ఒక్కడే బ్రతికాడు!

 సినీ సంచారం

                       ఒక్కడే బ్రతికాడు!

                                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          మెరికాకు,ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ సందర్భాన్ని లోన్ సర్వైవర్ సినిమాగా మలచడం జరిగింది. ఈ ఆపరేషన్ ను ఆపరేషన్ రెడ్ వింగ్ గా వ్యవహరిస్తారు. ఈ ఆపరేషన్ లో బ్రతికి బయటపడ్డ మార్కస్ లుట్రెల్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు.

          అమెరికాకు,ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని ఓ తాలిబాన్ నాయకుడు అయిన అహ్మద్ షా ను పట్టుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో 2005 లో అహ్మద్ షా 20 మంది అమెరికన్ సబ్ మెరైన్ ఆఫీసర్స్ ను,వారికి సాయం చేసిన ఆ గ్రామస్తులను హత్య చేస్తాడు. దీనికి ప్రతిస్పందనగా అమెరికన్ ప్రభుత్వం నలుగురు బృందంతో అహ్మద్ షాను పట్టుకోవడానికి పంపిస్తుంది. ఈ నలుగురిలో నాయకుడు మైఖేల్ మర్ఫీ,మార్క్స్ మెన్ మరియు మెడికల్ ఆఫీసర్ మార్కస్ లుట్రెల్,మాథ్యూ అలెక్సన్  మరియు కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ డాని డీజ్ ఉంటారు.

          ఈ నలుగురున్న  బృందం ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో మాటు వేసి అహ్మద్ షాను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోపు వీరికి ముఖ్య కేంద్రంతో కమ్యూనికేషన్స్ సమస్య వస్తుంది.ఈ లోపు వీరు ఉన్న ప్రాంతంలోకి గొర్రెలు కాసుకునేవారు వస్తారు. వీరిని వదిలేయ్యాలా? వద్దా? అనే సమస్య వస్తుంది. వారిని వదిలేస్తే తాలిబన్లకు తమ గురించి తెలియజేస్తారనే అంశం తెలిసినప్పటికి,వారిని వదిలేస్తారు. ఇక ముఖ్య కేంద్రంతో కమ్యూనికేషన్స్ తప్పడంతో,వారు మిషన్ ను రద్దు చేసి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు.

          కానీ ఈ లోపు తాలిబాన్ బృందం వచ్చి వీరి మీద  దాడి చేస్తారు. ఈ నలుగురు బృందం ఎంతో వీరోచితంగా పోరాడినప్పటికి కూడా వీరి సంఖ్య అల్పంగా ఉండటం,తాలిబన్ల బృందం పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల  లుట్రెల్ తప్ప మిగిలిన ముగ్గురు మరణిస్తారు. ఈ నలుగురిని కాపాడటానికి అమెరికా నుండి రెండు హెలికాఫ్టర్లు వచ్చినప్పటికి, ఒక దానిని తాలిబన్లు పేల్చేస్తారు. రెండోది ఈ విషయం తెలియజేయడానికి బేస్ దగ్గరకు వెళ్ళిపోతుంది.

          ఈ లోపు లుట్రెల్ ఓ నదిలో సేద తీర్చుకుంటూ ఉండగా ఆ గ్రామంలోని మహమ్మద్ గులాబ్ అనే అతను సాయం చేసి, తన ఇంటికి తీసుకు వచ్చి ఆశ్రయం ఇస్తాడు. లుట్రెల్ గులాబ్ సాయంతో అమెరికన్లకు తన ఉనికి గురించి తెలియజేస్తాడు. మహమ్మద్ గులాబ్ ఇంటి మీద తాలిబన్లు మూకుమ్మడిగా దాడి చేసినప్పటికీ లుట్రెల్ ను కాపాడి అతన్ని అమెరికన్లకు అప్పగిస్తాడు గులాబ్. అలా ఆ నలుగురిలో లుట్రెల్ ఒక్కడే ప్రాణాలతో బయట పడతాడు.

          దేశాలకు మధ్య జరిగే యుద్ధాల్లో,సైనికులు ఎలా తమ ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధపడి పయనిస్తారో స్పష్టం చేసే సినిమా ఇది. ఆపరేషన్ రెడ్ వింగ్స్ లో ఓ ఉదంతం ఆధారంగా వచ్చిన ఈ సినిమా యుద్ధంలో దేశాల సైనికులు,శత్రువులే కాకుండా పౌరులు కూడా ఎలా భాగమవుతారో స్పష్టం చేస్తుంది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

                  *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!