ప శిక్షకుడికిబాల్యం నుండి అడవుల్లో తోడేళ్ళను వేటాడిన వెజిల్ కు మధ్య సాగిన ప్రచ్చన్న యుద్ధమే ఈ సినిమా.

          తర్వాతి రోజు  డిపార్ట్మెంటల్ స్టోర్ లో కాల్పులు జరిగాయన్న సమాచారం రావడంతో అక్కడికి  తన వారితో వెళ్తాడు వెజిల్. అక్కడికి వెళ్ళాక ఓ భవనంలో పై ఫ్లోర్ లో జర్మన్ సైనికుడి హెల్మెట్  కనిపిస్తుంది. దానికి గురి పెట్టి కాలుస్తాడు వెజిల్. ఆ హెల్మెట్ కింద పడుతుంది. దానితో అది ట్రాప్ అని అర్ధమవుతుంది వెజిల్ కు. అలా హెల్మెట్ ను పేల్చగానే ఆ ధ్వని వచ్చిన దిశను బట్టి ప్రత్యర్ధి ఎక్కడ ఉన్నాడో గుర్తించి పేల్చడానికే అది ఏర్పాటు చెయ్యబడిందని వెజిల్ కు అర్ధమవుతుంది. వెజిల్ తప్పించుకున్నా అతని వచ్చిన వారు మరణిస్తారు. పిల్లవాడైన సాచి ద్వారా వెజిల్ గురించి విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు కొనిగ్. కొనిగ్ కు వెజిల్ గురించి అన్నీ తెలుసు అందుకే అతని కన్నా ఓ అడుగు ముందే ఉంటాడు. ఇలా వారిద్దరి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. జనాలకు వెజిల్ మీదే నమ్మకం ఉంటుంది.

          ఈ సినిమాలోని ఇంకో సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇద్దరు స్నైపర్స్ ముఖాముఖీ పోరాడే సమయంలో పై అంతస్తు నుండి గురి పెట్టి వెజిల్ ను కాల్చే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొనిగ్. అదే సమయంలో తన తుపాకి పక్కన పడటం వల్ల దానిని తీసుకునే ప్రయత్నం ఓ దారం ద్వారా చేసినప్పుడు ఆ దారాన్ని కాలుస్తాడు కొనిగ్. అలా ఇద్దరు అవకాశం కోసం వేచి చూస్తూ ఓపికగా ఉంటారు. అదే సమయంలో తానియా రావడం గమనించిన వెజిల్ ఆమెను తనకు దగ్గరలో ఉన్న అద్దం ముక్క ఇవ్వమని అడిగి తీసుకుని దానిని కొనిగ్ మీద పడేలా పెడతాడు. ఆ అద్దం కాంతి వల్ల దృష్టి కాస్త అతను మరల్చుకునేలోపే గన్ తీసుకుంటాడు వెజిల్. ఈ స్నైపర్ యుద్ధంలో ఉన్న ఆలస్యంతో విసుగు చెందిన జర్మన్ ఆర్మీ రష్యాకుజర్మనీకి యుద్ధం జరుగుతున్న సమయంలో వెజిల్ ,కొనిగ్ ఇద్దరు మరణించారని ప్రకటిస్తారు.

     సాచి వెజిల్ కు సమాచారం అందించడానికే కొనిగ్ తో ఉన్నట్టు నటిస్తాడు. తానియా,వెజిల్ సన్నిహితంగా ఉండటం చూసిన డనిలోవ్ అతని మీద కోపంతో రగిలిపోతాడు. ఇక స్నైపర్స్ మరణించారని ప్రకటించడం యుద్ధం విషమించడంతో ఆ నగరంలోని మామూలు పౌరులను ఆ స్థలం నుండి దాటించే ప్రయత్నం చేస్తారు.

          సాచి విషయం పసిగట్టిన కొనిగ్ తర్వాతి రోజు తాను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న నది దగ్గర ఉంటానని చెప్తాడు. అతను ఊహించినట్టే అక్కడికి వెజిల్ రావడంతో సాచి తన శత్రువుకు సాయం చేయడానికి తనతో ఉన్నాడన్న విషయం స్పష్టం అవ్వడంతో అతన్ని చంపి అక్కడ స్టేషన్  దగ్గర ఉన్న పోల్ కు ఉరి తీస్తాడు.తనను రెచ్చగొట్టడానికి తన ఉనికి తెలుసుకోవడానికే కొనిగ్ చేశాడని తెలుసుకున్న వెజిల్ సంయమనయంతో ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న డనిలోవ్ తన వల్ల వెజిల్ కు జయం లభించాలని తానే లక్ష్యంగా కొనిగ్ కు కనిపించేలా ఉంటాడు. అతనే వెజిల్ అనుకుని పేలుస్తాడు కొనిగ్. ఇక వెజిల్ మరణించాడనుకుని బయటకు వచ్చిన అతన్ని వెజిల్ చంపుతాడు. తర్వాత తానియా,వెజిల్ ఒకటవుతారు.

     1942 నుండి 1943 వరకు జరిగిన  స్టాలిన్ గ్రాడ్ యుద్ధం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ యుద్ధంలో చివరకు జర్మనీ ఓడిపోయింది. ఇందులో ఉన్న స్నైపర్స్ కూడా వాస్తవ పాత్రలే. వజిల్ రెండ యుద్ధ సమయంలో ఉన్న స్నైపర్ . అతను 225 మంది శత్రు సైనికులను ,వారిలో ఉన్న తొమ్మిది మంది స్నైపర్స్ ను హతమార్చాడు. అతన్ని నేటికి రెండవ ప్రపంచ యుద్ధ నాయకుడిగానే కీర్తిస్తారు రష్యన్లు. ఎర్విన్ కొనిగ్ పాత్ర కూడా వాస్తవ పాత్రే. ఈ సినిమాను ఒకసారి చూస్తే అన్నీ అర్ధం కావు. కానీ రెండో సారి చూస్తే ఈ సినిమాలోని ప్రతి షాట్ లో ఉన్న గొప్పతనం అర్ధమవుతుంది. యుద్ధ సినిమాలు మీకు ఫేవరెట్ అయితే తప్పక చూడాల్సిన సినిమా ఇది.

     *   *   *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ