మధ్యతరగతి గృహిణి
లఘుచిత్రలోకం
మధ్యతరగతి గృహిణి
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఒక్కో
కథకు ఒక్కో గొప్పతనం ఉంటుంది.కొన్ని కథలు సంభాషణలతో నడిస్తే,ఇంకొన్ని
సంఘటనలతో నడుస్తాయి.కానీ అతి కొద్ది కథలే 'కనబడని మౌనంతో'
నడుస్తాయి.ఈ శైలి కథే హిందీ షార్ట్ ఫిల్మ్ 'జ్యూస్.'
మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీల మనసుల్లో ఉండే
ఆలోచనలు,వ్యథలు,ఆశలు ఎలా మౌనంగా ఉండిపోతాయో,వాటిని మౌనంగానే ఎలా ఓ గృహిణి తెలియజేసిందో చెప్పే షార్ట్ ఫిల్మ్ ఇది.
మంజు వాళ్ళింట్లో ఓ గెట్ టుగెదర్ డిన్నర్
పార్టీ జరుగుతూ ఉంటుంది.ఆ ఇంట్లో ఆ సమయంలో మగవారంతా హాల్లో కూర్చుని తింటూ,ఆఫీసు-ప్రపంచ
రాజకీయాల గురించి,చరిత్ర గురించి కులాసాజా కబుర్లు
చెప్పుకుంటూ ఉంటే వారి భార్యలు మాత్రం వంటింట్లో వారికి వండిపెట్టడానికి మంజూకి
సాయం చేస్తూ ఉంటారు.
వారి సంభాషణల్లో మధ్యతరగతి స్త్రీల కష్టాలు
స్పష్టమవుతాయి.ఉద్యోగస్థురాలైన మంజూ పిల్లలు పుట్టడంతో ఉద్యోగం మానేయాల్సి
వచ్చింది.ఇంకొందరి పరిస్థితి అదే. ఆ పార్టీకు సరి
పడా వంటలు చేస్తూ,పిల్లలను కూడా చూసుకుంటూ ఉంటుంది మంజూ.ఆ
సమయంలో మంజూకి సాయం చేయకపోగా భర్త ఆమెకు
ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు.
మంజూ మనసులో ఏర్పడే అసహనం,కోపం ఇవన్నీ ఈ పార్టీ వాతావరణం ద్వారా
వీక్షకులకు స్పష్టం అవుతుంది.చివరకు విసిగిపోయిన మంజూ వంట మధ్యలో జ్యూస్ గ్లాసుతో,కుర్చీ లాక్కుని ఆ మగవారి ముందు కూర్చుంటుంది.దానితో వారంతా
నిశ్శబ్దమైపోతారు.
తాము
కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆజ్ఞలు జారీ చేసే వారికి ఓ భార్య సమాధానం చెప్పిన
పద్ధతి ఇది. చాలా కొత్త సమాధానం. ఒక్క మాట,ఒక్క ఎదురింపు లేకుండా
సూటిగా చెప్పిన సమాధానం. వారి తప్పు వారే తెలుసుకునేలా చేసే సమాధానం. మౌనమే
సమాధానం.
*
* *

Comments
Post a Comment