టారెట్ టీచర్

 సినీ సంచారం

టారెట్ టీచర్

                                                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          పాధ్యాయులు అవ్వాలంటే పిల్లల్ని తమ మాటలతో మొదట వారిని ఆకర్షించగల చాతుర్యంతో పాటు,వారి అటెన్షన్ స్పాన్ ను పెంచే ఓర్పు కూడా ఉండాలి. కానీ ఓ రెండు నిమిషాలు ఏ అంతరాయం లేకుండా మనిషిని ఎక్కిళ్ళతో ఏడిపించే టారెట్ సిండ్రోమ్ ఉన్న ఓ వ్యక్తి టీచర్ అవ్వాలనే కోరికను ఎన్ని ఆటంకాలు అధిగమించి నెరవేర్చుకుని,అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గొప్ప టీచర్ గా ఎదిగాడో తెలిపే సినిమానే 2018 లో వచ్చిన హిచ్కి . ఇది బ్రాడ్ కొహెన్ జీవిత ప్రేరణతో తీసిన సినిమా. రాణి ముఖర్జీ ఇందులో టారెట్ సిండ్రోమ్ తో బాధ పడే టీచర్ గా నటించింది.

          నైనా బి.ఎడ్ ,ఎమ్మెస్సీ చేసినప్పటికీ టారెట్ సిండ్రోమ్ ఉండటం వల్ల ఎక్కడ ఆమెకు టీచర్ గా ఉద్యోగం దొరకదు.ఐదేళ్ళు ఆమె టీచర్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆమెకు ఈ సమయంలో అండగా ఆమె తల్లి,తమ్ముడు ఉంటారు.ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటారు. అప్పుడప్పుడు పిల్లల్ని చూడటానికి ఆమె తండ్రి ప్రభాకర్ వచ్చినప్పటికీ ఆమె చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను నిరుత్సాహపరచడం వల్ల,బాల్యంలోనే తమను వదిలేయడం వల్ల నైనా అతన్ని ప్రేమించలేదు.

          కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలోనే గొప్ప స్కూల్ అయిన సెంట్ నూకర్స్ స్కూల్ లో ఆమెకు టీచర్ గా ఉద్యోగం వస్తుంది. అంతకు ముందు అదే స్కూల్ కి ఐదు సార్లు టీచర్ గా అప్లై చేసి ఫెయిల్ అయినా ఈ సారి ఆమెకు ఈ అవకాశం వస్తుంది. తన ఆత్మవిశ్వాసంతో చివరకు ఆ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం సాధించిన ఆమెకు ఆ స్కూల్ లోని 9ఎఫ్ సెక్షన్ ను ఇస్తారు.అప్పటికే ఎంతోమంది టీచర్లు ఆ క్లాసుకు చెప్పలేక వెళ్ళిపోయారు. ఆ స్కూల్ లో ఉన్న ప్యూన్ ద్వారా ఆ సెక్షన్ లోని విధ్యార్ధులందరూ స్లమ్ ఏరియాలోని వారని, గవర్నమెంట్ కోటా లో వారు స్కూల్ కు వస్తున్నారని తెలుసుకుంటుంది నైనా.

          9ఎఫ్ విద్యార్ధులను ఆ స్కూల్ లోని మిగిలిన పిల్లలు తమలో ఒకరుగా కలుపుకోరు. దానికి కారణం ఆర్థిక వ్యత్యాసం.ఏదో స్కూల్ కి రావాలి కాబట్టి వచ్చే పిల్లలు వాళ్ళు. తమ క్లాసుకు వచ్చే ప్రతి టీచర్ ను హడలుగొట్టేస్తారు వాళ్ళు. లిక్విడ్ నైట్రోజెన్ తో వాళ్ళు నైనాను కూడా పారిపోయేలా చేయడానికి చేసిన ప్రయత్నం వల్ల ఆ క్లాస్ గ్లాసులు బద్ధలై, అది ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది. కానీ తన విద్యార్ధులను నైనా తానే అది ప్రయోగం చేద్దామనే ప్రయత్నం చేయించానని చెప్పి కాపాడుతుంది.అప్పటి నుండి వారికి నైనా మీద నమ్మకం ఏర్పడుతుంది. వారిలో మార్పుకు అదే నాంది అవుతుంది.

          అదే స్కూల్ లో ఉన్న ఇంకో టీచర్ వాడియా. అతని విద్యార్ధులైన 9 ఏ వాళ్ళు టాపర్స్. అతనికి 9ఎఫ్ విద్యార్ధులంటే ఉన్న అయిష్టత అతని విద్యార్ధుల్లో కూడా నిండుతుంది. స్కూల్ సైన్స్ ప్రాజెక్టు 9 ఏ విద్యార్ధులకు వస్తుంది. వారిని 9 ఎఫ్ విద్యార్ధులతో వాడియా కలవనివ్వడు. నైనా తన విద్యార్ధులకు బేసిక్స్ నుంచి,వారికి నచ్చే పద్ధతుల్లో బోధిస్తుంది. 9 ఎఫ్ విద్యార్ధుల్లో అందరూ మారినప్పటికీ  ఆతిశ్ మాత్రం మారడు. అతను 9 ఏ విద్యార్ధుల సైన్స్ ప్రాజెక్ట్ ను నాశనం చెయ్యడం వల్ల, ఆ తప్పును అతనితో పాటు మిగిలిన వారంతా చేయకపోయినా చేశామని ఒప్పుకోవడం వల్ల ఆ క్లాస్ మొత్తం సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది.

          నైనా అభ్యర్ధనల మీద కేవలం ఆ విద్యార్ధులు పరీక్షలు మాత్రం రాయడానికి అనుమతి ఇస్తాడు ప్రిన్సిపల్. పరీక్షల సమయంలో 9 ఏ టాపర్ వారి మీద కక్ష సాధించడానికి ప్యూన్ ద్వారా తప్పుడు ప్రశ్నాపత్రాన్ని వారికి అందేలా చేస్తాడు. కానీ తమ టీచర్ అయిన నైనా మీద గౌరవంతో, మోసం చేయకూడదనే సంకల్పంతో వారు ఆ పేపర్ ను అనుసరించరు.

          కష్టపడి చదివిన వారంతా పాస్ అవ్వడమే కాకుండా 9 ఎఫ్ కు చెందిన విద్యార్ధులు టాపర్స్ కూడా అవుతారు. అదే సమయంలో ఆ స్కూల్ ప్యూన్ ద్వారా పేపర్ లీక్ అయ్యిందని వాడియా ఆరోపించడం వల్ల వారందరినీ సస్పెండ్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటాడు ప్రిన్సిపల్. కానీ అదే సమయంలో తన క్లాస్ విద్యార్థి ద్వారా జరిగింది తెలుసుకున్న వాడియా ఆ తప్పుడు ప్రశ్నాపత్రాన్ని తానే లీక్ చేశానని అబద్ధం చెప్పి తన విద్యార్ధిని,9ఎఫ్ విద్యార్ధులను కూడా కాపాడతాడు. నాటి నుండి వాడియా ప్రవర్తన కూడా మారిపోతుంది. 9ఏ,9 ఎఫ్ మిత్రులవుతారు. కొంతకాలానికి  నైనా టీచర్ నుండి ప్రిన్సిపల్ కూడా ఏడుగుతుంది. 25 ఏళ్ళు ఆ వృత్తిలో ఉన్నాక ఆమె రిటైర్ అవ్వడంతో  సినిమా ముగుస్తుంది.

          మనిషికి ఎన్ని అసాధ్య పరిస్థితులు ఉన్నా, మనిషిలోని సంకల్ప సిద్ధి వల్ల దేనినైనా సాధించవచ్చనే సందేశమే ఈ సినిమాలోని నైనా స్పష్టం చేసేది. బ్రాడ్ కొహెన్ తన జీవితంలో ఎదిగిన తీరు ఎందరికో స్పూర్తి. తమ కన్నా చిన్న పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్, వారి నుండి,తన తోటి వారి నుండి అందరి నుండి అవమానాలు భరిస్తూనే ఎలా ఆ వృత్తిలోనే ఆదర్శ వ్యక్తిగా ఎదిగిన బ్రాడ్ కొహెన్ గురించి ప్రతి టీచర్ తెలుసుకోవాలి. వృత్తి ఏదైనా సరే దానికి ప్రతికూల వాతావరణం ఏ మేరకు ఉన్నా సరే, సాధించాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని స్పష్టం చేసే సినిమా అలానే జీవితం కూడా ఇది.

                               *   *   *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ