పరాన్నజీవి

 సినీ సంచారం 

పరాన్నజీవి

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          నాలుగు ఆస్కార్లతో అందరినీ ఆశ్చర్యపరిచి కొరియన్ సినిమాల వైపు ప్రపంచ దృష్టి మళ్ళేలా చేసిన సినిమా పారసైట్.పారసైట్ అంటే అర్ధం పరాన్నజీవి లేదా ఇతరులపై ఆధారపడి జీవించే వ్యక్తి అని.ఈ సినిమా ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య  జరిగే కథ. వీరిలో కిం కుటుంబం పేద కుటుంబం. పార్క్ కుటుంబం ధనవంతుల కుటుంబం. డబ్బున్న పార్క్ కుటుంబంలోకి కిం కుటుంబం చేరుతుంది. కిం కుటుంబంలోని ఒక్కొక్కరు ఎలా పార్క్ కుటుంబంలోకి ఎలా చేరతారు? వారంతా ఆ ఇంట్లోకి చేరిన తర్వాత ఆ రెండు కుటుంబాలకు ఏమవుతుంది అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలే ఒక్కరే ముఖ్య పాత్రగా కథ ఉండదు. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే సినిమాలో ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకునేది కిం కుటుంబంలోని తండ్రికొడుకులనే.

          పేద కుటుంబంలో తండ్రి పేరు కిం. తల్లి పేరు చంగ్ సూక్. వీరికి ఓ కొడుకు,కూతురు. వీరు పేర్లు కెవిన్ ,జెస్సికాలుగా మార్చుకుని పార్క్ కుటుంబంలోకి వెళ్తారు. ఇక ధనవంతుల కుటుంబంలోని జంట పేరు పార్క్ మరియు యియాన్. వారి కొడుకు దై సాంగ్ ,కూతురు దై హే.

          పారసైట్ సినిమా కిం కుటుంబం నివసిస్తున్న సెమీ బేస్మెంట్ కుటుంబం దగ్గర మొదలవుతుంది. కిం కుటుంబంలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఉండదు. పిజ్జా కవర్లు ప్యాక్ చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కిమ్ కొడుకు కెవిన్ తన స్నేహితుడైన మిన్ ను కలుస్తాడు. అతని ద్వారానే కెవిన్ కు పార్క్ కుటుంబం గురించి తెలుస్తుంది. అప్పటి వరకు పార్క్ కుటుంబంలో వారి కూతురైన దై హే కు ఇంగ్లీష్ ట్యూటర్ గా ఉంటాడు మిన్.తాను చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళడం వల్ల తన తరువాత అక్కడ ట్యూటర్ గా వెళ్ళమని మిన్ సలహా ఇస్తాడు. తాను రికమండేషన్ చేస్తానని,కానీ కాలేజీలో చదువుకుంటునట్టు చెప్పమని సలహా ఇస్తాడు. అలా యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా ఫోర్జరీ చేసి ఓ సర్టిఫికేట్ సృష్టించి,మొత్తానికి కెవిన్ పేరుతో కిమ్ కొడుకు పార్క్ కుటుంబంలో ట్యూటర్ గా జాయిన్ అవుతాడు.

          ధనవంతుల కుటుంబమైన పార్క్ కుటుంబంలో మనకు ముందు రెండు ప్రధాన పాత్రలు కనిపిస్తాయి. పార్క్ కుటుంబాపు యజమానురాలైన యియాన్,అలాగే వారింట్లో         పని మనిషి అయిన మూన్ గ్వాంగ్. మూన్ ఎప్పటినుండో ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఆ ఇంటిని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ కు మూన్ కు సన్నిహిత సంబంధం ఉండటం వల్ల అతని తర్వాత ఆ ఇంటిని కొనుక్కున్న పార్క్ కుటుంబంతో కూడా కలిసి పని చేయగలుగుతుంది. యియాన్ కెవిన్ కు తన కొడుకు వేసిన కొన్ని పెయింటింగ్స్ ను చూపిస్తుంది. ఇక్కడ ఓ అవకాశాన్ని గమనించిన అతను తనకు ఓ ఆర్ట్ టీచర్ తెలుసని తన చెల్లిని మారుపేరైన జెస్సికా అని చెప్పి ఆ ఇంట్లో ఆర్ట్ టీచర్ గా ప్రవేశించేలా చూస్తాడు. ఆ తర్వాత  వారిద్దరూ కలిసి డ్రైవర్ ను ,మూన్ ను మానిపించేలా చేసి డ్రైవర్ స్థానంలో తమ తండ్రిని, పని మనిషి స్థానంలో తమ అమ్మను అపరిచితులుగా ఆ ఇంట్లో ప్రవేశపెడతారు. అలా ఆ ఇంట్లో కిమ్ కుటుంబం ప్రవేశిస్తుంది. ఈ కుటుంబం అంతా పార్క్ కుటుంబం లోని చేరడానికి వేసే పథకాలు,వాటిని అమలు పరిచే పద్ధతులు ప్రేక్షకులను ఈ సినిమా చూసేలా చేస్తాయి.

          ఆ ఇంట్లో అంతా కష్టపడి సెటిల్ అయ్యాక ఓ సారి పార్క్ కుటుంబం కొడుకైన దై సాంగ్ పుట్టినరోజుకు బయటకు ట్రిప్ కు వెళ్తారు. ఆ సమయంలో ఒక్క చుంగ్ సూక్ ను మాత్రం తాము వచ్చేవరకు ఉండమని చెప్తారు. వారు వెళ్ళిపోయాక మిగిలిన కుటుంబం అంతా అక్కడ చేరి ఆ విలాసవంతమైన కుటుంబంలో తాగుతూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో యజమానులు లేరని తెలుసుకున్న పాత పనిమనిషి మూన్ అక్కడికి వస్తుంది. తాను కొన్ని వస్తువులు అక్కడ మర్చిపోయాననని అవి తీసుకుంటానికి వచ్చానని చెప్పి బేస్మెంట్ ఏరియాలోకి వెళ్తుంది. ఇక్కడ నుండి సినిమా పూర్తి స్థాయి థ్రిల్లర్ గా మారిపోతుంది.

          ఇక సినిమా కథలో కొత్త మలుపు ఏమిటంటే పనిమనిషి మూన్ తన భర్తను ఆ బేస్మెంట్ లో ఉన్న బంకర్ లో దాస్తుంది. ఆ ఇంటిని కట్టించిన ఆర్కిటెక్ట్ ఉన్న సమయం నుండి ఆమె భర్త అక్కడే ఉన్నాడని,అప్పులపాలైన భర్తను కాపాడుకోవడానికి తాను అతన్ని అక్కడ ఉంచానని, రెండు రోజులకొకసారైనా అతనికి తినడానికి ఏమైనా ఇవ్వమని చంగ్ సూక్ ను వేడుకుంటుంది. అదే సమయంలో కిమ్ కుటుంబం మొత్తాన్ని అక్కడ చూసిన మూన్ కు వారి రహస్యం అర్ధమైపోతుంది. ఆమె ఫోన్ లో దానిని వీడియో తీసి తన మాట వినకపోతే దానిని పార్క్ కుటుంబానికి పంపిస్తానని చెప్పి బెదిరిస్తుంది. మొత్తానికి వీరిద్దరికి మధ్య జరిగిన ఘర్షణలో కిమ్ కుటుంబం మూన్ ను,ఆమె భర్తను బంకర్ లోకి నెట్టేస్తారు. ఇక అంతా బానే ఉందనుకున్న సమయంలో పార్క్ కుటుంబం వాన వల్ల తమ ట్రిప్ క్యాన్సిల్ అయ్యిందని,తాము ఇంటికి తిరిగి వస్తున్నామని చెప్తారు. ఇక కిమ్ కుటుంబం మొత్తం దాక్కుంటుంది. చంగ్ సూక్ యజమానురాలు చెప్పిన వంట చేస్తుంది. వాళ్ళు తిరిగి వస్తారు.

          మొత్తానికి ఆ రాత్రి వారు నిద్రపోయాక చంగ్ సూక్ యాజమానుల ఇంట్లో ఉండిపోతుంది,మిగిలినవారు అక్కడి నుండి వారు నిద్రపోతున్న సమయంలో వెళ్లిపోతారు. ఇంటికి కిమ్ కొడుకు,కూతురుతో వెళ్ళేసరికి ఆ ఇల్లు మొత్తంవర్షం నీటితో  నిండిపోతుంది. ఆ తర్వాతి రోజు పార్క్ కుటుంబం తమ కొడుకైన దై సాంగ్ పుట్టిన రోజు వేడుక చేసుకోవాలనుకుంటారు. ఇక ఇల్లు కోల్పోయిన కిమ్ కుటుంబం,బంకర్ లో ఉన్న మూన్ కుటుంబం,పుట్టిన రోజు వేడుకల్లో పార్క్ కుటుంబం ఈ ముగ్గురి దృష్ట్యా క్లైమాక్స్ ఉంటుంది.

          ఇక పుట్టిన రోజు వేడుకలు మొదలవుతాయి.బంకర్ లో మూన్ దెబ్బలతో పడి ఉంటుంది. ఇక కిమ్ కుటుంబం ఇల్లు కోల్పోవడం ఓ వైపు,బంకర్ లో ఉన్న వారిని మేనేజ్ చెయ్యడం రెండోవైపు,పుట్టిన రోజు వేడుకలో పాల్గొనడం మరోవైపు,ఈ మూడు జరిగిపోతూ ఉంటాయి. బంకర్ లో ఉన్న మూన్ చనిపోతుంది. భార్య చనిపోయిందన్న కక్షతో ఆమె భర్త కిమ్ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి పైకి వస్తాడు.

          అలా పైకి వచ్చిన అతను కిమ్ కొడుకును తల మీద గట్టిగా మోదుతాడు. ఇంకో పక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. బయటకు వచ్చిన మూన్ భర్త జెస్సికాను చంపుతాడు. కిమ్ తన కూతురు జెస్సికాను పట్టుకుంటాడు. ఇంతలో కిమ్ భార్య చంగ్ మూన్ భర్తను పొడిచేస్తుంది. ఇక ఈ సమయంలోనే సినిమా మొదటి నుండి ఉన్న వాసనఅనే అంశం కిమ్ కు కోపాన్ని తెప్పిస్తుంది. డబ్బున్న పార్క్ కిమ్ కుటుంబ సభ్యుల నుండి ఏదో వాసన వస్తూ ఉంటుందని అంటూ ఉంటాడు. ఈ వాసన వల్ల అవమానించబడినట్టు భావించిన కిమ్ పార్క్ ను కత్తితో పొడుస్తాడు. ఇలా ఒకరినొకరు పొడుచుకోవడంతో ఈ సీన్ ముగుస్తుంది.

          తలకు తగిలిన గాయం మానాక కెవిన్ తన తల్లితో కలిసి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కిమ్ పార్కును హత్య చేశాక పోలీసుల నుండి తప్పించుకోవడానికి బంకర్ లో ఉంటాడు. జెస్సికా,మూన్ ,మూన్ భర్త ,పార్క్ ఈ నలుగురు మరణిస్తారు. ఇక సినిమాలో తండ్రి కిమ్ బంకర్ లో ఉంటే అతని కోసం కొడుకు బయట వేచి చూస్తూ ఉంటాడు.

          మోర్స్ కోడ్ ద్వారా లైట్ రూపంలో కొడుక్కి కిమ్ ఓ సందేశం పంపిస్తాడు. దాని ద్వారా తండ్రి ఆ బంకర్ లోనే ఉన్నట్టు అర్ధమవుతుంది అతనికి,కానీ పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉండటం వల్ల అతను ఏం చేయలేకపోతాడు.కెవిన్ పెద్దయ్యాక డబ్బులు సంపాదించి, ఆ ఇంటిని కొని తండ్రిని కలిసినట్టు చూపిస్తారు.కథ సుఖాంతం అనుకుంటున్న సమయంలో ఆ కలల లోకం నుండి కెవిన్ బయటపడినట్టు చూపిస్తారు. ఇక పారసైట్ ఏ సీన్ తో అయితే మొదలయ్యిందో అదే సీన్ తో ముగుస్తుంది. మొదటి సీన్ లో ఆ బేస్మెంట్ ఇంటిలో కెవిన్ ఉండటంతో మొదలవుతుంది,చివరకు అతను అక్కడే ఉండటంతో ముగుస్తుంది. కానీ ఈ రెండు సీన్లకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మొదట్లో పేదరికం ఉన్నా,కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది,అప్పుడు వెల్తురులో కెవిన్ ఉంటాడు. ఇప్పుడు చెల్లి,తండ్రిని కోల్పోయి చీకటిలో ఉన్నట్టు చూపిస్తారు. ఆ సీన్ కు ,ఈ సీన్ కు మధ్య వ్యత్యాసమే పారసైట్ సినిమా థీమ్.అదే పేదరికం,వర్గ వ్యత్యాసం.

          కెవిన్ అంత డబ్బు సంపాదించడం దాదాపు అసాధ్యమే కనుక సినిమాకు వాస్తవిక ముగింపు ఇచ్చి సినిమాను గుర్తుండి పోయేలా చేశారు దర్శకుడు. ఈ సినిమాలో డైలాగ్స్ ద్వారా చెప్పలేని చాలా విషయాలను మెటఫర్స్ ద్వారా స్పష్టం చేశారు దర్శకులు బాంగ్ జున్ హో.

          వర్గ వ్యత్యాసాన్ని చెప్పి చెప్పకుండా చూపించడం ఈ సినిమాకు కొత్త శోభను చేకూర్చింది. కిమ్ కుటుంబం బేస్మెంట్ ఏరియా అంటే భూమికి కొంచెం లోపలకు ఉన్నట్టు ఉనడటం వారు ఆర్థికంగా కూడా కింద ఉన్నట్టు చూపించడం,అలాగే పార్క్ కుటుంబానికి కిమ్ కుటుంబం వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళడం కూడా పార్క్ కుటుంబ ఎత్తును చూపిస్తుంది.అలాగే ఆ వర్షపు రాత్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కిమ్ కుటుంబం ఆ మెట్లు దిగుతూ రావడం కూడా దీనికే ప్రతీకగా అనిపిస్తుంది.

          అలానే కెవిన్ స్నేహితుడు మిన్ అతనికి ఓ రాయి అదృష్టం తీసుకువస్తుందని చెప్పి ఇస్తాడు.కెవిన్ ఆఖరికి ఇల్లు మునిగిపోతున్న సమయంలో కూడా దానిని తనతో తీసుకువెళ్తాడు. చివరకు ఆ రాయితోనే అతన్ని మూన్ భర్త గాయపరుస్తాడు. ఇక్కడ రాయి మన మెదడులో ఉన్న భారమని చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించాలన్న భారాన్ని మోస్తున్న కెవిన్ ఈ సంఘటన తర్వాత ఆ రాయిని నీళ్ళలో వదిలేస్తాడు. దానిని బట్టి ఆ భారాన్ని శారీరకంగా,అది ఇచ్చిన భావాన్ని మానసికంగా కూడా వదిలించుకున్నట్టు అనుకోవచ్చు.

          ఇక సినిమాలో వర్గ వ్యత్యాసాన్ని చూపించే ఇంకో అంశం వాసన. పేద ఇళ్ళల్లో ఉన్న వారి శరీరాల నుండి వచ్చే వాసన గురించి కూడా చెప్పడం దాని ద్వారా వర్గ వ్యత్యాసాన్ని స్పష్టం చేయడం సినిమాలోని ఈ సబ్ కాన్షియస్ అంశానికి ప్రేక్షకులను కనక్ట్ అయ్యేలా చేస్తుంది.వీటితో పాటు వర్షం పార్క్ కుటుంబానికి సంతోషం కలిగిస్తే,కిమ్ కుటుంబానికి బాధను కలిగిస్తుంది. ఇలా చెప్పి చెప్పకుండా వర్గ వ్యత్యాసాన్ని చెప్పడం ఈ సినిమాను మామూలు సినిమాలకు భిన్నంగా ఉండేలా చేసి నాలుగు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకునేలా చేసింది. తప్పక చూడాల్సిన సినిమా ఇది.

             *      *      *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!