ద విచర్

 సీజనల్ సమీక్షలు

ద విచర్

                                                              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ఫ్యాంటసీ  సిరీస్ కు నేడు ప్రేక్షకాదరణ వుంది. నేడు విజయవంతమవుతున్న సిరీస్ లో క్రైమ్ వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, సైన్స్ ఫిక్షన్-ఫ్యాంటసీ లకు కూడా అంతే ప్రాధాన్యత ఉండటం దాదాపు హాలీవుడ్ ప్రభావమనే చెప్పవచ్చు.తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫ్యాంటసీ సిరీస్ ను ప్రేక్షకులు గమనిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో 2019 లో విడుదల చేసిన ద విచర్ సిరీస్ కూడా మొదటి సీజన్ తో ఎంతో ఆదరణను పొందింది. మానిస్టర్స్ -మానిస్టర్ హంటర్స్,రాజ్యాల యుద్ధాలు,మంత్రగత్తెల విన్యాసాలు, ఇన్ని అంశాల మధ్య ఓ ఉత్పత్తిగా వచ్చిన ఈ సిరీస్ వాస్తవానికి చూస్తుంటే ఓ కథను మంచి కథగా ఎలా మలచవచ్చో స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు ఇది ఒక సీజనే వుంది. ఒకేసారి గతం,వర్తమానం ఈ కథలో నడుస్తాయి. మొదట్లో కాస్త గందరగోళంగా వున్నా సరే ఆ తర్వాత కథ స్పష్టమవుతుంది. మధ్యలో నుండి రసవత్తరంగా వుంటుంది.

          ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర అంటే విచర్ గెరాల్ట్. అతను కికిమోర అనే మానిస్టర్ ను అంతమొందించాక  బ్లావికెన్ అనే పట్టణంలోకి అడుగుపెడతాడు. స్ట్రెగోబోర్ అనే మంత్రగాడు అతన్ని పిలిపిస్తాడు. గ్రహణం నాడు పుట్టిన ఓ రాజకుమార్తె అయిన రెన్ఫ్రిను హత్య చేయమని ఎందుకంటే ఆ గ్రహణం నాడు పుట్టిన వారి వల్ల  ప్రపంచం నాశనం అవుతుందని చెప్తాడు. కానీ గ్రహణం పేరిట ఓ రాజకుమార్తెను చంపడానికి గెరాల్ట్ ఇష్టపడడు. ఆ తర్వాత గెరాల్ట్ రెన్ఫ్రిని కలుస్తాడు. ఆమె స్ట్రెగోబోర్ ను చంపమని అడుగుతుంది. దానికి గెరాల్ట్ నిరాకరిస్తాడు. ఆమెను అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్తాడు.అతని మాట వినకుండా మళ్ళీ స్ట్రెగోబోర్ ను చంపే ప్రయత్నం చేయబోతున్న ఆమెను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె గెరాల్ట్ చేతిలో మరణిస్తుంది. ఆ తర్వాత స్ట్రెగోబోర్ వచ్చి ఆమె శరీరాన్ని అటాప్సి కు తీసుకువెళ్ళడానికి వస్తాడు.దానికి గెరాల్ట్ అంగీకరించకపోయినా ఆ పట్టణం అంతా అతనికి వ్యతిరేకం అవ్వడంతో ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది జరిగింది 1231 లో.

          ఇక 1263 లో దక్షిణ రాజ్యమైన సింటియాను దాని పొరుగు రాజ్యమైన నిల్ఫ్ గ్రాడ్ ఆక్రమించుకుంటుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న క్వీన్ కలంతే తన మనవరాలైన సిరిల్లాను ఆమె విధి గెరాల్ట్ ను కలవడం అని అక్కడి నుండి తప్పించుకుని అతని దగ్గరకు వెళ్ళమని చెప్తుంది. సిరిల్లా పారిపోతున్నప్పుడు ఆమెను నిల్ఫ్ గ్రాడ్ ఆఫీసర్ అయిన కహిర్ ఆమెను పట్టుకుంటాడు. ఆ పరిస్థితుల్లో ఆమెకే తెలియని ఆమె అజ్ఞాత శక్తి ద్వారా అక్కడి నుండి తప్పించుకుంటుంది.

          1206 లో ఆడ్రిన్ రాజ్యంలోని వెనర్బర్గ్ ప్రాంతంలో యెన్నిఫర్ అనే గూని గల అమ్మాయి ఉంటుంది. ఆమెను టిసియా అనే మంత్రగత్తెకు ఆమె తండ్రి అమ్మేస్తాడు. ఆమెను టిసియా అరుజాకు మ్యాజిక్ శిక్షణ కోసం తీసుకువెళ్తుంది.మొదట్లో అక్కడ మంత్రగత్తె శిక్షణలో ప్రాథమిక అంశాలు కూడా చేయలేకపోతుంది.మ్యాజిక్ శిక్షణలో భాగంగా రాయిని కదల్చకుండా ఎత్తడం, మెరుపుల్ని సీసాలోకి తీసుకోవడం వంటివి ఉంటాయి.అదే సమయంలో ఇస్త్రెడ్ అనే అతనితో ఆమెకు స్నేహం ఏర్పడుతుంది. వాస్తవానికి యెన్నిఫర్ మీద గూఢాచారిలా అతన్ని నియమిస్తారు. అతని దగ్గర పోర్టల్ చేయడం నేర్చుకుంటుంది.పోర్టల్ అంటే ఆపద సమయాల్లో ఎక్కడి కైనా సరే ఓ పోర్టల్ ద్వారా వెళ్ళిపోగలగడం. అతనికి తాను సగం ఎల్వ్ జాతికి చెందిన దానిని అని,అందువల్లే తనకు గూని ఉందని చెప్తుంది. ఆ మ్యాజిక్ లో భాగంగా టిసియా మిగిలిన విద్యార్ధులు ఎవరైతే మ్యాజిక్ కు వాహకంగా ఉన్నారో వారిని కొలనులో చేపలుగా మార్చి వారి శక్తిని ఆ మ్యాజిక్ స్కూల్ లో నింపుతుంది. 1240 లో గెరాల్ట్ ను పోసాడాలో ధాన్యం మాయమవుతుందని అది చేస్తుంది ఓ మోనిస్టర్ అని దానిని అంతం చేయాల్సిన పని అప్పగించబడుతుంది.అతనితోపాటు జాస్కియర్ అనే బార్డ్ (సింగర్ )కూడా వస్తాడు.అక్కడ అతను ఫిలావేండ్రల్ ను కలుసుకుంటాడు.ఫిలావేండ్రల్ఎల్వ్ రాజ్య రాజు మనుషులు ఎల్వ్స్ ను అంతం చేశాక మిగిలిన వారితో పర్వతపు గుహల్లో తల దాచుకుంటారు. వారి కోసమే ఈ మానిస్టర్ ధాన్యం దొంగతనం చేస్తుందని గెరాల్ట్ కు అర్ధమవుతుంది. గెరాల్ట్ వారిని ఏం చేయకుండా వదిలేస్తాడు. ఇక 1263 లో సిరిల్లా అడవుల్లోకీ తప్పించుకున్నప్పుడు దారా అనే బాలున్ని కలుస్తుంది.అతని మాటల ద్వారా అతను ఎల్వ్ జాతికి చెందినవాడని ఆమెకు అర్ధమవుతుంది.అతనితో కలిసి శరణార్ధుల క్యాంపులో ఉంటుంది. దాని మీద కహిర్ దాడి చేసినప్పుడు డారా ఆమెను రక్షిస్తాడు.

          1210 లో తమ శిక్షణ పూర్తయ్యే సరికి యెన్నిఫర్,ఇస్త్రెడ్ ప్రేమించుకుంటారు.ఇలా ఈ శిక్షణ పూర్తయ్యాక ఛాంబర్ నిర్ణయం ప్రకారం ఈ శిక్షణ పూర్తి చేసుకున్నా వారిని రాజ్యాలకు మేజులుగా పంపిస్తారు.అంటే వీరు రాజ్యాన్ని పాలించే రాజుల లేదా రాణులకు అధికారిక మంత్రగత్తెలుగా లేదా మంత్రగాళ్ళగా ఉంటారు.రాజ్యానికి శత్రువు ద్వారా కష్టం వాటిల్లినప్పుడు వీరు కాపాడే ప్రయత్నం చేస్తారు.ఈ మేజులను నియమించడానికి ఓ ఛాంబర్ వుంటుంది. తన ప్రాంతమైన ఆడ్రిన్ రాజ్యానికి వెళ్ళాలని యెన్నిఫర్ ఆశిస్తుంది.కానీ ఆమె సగం ఎల్వ్ అని తెలుసుకున్న ఛాంబర్ ఆమెను నిల్ఫ్ గ్రాడ్ ప్రాంతానికి మేజుగా నియమిస్తుంది. కోపంతో ఉన్న యెన్నిఫర్ ఆ విషయం  వారికి తెలిసేలా చేసిన   ఇస్త్రెడ్ తో బంధాన్ని తెంచుకుంటుంది.   తనను తాను అందంగా మార్చుకోవాలంటే తన మాతృత్వం  కోల్పోతానని తెలిసినా  ఎన్ ఛాంటర్ ద్వారా సర్జరీ చేయించుకుని అందంగా మారుతుంది. అందంగా మారినా యెన్నిఫర్ ఎడ్రిన్ రాజు దగ్గరకు వెళ్తుంది. అలా అడ్రిన్ రాజుకు ఆమె మేజ్ అవుతుంది.ఆమె బదులు నిల్ఫ్ గ్రాడ్ కు ఫ్రింజిల్లా మేజుగా వెళ్తుంది.1243 లో గెరాల్ట్ టెమురియా రాజ్యానికి అక్కడి రాజు ఫోల్టెస్ట్  మంత్రగత్తే ట్రిస్ మేరిగోల్డ్ సాయంతో స్టీర్జిగా అనే మానిస్టర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఆ మానిస్టర్ శపించబడిందని,ఆ మానిస్టర్ రాజు ఫోల్టెస్ట్ కు అతని సోదరి అడ్డాకు జన్మించిందని,వారిద్దరి సంబంధం తెలుసుకున్న ఆ రాజ్య కోర్టియర్ ఆస్ట్రిట్ శపించడం వల్ల ఆ బిడ్డ మానిస్టర్ అయ్యిందని తెలుసుకుంటాడు.ఆస్ట్రిట్ ను ఎరగా వేసి ఆ మానిస్టర్ ను పట్టుకుని,దానితో ఉదయం వరకు పొరాడి ఆ శాపం పోయి,ఆమెను మామూలు మనిషిని చేస్తాడు.

          1263 లో సిరిల్లా నిల్ఫ్ గ్రాడ్ నుండి పారిపోతూ డారాతో కలిసి ఓ అడవిలోకి వెళ్తుంది. 1240 లో యెన్నిఫర్ అప్పటికే ఎడ్రిన్ రాజ్యానికి 30 ఏళ్ళుగా మేజుగా చేసిన తర్వాత ఆ రాజ్యపు రాణి కాలిస్ తో కలిసి ప్రయాణిస్తుందగా వారి మీద దాడి జరుగుతుంది.ఆ రాణి రాజుకు మగ పిల్లవాడిని ఇవ్వలేకపోవడం వల్ల రాజే ఆమెను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నాడని యెన్నిఫర్ కు అర్ధమవుతుంది. వారిని కాపాడే ప్రయత్నం చేసినా రాణి,రాణికి పుట్టిన పాప కూడా మరణిస్తారు.

          1249 లో గెరాల్ట్ జాస్కియర్ తో కలిసి క్వీన్ కలంతి కూతురైన యువరాణి పావెట్టా స్వయంవరానికి వెళ్తాడు.డుని అనే అతను ఆ రాజ్యపు రాజును కొన్నాళ్ళ క్రితం కాపాడినప్పుడు లా ఆఫ్ సర్ప్రైజ్ కింద పావేట్టాను వివాహమాడటానికి వస్తాడు. ఎవరి ప్రాణమైనా కాపాడితే వారు దానికి ప్రతిఫలంగా తమ మొదటి సంతానాన్ని ఆ వ్యక్తికిచ్చి పెళ్లి చేయడమే లా ఆఫ్ సర్ప్రైజ్.కానీ డుని శాపం వల్ల మానిస్టర్ లా వుంటాడు. అతనితో వివాహానికి పావెట్టా ఒప్పుకున్నా క్వీన్ ఒప్పుకోదు. డుని మీద దాడి చేయబోతున్న సమయంలో గెరాల్ట్ అతన్ని కాపాడతాడు. ఇక క్వీన్ కూడా కూతురి సంతోషం కోసం పెళ్ళికి ఒప్పుకుంటుంది,ఆ పెళ్ళికి ఆమోదం తెలిపిన సందర్భంలో డుని కి శాపం పోయి మామూలు మనిషి అవుతాడు. ఆ సమయంలో తనని కాపాడినందుకు గెరాల్ట్ కు లా ఆఫ్ సర్ప్రైజ్ మాట ఇస్తాడు డుని.అప్పుడే పావెట్టా డుని వల్ల గర్భవతి అవుతుంది.ఆమె బిడ్డే సిరిల్లా.1263 లో సిరిల్లా కోసం నిల్ఫ్ గ్రాడ్ సైన్యం వెతుకుతూ ఉంటుంది. సింటియా రాజ్య మేజ్ అయిన మౌస్ సాక్ ను నిల్ఫ్ గ్రాడ్ సైన్యం ప్రిజనర్ గా పట్టుకుంటారు.

          1256 లో గెరాల్ట్,జాస్కియర్ తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో నిద్ర పట్టక గెరాల్ట్ ఓ జిన్ ను పట్టుకుంటాడు. దానిని జాస్కియర్ తీసుకుని కోరికలు అడిగే ప్రయత్నంలో దానిని విడుదల చేస్తాడు.జాస్కియర్ కు తీవ్ర అనారోగ్యం కలుగుతుంది. అక్కడ దగ్గర హీలర్ దగ్గరకు  తీసుకువెళ్తే అది మ్యాజిక్ సంబంధ అనారోగ్యం కనుక ఓ మేజ్ మాత్రమే నయం చేయగలరని చెప్పడంతో దగ్గరలో ఉన్న యెన్నిఫర్ దగ్గరకు అతన్ని గెరాల్ట్ తీసుకువెళ్తాడు. ఆ జిన్ కు మాస్టర్ జాస్కియర్ అనుకున్న యెన్నిఫర్ అతన్ని బాగు చేసి,అతను మూడు కోరికలు కోరుకున్నాక ఆ జిన్ ను తన శరీరంలోకి తీసుకుని తాను గర్భవతి అయ్యేలా చేయాలనుకుంటుంది.కానీ ఆ జిన్ మాస్టర్ గెరాల్ట్. ఆ ప్రయత్నంలో ఆమె మరణిస్తుందని తెలుసుకున్న అతను ఓ కోరిక కోరుకుంటాడు. ఆ జిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దానితో పట్టు యెన్నిఫర్ కు గెరాల్ట్ కు మధ్య ప్రేమ,శారీరక సంబంధం ఏర్పడుతుంది.అతను కోరుకున్నది ఏమిటో యెన్నిఫర్ అడిగిన చెప్పడు గెరాల్ట్.

          1263 లో కాహిర్ ఓ డాప్లర్ ను మౌస్ సాక్ ను చంపి,అతని రూపం,జ్ఞాపకాలు తీసుకునేలా చేస్తాడు. ఆ రూపంతో సిరిల్లాను పట్టుకోవడానికి ఆ డాప్లర్ బయల్దేరతాడు. ఆ డాప్లర్ ఎతిన్ సిరిల్లా వున్న అడవికి వెళ్తాడు.అతన్ని మౌస్ సాక్ అనుకుని,అతనితో డారాతో సహా బయల్దేరుతుంది సిరిల్లా. 1262 లో డ్రాగన్స్ ను కాపాడతారు గెరాల్ట్,యెన్నిఫర్. ఆ సమయంలోనే యెన్నిఫర్ కు తనకు,గెరాల్ట్ కు మధ్య ప్రేమ అతను జిన్ ను కోరుకున్న కోరిక వల్ల కలిగింది తప్ప సహజమైనది కాదని తెలుసుకుని అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇక ప్రస్తుతం లో సిరిల్లా కు డాప్లర్ మీద అనుమానం వస్తుంది.అతను మౌస్ సాక్ కాదని తెలిసిపోతుంది.డారా సాయంతో తప్పించుకుంటుంది.కానీ డారా ఆమెను వదిలి వెళ్ళిపోతాడు.

          1263 లో గెరాల్ట్ ఎప్పుడైతే నిల్ఫ్ గ్రాడ్ సింటియా మీద దాడి చేయబోతుందన్న వార్తా తెలుసుకుంటాడో తనకున్న లా ఆఫ్ సర్ప్రైజ్ ప్రకారం ఆ మొదటి బిడ్డ అయిన సిరిల్లాను కాపాడుకోవడానికి తనతో పంపించమని క్వీన్ ను అడుగుతాడు.ఆమె తెలివిగా సిరిల్లా స్థానంలో ఇంకో అమ్మాయిని పెట్టినా ఆమె మోసం చేసిందని గ్రహిస్తాడు గెరాల్ట్.ఆ సమయంలో అతన్ని బంధిస్తుంది క్వీన్.అదే సమయంలో నిల్ఫ్ గ్రాడ్ దాడి చేయడం,గెరాల్ట్ బంధిగా వుండిపోవడం, సిరిల్లాను క్వీన్ మరణించే ముందు మౌస్ సాక్ కు ఆమెను గెరాల్ట్ కు అప్పగించమని చెప్పడం జరుగుతుంది.మౌస్ సాక్ వచ్చే సరికి గెరాల్ట్ తప్పించుకుంటాడు. మౌస్ సాక్ ను పట్టుకుంటారు. సిరిల్లా పారిపోతుంది.

          ఇక గెరాల్ట్ అక్కడి నుండి తప్పించుకుని ఓ వర్తకుడిని మానిస్టర్స్ నుండి కాపాడతాడు. ఆ ప్రయత్నంలో గాయపడతాడు. అతన్ని తన బండిలో తన ఇంటికి తీసుకు వెళ్తూ ఉంటాడు. ఇక సిరిల్లా ఆ వర్తకుడి భార్యకు తారసపడటం,ఆమెతో కలిసి రావడం జరుగుతుంది. మొత్తానికి గెరాల్ట్, సిరిల్లా కలుసుకోవడం తో ముగుస్తుంది. కానీ సిరిల్లాకు కూడా కొన్ని అజ్ఞాత శక్తులు ఉండటం వల్ల ఆమెకు యెన్నిఫర్,గెరాల్ట్ ఇద్దరు విజన్ లా కనబడటం తో యెన్నిఫర్ ఎవరు అని గెరాల్ట్ ను అడగటంతో ఈ సీజన్ ముగుస్తుంది.

          ఓ పక్క గతం, ఇంకో పక్క  వర్తమానం నడవటం వల్ల కాస్త ఇది ప్రేక్షకులు కాలక్షేపానికి కాకుండా సీరియస్ గా చూడాల్సిన సిరీస్. ఏ సిరీస్ అయినా సరే మొదటి సీజన్ లో ముఖ్య పాత్రల పరిచయం,వారి ప్రస్తుత -వర్తమాన పరిస్థితుల వరకే పరిచయమవుతాయి. ఫ్యాంటసీ ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ పోలండ్ రచయిత అయిన ఆండ్రేజ్ సాప్కోస్కీ  రాసిన ద విచర్ఆధారంగా తియ్యబడింది. ఈ సీజన్ లోని ఎనిమిది ఎపిసోడ్లకు ఎపిసోడ్ రచయితలు వేరు. ఈ ధోరణి మనకు సీజన్లలో ఎక్కువ కనబడుతుంది. దీనిని బట్టి రచయితల మధ్య ఉండే సమన్వయం కూడా స్పష్టమవుతుంది. ఫ్యాంటసీ చూడటం వల్ల మనం ఊహించలేని ఎన్నో ఊహలను దృశ్య రూపంలో చూడగలము. లాజిక్ కు దూరమైన ఊహాల్లోకి తీసుకువెళ్లే శక్తి,ఊహా శక్తిని పెంచే దృశ్యాలు ఫ్యాంటసీ లో ఉంటాయి.

  *    *   *

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!