ఊహ -వాస్తవం

 సినీ సంచారం

ఊహ -వాస్తవం

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          కొన్ని సినిమాలు కథలను ఇలా కూడా దృశ్యీకరించవచ్చా  అన్న స్థాయిలో ఉంటాయి. ఆ స్థాయి సినిమాలే ప్రేక్షకులకు సినిమా చూసినప్పుడు కలిగే ఓ ఆనందాన్ని,భిన్న భావోద్వేగాన్ని కలిగిస్తాయి. మెదడుకు పని చెబుతూ,సినిమాలోనే వాస్తవానికి -కల్పనకు మధ్య ఓ సందిగ్దతను ఏర్పరచి, కథలో ట్విస్టులను రెండు లోకాల్లోనూ ఇస్తూనే సినిమాకు సరి కొత్త అర్ధం చెప్పే సినీ విభాగంలో షట్టర్ ఐలాండ్ సినిమా కూడా ఒకటి. విభిన్న సినిమాల నాయకుడు లియోనార్డో డి క్యాప్రియో నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.

          ప్రతి మనిషి తాను మంచివాడు గానే ఉండాలనుకుంటాడు. కానీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు,మనుషులు కొన్నిసార్లు మనిషిని మృగాన్ని చేస్తాయి. స్వతహాగా మంచి వ్యక్తి అయ్యి  పరిస్థితులకు లోబడి అలా నేరాలు చేసిన వ్యక్తి మనసులో జీవితాంతం ఆ పశ్చాత్తాప భావం అలానే ఉండిపోతుంది. అలా రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా ఉండి,తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పోలీసుగా జీవితాన్ని సాగిస్తుంటాడు   యాండ్రు లాడీస్. అతని భార్య డోలారస్ షానల్. ఆమె మానసిక ఆరోగ్యం బావుండదు. ఆమె తన పరిస్థితి గురించి చెప్పినప్పుడు దాని పట్ల సరైన బాధ్యత తీసుకోడు యాండ్రు. వారికి ముగ్గురు పిల్లలు.వారు ఉంటున్న అపార్ట్మెంట్ కు నిప్పు అంటుకోవడం వల్ల కాలిపోతే, భార్యా పిల్లలతో కలిసి లేక్ దగ్గర ఓ ఇంటిలో ఉంటాడు. ఓ రోజు అతను ఇంటికి వచ్చేసరికి అతని భార్య వారి ముగ్గురు పిల్లలను ఆ పక్కనే ఉన్న లేక్ లో పిల్లలను ముంచి హత్య చేస్తుంది. అతను తిరిగి వచ్చేసరికి ఆ దృశ్యం చూసి తన పిల్లలను చంపిందన్న బాధ,కోపాలతో ఆమెను పిస్తోలుతో పేల్చి చంపేస్తాడు. దీనికి గాను అతన్ని షట్టర్ ఐలాండ్ లోని యాష్ క్లిఫ్ మెంటల్ హాస్పటల్ లో అతనికి చికిత్స జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా వెనుక కథ. సినిమా చివరి వరకు ఇది నిజమని ప్రేక్షకులకు తెలియదు.

          సాధారణంగానే ఎంతో తెలివైన వాడు యాండ్రు.అతని మనసులో ఉన్న పశ్చాత్తాపం క్రమంగా అతనిలో ఆల్టర్ ఇగో ను తయారు చేసింది. తనను తాను నేరస్థుడిగా, హంతకుడిగా బదులు తన జీవితం గురించిన ఓ కల్పనా ప్రపంచంలో అతను జీవిస్తూ ఉంటాడు. అప్పటికే అతను అక్కడికి వచ్చి రెండేళ్ళు అయినా ఆ ప్రపంచంలోనే ఉంటాడు. ఆ ప్రపంచంలో ఉన్నప్పుడూ అతనిలోని హింసా ప్రవృత్తి ఎక్కువయ్యే సందర్భాలు ఎక్కువ. ఎందుకంటే  అతని ప్రవృత్తిలోనే యుద్ధం-హింస రెండు ఉన్నాయి. అతని ధోరణి మారకపోయేసరికి అతనిలో మార్పు తీసుకువచ్చి అతన్ని వాస్తవ జీవితంలోకి తీసుకురావడానికి అతని పద్ధతిలోనే అతని లోకంలోకే వెళ్ళే మార్గాన్ని ఎన్నుకుంటారు ఆ హాస్పటల్ లో

          యాండ్రు ఓ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథాలోకంలో జీవిస్తూ ఉంటాడు. యాండ్రు ఊహా లోకంలో కూడా అతని తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. తన పేరును ఎడ్వార్డ్ డేనియల్స్ గా ఊహించుకుంటాడు. అతను ఈ సినిమాలో సృష్టించిన పేర్లు అతని మరియు అతని భార్య పేర్లకు ఏనాగ్రామ్స్ .అంటే ఒకే పదంలోని అక్షరాలను వివిధ రకాలుగా ఏర్పాటు చెయ్యడం వల్ల ఏర్పడే కొత్త పేర్లు.అలాగే ఎడ్వార్డ్ డేనియల్స్ కూడా అతని నిజమైన పేరుకు యానాగ్రామే. అలాగే అతని భార్య పేరైన డోలారస్ షానల్ ను రేచల్ సోలాండో గా ఆ పద్ధతిలోనే మార్చి ఇంకో కొత్త పాత్రను సృష్టిస్తాడు. ఆ హాస్పటల్ లో రేచల్ సోలాండో  తప్పించుకుందని,ఆమె ఆచూకీ కనుగొనడానికే తాను, తన పార్టనర్ అయిన చక్ తో కలిసి వచ్చానని అక్కడి వారికి చెప్తూ ఉంటాడు. ఈ భ్రమ నుండి అతన్ని బయటపడవెయ్యటానికే డాక్టర్ జాన్ క్రాలే, డాక్టర్ షీహన్ ఈ భ్రమను నిజం చేసే వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తారు. దానికి అనుగుణంగా అక్కడ ఉన్న వారందరూ అది నిజమానిపించేలా నటిస్తారు.

          ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎడ్వార్డ్ గా చక్ (డాక్టర్ షీహన్ )తో కలిసి అతను ఈ షట్టర్ ఐలాండ్ కు రావడంతో ఈ సినిమా మొదలవుతుంది. సినిమా మొదలైనప్పటి నుండి ఆఖరి ఇరవై నిమిషాల వరకు కూడా ప్రేక్షకులు ఎడ్వర్డ్ పాత్రనే నిజంగా భావిస్తారు.అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ,విజువల్స్ ఈ సినిమా గొప్పతనం.

          యాండ్రు తనను తాను ఎంత అసహ్యించుకుంటాడంటే తన భార్య ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిందని,దానికి కారణం యాండ్రు లాడియస్ గా ఊహించుకుంటాడు. అతను ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రత్యేకంగా వచ్చింది కూడా అతను ఈ షట్టర్ ఐలాండ్ లో ఉన్నడేమో అన్న విషయం నిర్ధారించుకోవడానికే అని చెప్తాడు. అలానే రేచల్ సోలాండ్ తన ముగ్గురు పిల్లలను హత్య చేసి ఇక్కడికి వచ్చిందని చెప్తాడు.అతను తన జీవితంలోని పాత్రాలను వేరే పేర్లతో వారి ప్రవృత్తులతో సృష్టించి వారిని రాక్షసులుగా భావిస్తాడు.ఆ ఐలాండ్ లో మనుషుల మెదడుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయని, ఆ విషయం అనుమానించినందుకే తనను ఇక్కడే ఉంచి తన మీద కూడా అలాంటి ప్రయోగాలు చెయ్యబోతున్నారని అని భావిస్తాడు.చివరకు అతన్ని అతని ఊహాలోకం నుండి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం అని తెలిసిన తర్వాత అతను కూడా వాస్తవాన్ని అంగీకరిస్తాడు.

          ఒకవేళ అతని పరిస్థితుల్లో మార్పు లేకపోతే లబోటమి చేసి అతని భావోద్వేగాలను ప్రతిస్పందించకుండా చేయాలనే నిర్ణయం ఆపాటికే ఆ హాస్పటల్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పటికీ దీనిని ఆఖరి ప్రయత్నంగా ప్రయోగిస్తారు. మారాడనుకున్న యాండ్రుని ఓ సారి పరీక్షించడానికి డాక్టర్ షీహన్ అతనితో మాట్లాడితే పూర్వం లానే మాట్లాడతాడు.దానితో అతనికి లబోటమి తప్పదని అర్ధమైపోతుంది.

          కానీ ఆఖరిలో యాండ్రు,’ఈ లోకంలో ఓ రాక్షసుడిగా బ్రతకడం కంటే మంచివాడిగా మరణించడమే మంచిది అని షీహన్ తో అన్నదాని బట్టి అతను మారినప్పటికి లబోటమి ద్వారా తనను తాను కోల్పోవడానికి సిద్ధపడి వెళ్తున్నాడని స్పష్టమవుతుంది. ఇది విషాద ముగింపు అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని తానే అసహ్యించుకునే వ్యక్తి తనను తాను అంగీకరించినా తనలోని రాక్షస ప్రవృత్తి చర్యల పట్ల జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. అతని ఊహా లోకంలో అతనికి తాను మంచివాడిననే నమ్మకం,అందుకే అది అతనికి అనారోగ్యంగా కాకుండా అతనికి నచ్చిన జీవితంలా అనిపించింది.

          తప్పక చూడాల్సిన సినిమా ఇది. మనిషికి తన జీవితంలో తనకు నచ్చని అంశాలను తన ఆల్టర్ ఇగోల ద్వారా తృప్తి పరచుకునే లక్షణం ఉంటుంది. అందుకే ఏదైనా సినిమా చూసినప్పుడు ఆ సినిమాలోని నాయకులను చూసినప్పుడు మనం కూడా అదే పాత్రలోకి ప్రవేశం చేస్తాము. కానీ అది పరిమిత స్థాయిలో ఉంటే ఆ వ్యక్తి జీవితం సామాజిక స్థాయిలో ఎటువంటి ఇబ్బందులకు గురవ్వకుండా సాఫీగా సాగుతుంది. కానీ అది దాని విస్తృతి పెంచుకుని ఆ వ్యక్తి జీవితాన్నే ఆక్రమిస్తే యాండ్రు జీవితంలా అవుతుంది.

             *    *    *

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!