రోమ్ లో ఓ రోజు

 సినీ సంచారం

                      రోమ్ లో ఓ రోజు

                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          బెన్ హర్ లాంటి అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన విలియం వైలర్ తీసిన మరో ఆణిముత్యమే రోమన్ హాలిడే.’1953 లో వచ్చిన ఈ రోమాంటిక్ కామెడీ సినిమా ఓ మంచి క్లాసిక్. ఈ సినిమాతో ఆడ్రి హెప్బర్న్ ఆస్కార్ సొంతం చేసుకుంది.1940 ల నుండి 60 ల వరకు గొప్ప క్లాసిక్ నటుడిగా ప్రసిద్ధి పొందిన గ్రేగరి పెక్ ఇందులో నాయకుడు.ఈ సినిమా బ్రిటిష్ రాణి మార్గరెట్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసినట్టు చెప్తారు.

          ఓ యూరోపియన్ దేశానికి యువరాణి అయిన అన్ రోమ్ దేశానికి వస్తుంది. ప్రతి రోజు అదే ఆహారం,అదే భద్రత,అదే జీవన శైలితో విసుగు చెందిన ఆమె ఓ రోజు రాత్రి ఎప్పటిలానే ఆమెకు రోజు నిద్ర పోయే ముందు ఇచ్చిన తర్వాత అక్కడ నుండి తప్పించుకుంటుంది.

          రోమ్ కు యువరాణి వచ్చిందని తెలిసి ఆమె ఇంటర్వ్యూ కోసం ఎన్నో పత్రికలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అమెరికన్ న్యూస్ సర్వీస్ రిపోర్టర్ గా పని చేస్తున్న జో బ్రాడ్లీకు ఆమెను తర్వాత రోజు కాన్ఫెరెన్స్ లో ఇంటర్వ్యూ చేయాలనుకుంటాడు. అంతకు ముందు రోజు రాత్రే అన్ తప్పించుకుంటుంది.ఆమెను అర్ధరాత్రి చూసిన జో ఆమెను యువరాణి అని గుర్తు పట్టడు. మానవతా దృక్కోణంతో ఆమెను తన రూమ్ కు తీసుకువెళ్ళి ఆ రాత్రి ఆశ్రయం ఇస్తాడు.మరునాటి వార్తాపత్రికల్లో యువరాణి  కనిపించకపోవడం వల్ల, దానిని రహస్యంగా ఉంచి యువరాణి అనారోగ్యం వల్ల ఆమెతో ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా పడిందని ప్రకటన ఇస్తారు.ఆ వార్తాపత్రికలోని ఫోటో ద్వారా జో అన్ ను గుర్తు పడతాడు.

          ఆమె ఫోటోలు,ఆమె గురించి ఆర్టికల్ మిగిలిన పత్రికలు ఇవ్వకముందే తానే  తన పత్రికకు ఫోటోలతో సహా ఇస్తానని దాని కోసం ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తాడు జో. అతని పై అధికారి అయిన హెన్సే ఆ ఆర్టికల్ కు ఐదు వేల డాలర్లు ఇస్తానని,కానీ అతను అది చేయలేడని హెన్సే 500 డాలర్ల పందెం వేస్తాడు.

          ఇంటికి వెళ్ళిన జో తాను రిపోర్టర్ అనే విషయం అన్ దగ్గర రహస్యంగా ఉంచుతాడు. అన్ కూడా తన పేరు అన్యా అని చెప్తుంది. జో ఆమెకు రోమ్ అంతా చూపిస్తానని చెప్పిన వద్దని వెళ్ళిపోతుంది. ఆమె రోమ్ పట్టణంలోని మామూలు మనుషుల జీవితాలు గమనిస్తూ.మామూలు షూస్ కొనుక్కుంటుంది. ఆమె ఓ హెయిర్ కట్ షాప్ లో షార్ట్ హెయిర్ గా కట్ చేయించుకుంటుంది.ఆ బార్బర్ ఆమెను ఓ బోట్ పార్టీకి ఆహ్వానిస్తాడు.అక్కడ నుండి ఆమె తిరిగి వస్తున్న సమయంలో జో ఆమెను మళ్ళీ కలుస్తాడు. తన మిత్రుడు మరియు ఫోటోగ్రాఫర్ అయిన ఇర్వింగ్ తో కలిసి ఆమెకు రోమ్ లోని ఎన్నో ప్రదేశాలు చూపిస్తాడు. ఆ తర్వాత ఆ రాత్రి జోతో కలిసి బోట్ పార్టీకి వెళ్తుంది అన్. అక్కడ  గవర్నమెంట్ ఏజెంట్లు అన్ ను గుర్తుపట్టి ఆమెను మళ్ళీ తమ ఎంబసీకి తీసుకువెళ్ళిపోతారు.

          ఆమె ఫోటోలన్నీ తీసినప్పటికీ కూడా అవి పత్రికకు ఇవ్వడు జో. తర్వాతి రోజు ఆమె దగ్గరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్ళినప్పుడు ఇర్వింగ్  ఆమెకు ఆ ఫోటోలు ఇస్తాడు. తాను వెళ్ళిన దేశాలన్నింటిలో రోమ్ ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆ కాన్ఫరెన్స్ లో చెప్తుంది అన్. అన్ ను కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే చూసి,ఆమెకు మామూలు జీవితాల పట్ల ఆసక్తి ఉండటంతో,ఆమె తనదగ్గర ఉన్నంతవరకు ఆమె సంతోషపడేలా చూసి,అవకాశం ఉన్నప్పటికీ ఆ ఫోటోలు,ఆర్టికల్ బహిరంగం చేయలేదు జో. సినిమా కథ ఇంతే.

          మనిషి ఎంత గొప్పవాడైనా, తనకు పరిచయం-అనుబంధం లేని కొత్త పరిస్థితుల పట్ల ఆసక్తి,కుతూహలం పెంచుకుంటాడు. మామూలు మనుషులందరికీ మన జీవితాలతో పాటు మన చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులను దర్శించి,వారి గురించి ప్రత్యక్షంగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దేశాన్ని పాలించే రాజులకు,వారి కుటుంబీకులకు వారు ఆ ప్రజల సంక్షేమం కోసమే ఉన్నప్పటికీ వారి జీవితాలను అతి సన్నిహితంగా పరిశీలించే అవకాశం ఉండదు. దాని కారణం వారి హోదా అయినప్పటికీ,వారు జీవితంలో కూడా సాధారణత్వాన్ని కోల్పోయినట్టే. సాధారణత్వంలోని సంతోషాన్ని తెలియజేసే సినిమా ఇది. హాలీవుడ్ క్లాసిక్స్ లిస్టులో చూడదగిన సినిమా ఇది.

                       *    *   *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ