కింగ్ జాన్ క్రూరత్వం

 సినీ సంచారం

కింగ్ జాన్ క్రూరత్వం

                                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ఇంగ్లాండ్ రాజైన కింగ్ జాన్ ప్రజలు స్వేచ్చాజీవులని పేర్కొనే మాగ్నా కార్టాపై సంతకం చేశాక దానిని మరచి ఎలా క్రూరంగా ప్రవర్తించాడో తెలిపే ఆంగ్ల సినిమానే ఐరన్ క్లాడ్. ఇంగ్లాండ్ రాజుల్లో ఓ క్రూర రాజుగా కింగ్ జాన్ ను చరిత్రకారులు పేర్కొంటారు. కింగ్ జాన్ క్రూరత్వం వల్ల అతనికి వ్యతిరేకంగా ఆ రాజ్యంలో ఉండే బారన్స్ టెంప్లర్ నైట్స్  సాయంతో మూడేళ్ళకు పైగా యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ విజయం తర్వాత కింగ్ జాన్ సంధి పత్రంగా ఓ మాగ్నమ్ కార్టా మీద సంతకం చేశాడు.దాని ప్రకారం ఇంగ్లాండ్ పౌరులంతా స్వేచ్చాజీవులు,రాజు ఆధిపత్యం వారి మీద ఉండదు.

          కానీ దాని మీద సంతకం చేసినందుకు తర్వాత విచారించిన కింగ్ జాన్ దానికి వ్యతిరేకంగా మళ్ళీ రాజ్యంలో తన ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. దానిలో భాగంగా డెన్మార్క్ నుండి మెర్శనరీలను వారి భూముల్లోకి క్రైస్తవ మిషనరీలను రానివ్వకుండా పోప్ అడ్డుకుంటాడని అబద్ధం చెప్పి వారి ద్వారా ఓ సైన్యాన్ని ఏర్పరుస్తాడు.

          అబ్బట్ మార్కస్ ఇంకో ముగ్గురు టెంప్లర్ నైట్స్ తో కలిసి క్యాంటర్బరి కోటలో వాన వల్ల తల దాచుకోవడానికి వస్తారు. ఆ మర్నాడు అక్కడికి కింగ్ జాన్ వస్తాడు. మాగ్నా కార్టా మీద సంతకం పెట్టిన బారన్ డార్నేని అక్కడే ఉరి తీసి చంపిస్తాడు. టెంప్లర్ నైట్ అబ్బట్ దానిని అడ్డుకోబోతుండగా అతని నాలుకను తెగ్గొస్తాడు. మిగిలిన నైట్ టెంప్లర్ లు రాజుతో యుద్ధం చేసి మరణిస్తారు. ఇక మిగిలిన థామస్ మార్షల్ అనే టెంప్లర్ అబ్బట్ ను కాపాడటానికి గుర్రం మీద పారిపోతాడు. అబ్బట్ ఆ రాత్రి మరణిస్తాడు.అతని త్యాగం వృథా కాకుండా చూస్తానని థామస్ అతనికి చనిపోయే ముందు మాట ఇస్తాడు.

          థామస్ ఆర్చ్ బిషప్ లాంగ్టన్ ను,బారన్ విలియం డి ఆబిగ్నిను కలుస్తాడు. మజ్ఞా కార్టా ను రాసినందుకు తనను కింగ్ జాన్ తనను ఎక్స్ కమ్యూనికేట్ చేశాడని చెప్తాడు లాంగ్టన్. పోప్ కూడా కింగ్ జాన్ వైపు ఉన్నాడని,ఆ మాగ్నా కార్టా మీద సంతకం పెట్టినవారిని హతమార్చి,ప్రజలను భయభ్రాంతులను చేసే పనిలో ఉన్నాడని,అతన్ని ఎలా అయినా ఆపాలని ముగ్గురు నిర్ణయించుకుంటారు.

          మొత్తానికి ఈ ముగ్గురు కలిసి ఇరవై మందిని సైన్యంగా చేసుకుని బ్రిటిష్ రాజ్యానికి కింగ్ జాన్ ఆధిపత్యానికి ఆయువు పట్టు అయిన రోచెస్టర్ కోటను తిరుగుబాటు పేరు మీద ఆక్రమిస్తారు. రెండు సార్లు కింగ్ జాన్ వీరి మీద యుద్ధం చేసినా ఆ ఇరవై మందితోనే విజయం సాధిస్తారు. ఆ తర్వాత కాలాలు మారుతూ ఉంటాయి. తినడానికి కూడా ఆ రోచెస్టర్ కోటలోని వారికి ఏమి లేక వారి వారి గుర్రాలను కూడా తినే పరిస్థితికి వస్తారు. ఇక అదును చూసుకుని మళ్ళీ దాడి చేస్తాడు. బారన్ ఆబిగ్నిని దారుణంగా చంపుతాడు కింగ్ జాన్.ఇక వారి సైన్యంలో దాదాపు అందరూ చనిపోయినా థామస్ మార్షల్ మాత్రం లొంగిపోవడానికి ఒప్పుకోడు.

          కింగ్ జాన్ పందులను తెప్పించి ఆ కోట కింద నుండి మైన్ తవ్వి పంది కొవ్వుతో కింద నుండి కాలుస్తూ ఆ కోటను కూల్చేస్తాడు. ఆ సమయంలో మిగిలిన వారిని కూడా కింగ్ జాన్ సైన్యం చంపేయ్యబోతున్న తరుణంలో ఎప్పటి నుండి వస్తారని ఎదురుచూస్తున్న ఫ్రెంచ్ సైన్యం వస్తుంది. ఫ్రెంచ్ చేతిలో కింగ్ జాన్ సైన్యం ఓడిపోతుంది. పారిపోతున్న సమయంలో కింగ్ జాన్ డిసెంట్రీ తో మరణిస్తాడు.మొత్తానికి ఆ మాగ్నా కార్టా అలా అమల్లోకి వచ్చింది. ఆ రోచెస్టర్ కోటను తర్వాత పునర్నిర్మించారు.

          ప్రపంచ చరిత్ర అంటే దేశాల చరిత్రే. ఆ దేశాలంటే ఆ దేశాల్లోని పౌరులే. ఆ పౌరుల స్థితిగతులు,వారి జీవితాలే చరిత్ర పుటలు.అటువంటి పుటల్లో ఈ గెలుపు కూడా అందరికి స్పూర్తినిచ్చే ఓ పాఠం. చరిత్రపై,యుద్ధ సినిమాలపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

        *         *      *

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!