షిండ్లర్స్ లిస్ట్

 సినీ సంచారం

షిండ్లర్స్ లిస్ట్

      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ప్రముఖ హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ సినిమా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1200 మంది యూదులను ఓ జర్మన్ వ్యాపారవేత్త ఎలా కాపాడాడో కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమా. ఈ కథ కల్పితం కాదు.ఈ చిత్రానికి స్టీవెన్ స్పీల్ బర్గ్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఆస్కార్ షిండ్లర్ ఓ జర్మన్ వ్యాపారవేత్త. అలాగే నాజీ పార్టీలో సభ్యుడు కూడా. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధాన్ని తన వ్యాపార లాభానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంటాడు షిండ్లర్.వ్యాపారవేత్తగా ఉన్న షిండ్లర్ ఎందరో యూదుల ప్రాణాలు ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమా కథ.  1982లో వచ్చిన షిండ్లర్స్ ఆర్క్ నవల ఆధారంగా 1993 లో ఈ సినిమాను స్టీవెన్ స్పీల్ బర్గ్ తీశారు.

          ఇక కథ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో క్రాకోవ్ లో జర్మన్ సైన్యం ఆ ప్రాంతంలో ఉండే యూదులను క్రాకోవ్ ఘట్టో లోకి బలవంతంగా తీసుకెళ్ళేవారు.అక్కడికి వెళ్ళారు అంటే నిత్యం మరణంతో చెలగాటం ఆడుతూ బ్రతకటమే. ఇదే సమయంలో అక్కడికి వ్యాపారవేత్త అయిన  షిండ్లర్ వస్తాడు. అతను జర్మన్ సాయుధ్య దళాలకు, వారి నాయకులకు లంచాలు ఇచ్చి నాజీ పార్టీలో సభ్యుడవుతాడు. అలాగే జర్మన్ నాయకులకు లంచాలు ఇచ్చి ఏనామిల్ వేర్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని  స్థాపించటానికి అనుమతులు తీసుకుంటాడు. ఇజాక్ స్టెర్న్ అనే అతనికి యూదులతో ఉన్న సంబంధాలు గమనించి అతని ద్వారా తన కంపెనీకి యూదు వ్యాపారవేత్తలను పెట్టుబడిదారులుగా వచ్చేలా చేస్తాడు.

          షిండ్లర్ జర్మన్ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ స్టెర్న్ సాయంతో ఆ సంస్థను నడుపుతూ ఉంటాడు. షిండ్లర్ అక్కడ పోలాండ్ దేశస్థులైతే ఎక్కువ జీతాలు చెల్లించాలని యూదులను తీసుకోవాలని అనుకుంటాడు. స్టెర్న్ ఈ జీతాల వారీగా మాత్రమే కాకుండా తాను కూడా యూదు అవ్వడం వల్ల వీలైనంత మంది  యూదులను జర్మన్ సైన్యం నుండి కాపాడటానికి వారిని పెద్ద సంఖ్యలో ఆ ఫ్యాక్టరీలో వర్కర్లుగా నియమిస్తాడు.

          ప్లాస్ జో కాన్సంట్రేషన్ క్యాంప్ నిర్మాణాన్ని చూడటానికి అమన్ గోత్ అనే వస్తాడు. అతను రాగానే ఆ క్యాంప్ పూర్తవ్వడం గమనించి పోలిష్ యూదులను ఘట్టోలో ఉన్నవారిని ఈ క్యాంపుకు తరలిస్తారు. ఈ సందర్భంలో ఎంతో మంది యూదులను చంపేస్తారు. అమన్ సరదాకి కూడా రోజు కొందరు యూదులను చంపుతూ ఉండటం,అలాగే హెలెన్ అనే యూదురాలిని తన మెయిడ్ గా తీసుకుని ఆమెను రోజు చిత్రహింసలు పెట్టడం వంటివన్నీ గమనిస్తూ ఉంటాడు షిండ్లర్. అమన్ కు లంచాలు ఇచ్చి ఇంకో సబ్ క్యాంప్ ను నిర్మించటానికి అనుమతి తీసుకుంటాడు. అమన్ బారి నుండి కొందరు యూదులను అయినా కాపాడాలని నిర్ణయించుకుంటాడు షిండ్లర్.

          రెండవ ప్రపంచ యుద్ధం అయిపోతుంది,ఇక జర్మనీ ఓటమి తేలిపోయింది అని తెలిసాక ఈ యూదులను ఆష్ విజ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలిద్దాం అనుకుంటారు. కానీ తన ఫ్యాక్టరీలో వర్కర్ల పేరు మీద వారందరినీ తప్పించాలని నిర్ణయించుకుంటాడు షిండ్లర్. 1200 మంది యూదుల లిస్టును తయారు చేసి వారిని తన వర్కర్లుగా పేర్కొని, వారికి ఒక్కొక్కరికి డబ్బు అమన్ కు కట్టి వారిని విడిపించే ప్రయత్నం చేస్తాడు. అతను అలా విడిపించిన వారి లిస్తూనే షిండ్లర్ లిస్ట్ అంటారు. తనకు లేని ఆర్టిల్లరి ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టు చూపించి మరి వీరందరిని కాపాడే ప్రయత్నం చేస్తాడు.  మొదట మగవారిని అతని సబ్ క్యాంప్ లో వదిలేస్తారు. స్త్రీలను రూటు మార్చి ఆష్ విజ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలిస్తారు. మళ్ళీ ఎలాగో లంచాలు ఇచ్చి వారిని తన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. అదే సమయంలో పిల్లలను మళ్ళీ జర్మన్ సైనికులు తీసుకువెళ్ళబోతుంటే వారు తన ఫ్యాక్టరీలో గన్ లోని బులెట్స్ ను క్లీన్ చేయడానికి కావాలని, వారి చేతులు చిన్నవి కనుక వారే చెయ్యగలరని ఒప్పించి మరి వారిని కూడా కాపాడతాడు.

          అలా 1200 మందిని కాపాడిన తర్వాత యుద్ధం పూర్తవ్వడం,జర్మనీ ఓటమి పాలవ్వడం జరుగుతుంది. జర్మనీ ఓటమి పాలవ్వడంతో షిండ్లర్ కాపాడిన యూదులను చంపేయ్యమని ఆజ్ఞలు రావడంతో వారిని చంపాలనుకున్న వారిని ఒప్పించి యుధులను చంపకుండా కాపాడతాడు షిండ్లర్. రష్యా ఎవరైతే యూదులను హత్యలు చేశారో ఆ జర్మన్లకు శిక్షలు విధిస్తున్నారు. షిండ్లర్ కు ప్రత్యర్ద దేశాల నుండి ఎటువంటి ఆపద రాకూడదని అతని ఫ్యాక్టరీలో వర్కర్ల పేరుతో అతను కాపాడిన వారంతా అతని పేరు మీద ఉత్తరం రాసి సంతకాలు పెట్టి ఇస్తారు.ఆ తర్వాత షిండ్లర్ రెడ్ ఆర్మీకి పట్టుబడకుండా ఉండటానికి వెళ్ళిపోతాడు.

          ఆ తర్వాత అమన్ కు ఉరి తీస్తారు. షిండ్లర్ వివాహం,వ్యాపారం రెండు ఆ తర్వాత దెబ్బ తింటాయి. కానీ ఇజ్రాయిల్ లో షిండ్లర్ సమాధి నిర్మిస్తారు అతని మీద ఉన్న ప్రేమతో. జర్మన్ నాజీ పార్టీ సభ్యత్వం కలిగి ఉండి మానవత్వంతో ఆలోచించి తన లాభాల కన్నా మనుషుల ప్రాణాలు కాపాడటానికే ప్రాధాన్యత నిచ్చిన షిండ్లర్ ను యూదులు,ప్రపంచం  అంతా  ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

          ఈ సినిమా దాదాపు మూడు గంటల పైన ఉండే సినిమా.బ్లాక్ అండ్ వైట్ సినిమా.మధ్యలో మాత్రం దర్శకులు అవసరమైనప్పుడు మాత్రం కలర్స్ ఉపయోగించారు. యుద్ధ సినిమాల్లో కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

                      *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!