దాగుడుమూతలాట

 చదువరి

దాగుడుమూతలాట

                                                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          జేమ్స్ పాటర్సన్ తన నవలల్లో అలెక్స్ క్రాస్ సిరీస్ కాకుండా స్వతంత్ర నవలలుగా రాసిన వాటిల్లో 'హైడ్ అండ్  సీక్' ప్రముఖ థిల్లర్ నవల.పాటర్సన్ శైలిలో నేరం జరగడం,ఆ హంతకుడిని పట్టుకోవడం ప్రధానాంశాలుగా ఉంటాయి.ఈ నవలల్లో ఘటనలకు ఉన్న ప్రాధాన్యత పాత్రచిత్రణకు ఉండదు.అలా కాకుండా క్రైమ్ థ్రిల్లర్ లోనే వ్యక్తుల మనస్తత్వాలను  స్పష్టం చేస్తూ రాసిన నవల ఇది.వారి మనస్తత్వాలననుసరించి కథ నడుస్తుంది ఈ నవలలో. థ్రిల్లర్ నవలల్లో ప్రారంభం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.ఈ ఆరంభమే పాఠకులను కథ ఊహించేలా చేస్తుంది,పాత్రలను పరిచయం చేస్తుంది.

          ఈ నవల ఆరంభం మ్యాగి బ్రాడ్ ఫోర్డ్ అనే వివాహిత తన భర్త ఫిలిప్ ఆమెను,ఆమె కూతురిని చంపబోతున్న సమయంలో ఆత్మరక్షణకై ఆమె అతన్ని హత్య చేయడంతో ఆరంభమవుతుంది.ఆ తరువాత కథలో బ్రాడ్ ఫోర్డ్ తన కథను తను చెప్పుకుంటూ,అలాగే  దానికి సమాంతరంగా మిగిలిన కథ నడవడం జరుగుతుంది.ఆ హత్య విషయంలో ఆమె కూతురు  ఐదేళ్ళ మ్యాగికి కూడా దెబ్బలు తగలటం వల్ల  ఆత్మరక్షణ కింద మ్యాగి విడుదల అవుతుంది. ఈ సంఘటన జరిగేసరికి మ్యాగికి 24 ఏళ్ళ వయసు.ఫిలిప్ ఉదంతం ఆమెను మానసికంగా ఎంతగానో ప్రభావితం చేసింది.అప్పటినుండి చిన్న చిన్న శబ్దాలకే భయపడిపోయేది.

          మ్యాగికి బాల్యం నుండే పాటలు రాసుకుని,పాడుకోవడం అలవాటు.బారీ అనే ప్రసిద్ది పొందిన గాయకుడు మ్యాగి రాసిన ఉత్తరాల వల్ల ఆమెకు పాటల రచయితగా,గాయకురాలిగా అవకాశం ఇస్తాడు.కొద్ది కాలంలోనే ఆమె గొప్ప గాయకురాలవుతుంది. మ్యాగి జీవితంలోకి ఇంకో ఇద్దరు మగవాళ్ళు ప్రవేశించడం ఆమె జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో,వారి మనస్తత్వాలు ఎటువంటివో స్పష్టం చేస్తుంది కథ.

          దాదాపు 55 ఏళ్ళ వయసున్న ప్యాట్రిక్ అనే వ్యాపారవేత్తతో మ్యాగి ప్రేమలో పడటం,వారిద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం,తరువాత పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది.ప్యాట్రిక్ కు యుక్త వయసుకొచ్చిన పీటర్ అనే కొడుకు ఉన్నాడు అప్పటికే.ప్యాట్రిక్ తో తన తల్లి సంబంధాన్ని జెన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

          ప్యాట్రిక్ వల్ల మ్యాగికి ఓ మగపిల్లవాడు పుడతాడు.ఆ బాబే యాలి.ఆ తరువాత ప్యాట్రిక్ ,మ్యాగి బోటులో షికారు చేస్తున్న సమయంలో ప్యాట్రిక్ కు గుండె పోటు రావడంతో మరణిస్తాడు.ప్యాట్రిక్ తన విల్లులో తన ఆస్తులలో,వ్యాపారాలలో మ్యాగికి,యాలికి కూడా భాగం రాయడంతో పీటర్ కు కోపానికి గురి చేస్తుంది.

          విల్ షెపర్డ్ ఓ ప్రసిద్ధి పొందిన ఫుట్ బాల్ ప్లేయర్. అతనిది ఓ వింతైన మనస్తత్వం. బాల్యంలో తల్లిదండ్రులు విడిపోవడం,తండ్రి దగ్గర ఉండటం,అతను నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకోవడంతో అతని మనస్తత్వంలో విపరీతమైన మార్పులు వస్తాయి. తాను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేయడం అతనికి ఉన్న లక్షణం.అతని తమ్ముడు పామర్.పామర్ ,విల్ చూడటానికి దాదాపు ఒకేలా ఉంటారు. తండ్రి మరణించాక మేనత్తల దగ్గర పెరుగుతారు ఇద్దరు. విల్ తన చిన్న మేనత్తతో శారీరక సంబంధం పెట్టుకుంటాడు.అమ్మాయిలను ఆకర్షించడం, వారు లొంగకపోతే సొంతం చేసుకునేవారకు ఓపికగా ఉండటం,తర్వాత వారిని బాధించడం విల్ విపరీత ధోరణికి సంకేతాలు.

          గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా ఉన్న విల్ బ్రెజిల్ ఆటగాళ్ల చేతిలో ఓడిపోతాడు. అసాధ్యాన్ని తాను అనుకున్నది సాధించడంలో సుసాధ్యం చేయగల విల్ తన ఆలోచనల వల్ల ఓడిపోతాడు. మ్యాగి పాటలను ఎంతగానో ఇష్టపడ్డ విల్ ఆమెకు దగ్గర కావాలనుకుంటాడు. ఓ పార్టీలో ఇద్దరు కలుస్తారు. కానీ విల్ ప్రవర్తన మ్యాగికి నచ్చకపోవడం వల్ల విల్ పట్ల ఆమెకు దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇది ప్యాట్రిక్ ను పెళ్ళి చేసుకునే ముందు జరిగిన విషయం.

          ప్రస్తుతం విల్ ఎలా అయినా మ్యాగికి దగ్గర కావాలనే లక్ష్యంతో ఆమె ఇంటి పక్కన ఓ ఇల్లు తీసుకుంటాడు. మొత్తానికి ఆమెతో పరిచయం పెంచుకుని,ఓపికతో ఆమెకు దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని ఆమె ఇంట్లోకే మకాము మార్చేస్తాడు.జెన్నీ,యాలి లతో ఎంతో మంచిగా ఉంటాడు. ఆ తర్వాత విల్ సినిమా రంగంలోకి ఓ సినిమాతో ప్రవేశిస్తాడు. ఆ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది. అప్పటికి మ్యాగికే మంచి పేరు ఉండటం సహించలేకపోతాడు. ఓ సారి ఆమె సింగింగ్ కన్సర్ట్ ఇవ్వడానికి వెళ్తాను అన్నప్పుడు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.ఆమె మీద చేయి చేసుకుంటాడు. విల్ గురించి తనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని మ్యాగికి అర్ధమవుతుంది. అతనికి విడాకులు ఇద్దామని నిర్ణయించుకుంటుంది. ఆమె తిరిగి వచ్చాకా కూడా అతని ప్రవర్తన కొన్ని సార్లు విపరీతంగానే ఉంటుంది.

          ఓ రోజు అలానే అతను తన రైఫిల్ తో వెళ్ళడం చూసి అతను జెన్నీ దగ్గరకు వెళ్తుండటం చూసి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఓ సారి షూట్ చేస్తుంది,ఆ తర్వాత గట్టిగా ఏదో తగలడం వల్ల ఆమెకు స్పృహ తప్పుతుంది. ఆమె లేచేసరికి విల్ మరణించడంతో ఆమెను హత్యా నేరం మీద అరెస్ట్ చేస్తారు.తాను పేల్చడం వల్లే విల్ చనిపోయాడని మ్యాగి కూడా అనుకుంటుంది.

          దాదాపు అదే నిరూపణ కాబడుతున్న సమయంలో మ్యాగి లాయర్ తో సహా ఓ సీక్రెట్ బృందం చేసే కార్యకలాపాలను కాపాడుకుంటారని,కావాలనే ఆమెను ఇరికించారని నిరూపించబడుతుంది. మ్యాగి మొదటి భర్తను ఆత్మ రక్షణ కోసం చంపడం, రెండో భర్త ఆమెతో ఉన్నప్పుడే మరణించడంతో విల్ ను కూడా ఆమె హత్య చేసిందని సమాజం అప్పటి దాకా భావించినా ఈ తీర్పుతో ఆ నిర్ణయం మారుతుంది.

          ఇక మ్యాగి జరిగింది మర్చిపోయి, సంతోషంగా ఉంటున్న సమయంలో విల్ ఆమెను,ఆమె పిల్లలను చంపడానికి వస్తాడు. విల్ తనలా ఉండే తన సోదరుడిని చంపి,తన బదులు ఉంచాడని పాఠకులకు ఇప్పుడు స్పష్టం అవుతుంది. తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో అతని మీద మ్యాగి అతన్ని కాలుస్తుంది. ఆ బులెట్ వల్ల అతను మూగ వాడు అవుతాడు,అతన్ని మానసిక వైద్యం కోసం హాస్పటల్లో ఉంచడంతో నవల ముగుస్తుంది.

          క్రైమ్ థ్రిల్లర్ నవలల్లో ఇలా పాత్రల ద్వారా నడపటం కష్టమైన అంశం. సంఘటన ద్వారా నడిచే శైలిలో కథ ఎంతో వేగంగా నడుస్తుంది. కానీ పాత్రల ద్వారా నడిచే ఈ థ్రిల్లర్ రకంలో పాత్ర మనస్తత్వం మీద రచయిత దృష్టి ఎక్కువ ఉండటం వల్ల ఇది కష్టమైన ప్రక్రియే. జేమ్స్ పాటర్సన్ అభిమానులు కచ్చితంగా చదవాల్సిన నవల ఇది. ఈ ప్రక్రియను సిడ్నీ షెల్డన్ కూడా ‘A stranger in the mirror’ నవలలో పాటించారు. ఈ నవలలు చదివాక కొంతసేపు ఆ పాత్రలలోకంలో ఉండేలా చేస్తాయి. అందుకే ఈ శైలి కష్టమైనది అయినా పాఠకులు అభిమానించే శైలి కూడా.

              *    *   *  

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!