అశ్రుధార

 చదువరి

      అశ్రుధార

         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          ప్రపంచ,దేశ,ప్రాంతాల పోరాటాలను తమ కలంతో ఎన్ని తరాలు దాటినా గుర్తుండేలా ఆ స్ఫూర్తిని అందించే అతి కొద్ది మంది రచయితల్లో దాశరధి రంగాచార్యగారు ఒకరు.ఆయన మోదుగుపూలునవల మనం ఆ కాలంలో జన్మించకపోయినా,నాటి పాలనలో ఉన్న అరాచకాల్లో మనం కూడా ప్రేక్షకులమై పయనిస్తూ,ప్రజలందరూ రక్తపు ధారలు కురిపిస్తున్న సమయంలో మనం మన కళ్ళతో అక్షరాల వెంట పరిగెడుతూ అశ్రువులు స్రవిస్తాము. మోదుగుపూలు నవల 1944-51 మధ్య తెలంగాణలో నెలకొన్న ప్రజా పోరాటాన్ని చిత్రించిన నవల. ఈ నేపథ్యంలో జాగీర్దారీ ప్రాంతంలో ఎలాంటి అకృత్యాలు, అరాచకాలు చెలరేగాయో క్రమంగా చైతన్యవంతులైన ప్రజలు అధికార వర్గాలను , వారి పీఠాలనూ ఎలా కదిలించాయో మోదుగుపూలు నవలలో ఉంటుంది.

          దేశంలో మొఘల్‌ వంశానికి చెందిన ఔరంగజేబు కాలంలో సాగిన పరిపాలన ఎంత క్రూరమైనదో అంతకంటే అమానుషంగా సాగింది ఇక్కడి నిజాం పాలన. ముఖ్యంగా 1911 నుంచి 1948 వరకు రాజ్యం చేసిన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ పరిపాలన ప్రజల కష్టాలకు, కడగండ్లకు కారణమైంది. జాగీర్దారలను, దేశముఖ్‌లను అండగా జేసుకుని తెలంగాణ పల్లెల్లో అరాచకత్వాన్ని సృష్టించాడు. ప్రజల కనీస అవసరాలు తీర్చకపోగా వెటించాకిరి రుద్దబడడమే కాకుండా చివరకు చస్తే శ్మశానంలో ' బూడిద పన్ను' పేరుతో డబ్బు వసూలు చేశాడు. నిజాం నవాబు పేరు చెప్పి జాగీదార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు వాళ్ల కనుసన్నల్లో పనిచేసే తాసీదార్లు, గిర్దావర్లు, పటేల్‌ పట్వారీలు పల్లెసీమల్లో సృష్టించిన భీభత్సం చెప్పనలవి కాదు. తరతరాలుగా అనుభవిస్తున్న దోపిడి, దౌర్జన్యాలపై తిరుగుబాటు సల్పిన ఇక్కడి ప్రజల సాహసాన్ని , సమరాన్ని చిత్రిస్తూ అద్భుతమైన ప్రజా సాహిత్యం వెలువడింది. సహనం నుంచే సాహసం పుట్టుకొస్తుందన్న చారిత్రిక సత్యాన్ని రుజువు చేస్తూ బాంచెన్‌ కాల్మొక్తా, గులాపోణ్ణి అన్న అమాయక ప్రజలే అసమాన పోరు సల్పి చరిత్రను తిరగరాసారు. నిజాం పాలన అనే బలవంతమైన సర్పము ప్రజలనే చలిచీమల చేతచిక్కి దిక్కులేని చావు చచ్చింది.

          అసఫ్ జాహి వంశం లో చివరివాడైన ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుండి 1948 వరకు నిరంకుశం గా రాజ్యం పాలించాడు. నిజాం రాష్ట్ర విస్తీర్ణం 82 వేల చదరపు మైళ్ళు .రాష్ట్ర వ్యాపితం గా ఉన్న 1167 జాగీర్ల వైశాల్యం 11000 చదరపు నిజాం బంధువులకు చెందిన పాయె గాళ్ళ విస్తీర్ణం 3262 చదరపు  మైళ్ళు .నైజం నవాబును తలదన్నిన నిరకుశత్వం  జాగీర్లది.అలాంటి ఒక జాగీర్దార్ జాగీర్ లో జరిగిన కథ ఇది. మోదుగు పూలు అడవిలో ఉంటాయి .ఎర్రగా ఉంటాయి .ఈ పూలను విప్లవానికి సంకేతించారు దాశరధి రంగాచార్య.          రఘు అభ్యుదయ భావాలు గల నవయువకుడు .హైదరాబాద్ లో చదువు ముగిస్తాడు .తన ఊరికి ఆంగ్ల దిన పత్రిక తో వస్తాడు . దినపత్రిక చేతిలో కనబడడమే ప్రభుత్వం దృష్టిలో పెద్ద నేరం .పోలీస్ అమీన్ ఎదురుపడి రఘుని చెంపదెబ్బ వేస్తాడు .సహనం,  తార్కికాలోచన రఘు సొత్తు .అతనిలో ఆలోచన మొదలవుతుంది .పరిస్థితుల ఆకళింపు పెరుగుతుంది .ప్రత్యమ్నాయం స్పురిస్తుంది .ఉద్యమం వైపు నడుస్తాడు .అతనిది అహింసా మార్గం .రఘు ఉద్యమానికి నగేశ్ తోడ్పడుతాడు .కాని నగేశ్ ది హింసా మార్గం .ఇద్దరిలో చాలా సార్లు అభిప్రాయ భేదం కలుగుతుంది .అయినా ఇద్దరూ కలిసే పని చేస్తారు .రఘు మేనమామ వీరయ్య ,అతన్ని బాల్యం నుండి ఆరాధించే మరదలు జానకి కూడా  ఉద్యమానికి తోడ్పడుతాడు .రఘు విముక్త రాష్ట్రం లోనే ఆమెను పెళ్ళాడుతానని చెబుతాడు. షావుకారు వెంకయ్య కూతురు రుక్మిణి .ఆమె నగేశ్ ని ప్రేమిస్తుంది .నగేశ్ కూడా ఆమెకి మనసు ఇస్తాడు.       

          అధికారుల దౌర్జన్యాలు ,ప్రజల కష్టాలు  చూసి రఘు కదలి పోతాడు .ప్రజలకు అధికారులు విధించే శిక్షలు చాలా భయంకరం గా ఉంటాయి .స్త్రీ లకు రక్షణ లేదు .ఏ అధికారి కన్నైనా ఏ స్త్రీ పైన పడిందో అంతే సంగతి .ఎటువంటి శిక్షనైనా నోరు మూసుకొని అనుభవించడమే  ప్రజలపని .వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకోవడం అయిన దానికి కానిదానికి కోపగించుకోవడం ,కట్టు కోయ్యలకు కట్టి కొట్టడం ,ఎండలో నిలబెట్టి వీపు మీద బండలు ఎక్కించడం ,మనిషిని గుర్రానికి కట్టి ఈడ్చుకు పోవడం ,దూలానికి తలకిందులు గా వేలాడదీయడం లాంటి శిక్షలన్నీ అధికారుల వేడుకలు .చివరికి ఈ దుర్మార్గాలన్నే చూసి విచలితుడైన రఘు హింసా మార్గం తోక్కుతాడు .తహసీల్ దార్ కొడుకు రషీద్ రజాకార్ల నాయకుడు .అతడు రుక్మిణి ని మాన భంగం చేస్తాడు .రుక్మిణి ఆత్మ హత్య చేసుకుంటుంది .రషీద్ జానకి ఇంటిపై అర్ధ రాత్రి దాడి చేసి చెరచ ప్రయత్నం చేస్తాడు .జానకి తనను మాన భంగం చేయ ప్రయత్నించిన రషీద్ ను కత్తి తో పొడిచి చంపుతుంది .చివరికి ప్రజల తిరుగు బాటు జరుగుతుంది .

          ఆ గ్రామంలో ప్రతాపరుద్రుని పాలన నాటి ఙ్ఞాపకాలు ఎన్నో ఉన్నట్టు రచయిత పేర్కొంటాడు .వేయి స్తంభాల గుడికి  నమూనా లాంటి శిధిల దేవాలయాలు అక్కడ ఉన్నాయి .సముద్రాల్లాంటి మహాతటాకాలు ఉన్నాయి .ఒక దృశ్యం లో ఒక పల్లె మనిషి ని అమీన్ సాబ్ తనకు కోళ్ళు ఎందుకివ్వవని బెదిరిస్తాడు .ఆ మనిషి చెప్పిన సమాధానం ‘’యాడ మిగిలినయ్ కాల్మొకుత,ఊరి బయటనే పోలీసాయనొకటి గుంజుకున్నడు,తాహసీల్దార్  దొర బంగ్లా ముందు జవాన్ ఒకటి పట్టుకున్నడు, బుట్టకోడి గుంజుకొన్నడు,కాల్మొక్త ,కాలు కడుపులు తెచ్చుకొని బుట్ట తెచ్చుకొన్న బాంచెను ,మల్ల తెచ్చినపుడిచ్చుకుంట ,గులాపోన్ని, మూడు కోడిపిల్లలు తెస్తిని ,మూడు గుంజుకొనిరి ,ఎం జేయమంటరు?ఒక్క పల్లె వాసి నిర్మల హృదయం ,నిసర్గ భాష ,అతని దైన్యం ,మన కళ్ళముందు పెడతాడు రచయిత .

          మంగలి వృత్తి ,ఒడ్డెర్లు  సమ్మె చేస్తే తాహసీల్దార్ బతుకే స్తంభిస్తుంది . ఊరంతా నిర్వీర్యమౌతుంది .మంగలులకు సమ్మె చేసే చైతన్యం రఘు ,నరేశ్ లనుండి లభిస్తుంది .ఈ సంఘటనల వల్లకులవృత్తులు సమాజ జీవన పునాదులు అని అన్యాపదేశం చేస్తాడు రచయిత .వీళ్ళు క్షురకర్మ చేయడమే కాదు ,వైద్యాలు చేయడం ,బెణుకులు సరి చేయడం ,వాయిద్యాలు వాయించడం ,లాంటి పనులన్నీటి లోనా సిద్దహస్తులే .మంగళ్ళు ,చాకల్లు ,కమ్మర్లు ,కుమ్మర్లు ,గ్రామజీవితం లో అతి ముఖ్యమైన స్తంభాలు .అందుకే మడులిచ్చి ,మాన్యాలిచ్చి ,వాళ్ళను  ఊరిలోకి తెచ్చి పెట్టు కున్నారు ఆ కాలం లోని గ్రామ నిర్మాతలు .ఇక కోయ సంస్కృతి, జీవన విధానం ,వివాహ పద్ధతి ,ఆచారాలు ఒక చలన చిత్రం లాగా మన ముందుంచుతాడు రచయిత .ఈయన స్వయం గా అడవికి వెళ్లి వాళ్ళ జీవితాన్ని పరిశీలించి చిత్రించిన అంశాలు ఇవి .

 

సింగి ,సింగడి ప్రేమ తండ్రి కొడుకు సింగని కోసం పెట్ట ( సింగిని వేటాడడం ,) తరువాత పిల్ల ,పిల్లగాని తరపు వాళ్లకు యుద్ధం (ఉట్టుట్టి) తరువాత రాజీ , పెళ్లి ,కోయ గూడెం విందులు వినోదాలు ,ఇప్పసారా ,నెమలి మాసం తో సహా వివిధ రకాలైన మంసాహారాలు, సింగని తల్లి మరణించి దేవత కావడం ,దేవతకు జంతు బలి, ఇట్లా కొయెల ప్రసవం ,వివాహం ,మరణం .లాంటి అనివార్యమైన జీవన గతులలో జరిగే ఆచారాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి .అల్లాంటి కోయల ,ఒడేరల  శ్రామిక జీవన సౌందర్యం ,తాహసీల్దార్ ,ఆమెన్ ,గిరిదావర్, వాళ్ళమీద చేసే దౌర్జన్యం ,చివరికి రఘు నగేశ్ ల ప్రభావం తో వాళ్ళు తిరుగబడిన తీరు  పాఠకులను కదలిస్తుంది .

          ఊరిలో కలరా వ్యాపించినపుడు ఊరి వాళ్ళ నమ్మకాలు ,బైండ్ల వాళ్ళ పాటలు ,తరువాత దున్నను బలి ఇవ్వడం ,లాంటి వన్నీ ఆశర్యం కలిగిస్తాయి .ఆ కాలంలోని గ్రామాల్లోని విశ్వాసాలు కళ్ళముందు కదలాడుతాయి .వర్షం రావడానికి హిందువులు ,ముస్లిం లు చేసే పూజలు ,కప్పతల్లి ఆటలు ,అందులోను అంతరంగికమైన బేధాలు ,వెరసి మానవుని మనస్తత్వాన్ని పరోక్షం గా చూపిస్తాడు రచయిత .చివరికి గిరిదావరి మాంత్రికుని మాటల ప్రభావం తో ధనాశతో నరబలి కూడా చేయిస్తాడు .పేద ప్రజల భాధలు ,ఆకలి ఇట్లా ఉంటె ధనవంతుల ముస్లిం పాలకుల  విలాసాలకు కొదవే లేదు .భోజనం లో పది రకాల మాంసాహారాలు ,అయిదు రకాల కూరగాయాలు ,పచ్చళ్ళు ,పెరుగు వెన్న ,మీగడ ,హల్వాలు (తహసీల్దార్ ) వాళ్ళ భోజనాలు .

          సమాజం లోని ఈ రకమైన అంతరాలే విప్లవానికి ,తిరుగు బాటుకి దారి తీశాయి. ఇన్ని రోజులు గడచినా ఈ నవల ఇప్పటికీ ప్రాసంగికంగా ఉన్నదంటే రచయిత సామాజికకోణం తో శిల్ప దృష్టి మేళవించడమే. ఈ నవలలో ప్రజల కన్నీళ్లు ఉన్నాయి,దానికి మూలాలు ఉన్నాయి,వారి కోపం ఉంది,అమయాకత్వం ఉంది,అధికార దాహం ఉంది,ఇలా అన్నీ ఉన్నాయి.విశ్వజనీయమైన అంశమే ఈ మోదుగుపూలుకథాంశం అనడంలో అతిశయోక్తి లేదు.

                 *    *   *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ