హెచ్చరిక

లఘు చిత్ర లోకం

హెచ్చరిక

              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          హిందీ షార్ట్ ఫిల్మ్ లలో ఎన్ని విభిన్నమైన కథాశైలులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.అటువంటి విభిన్న ముగింపుతో,కథా గమనంతో వచ్చిందే 'చట్నీ.'కథ సాగే శైలిలో ఉన్న పరోక్ష కథన పద్ధతి వల్లే ఈ లఘు చిత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది.

  అనిత ఘూజియాబాద్ వాసి అవ్వడం వల్ల ఆమె పట్టణ నాగరికతలో ఇమడకుండా సాధారణంగా ఉంటుంది.కిట్టీ పార్టీలో అందరూ కలుస్తారు.అనిత,ఆమె భర్త కూడా వస్తారు.ఆ పార్టీలో రసిక అనే ఆమె అనితతో ఆమె వంట బావుంటుందని,ఆమె దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానని,ఎప్పుడైనా రమ్మంటే వస్తానని చెప్తుంది.ఆ తర్వాత రసిక అనిత భర్తతో సన్నిహితంగా ఉండటం అనిత గమనించి,ఆ తరువాతి రోజు ఇంటికి రమ్మని ఆమెని ఆహ్వానిస్తుంది.

    ఇంటికి వచ్చిన రసికకు పకోడి-చట్ని,కూల్ డ్రింక్స్ ఇస్తుంది.రసిక చట్నీ బావుందని చెప్పినప్పుడు ఆమె ఆ చట్నీ భోలా బాగా చేసేవాడని భోలా కథ చెప్పడం ప్రారంభిస్తుంది.

    భోలా అనిత వాళ్ళింటికి వంట వాడిగా వచ్చాడు.తన భర్త ఎవరినైనా ఆకర్షిస్తాడని,నచ్చితే ఎంతో ఉదారత్వాన్ని ప్రదర్శిస్తాడని చెప్తుంది.భోలా తన భర్తకు నచ్చడం,అదే సమయంలో ఫ్యాక్టరీలో పని పెరగడంతో  అతన్ని ఫ్యాక్టరీకి కూడా తీసుకువెళ్తాడు.అనిత భర్తకు దగ్గరగా భోలా ఉండేవాడు.తరువాత భోలాకు వివాహమైంది.అతని భార్య గొప్ప అందగత్తె.ఆమె భోలాతో కలిసి వారి ఇంట్లో కింది గదిలోనే ఉండేది.ఆమెతో అనిత మరిది సంబంధం పెట్టుకుంటాడు.ఓ రోజు అది భోలాకు తెలిసిపోతుంది.అనిత మరిదిని చంపే ప్రయత్నంలో అతనే చనిపోతాడు.అలాగే అనిత భర్తకు దగ్గరైన కుక్కపిల్ల కూడా వారి కారు కింద పడే మరణిస్తుంది.ఇప్పుడు రసిక బాగుందని మెచ్చుకున్న చట్నీ కూడా భోలాను పాతిపెట్టిన స్థలంలో ఉన్న కూరగాయలనుండే చేసిందని చెప్తుంది అనిత.ఇక్కడితో షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది.

    అసలు కథను ఈ శైలిలో చెప్పడమే రిస్క్.ఎందుకంటే దీని ముగింపు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.కానీ అనిత మాటలను బట్టి ఆమె తన భర్త దగ్గరకు ఎవరు వచ్చినా సరే వారు అలాగే చచ్చిపోతారని ఆమెను భయపెట్టడానికి ఈ కట్టుకధ  చెప్పిందని  అనుకోవచ్చు.ఎందుకంటే తన భర్త రోజుకు 15 మందుబిల్లలు  వేసుకోవాలని చెప్పడం,అతను కనిపించేంత ఆరోగ్యవంతుడు కాదని స్పష్టం చేయడం,భర్తతో సన్నిహితంగా ఉన్న వారి మరణాలు చెప్పడం,ఇవన్నీ ఆమె భర్తకు దూరంగా ఉండమని రసికకు హెచ్చరించే కొత్త పద్ధతిలా అనిపిస్తుంది.కథలు మామూలు పరిస్థితుల్లో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ  తమ పరిస్థితులకు దగ్గరగా ఉంటే మనుషులు ఎలా భయపడతారో స్పష్టం చేసే లఘు చిత్రం ఇది. 

   ఈ కొత్తదనం కోసమైనా తప్పక చూడాల్సిన షార్ట్ ఫిల్మ్ ఇది.ఇక్కడ ఓ స్త్రీ తన భర్త జోలికి పరాయి స్త్రీ రాకుండా సాధారణ పద్ధతుల్లో భయపెట్టకుండా ఇలా ఓ కథను ఎన్నుకుని మరి భయపెట్టే ప్రయత్నం చేయడం ఈ కథలోని కొత్త విషయం.

 *   *   * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ