కుట్ర

 సినీ సంచారం

కుట్ర

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



           టామ్ క్లాన్సీ నవలల్లో జాక్ రయాన్ సిరీస్ సినిమాలుగా వచ్చాయి,అలాగే సీజన్లుగాను వచ్చాయి. అందులో ఓ నవలే ద క్లియర్ అండ్ ప్రెజంట్ డేంజర్. హారిసన్ ఫోర్డ్ ఇందులో జాక్ రియాన్ గా నటించారు. ఇది ఒక పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.దేశాల నాయకులు నేరాలను ఎందుకు ప్రోత్సహిస్తారో,దాని వల్ల ఎలా తమ కోశాగారాలు నింపుకుంటారో అన్న అంశాన్ని టామ్ క్లాన్సీ ఈ పోలిటికల్ థ్రిల్లర్ నవలలో కథాంశంగా మలిచారు. ఈ సినిమాకు ఫిలిప్ నోయిస్ దర్శకత్వం వహించారు.

          అమెరికన్ ప్రెసిడెంట్ ఎడ్వార్డ్ బెన్నెట్ మిత్రుడైన హార్డిన్  అతని భార్యా ,పిల్లలతో సహా  హత్య చేయబడతాడు. హార్డీన్ కొలంబియన్ డ్రగ్ కార్టెల్ తో ఉన్న సంబంధాల వల్ల,అతను ఎర్నెస్టో ఎస్కోబీడో అనే డ్రగ్ డీలర్ కు దాదాపు 650 మిలియన్ డాలర్లు ఎగవేసినందుకు అతనే ఈ హత్యలు జరిపిస్తాడు. ఈ ఎస్కోబీడో పాత్రను రచయిత పాబ్లో ఎస్కోబార్ పాత్ర నుండి స్పూర్తి పొంది సృష్టించారు.

          అమెరికన్ ఎఫ్.బి.ఐ వైస్ అడ్మిరల్ అయిన జిమ్ గ్రీర్ కు క్యాన్సర్ రావడం,అతను హాస్పటల్ పాలవ్వడంతో అతని బదులుగా అతని తరువాతి పదవి లో ఉన్న జాక్ రియాన్ ను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గా నియమిస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన జేమ్స్ కట్టర్ తో ఎలా అయినా తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పరోక్షంగా చెప్తాడు. జాక్ రియాన్ నిజాయితీపరుడు.ఇటువంటి వాటికి అంగీకరించడని తెలిసిన ప్రెసిడెంట్ మరియు జేమ్స్ రియాన్ కింద పని చేసే బృందం అయిన జేమ్స్ కట్టర్ బృందం అతనికి తెలియకుండానే  ఎర్నెస్టో ఎస్కోబీడో వ్యాపారాన్ని ధ్వంసం చేయడానికి రెసిప్రోసిటీ ఆపరేషన్ పేరు మీద జాన్ క్లార్క్ సాయంతో ప్రత్యేక బృందాన్ని ఈ పని కోసం నియమిస్తాడు.డ్రగ్ కార్టెల్ ఆపరేషన్స్ అన్నీ జాన్ క్లార్క్ బృందం ధ్వంసం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హార్డీన్ కు డ్రగ్ కార్టెల్ కు మధ్య ఉన్న సంబంధాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి జాక్ రియాన్ ను ప్రెసిడెంట్ కొలంబియా పంపిస్తాడు.

          ఎర్నెస్టో ఎస్కోబీడోకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఫెలిక్స్ కార్టేజ్ వ్యవహరిస్తాడు. ఆ 650 మిలియన్ డాలర్లు కొలంబియన్ ప్రభుత్వానికి చెందాలని కొలంబియా అనడంతో ఆ విషయం మీద  చర్చలు జరిపి అది పట్టుకుంది తాము కనుక తమకు దక్కేలా చూడటానికి ఒప్పించమని ఎఫ్ బి ఐ డైరెక్టర్ ఎమిల్ జాకబ్స్ ను కొలంబియా పంపిస్తాడు ప్రెసిడెంట్. కార్టేజ్ తెలివిగా వీరి మీద దాడి ప్లాన్ చేస్తాడు.జాకబ్స్ మరణిస్తాడు. జాక్ రియాన్స్ మాత్రమే ప్రాణాలతో మిగులుతాడు. ఆ అనుమానాన్ని ఎర్నెస్టో ఎస్కోబీడోకు మళ్ళేలా చేస్తాడు కార్టేజ్.

          కార్టేజ్ కట్టర్ తో ఓ డీల్ చేసుకుంటాడు. ఎర్నెస్టో ఎస్కోబీడోను తాను లేకుండా చేయగలిగితే డ్రగ్ కార్టెల్ తన చేతుల్లోకి వస్తుందని అప్పుడు తాను అమెరికాకు డ్రగ్స్ సప్లై తగ్గేలా చూస్తానని,దాని ద్వారా వారికి కూడా ఆదాయం ఉంటుందని, ప్రజల్లో డ్రగ్స్ మీద విజయం సాధించిన అభిప్రాయం కలుగుతుందని చెప్తాడు. దానికి బదులుగా క్లార్క్ సైనికుల బృందం తనకు కావాలని వారి లొకేషన్స్ ఇవ్వమని అడుగుతాడు.దానికి కట్టర్ ఆమోదిస్తాడు.క్లార్క్ కు ఈ విషయం తెలిసేలోపే అతనికి,అతని బృందానికి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తారు. కార్టేజ్ ఆ సైనికులను పట్టుకుని బంధిస్తాడు.

          జాక్ రియాన్ రిట్టర్ (డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ) కంప్యూటర్ ను హ్యాక్ చేసి ఈ ఆపరేషన్ గురించి తెలుసుకుంటాడు. అతను స్వయంగా ఆ సైనికులను విడిపించడానికి కొలంబియా వెళ్తాడు. అక్కడ క్లార్కును కలుస్తాడు.అతనికి తన సహకారం అందించి, ఎర్నెస్టో ఎస్కోబీడో దగ్గరకు వెళ్ళి కార్టేజ్ కట్టర్ తో చేసుకున్న ఒప్పందం గురించి ఆ వాయిస్ రికార్డింగ్ ద్వారా నిరూపిస్తాడు.కార్టేజ్ ను పిలిపిస్తాడు ఎర్నెస్టో ఎస్కోబీడో. ఎర్నెస్టో ఎస్కోబీడోకు కార్టేజ్ కు జరిగే దాడిలో ఎర్నెస్టో ఎస్కోబీడో మరణిస్తాడు. ఆ సమయంలోనే కార్టేజ్ ను అంతం చేసి జాన్ క్లార్క్ సైనికులను విముక్తులను చేస్తాడు జాక్ రియాన్.

          తిరిగి అమెరికాకు వచ్చిన జాక్ రియాన్ కాంగ్రెషనల్ ఓవర్ సైట్ కమిటీ ముందు జరిగిన కుట్రను గురించి సాక్ష్యం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటాడు.దాని వల్ల తన ఉద్యోగం పోతుందని తెలిసినా,తనను ఇరికిస్తారని తెలిసినా ప్రెసిడెంట్ కు,అతని బృందానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి జాక్ రియాన్ వెళ్ళడంతో ఈ సినిమా ముగుస్తుంది.

          దేశాల్లో జరిగే అంతర్గత యుద్ధాలు,బయటకు కనిపించే యుద్ధాలకు వ్యతిరేకంగా లోపల జరిగే సంధులు వంటి అంశాల గురించి స్పష్టం చేసే సినిమా ఇది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ఉద్యోగుల తెలివితేటలు కొన్నిసార్లు ఎలా స్వలాభాలకు వినియోగించబడతాయో తెలిపే సినిమా ఇది.రాజకీయ సినిమాలు మీకు ఇష్టమైతే తప్పక చూడాల్సిన సినిమా ఇది.

                *      *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!