రివర్స్ ఇంజనీర్

 సినీ సంచారం

రివర్స్ ఇంజనీర్

                                                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          విష్యత్తును ముందే దర్శించే సినిమాలు ఎన్నో హాలివుడ్లో  వచ్చాయి. ఆ వర్గానికి చెందిన సినిమానే 2003 లో వచ్చిన పే చెక్.ఫిలిప్  కె.డెక్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకులు,నటులు అయిన బెన్ అఫ్లిక్ ఈ సినిమాలో మైఖేల్ పాత్రను పోషించారు. భవిష్యత్తును ముందే చూసిన ఓ రివర్స్ ఇంజనీర్ ఆ విషయాలన్నీ మర్చిపోయినా తిరిగి వాటిని కనుక్కొని ఆ భవిష్యత్తును ముందే చూసే యంత్రాన్ని తయారు చేసినందుకు దాని నుండి వచ్చే నష్టాలను నివారించడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.

          మైఖేల్ జెన్నింగ్స్ ఓ రివర్స్ ఇంజనీర్. అంటే ఇతను తాను పని చేసే కంపెనీకి పోటీగా వచ్చే ఉత్పత్తులన్నింటినీ గమనించి వాటికన్నా మెరుగైనవి తయారు చేస్తూ ఉంటాడు.ఇతను ఈ టెక్నాలజీని ఎక్కడ మరలా ఉపయోగించకూడదని అతను ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేయగానే  ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మెమరీని తొలగిస్తారు కంపెనీ వారు. తర్వాత మైఖేల్ ను అతనికి కాలేజీలో స్నేహితుడైన జేమ్స్ రేతరిక్ కలుస్తాడు.అతను ప్రస్తుతం ఆల్కామ్ అనే కంపెనీకి సిఈవో. రేతరిక్ తన కంపెనీలో ఓ ప్రాజెక్టు చేయడానికి  మైఖేల్ ను ఆహ్వానిస్తాడు. అది దాదాపు మూడేళ్ళ ప్రాజెక్ట్. కానీ అది చేయడం వల్ల వచ్చే డబ్బుతో అతని జీవితం స్థిరపడిపోతుందని జేమ్స్ ఒప్పించడంతో ఒప్పుకుంటాడు.

          అలా ఆల్కమ్ కంపెనీలోకి అడుగుపెడతాడు. అతను అక్కడ బయాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ రేచెల్ పోర్టర్ ను కలుస్తాడు. ఆమెతో మాట్లాడినా తర్వాత అతన్ని అతని వర్క్ పార్టనర్ అయిన విలియం డెక్కర్ దగ్గరకు తీసుకువెళ్తారు.మూడేళ్ళు అక్కడ ఉండి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాడు మైఖేల్. ఆ తర్వాత అతనికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మెమరీ తొలగిస్తారు.దానితో అతనికి 92 మిలియన్ డాలర్లు ఆ ప్రాజెక్టు  వల్ల వస్తాయి. కానీ ఎప్పుడైతే మైఖేల్ కామేపెనీలో తనకున్న షేర్స్ తెచ్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు అతను తన డబ్బు అంతా ఇచ్చేసినట్టు డాక్యుమెంట్స్ చూపిస్తారు. దానికి బదులుగా కొన్ని  ఐటమ్స్ ను మాత్రం అతను తన పేరున ఉంచుకున్నాడని అతనికి తెలుస్తుంది.

          అదే  సమయంలో ఎఫ్ బి ఐ కూడా అతని వెంట పడుతుంది. విలియం డెక్కర్ తో కలిసి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని డిజైన్స్ మీద పని చేసినట్టు ఆరోపిస్తారు.దాని వల్లే డెక్కర్ తన బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్తారు. మైఖేల్ కు అవేమీ గుర్తు లేకపోవడం వల్ల ఏమి చెప్పలేడు. ఎలాగో వారి బారి నుండి తప్పించుకుంటాడు.

          ఇక మైఖేల్ తనకు స్నేహితుడైన షార్టిని కలుస్తాడు. అతను మైఖేల్ పూర్వం పని చేసిన కంపెనీలో మెమరీని తొలగించేవాడు. అదే సమయంలో అతనికి టీవీలో వస్తున్న ఓ షో లో ఓ లాటరీ నంబర్ చూపించడం,తన దగ్గర ఉన్న వస్తువుల్లో ఒకటి ఆ లాటరీ సంఖ్య ఉన్నది కూడా కావడంతో తాను భవిష్యత్తులో జరగబోయేది ముందే చూడటం వల్ల వాటిని  సరి చేయడానికి తాను తనకు ఆధారాలుగా ఆ వస్తువులను ఉంచుకున్నాడని అతనికి అర్ధమవుతుంది. ఆల్కామ్ లో రేతరిక్ మైఖేల్ తయారు చేసిన మెషీన్ ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తే అది పని చేయదు. రేతరిక్ మైఖేల్ ను గమనిస్తూ ఉంటాడు. మైఖేల్ తన లవర్ అయిన డాక్టర్ రేచెల్ పోర్టర్ ను ఓ కేఫే దగ్గర కలవమని పంపిన సందేశాన్ని తెలుసుకుంటాడు రేతరిక్.

          రేతరిక్ రేచెల్ స్థానంలో ఆమె బాడి డబుల్ (అంటే చూడటానికి ఒకేలా అనిపించేవారు)ని పంపిస్తాడు,మైఖేల్ దగ్గర ఎన్వలోప్ ను తీసుకోవడానికి. ఈ లోపు అసలైన రేచెల్ రావడంతో మైఖేల్ ను రక్షిస్తుంది. మైఖేల్ తన దగ్గర ఉన్న ఎన్వలోప్ స్టాంప్స్ మీద మైక్రో డాట్ ఇమేజ్స్ ఉండటం గమనిస్తాడు. ఆ ఇమేజ్స్ ను పరిశీలిస్తే అవి ఆల్కమ్ కంపెనీ తయారు చచేసిన భవిష్యత్తును చూడగల మెషీన్ విజయవంతం అయ్యిందని,దాని వల్ల అమెరికా న్యూక్లియర్ యుద్ధాలు కూడా చేస్తుందన్న ముఖ్యాంశాలు ఓ దినపత్రికలో ఉంటాయి. ఆ మెషీన్ వల్ల భవిష్యత్తులో జరగబోయే దానిని గ్రహించిన మైఖేల్ దానిని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు.

          ఆ ఎన్వలోప్ లో ఉన్న ఇంకో వస్తువు మాల్కమ్ కంపెనీ ప్రవేశ కార్డు. ఆ కార్డు స్వైప్ చేసి లోపలికి ప్రవేశిస్తారు మైఖేల్ ,రేచెల్. ఆ మెషీన్ ను పని చేయకుండా మైఖేల్ పెట్టిన బగ్ ను తన ఎన్వలోప్ లో ఉన్న పజిల్ సాయంతో కనుక్కుని దాన్ని తొలగించి మెషీన్ పని చేసేలా చేస్తాడు. ఆ మెషీన్ ను నాశనం చేసే ముందు తన భవిష్యత్తును ఓ సారి చూసుకుంటాడు మైఖేల్. దానిలో అతన్ని రైఫిల్ తో కాల్చడం ఉంటుంది. ఆ మెషీన్ రాడ్ కు బులెట్ ను అమర్చి అక్కడ ఉన్న వెంటిలేటర్ సాయంతో అక్కడి నుండి బయటపడతారు మైఖేల్,రాచెల్.

          రేతరిక్ ముందే వీరు రావడం గమనించిన ఆ మెషీన్ పని చేసే వరకు వేచి ఉండి ఆ తర్వాత వారిని చంపవచ్చని వారిని లోపలికి వెళ్లనిస్తాడు. ఆ తర్వాత రేతరిక్,అతని మనుషులు ఆ ల్యాబ్ రూమ్ పగలగొట్టి లోపలికి వెళ్తారు. ఇక ఈ ఫైట్ లో ఓ వైపు రేతరిక్ ఇంకో వైపు ఎఫ్ బి ఐ వారు మైఖేల్ ను పేల్చే ప్రయత్నం చేస్తుండగా మధ్యలో ఉన్న మైఖేల్ కిందకు వంగడంతో ఎఫ్ బి ఐ బులెట్ తగిలి రేతరిక్ మరణిస్తాడు. మైఖేల్ తన వాచ్ అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. దానితో అతను మరణించాడనే ఎఫ్ బి ఐ కూడా భావిస్తుంది.

          ఇక మైఖేల్ ,రేచెల్ ,షార్టి ఓ ప్రశాంతమైన ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. షార్టి రేచెల్ ఆల్కమ్ ల్యాబ్ లో తనతో పాటు పెంచుకుంటున్న లవ్ బర్డ్స్ ను తప్పించి ఆమెకు ఇస్తాడు. తన దగ్గర ఉన్న ఎన్విలొప్ లో ఉన్న ఓ వాక్యం సాయంతో ఆ పంజరం కింద 90 మిలియన్ డాలర్ల లాటరీ టికెట్ ను బయటకు తీస్తాడు మైఖేల్. దీనితో సినిమా ముగుస్తుంది.

          పే చెక్ లాంటి సినిమాలు అర్ధం చేసుకోవడం కూడా ఒక సవాలే. ఇటువంటి సినిమాలు చూడటం వల్ల మన సాంకేతిక ప్రగతి వైపు ఆలోచనలు ఎంత వేగంగా పయనిస్తున్నాయో స్పష్టమవుతుంది.

               *     *     *

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!