బాబీ ఫిషర్ కు ఏమైంది ?

 సినీ సంచారం

బాబీ ఫిషర్ కు ఏమైంది ?

                                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          మేధావులకు మేధస్సు వరమో,లేకా ఆ మేధస్సు వల్ల ఏర్పడే ఆలోచనలు వారికి శాపమో చెప్పలేని    సందిగ్దత ఉంది. బాబీ ఫిషర్ లాంటి ప్రపంచ చెస్ ఛాంపియన్ కు  అతని మేధస్సు ఎలా శాపమై అతని జీవితాన్ని నాశనం చేసిందో స్పష్టం చేసే సినిమానే పాన్ సాక్రిఫైస్.అమెరికన్ చెస్ ప్లేయర్ బాబీ ఫిషర్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన సినిమానే పాన్ సాక్రిఫైస్.

           అమెరికాకు,రష్యాకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ సమయంలో చెస్ అన్నది మేధావులు ఆడే ఆట కనుక దానిని వార్ ఆఫ్ పర్సెప్షన్ అంటారు. ఈ ఆట కూడా ఈ రెండు దేశాల మధ్య ఓ యుద్ధం లాంటిదే. బాబీ ఫిషర్ యూదు జాతికి చెందిన వాడు.అతని తల్లి రష్యా నుండి వలస వచ్చింది. బాల్యం నుండి అతని తల్లికి కమ్యూనిస్ట్ స్నేహితులు ఉండటం వల్ల అమెరికన్ అధికారులు ఆమె కార్యకలాపాల మీద కన్ను వేసి ఉంచేవారు. ఎవరైనా బాబిని ఆమె తల్లి స్నేహితుల గురించి అడిగితే తనకు ఏం తెలియదని చెప్పమని చెప్తుంది అతని తల్లి.

          బాల్యంలో ఒంటరి వాడిగా ఉన్న బాబీ చెస్ క్రీడ పట్ల ఎంతో ఆసక్తి పెంచుకుంటాడు. అతని తల్లి అతన్ని చెస్ క్లబ్ కు తీసుకువెళ్తుంది. అక్కడ అతను ఆడిన పద్ధతిని గమనించిన అక్కడి గురువు అతన్ని విద్యార్ధిగా జాయిన్ చేసుకుంటాడు. అలా చెస్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన బాబీ ఫిషర్ అతి చిన్న వయసులోనే అమెరికాలోనే ప్రసిద్ధ ఆటగాడుగా మారతాడు.

          అప్పటికే రష్యన్ ఆటగాడైన బోరిస్ స్పాస్కీ ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఉన్నాడు. అప్పటికే చెస్ లో అగ్రగామిగా రష్యా ఉండటంతో వారిని ఓడించడమే తన లక్ష్యంగా పెట్టుకుంటాడు బాబీ ఫిషర్. అప్పటికే ప్రత్యర్ధులు ఆడిన ఆటలు వాళ్ళ ఓపెనింగ్స్ ,మిగిలిన మూవ్స్ అన్నీ గమనిస్తూ ఉంటాడు బాబీ. బల్గేరియాలో రష్యన్ లతో ఆడటానికి వెళ్ళిన బాబీ ఫిషర్ అక్కడ ఆటగాళ్ళందరూ కావాలని డ్రా అయ్యేలా ఆడుతూ ఉన్నారని,దాని వల్ల రష్యాన్లు తప్ప మిగిలిన వారు గెలిచే అవకాశం లేదని భావించి,ఆ ఆట ఆడకుండానే వదిలేస్తాడు. ఇక చెస్ ఆడటం కూడా మానేస్తాడు.

          బాబీ ఫిషర్ ఎప్పుడు ఓ రకమైన పారనోయాతో ఉండేవాడు.రష్యన్లు తనను వెంబడిస్తున్నారని,తనను చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అనుకుంటూ ఉండేవాడు. అతను రష్యన్లు ఎలా మోసం చేసి గెలుస్తున్నారో అన్న అంశం మీద రాసిన ఆర్టికల్ చూసిన పాల్ మార్షల్ అనే లాయర్ అతనికి సాయం చేస్తానని చెప్తాడు.నాడు రష్యన్ ఆటగాళ్లకు ఎన్నో సౌకర్యాలు ఉండేవి.వారు ఉండే హోటల్ మొదలుకుని వారి కారు దాకా ఎంతో ఖరీదైనవే ఉండేవి. తనకు కూడా అటువంటివే కావాలని పట్టుబడతాడు బాబీ. ఆ షరతులు తీరేలా తాను చేస్తానని మాట ఇస్తాడు పాల్.

          బాబీ ఫిషర్ మళ్ళీ చెస్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు.ఫాదర్ విలియం లొంబార్డి ఎవరైతే అంతకు ముందు వరల్డ్ చెస్ ఛాంపియనో అతన్ని తన సెకండ్ ప్లేయర్ గా తీసుకుంటాడు. ఆ సమయంలో కోల్డ్ వార్ జరుగుతున్నా తరుణంలో రష్యా తన చెస్ గెలుపు ద్వారా తమ కమ్యూనిజం అమెరికా ప్రజాస్వామ్యం కన్నా గొప్పదనే అంశాన్ని ఛాతీ చెప్పే ప్రయత్నంలో ఉంది. బాబీ ఫిషర్ ఇక అమెరికన్ స్టార్ అయిపోయాడు.ఇక అతని డిమాండ్స్ అన్నీ తీరడంతో అతను ఇక ఆడాల్సింది రష్యాతోనే.

          కానీ బాబికున్న పారనోయా వల్ల బోరిస్ స్పాస్కో తో శాంటా మోనికా లో ఓడిపోతాడు.మళ్ళీ ఆట ఆడనని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం,ఆఖరికి ప్రెసిడెంట్ నిక్సన్ అతని సెక్రటరీ కూడా బాబీ గురించి తెలుసుకుంటూ అతన్ని చివరకు ఐస్ లాండ్ లో జరిగే చెస్ పోటీలో పాల్గొనేలా చేస్తారు.అక్కడ అతని ప్రత్యర్ధి బోరిస్ స్పాస్కీ. చెస్ ఆడుతున్న సమయంలో బాబీ చిన్న చిన్న శబ్దాలకు కూడా అనుమానించి ఆట మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మొదటి రౌండ్ లో ఓడిపోతాడు. రెండవ రౌండ్ కు రాకపోవడం వల్ల అది కూడా ఓటమిగానే పరిగణించబడుతుంది.

          ఇక మూడో రౌండ్ నుండి తాను ఆడాలంటే చెస్ ఆ ఓపెన్ స్పేస్ లో కాకుండా పింగ్ పాంగ్ రూమ్ లో జరగాలని,ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్తాడు బాబీ.బాబీ కావాలనే ఓటమి నుండి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నాడని ఇలా ఆడకుండా గెలిచిన తనకు సరైన గుర్తింపు ఉండదని,అప్పటికే రెండు రౌండ్లు కోల్పోయిన బాబాయి గెలిచే అవకాశం లేదని భావించిన బోరిస్ స్పాస్కీ తాను బాబీ కండిషన్ కు ఒప్పుకుని పింగ్ పాంగ్ రూమ్ లో ఆడతానని చెప్పడంతో మళ్ళీ  బాబీ ఆడటానికి వస్తాడు.ఇక ఆ రౌండ్ నుంచి ప్రతి రౌండ్ లో గెలుస్తూ ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్ అవుతాడు బాబీ ఫిషర్.

          కానీ ఈ గెలుపు తర్వాత బాబీ కు మళ్ళీ పారనోయా,డెల్యుజాన్స్ ఎక్కువ్వడం వల్ల అతని విపరీత ప్రవర్తన వల్ల అతని కెరియర్ అంతమైపోయింది. యుగోస్లేవియాపై ఉన్న ఆంక్షలు కారణంగా ఆ దేశంలో జరిగే పోటీలలో పాల్గొనరాదనే హెచ్చరికను లెక్కచేయని బాబీ ఫిషర్‌పై అమెరికా చర్యలు తీసుకుంది. అంతవరకు చదరంగం క్రీడ ద్వారా ఆర్జించిన పారితోషికాలను అమెరికా కోశాగారంలో జప్తుచేయాలని ఆదేశించింది. దీనిపై బాబీ ఫిషర్ అమెరికాపై విరుచుకుపడ్డాడు. బాబీ ఫిషర్ అమెరికాను విమర్శించుటతో అమెరికా ఫిషర్‌ను పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది. దీనితో ఫిషర్ చాలా కాలం జపాన్ లో అజ్ఞాతజీవితం గడిపాడు. 2001, సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన దాడులను సమర్థించి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత మొదటిసారి బొరిక్ స్పాస్కీని ఓడించి ప్రపంచ చదరంగం టైటిల్ సాధించిన ఐస్‌లాండ్‌లో తలదాచుకున్నాడు. ఐస్‌లాండ్ ప్రభుత్వం కూడా బాబీ ఫిషర్‌కు పౌరసత్వం ఇచ్చింది. భారత్ కు వచ్చి విశ్వనాథన్ ఆనంద్ తో ఫిషర్ రాండమ్, చెస్ 960 పద్దతులలో తలపడాలని భావించిన ఫిషర్ కోరిక నెరవేరకుండానే 2008, జనవరి 17న మూత్రపిండాల వ్యాధితో రిక్జావిక్‌లో మరణించాడు.

          మనిషి మేధస్సుకు,సర్దుకుపోయి సమాజ జీవితంలో జీవించడానికి మధ్య ఉండాల్సిన సమన్వయం లోపిస్తే మేధావుల జీవితాలు ఎలా అవుతాయో బాబీ ఫిషర్ జీవితం స్పష్టం చేస్తుంది.

               *    *    *

           

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!