వంటిల్లు

 సినీ సంచారం

వంటిల్లు

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          స్త్రీ జీవితాన్ని అనేక కోణాల్లో చూపించే సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ 2021 లో మలయాళంలో వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్మాత్రం పెళ్ళయ్యాక స్త్రీ సర్దుకుపోతూ ఉన్నప్పటికీ సమాజ నిబంధనల్లో,పురుష స్వామ్య సమాజంలో భర్తల ప్రవర్తనను ఓ విద్యావంతురాలు భార్య అయ్యాక ఎందుకు భరించలేకపోయిందో  అన్న అంశాన్ని ఎంతో లోతుగా గమనించి చిన్న చిన్న ఘటనల ద్వారానే సినిమా నడిపించి,ఆలోచించేలా చేశారు.అందుకే ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కింది.

          నిమిష ఓ క్లాసికల్ డ్యాన్సర్.ఆమెకు ఓ టీచర్ తో వివాహమవుతుంది.ఆమె విద్యావంతురాలు.అత్తింటికి వెళ్తుంది.ఆ కుటుంబంలో అత్త,మామ,నిమిష,భర్త ఉంటారు. ఆ కుటుంబంలో సనాతన ఆచారాలు వాడుకలో ఉన్నాయి. ఆమె అత్త సాయంతో నిమిష పనులన్నీ ఏ ఆటంకం లేకుండా చేసుకోగలుగుతుంది. కానీ ఆమె ఆడపడచుకు డెలివరీ సమయం కావడంతో ఆమె అత్త తన కూతురి దగ్గరకు వెళ్ళడంతో ఆ కుటుంబ బాధ్యతలన్నీ ఆమె మీదే పడతాయి.

          ఆ ఇంట్లో మగవారి ప్రవర్తనను కొన్ని సంఘటనల ద్వారా దర్శకుడు స్పష్టం చేస్తాడు.నిమిష మామగారికి బ్రష్ చేసుకోవడానికి బ్రష్ ,టూత్ పేస్ట్ దగ్గర నుండి,ఆయన చెప్పుల వరకు నిమిష అత్తగారు అందిస్తుంది. ఆమె అత్తగారు వెళ్ళాక ఆ పనులన్నీ ఆమె చేయాల్సి వస్తుంది. నిమిష పచ్చడి మిక్సీ లో పడితే పద్దని నూరమని,అలాగే అన్నాన్ని కుక్కర్ లో కాకుండా కట్టెల పొయ్యి మీద చేయమని, బట్టలు వాషింగ్ మెషీన్ లో కాకుండా చేతితో ఉతకమని ఆమె మామ ఆమెకు చెప్తాడు. కాలం మారుతున్న స్త్రీల కష్టాన్ని తగ్గించే పరికరాలు వచ్చిన తమ ఛాందస పద్ధతులను వదలని మనస్తత్వాలను ఇక్కడ దర్శకుడు స్పష్టం చేస్తాడు. అదే విధంగా డైనింగ్ టేబుల్ మీద తిన్నప్పుడు ఆ ఇంట్లో మగవారు తినేటప్పుడు పారేయాల్సినవి వచ్చినప్పుడు వాటిని ఆ టేబుల్ మీదే వదిలేస్తారు. కానీ నిమిష భర్తతో కలిసి ఓ రెస్టారెంటుకు వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం శుభ్రంగా తింటూ టేబుల్ మ్యానర్స్ పాటించే భర్తను అలానే ఇంట్లో కూడా ఉండరెందుకని అని ప్రశ్నించడం అతని ఇగోను దెబ్బతీస్తుంది. నిమిష అలా అడిగినందుకు క్షమాపణ చెప్తుంది.

          ఆ ఇంట్లో సింక్ లీక్ అయ్యి పాడైన ఎన్ని సార్లు నిమిష ప్లంబర్ ను తీసుకురమ్మని చెప్పిన ఆమె భర్త  దాన్ని పట్టించుకోడు. ఇక వారి లైంగిక జీవితానికి వస్తే తనకు ఆ ప్రక్రియ చాలా బాధను కలిగిస్తుందని,ఫోర్ ప్లే చేయమని నిమిష అడిగినప్పుడు ఆమె భర్త దానికి నిరాకరిస్తాడు.

           నిమిషకు ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది.ఆమె డ్యాన్స్ టీచర్ ఉద్యోగానికి అప్లై చేస్తుంది.ఇంటర్ వ్యూ లెటర్ వస్తుంది. కానీ తమ ఇంట్లో ఆడవారు ఉద్యోగం చేయకూడదని ఆమె మామ,భర్త ఆమెకు స్పష్టం చేస్తారు. ఆమె అత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఉద్యోగం చేయలేదని చెప్తారు.

          నిమిష భర్త,మామ ఇద్దరు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. ఆ సమయంలో ఆమె బహిష్టు అయినప్పుడు ఆమె మామ సోదరి ఆ ఇంటి పనులు చూడటానికి వస్తుంది. ఆ సమయంలో నిమిషను ప్రత్యేక గదిలో ఉంచి,నేల మీద పడుకోమని చెప్తారు.ఆ సమయంలో భర్త ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో అతను బండి మీద నుండి పడిపోబోతుంటే నిమిష అతన్ని పట్టుకుంటుంది.ఆమె ఆ బహిష్టు  సమయంలో తనను ముట్టుకున్నందుకు ఆమెను నిందించి,దానికి  ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఆ రోజులన్నీ ఆ ఇంటి వంట బాధ్యతలు అన్నీ కూడా నిమిష మామ సోదరే  చూసుకుంటుంది.

          ఆ సమయంలోనే శబరిమలై లో మహిళల బహిష్టు కారణంగా వారిని అపవిత్రులుగా భావించకూడదని,వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పిస్తుంది. ఆ తీర్పును హర్షిస్తూ ఓ స్త్రీ ఫేస్ బుక్ లో వీడియో చేస్తుంది. దానిని నిమిష షేర్ చేస్తుంది. ఆ వీడియో చేసిన స్త్రీ ఇంటికి కొందరు మగవాళ్ళు వెళ్ళి ఆమె స్కూటిని తగులబెట్టి తమ నిరసనను తెలియజేస్తారు.అలాగే నిమిష షేర్ చేసిన వీడియోను కూడా తొలగించమని ఆమె భర్త ద్వారా చెప్పించిన ఆమె తనకు నచ్చి షేర్ చేశానని దానిని తొలగించనని స్పష్టం చేస్తుంది. ఇక్కడ దర్శకుడు చట్టాల కన్నా,మనిషి స్వేచ్చ కన్నా కూడా కుటుంబాల్లో సమాజ నిబంధనలకే ప్రాధాన్యత అని స్పష్టం చేస్తాడు.

          ఆ తర్వాత తమకు టీ ఇవ్వమని భర్త అడిగినప్పుడు విసిగిపోయిన నిమిష ఆ సింకులోనే నీళ్లే కప్పులో పోసి ఇస్తుంది. ఆమెను కొట్టడానికి వచ్చిన భర్తను,మామను ఆ వంటింట్లోనే ఉంచి గడియపెట్టి ఆ ఇంటి నుండి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఓ డ్యాన్స్ టీచర్ గా జాయిన్ అవుతుంది. ఆమె భర్త ఇంకో పెళ్లి చేసుకోవడం,ఆమె కూడా నిమిష లానే వంటింట్లోనే ఉండిపోవడంతో సినిమా ముగుస్తుంది.

          ఈ సినిమాలో మనం చూసే అన్ని సంఘటనలు మన చుట్టు పక్కలా జరిగేవే అయినా ప్రేక్షకుల్లా చూస్తుంటే మాత్రం ప్రత్యేక భావన కలుగుతుంది. ఈ సినిమాలో వంటింట్లో స్త్రీని చిత్రిస్తూనే, మార్పులను అంగీకరించలేని మనస్తత్వాలు  ఉన్నవారితో ఉంటే ఇక ఆ మార్పు ప్రశ్నార్ధకమైనదే అన్న అంశాన్ని స్పష్టం చేస్తారు దర్శకుడు. స్త్రీ జీవితంలో వంటింటి లోతులను చూపించిన ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమా.

                    *       *     *

 

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ