షూటర్

 సినీ సంచారం

                         షూటర్

                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          మార్క్ వాల్ బర్గ్ హీరోగా, స్టీఫెన్ హంటర్ రాసిన ద పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ నవల హాలీవుడ్ లో  షూటర్ సినిమాగా వచ్చింది.ఈ సినిమా పోలిటికల్  క్రైమ్ థ్రిల్లర్.అమెరికన్ ప్రెసిడెంట్ ను చంపే ప్రయత్నం  చేశాడన్న ఆరోపనను   అమెరికన్ మెరైన్ స్నైపర్ అయిన లీ స్వీగర్  ఎలా ఎదుర్కుంటాడు, తన నిర్దోషిత్వాన్ని ఎలా అతను నిరూపించుకున్నాడన్నదే ఈ సినిమా.

          లీ స్వీగర్ తన మిత్రుడైన డోని ఫెన్ తో కలిసి ఎరిత్రాలో ఉన్న మిషన్ లో పాల్గొంటాడు.స్వీగర్ కు ఫెన్ స్పాటర్. అక్కడకు వస్తున్న శత్రువులను మిత్రుడైన ఫెన్ సాయంతో ఎవరికి కనబడకుండా స్వీగర్ కాలుస్తూ ఉంటాడు. ఆ మిషన్ లో ఫెన్ మరణిస్తాడు. స్వీగర్ ఈ ఘనత అనంతరం తనకు తానే ఏర్పరచుకున్న అజ్ఞాతవాసంలో తన కుక్కతో ఉంటాడు.

          ఓ ప్రైవేట్ మిలిటరిలో కంపెనీలో ఉన్న అమెరికన్ ఆర్మీ కల్నల్ ఐజాక్ జాన్సన్ తన ఉద్యోగులతో కలిసి స్వీగర్ చేసిన మిషన్లను చూస్తూ ఉంటారు. స్నైపర్ గా,షూటర్ గా గురి తప్పని అతని దీక్షను గుర్తిస్తారు. జాన్సన్ స్వీగర్ దగ్గరకు వెళ్తాడు. త్వరలో అమెరికన్ ప్రెసిడెంట్ మీద జరగబోయే హత్యాప్రయత్నాన్ని నివారించడానికి సాయపడమని అడుగుతాడు. దానికి అంగీకారం తెలుపుతాడు స్వీగర్. స్వీగర్ వారికి సాయం చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు జాన్సన్ మనుషులు అతన్ని మోసం చేస్తారు.స్వీగర్ కాల్చకముందే  ఎవరో ప్రెసిడెంట్ పక్కన ఉన్న ఇథియోపియా ఆర్చ్ బిషప్ ను కాలుస్తాడు. ఆ తర్వాత స్వీగర్ ను కూడా ఓ పోలీస్ ఆఫీసర్  కాల్చే ప్రయత్నం చేయబోతుండగా అతను తప్పించుకుంటాడు.స్వీగర్ తప్పించుకునే క్రమంలో ఓ ఎఫ్ బి ఐ ఏజెంట్ అయిన నిక్ మెంఫిస్ కారును దొంగిలించి దానిలో పారిపోతాడు. మొత్తానికి ప్రెసిడెంట్ ను హత్య చేయబోయాడని, ఆర్చ్ బిషప్ ను హత్య చేశాడన్న ఆరోపణ మీద స్వీగర్ ను పట్టుకోవడానికి ఎఫ్ బి ఐ,పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాయి.స్వీగర్ ను పారిపోయే ముందు గన్ తో షూట్ చేస్తారు కూడా.

          మరణించిన తన మిత్రుడైన ఫెన్ భార్య సారా దగ్గరకు స్వీగర్ వెళ్తాడు.ఆమె అతనికి సాయం చేస్తుంది. క్రమేపీ ఇద్దరు ప్రేమలో పడతారు. ఈ కేసు గురించి నిక్ కూడా వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఎంతో కచ్చితంగా గురిని పేల్చగల స్వీగర్ ప్రెసిడెంట్ ను కాకుండా గురి తప్పి ఆర్చ్ బిషప్ ను కాల్చడం అన్న విషయం మీద అతనికి అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఆర్చ్ బిషప్ ను కాల్చిన పోలీస్ ఆఫీసర్ కూడా మరణిస్తాడు. దానితో స్వీగర్ ఈ హత్య చేయలేదనే నమ్ముతాడు నిక్.సారాను నిక్ ను కలిసి అతనికి తన గురించి తెలుసు అని చెప్పమంటాడు. అలాగే చేస్తుంది ఆమె.అదే సమయంలో నిక్ కు స్వీగర్ గురించి తెలిసిందనుకుని అతన్ని జాన్సన్ మనుషులు వెంటాడుతారు.వారిని కనుక్కోవడానికే స్వీగర్ నిక్ ను ఎరగా వాడతాడు.నిక్ ను కాపాడతాడు స్వీగర్.

          స్వీగర్ ,నిక్ ఇద్దరు కలిసి ఫైర్ ఆర్మ్స్ ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్తారు.ఇలా దూరం నుండి చంపగల వారు ఎవరు ఉన్నారో కనుక్కుంటారు. అలా కనుక్కుని నిక్ సాయంతో ఎక్స్ ప్లోజివ్స్ కూడా తయారు చేసుకుని ఆ అసాసిన్ దగ్గరకు వెళ్తారు.అతను జరిగింది చెప్తాడు.ఆ హత్య ఆర్చ్ బిషప్ ను చంపడానికి,దానిలో స్వీగర్ ను ఇరికించడానికి అని,ఇదంతా జరగడానికి కారణం ఓ ఆఫ్రికన్ గ్రామంలో ఆయిల్ పైప్ లైన్ తవ్వడానికి ఆ ఊరిలోని వారు ఒప్పుకోకపోవడంతో ఆ ఊరు మొత్తాన్ని చంపి వారిని సామూహికంగా పాతి పెట్టారని,దీనికి అమెరికన్ సెనేటర్ కు సంబంధం ఉందని,జాన్సన్ దీనిలో ఉన్నాడని, ఈ విషయం అమెరికన్ ప్రెసిడెంట్ కు చెప్పడానికి ఆర్చ్ బిషప్ రావడం వల్ల అతన్ని హతమార్చారని చెప్తాడు. అలాగే శారను వాళ్ళు బంధించారని చెప్పి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అతను చెప్పినదంతా సాక్ష్యంగా రికార్డ్ చేసుకుంటాడు స్వీగర్.

          సారాను వదిలేయ్యాలంటే స్వీగర్ దగ్గర ఉన్న రికార్డింగ్ ఇవ్వాలంటే అలాగే ఇవ్వడానికి వస్తాడు స్వీగర్. కానీ ఆ రికార్డింగ్ ను కాల్చేసి సారాను కాపాడుకుంటాడు.నిక్ సాయంతో ఎఫ్ బి ఐ కు లొంగిపోతాడు. ఎఫ్ బి ఐ ,అటార్నీ జనరల్ ఉండగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు స్వీగర్. తన రైఫిల్ అక్కడ ఉన్న మాట నిజమే కానీ తాను ఆపరేట్ చెయ్యనప్పుడు దాన్ని ఆపరేట్ చేయలేని విధంగా పెడతాననే విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాడు.అలాగే జాన్సన్ ఆఫ్రికాలో చేసినవి చెప్పినా ఆఫ్రికా వేరే దేశం కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోవడం కుదరదని ఎఫ్ బి ఐ తేల్చేస్తుంది.స్వీగర్ ను నిర్దోషిగా ప్రకటిస్తుంది. స్వీగర్ ఆ రాత్రి జాన్సన్ ,సెనేటర్ ను హత్య చేసి ఆ ఇంటిని బ్లాస్ట్ చేస్తాడు.ఆ తర్వాత సారాతో కలవడంతో సినిమా ముగుస్తుంది.

          సీరియల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే ఫీలింగుకు, ఇటువంటి పోలిటికల్ థ్రిల్లర్స్ ఇచ్చే ఫీలింగుకు వ్యత్యాసం ఉన్నా, ఈ సినిమాల్లో రాజకీయ లౌక్యాలు,వ్యూహాలు ఉంటాయి. లోన్ సర్వైవర్ లాంటి సినిమాల్లో నటించిన మార్క్ వాల్ బర్గ్ యాక్షన్ సినిమాల్లో అద్భుతంగా నటిస్తాడు. మీకు పోలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టమైతే  ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా.

              *    *   *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!