గది ప్రపంచం

 సినీ సంచారం

గది ప్రపంచం

                                                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          నిషి బాల్యం నుండి ఓ గదిలోనే కొంతకాలం ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే వారి మానసిక స్థితిపై దాని ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టం చేసే సినిమానే 2015 లో లెన్ని అబ్రహంసన్ దర్శకత్వంలో వచ్చిన రూమ్. పదిహేడేళ్ళ వయసులో కిడ్నాప్ కు గురై ఏడేళ్లు ఓ గదిలో ఉండిపోయి,ఆ సమయంలో ఓ బిడ్డకు తల్లయిన స్త్రీ కథే ఈ సినిమా. పుట్టినప్పటి నుండి ఐదేళ్లు  ఓ గదిలో ఉండిపోయిన ఆ బిడ్డ వాస్తవ ప్రపంచాన్ని ఎలా చూడగలిగాడు అన్నదే ఈ సినిమా.

          24 ఏళ్ళ జాయ్ అనే స్త్రీ ఏడేళ్ళ క్రితం ఓల్డ్ నిక్ అనే అతను కిడ్నాప్ చేయడం వల్ల ఓ షెడ్ లాంటి రూమ్ లో ఉండిపోతుంది.ఓల్డ్ నిక్ ఆమెను మానభంగం చేయడం వల్ల ఆమెకు ఓ కొడుకు కూడా పుడతాడు. ఆ బాబు పేరు జాక్.అతనికి ఐదేళ్లు. ఓల్డ్ నిక్ ఆ షెడ్ లో వాళ్ళిద్దరిని ఉంచి,వారికి కావల్సిన ఆహార పదార్ధాలు ఇస్తూ ఉంటాడు. ఆ షెడ్ లాంటి రూమ్ లో ఓ పక్క కిచెన్,ఓ వార్డ్ రోబ్, ఓ మంచం, ఓ టెలివిజన్ ఉంటాయి.పుట్టినప్పటి నుండి ఆ రూమ్ లోనే ఉండిపోయిన జాక్ కు అక్కడ ఉన్న టెలివిజనే ఇంకో ప్రపంచం. జాయ్ తన కొడుకు జాక్ కు ఆ రూమ్ మాత్రమే నిజమని టెలివిజన్ లో కనిపించే బయటి ప్రపంచం అంతా అబద్ధం అని చెప్తుంది. ఓల్డ్ నిక్ వచ్చినప్పుడు జాక్ ను వార్డ్ రోబ్ లో ఉంచుతుంది జాయ్.

          ఓ రోజు రాత్రి ఓల్డ్ నిక్ వస్తాడు. తనకు ఉద్యోగం పోయిందని,ఇక ముందు వారికి కావాల్సినవి ఇవ్వలేనేమోనని చెప్తాడు. ఆ సమయంలో వార్డ్ రోబ్ లో ఉన్న జాక్ కుతూహలం కొద్ది బయటకు వస్తాడు. ఆ సమయంలో  తల్లిని,ఓల్డ్ నిక్ సన్నిహితంగా జాక్ చూసేసరికి భయపడిన జాయ్ నిక్ ను తన కొడుకును తాకవద్దని అరుస్తూ అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. దానితో ఓల్డ్ నిక్ అక్కడ పవర్ కట్ చేస్తాడు.

          జాయ్ తన కొడుకైన జాక్ కు వాస్తవ ప్రపంచం గురించి చెప్తుంది. దానిని ఎప్పుడు చూడని జాక్ అపనమ్మకంతో నమ్ముతాడు. ఇక తన కొడుకును అయినా అక్కడి నుండి తప్పిద్దామని నిర్ణయించుకున్న జాయ్ అతనికి జ్వరం వచ్చేటట్లు చేస్తుంది. ఓల్డ్ నిక్ వస్తే  జాక్ ని హాస్పటల్ కు తీసుకువెళ్తాడని ఆ సమయంలో తప్పించుకోమని చెప్తుంది. కానీ ఓల్డ్ నిక్ హాస్పటల్ కు తీసుకువెళ్ళనని యాంటీ బయోటిక్స్ తీసుకువస్తానని చెప్పి వెళ్ళిపోతాడు.

          ఈ లోపు జాయ్ తన కొడుకైన జాక్ ను చనిపోయినట్టు నటించమని,ఓల్డ్ నిక్ అతన్ని పాతిపెట్టడానికి ట్రక్ లో తీసుకువెళ్ళే సమయంలో తప్పించుకోమని చెప్తుంది. ఓల్డ్ నిక్ వచ్చేసరికి జాయ్ జాక్ ను అక్కడ ఉన్న ఓ చాపలో చూడుతుంది. ముందే జాక్ కు ఆ చాప నుండి ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది. ఓల్డ్ నిక్ రాగానే జాక్ చచ్చిపోయాడని చెప్తుంది. చెట్లు ఉన్న చోట అతన్ని పాతిపెట్టమని చెప్తుంది. ఓల్డ్ నిక్ జాక్ ను ట్రక్కులో తీసుకువెళ్తూ ఉంటాడు. చాప నుండి బయటకు వచ్చిన జాక్ ఓ చోట కిందికి దూకేస్తాడు.అదే సమయంలో అక్కడ ఉన్న  ఓ వ్యక్తి కుక్కతో అక్కడికి వాకింగుకు వస్తాడు. మొత్తానికి ఓల్డ్ నిక్ జాక్ ను  అక్కడే వదిలి పారిపోతాడు. జాక్ ను పోలీసులకు అప్పగిస్తారు..జాక్ చెప్పిన వివరాల ఆధారంగా ఆ రూమ్ ను కనుగొని జాయ్ ను కూడా విడిపిస్తారు. ఓల్డ్ నిక్ ను పట్టుకుని అరెస్ట్ చేస్తారు.అలా ఏడేళ్ళ తర్వాత జాయ్ తన  తల్లిదండ్రులను కలుసుకుంటుంది.

          జాయ్ తల్లిదండ్రులు విడిపోతారు. జాయ్ తల్లి లియో అని అతనితో ఉంటుంది.జాయ్ తండ్రి ఆమెకు ఓల్డ్ నిక్ వల్ల పుట్టిన జాక్ ను తన మనవడిగా అంగీకరించడు.జాయ్ జాక్ తో కలిసి తల్లితో ఉంటుంది. జాక్ తన కొత్త ప్రపంచంలోకి ఇమడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. జాయ్ జాక్ వాస్తవ ప్రపంచంలోని అంశాలతో ఇమడలేకపోవడం చూసి బాధ పడుతూ ఉంటుంది.అదే సమయంలో లాయర్ సలహా మీద ఓ టెలివిజన్ షో కు ఒప్పుకుంటుంది. అందులో ఓ ప్రశ్నగా ఆమెను జాక్ ను ఎందుకు ఓల్డ్ నిక్ తో హాస్పటల్ కు పంపలేదని,దాని వల్లే జాక్ ఈ ప్రపంచంతో పరిచయం లేని వాడిలా అయిపోయాడని అడగటంతో ఆమెకు పశ్చాత్తాప భావం కలిగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.

          జాయ్ ను హాస్పటల్ లో చేర్పిస్తారు. లియో తన కుక్క సాయంతో జాక్ ను ఈ ప్రపంచంలోకి వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత జాక్ మెల్లగా తన తోటి పిల్లవాడితో కూడా ఆడుకుంటూ ఉంటాడు.జాయ్ హాస్పటల్ నుండి తిరిగి వచ్చేసరికి మొత్తానికి జాక్ ఈ ప్రపంచానికి అలవాటు పడిపోతాడు. జాయ్ హాస్పటల్ నుండి తిరిగి వచ్చేసరికి జాక్ మామూలుగా మారిపోవడంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత జాక్ తో కలిసి జాయ్ జీవితంలోని అన్నీ కొత్తవి ప్రయత్నించాలని నిర్ణయించుకుంటుంది. చివరి సారిగా తాము ఉన్న రూమ్ ను ఓ సారి చూద్దామని జాయ్ ను అడుగుతాడు జాక్.చూడటానికి వెళ్తారు. దానిని చూసిన జాక్ దాని తలుపు తీసివేస్తే ఎంతో కొత్తగా ఉందని,ఆ కొత్త ప్రపంచం ఆ తలుపు వల్లే వచ్చిందని అంటాడు. ఇక ఆ రూమ్ కు గుడ్ బై చెప్పి అక్కడి నుండి బయటకు వారిద్దరు రావడంతో సినిమా ముగుస్తుంది.

          మనిషికి ఏది  నచ్చుతుంది.ఏది నచ్చదు అన్న అంశం అతను ఏ వాతావరణంలో పెరిగాడు అన్నదానిమీదే ఉంటుంది,అదే అతని మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుంది అని స్పష్టం చేసే సినిమా ఇది. ఇది పూర్తిగా అనుభూతి-అనుభవ ప్రధాన సినిమా. మనుషుల మానసిక మూలాలను పరిచయం చేసే సినిమా ఇది.

               *    *  *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!