అమిష్ కోణంలో రాముడు

 చదువరి

                            అమిష్ కోణంలో రాముడు

                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  



          నుషుల జీవితంపై ఇతిహాసాల ప్రభావం ఎంతగానో ఉంది. ముఖ్యంగా రామాయణ,భారతాలను మనిషి జీవితానికి ఆదర్శాలుగా కూడా పేర్కొంటారు. అందులోని పాత్రల వ్యక్తిత్వాలు మనుషులకు ఆదర్శం అని కూడా భావిస్తారు. సాహిత్యంలో వచన సాహిత్యం విస్తారంగా వచ్చినప్పటి నుండి ఈ ఇతిహాసల పట్ల వైవిధ్య భావాలతో ఎన్నో రచనలు వచ్చాయి. ఈ ఇతిహాసాలు వాస్తవమా?కాదా?అన్నది పక్కన పెడితే అవి జరిగినా సరే, ఆ ఇతిహాసాలలోని పాత్ర చిత్రణలు మాత్రం దేవుడి జీవిత చరిత్రలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే ఇతిహాసాల్లోని ముఖ్య సంఘటనలను మార్చకుండా రామాయణంలోని పాత్రలకు ఇంకో కోణాన్ని ఇచ్చిన భారతీయ రచయిత అమిష్. శివా ట్రయలాజి,దాని తరువాత రామాచంద్రా సిరీస్ తో పాఠకుల ఆదరణ పొంది భారత దేశ సాహిత్య పాప్ స్టార్ గా పేరు పొందారు. రామా చంద్రా సిరీస్ లో అమిష్ హైపర్ లింక్’(Multilinear Narrative) ద్వారా ఇప్పటి వరకు రామ్,సీతా,రావణ్ అనే మూడు పుస్తకాలను రచించారు. ఈ పద్ధతిలో కథలోని ముఖ్య పాత్రల జీవితాలను పరిచయం చేస్తూ, ఆ తర్వాత ఓ ముఖ్య సంఘటన ద్వారా ఈ ముఖ్య పాత్రల మధ్య సంబంధాన్ని నెలకొల్పి, ఆ తర్వాత కథను అక్కడి నుండి నడపటం. రామాయణంలో రాముడు,సీతా,రావణాసురుడు ముఖ్య పాత్రలు. అమిష్ రామా చంద్రా సిరీస్ లో ఈ మూడు పాత్రలను మూడు పుస్తకాలుగా రచించారు. మొదటి పుస్తకం రామ్. వాస్తవానికి ఇతిహాసాల్లో ఎక్కువగా దేవుడు అన్న కోణం వల్ల మనిషి కన్నా అధికుడు అందుకే అతను విజయం సాధించాడు అనే భావన పాఠకుల్లో కలుగుతుంది.కానీ అమిష్ రామాయణంలోని ముఖ్య సంఘటనలను మార్చకుండా,అలాగే ఈ పాత్రలకు దైవాంశ అనే కోణం జోడించకుండా రాయడం వల్ల ఓ ఇతిహాసం చదివేటప్పుడు కూడా ఎలా ఆలోచించాలి అనే అంశాన్ని అమిష్ పాఠకులకు పరిచయం చేస్తారు. ఆలోచించడం నేర్పించేవే గొప్ప పుస్తకాలైతే తప్పక అమిష్ గొప్ప పుస్తకాల రచయిత అని చెప్పుకోక తప్పదు.

          రామా చంద్రా సిరీస్ లోని మొదటి పుస్తకం రామ్ సీతను రావణుడు అపహరించడంతో మొదలవుతుంది. జింకను వేటాడటానికి రాముడు,లక్ష్మణుడు వెళ్ళిన సమయంలో రావణుడు సీతను అపహరించడంతో మొదలైన ఈ కథ ఈ సంఘటన తర్వాత రాముని జీవితం,అప్పటి రాజ్య పరిస్థితులు గురించి చెప్తూ,ఈ సీతాపహరణ సంఘటనతో ముగుస్తుంది.

          ఈ సంఘటన జరిగిన 33 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పడమే,రాముడు జననానికి ముందు రాజ్య పరిస్థితుల నుండి రాముడి పుట్టుక ఆ తర్వాత పెళ్ళి, వనవాసం వరకు ఈ మొదటి పుస్తక కథ. సప్త సింధు రాజ్యాలను దశరథుడు పరిపాలిస్తున్నాడు.ఆయనకు చక్రవర్తి సామ్రాట్ అని పేరు. సప్త సింధులో ఉన్న ప్రాంతాలన్నీ తన పాలంలోకి తెచ్చుకోగలిగాడు కనుక ఆయనకు ఆ పేరు.దశరథుని సైన్యాధిపతి మృగస్యుడు. దశరథుని సామంత రాజైన కేకయా రాజ్య రాజు అశ్వపతి ఆయనకు ఎంతో నమ్మకస్థుడు.తన కూతురు కైకను కూడా ఇవ్వడం వల్ల అశ్వపతికి రాజు అంటే గౌరవంతో పాటు ప్రేమ కూడా ఉంది. దశరథునికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య దక్షిణ కోసల రాజు కూతురు కౌసల్య మొదటి భార్య, రెండో భార్య కేకయా రాజు అశ్వపతి కుమార్తె కైక రెండో భార్య. ఈ ఇద్దరి వల్ల సంతానం కలుగకపోవడం వల్ల కాశీ రాజ్య యువరాణి సుమిత్రను వివాహం చేసుకున్నాడు దశరథుడు.కానీ ఈ ముగ్గురిలో ఎవరి వల్ల కూడా ఆయనకు వారసుడు లభించలేదు.

          దశరథునికి వర్తకులంటే అంటే చిన్న చూపు ఉండటం వల్ల తన రాజ్యంలో పుట్టిన వారిని బ్రాహ్మణులగానో లేక క్షత్రియులగానో మాత్రమే రూపొందేలా చూడటంతో ఆ రాజ్యంలో వర్తకరంగం లేకుండా పోయింది. అదే సమయంలో దీనిని అవకాశంగా మలచుకుని కుబేరుడనే వర్తకుడు తన వర్తక లావాదేవీలను సప్త సింధు రాజ్యాలతో విస్తారంగా పెంచుకున్నాడు. వర్తకుల పై ఉన్న చులకనా భావంతో దశరథుడు వారికి ఎన్నో పన్నులు విధించినా సరే వాటిని భరిస్తూనే మొత్తానికి ఓ శక్తివంతమైన వర్తకుడిగా మారాడు.కుబేరుడి దగ్గర రావణుడు వర్తకంలో ముఖ్య అధికారిగా చేరిన తర్వాత అతని సహాయంతో కుబేరుడు దశరధుడికి ఎదురు తిరుగుతాడు.తాము చెల్లించే దానిలో చాలా తక్కువ మొత్తం మాత్రమే చెల్లిస్తామని తెలియజేస్తాడు. దీనికి దశరథుడు అంగీకరించకపోవడం వల్ల వెంటనే కరచాప వద్ద రావణుడికి, దశరథుడికి మధ్య యుద్ధం జరుగుతుంది.ఆ యుద్ధంలో దశరథుడు ఓటమి పాలవుతాడు. ఈ యుద్ధం ముగిసే సమయానికి దశరథుడు గాయాలతో ఉన్నప్పుడూ కైక అతన్ని కాపాడి రాజ్యానికి తీసుకువస్తుంది.ఆమె చేసిన సాయానికి ఆమె ఏ రెండు కోరికలైనా ఎప్పుడైనా తీరుస్తానని మాటిస్తాడు దశరథుడు. ఇదే సమయంలో కౌసల్య రాముడికి జన్మనిస్తుంది. ఏ యుద్ధం ఓడిపోని దశరథుడు మొదటి సారి ఓడిపోవటం,అదే సమయంలో రాముడు జన్మించడంతో రాముడిని నష్టజాతకుడిగా దశరథుడు భావిస్తాడు. అదే భావం ప్రజల్లో కూడా ఉంటుంది. దశరథుడు ఆ ఓటమితో పూర్తిగా క్రుంగిపోతాడు. రాముడి తర్వాత కైకేయి భరతుడికి జన్మనిస్తుంది. ఆ తర్వాత సుమిత్ర లక్ష్మణ,శతృఘ్నులను కంటుంది. ఈ నలుగురుని రాజగురువైన వశిష్టుడి గురుకులానికి పంపిస్తారు. రాముడు తండ్రి మరియు రాజ్యం తనను చూసే దృష్టికి అలవాటు పడిపోతాడు. మౌనంగా ఉంటాడు. లక్ష్మణుడు బాల్యం నుండి రాముడిని సోదరుడిగా ఎంత గానో ప్రేమిస్తాడు. ఇక పోతే భరతుడు కైకేయి బిడ్డ అవ్వడం వల్ల,ప్రాధాన్యత ఉండటం వల్ల అతని ప్రవర్తనలో బాల్యం నుండే ఓ రకమైన తిరుగుబాటు ధోరణి ఉంటుంది.

          నాడు రాజ్యల్లో పరిపాలించడం రెండు పద్ధతుల్లో ఉండేది. ఒకటి పురుష స్వభావం అయితే,రెండోది స్త్రీ స్వభావం.పురుష స్వభావ పాలనలో సత్యం,కర్తవ్యం మరియు గౌరవం అన్నవి ముఖ్య పాత్రను పోషిస్తాయి. స్త్రీ స్వభావ పాలనలో స్వేచ్చ,సౌందర్యం ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ రెండు విధానాల్లోని కొన్ని లోపాలు ఉన్నాయి. మొదటి రకంలో పరిస్థితులకు మారలేకపోవడం వల్ల, మార్పులను అంగీకరించలేకపోవడం వల్ల వైఫల్యాలు ఎదురైతే,రెండో దానిలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం వల్ల,ఐక్యత లోపించడం వల్ల,స్వేచ్చ పేరుతో బాధ్యతలను పట్టించుకోకపోవడం వల్ల వైఫల్యాలు ఎదురయ్యాయి. దీనికి ఉదాహరణలు అసురులు పురుష స్వభావ పాలనను పాటిస్తే,దేవతలు స్త్రీ స్వభావ పాలనను అనుసరించారు.రాముడు పురుష స్వభావ పాలన పట్ల సదాభిప్రాయం కలిగి ఉంటే,భరతుడి స్వేచ్చలోనే నిజమైన పాలన ఉంటుందని నమ్ముతాడు. రాముడి స్వాభావంలో ధర్మం,న్యాయం మాత్రమే ఉంటాయి తప్ప పరిస్థితులకు తగ్గట్టు వాటిని మార్చుకునే శైలి ఉండదు. ఓ ఆదర్శ పాలన రాముడి ఆశయం.ఇక భరతుడు మాత్రం అలా కాదు,ప్రజల స్వేచ్చను హరించకూడదు అని భావిస్తాడు. భరతుడు యుక్త వయసుకు వచ్చేసరికి వారి పక్కనే ఉన్న కొండజాతి స్త్రీలతో ప్రేమలు నడుపుతాడు.ఆజాతిలో ప్రేమకు స్వేచ్చ ఉండటం వల్ల ఏ ఆటంకం కూడా ఏర్పడదు. గురుకులంలో విద్య నేర్చుకునేటప్పుడు  గురుకుల నామాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. రాముడు ఆ కొండ జాతి నాయకుడైన వరుణ్ తో తమ గురువైన వశిష్టుడు తమ గురించి ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అయోధ్యులకు ఆతిధ్యం ఇవ్వకూడదనే నిబంధన వారికి ఉందని,అది ఎందుకు ఉందో తనకు తెలియదని,అలాగే గురుకులంలో ఉన్నవారికి ఆశ్రయం కూడా ఇవ్వడం వారి బాధ్యత  అని తెలియజేస్తాడు.

          వశిష్టుడు రహస్యంగా ఓ నాగాను కలవడం గమనిస్తాడు లక్ష్మణుడు.రాముడికి ఆ విషయం చెప్పి తాము గురువుతో అప్రమత్తంగా ఉండాలని చెప్తాడు. దానిని రాముడు పట్టించుకోడు. గురుకులంలో విద్యను పూర్తి చేసుకున్న ఆయోద్య యువరాజులు తిరిగి అయోధ్యకు వెళ్తారు.అయోధ్యలో మంథర అనే వర్తకురాలు ఉంటుంది.బాల్యంలో వచ్చిన జబ్బు వల్ల ఆమె గూనిగా ఉంటుంది. ఆమె గొప్ప ధనవంతురాలు.అయోధ్య రాజ్య సంపద కన్నా కూడా ఆమె సంపద ఎన్నో రెట్లు ఎక్కువ. యువరాజులను చూసిన ఆమె తన ప్రాబల్యంతో భవిష్యత్తులో భరతుడిని రాజును చేస్తే మంచిదని ఎందుకంటే రాముడి పట్ల ఎవరికి సదాభిప్రాయం లేదు కనుక. అందుకని రాముడిని పోలీస్ ఫోర్సుకు నాయకుడిగా అంటే రాజ్యంలో నేరాలను అరికట్టే బాధ్యతలు వచ్చేలా చేస్తుంది. భరతుడికి ఆ రాజ్య దౌత్య పరమైన సంబంధాలు నిర్వహించే పదవి వచ్చేలా చేస్తుంది.

          కానీ ఎవరు ఊహించని రీతిలో ఆ రాజ్యంలో నేరాలను అరికట్టి రాముడి ప్రజల హృదయాల్లో మంచి పాలకుడనే భావన కలిగిస్తాడు. దశరథుడు ఓ సారి వేటకు వెళ్ళాలనుకుంటాడు. ఆ సమయంలో భరతుడు దౌత్య సంబంధాల విషయమై రాజ్యంలో లేకపోవడం వల్ల రాముడిని అతనితో పంపిస్తుంది కైకేయి. ఆ వేటలో తన ప్రాణాలకు తెగించి దశరథుడిని  అడవిజంతువుల బారి నుండి కాపాడతాడు రాముడు. అప్పటి వరకు రాముడి పట్ల ఉన్న కోపం కాస్త దశరథుడి మనసులో ప్రేమగా మారుతుంది. తాను రాముడి బాల్యం నుండి అతన్ని తన ఓటమికి బాధ్యుడిని చేసినా సరే అదేమీ మనసులో పెట్టుకోకుండా తనను కాపాడటంతో రాముణ్ణి రాజును చేస్తాడు దశరథుడు. 

          మంథర కుమార్తె రోషిణి.ఆమెకు పేదలకు సేవ చేయాలనే భావనతో ఆ రాజ్యంలోని మారు మూలలకు వెళ్ళి వైద్యం చేస్తూ ఉంటుంది. ఆమె రామ,లక్ష్మణ,భరత,శతృఘ్నులను తన సోదరులుగా భావించి వారికి రాఖీ కడుతుంది. ఓ సారి ఆమె సరయూ నది దాటి అక్కడి ప్రజలకు వైద్యం చేసి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను అక్కడికి చెందిన ధేనుక అనే యువకుడి ఆధ్వర్యంలో అతని బృందం ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేస్తారు. ఇది కాస్త నిర్భయ సంఘటనను పోలి ఉంటుంది. రాజైన రాముడు ధేనుకకు తప్ప మిగిలిన వారికి మరణ శిక్ష విధిస్తాడు. దానికి కారణం ధేనుక మైనర్ కావడం వల్ల చట్ట ప్రకారం అతనికి మరణ శిక్ష వర్తించదు కనుక. మిగిలిన వారు మరణ శిక్షతో మరణిస్తారు. ధేనుక ను అలా రాముడు విడిచిపెట్టడంతో అతని పట్ల ద్వేషం పెంచుకుంటుంది మంథర. కైకేయిని సంప్రదిస్తుంది.ధేనుకను హతమారిస్తే అయోధ్యలో ఉన్న సంపద కన్నా ఎక్కువ ఇస్తానని మాట ఇచ్చి తన ముద్రతో ఉన్న అంగీకార పత్రం ఇస్తుంది. ఆ సంపదతో తన కొడుకైన భరతుడిని రాజును చేయవచ్చని భావించిన కైకేయి దానికి అంగీకరిస్తుంది.

          భరతుడికి సోదరిగా రోషిణి పట్ల ఉన్న ప్రేమను తన ఆయుధంగా వాడి ఎవరికి తెలియకుండా ధేనుకను అతని చేత హతమార్చేలా చేస్తుంది. ఆ సమయంలో భరతుడు అక్కడ ఉంటే అనుమానం రావచ్చని భావించిన ఆమె అతన్ని దౌత్య సంబంధ  విషయమై వేరే రాజ్యం పంపిస్తుంది. ఆ తర్వాత ధేనుక మరణం గురించి రాముడికి తెలిసి అతని దాని గురించి విచారిస్తున్న సమయంలో మలయపుత్ర జాతి నాయకుడు మరియు మహర్షి అయిన విశ్వామిత్రుడు రావడంతో  రాముడు ఆయన దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది.

          విశ్వామిత్రుడు తమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న కొందరు అసురులనుండి కాపాడటానికి రాముడు తనతో రావాలని అడుగుతాడు విశ్వామిత్రుడు. ఆయనతో కలిసి వెళ్ళిన రాముడికి ఆయన సైన్యం,వ్యూహాలు చూశాక తన అవసరం ఎందుకు పడిందో అర్ధం కాదు. ఆ అసురుల కోసం రాముణ్ణి తీసుకురావడానికి కారణం వారు అయోధ్యా రాజ్య వాసులను ఏమి చేయకపోవడమే అని తెలుసుకున్న రాముడు వారితో సంధి ఏర్పరుస్తాడు.

          ఆ తర్వాత రాముడిని లక్ష్మణుడితో పాటు మిథిలా రాజ్యానికి తీసుకువెళ్తాడు. అక్కడ రాజుకు ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తుంది యువరాణి సీత. సీత మిథిలా రాజ్య రాజైన జనకుడు పెంచుకున్న కూతురు. వారి సొంత కూతురు ఊర్మిళ. సీతా స్వయంవరం కోసమే తనను తీసుకువచ్చారని రాముడికి అర్ధమవుతుంది. సీతకు ధర్మం పట్ల,విలువల పట్ల తన అభిప్రాయాలే ఉండటంతో ఆమెను రాముడు ఇష్టపడతాడు. అదే స్వయంవరానికి రావణుడు కూడా వస్తాడు. కానీ అతనికి ఆహ్వానం లేకపోవడం,ఆ రాజ్యంలో గౌరవం లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాముడు ఆ స్వయంవర పరీక్షలో నెగ్గి సీతను వివాహం చేసుకుంటాడు. అదే సమయంలో ఊర్మిళా,లక్ష్మణులకు కూడా వివాహం జరుగుతుంది. అవమానం పొందిన రావణుడు తన దగ్గర ఉన్న సైన్యంతో మిథిలా రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. సుక్షితులైన లంక సైనికులతో మిథిలా రాజ్యం గెలవడం అసాధ్యమైన సందర్భంలో ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాముడు విశ్వామిత్రుడు సలహాపై దైవీ అస్త్రాన్ని ప్రయోగించి విజయం సాధిస్తాడు. ఈ విజయంతో రాముడి పేరు మారుమ్రోగిపోతుంది. కానీ ఆ అస్త్రాన్ని వాయుపుత్రుల అనుమతి లేకుండా ప్రాణాలు హరించడానికి వాడకూడదనే నియమం ఉంటుంది. విశ్వామిత్రుడు దానిని కేవలం రాముడు లంక సైనికులు స్పృహ కోల్పోవడానికి,కొందరు మరణించడానికి మాత్రమే వాడాడు కనుక పట్టించుకొనవసరం లేదని చెప్తాడు.కానీ ప్రజలు చట్టాన్ని పాటించాలంటే తాను ఆచరించాలి అని నమ్మిన రాముడు ఓ సారి దైవీ అస్త్రాన్ని ప్రయోగిస్తే 14 ఏళ్ళు వనవాసం చేయాలని ఉండటంతో ఆ శిక్ష అనుభవించాలని నిర్ణయించుకుంటాడు. అలా రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తన నిర్ణయం తండ్రితో చెప్తాడు.దానికి దశరథుడు అంగీకరించకపోయినా రాముడు తన నిర్ణయానికే కట్టుబడి ఉంటాడు.ఇటు కైకేయి మంథర తన రెండు కోరికల విషయం గుర్తు చేయడంతో రాముణ్ణి వనవాసానికి పంపించాలని,భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరుతుంది.ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాముడిని వనవాసానికి పంపిస్తాడు. భరతుడు మాత్రం రాముడి చెప్పులు తీసుకుని వాటిని పెట్టి అన్న పేరు మీద రాజ్య పాలన చేస్తూ ఉంటాడు. అంటే అయోధ్యకు రాజు రాముడే అని దీని అర్ధం.

          రాముడితో పాటు సీతా,లక్ష్మణుడు కూడా వనవాసానికి వస్తారు.సున్నిత మనస్తత్వం కల ఊర్మిళ వనవాసంలో ఉండలేదని లక్ష్మణుడు ఆమెను ఒప్పించి రాజ్యంలోనే ఉండేలా చేస్తాడు. వీరు వనవాసంలో ఉన్న సమయంలోనే దశరథుడు మరణిస్తాడు. ఇక 13 ఏళ్ళ వనవాసం పూర్తవుతుంది. విభీషణుడు,శూర్పణక రాముడి దగ్గరకు వస్తారు.తమకు తమ అన్నకు అభిప్రాయ భేదం ఉందని తర్వాత తమ సాయం రాముడికి ఉంటుందని చెప్తారు. శూర్పణక రాముణ్ణి కామిస్తుంది. అతిథులదను ఆదరించాలి కనుక వారికి రాముడు ఆశ్రయమిస్తాడు. కానీ శూర్పణక సీతతో గొడవ పడి ఆమెకు హాని కలిగించబోతున్న సమయంలో లక్ష్మణుడు ఆమె మీద కత్తి దూస్తాడు.ఆమెకు గాయాలై రక్తం చిందుతుంది. ఆ ఇద్దరు అప్పుడు తిరిగి వెళ్ళిన రావణుడు వారి రక్తానికి జవాబుగా తమ కోసం వెతుకుతాడని అర్ధమై ఎంతో జాగ్రత్తగా అక్కడి నుండి వేరే చోటుకు వెళ్తారు.కానీ రాముడు,లక్ష్మణుడు వేటకు వెళ్ళిన సమయంలో రావణుడు వచ్చి మలయపుత్రులను దాడి చేసి,సీతను అపహరించుకుపోతాడు.ఇక్కడితో మనకు రామ్ ముగుస్తుంది.

          ఈ నవలలో కొన్ని ముఖ్య సంఘటనలను మార్చకుండా ముఖ్య భావనలు అమిష్ మార్చారు. ఇతిహాసాల్లోని ఎన్నో కోణాల మీద ఎందరికో సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలను వాస్తవిక కోణం నుండి సమన్వయపరిచే వారే సాహితీవేత్తలు.ఆ ప్రయత్నం అమిష్ ఈ నవల ద్వారా చేశారు.

          రామాయణంలో మొదటి ముఖ్య భావన రాముడి పుట్టుక గురించి అందరూ సంతోషించడం,దశరథుడు రాముడంటే ప్రాణం పెట్టడం. కానీ ఈ నవలలో రాముడి పుట్టుక,దశరథుడి ఓటమి ఒకే సారి జరగడంతో రాముడు  దశరథుడి దృష్టిలో,రాజ్యం దృష్టిలో ఎలా ఓ నష్ట జాతకుడిగా పరిగణించబడ్డాడో అమిష్ స్పష్టం చేస్తాడు.అలాగే అలా ఉన్న రాముడికి రాజయ్యే అర్హత ఉండదని అందరూ భావించిన తరుణంలో చట్టాన్ని నిలబెట్టి తనను తాను రామాయణంలో స్పష్టం చేసిన ఉదాత్త పాత్రగా అమిష్ ఈ పాటర్ను చిత్రించారు. అలాగే దశరథుడి ప్రాణాలు కాపాడి అతని మనసు గెలుచుకుంటాడు. మనకు రాముడు పుట్టుక నుండే గొప్పవాడు,దేవుడు అనే భావన ఇతిహాసం కలిగిస్తే రాముడు మామూలు మనిషి నుండి ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం గురించి ఈ నవల స్పష్టం చేస్తుంది.

          ఇకపోతే  రామాయణంలోని ఇంకో ముఖ్య భావన మంథర కైకేయి దగ్గర ఉండే మనిషని ఆమె వల్లే కైకేయి రాముడి పట్ల ద్వేషాన్ని పెంచుకుని,భరతుడిని రాజును చేయాలనుకున్నది అని.కానీ వాస్తవానికి రాజ్యాలలో ఎవరు నిజమైన స్వామి భక్తితో ఉండరు. తమ అవకాశాలకనుగుణంగా ప్రవర్తిస్తారు. అలాగే మంథర కూడా. ఒక వ్యాపారవేత్తగా ఎవరు రాజైతే తనకు అనుకూలంగా ఉంటుందో భావించి నిర్ణయం తీసుకుంది,అలానే తన కూతురు హత్య గావించబడినప్పుడు ఆ ప్రతీకార జ్వాలతో ఆమె కైకేయిని కలిసి పెద్ద మొత్తం చెల్లించి,కైకేయి ఎప్పటి నుండో తన కొడుకును రాజు చేయాలనుకున్న కలకు ఆసరాగా నిలిచింది.ఇలా ఈ పాత్ర చిత్రణ ద్వారా కల్పనకు కూడా ఓ మూలాన్ని,హేతువును జోడించారు అమిష్.

          ఇంకో ముఖ్య భావన రామ,భరత పాత్ర చిత్రణ పట్ల స్పష్టత కలిగి ఉండటం.అప్పటికే క్షీణిస్తున్న దశలో ఉన్న అయోధ్యను చూసిన ఇద్దరు ఒక్కోలా స్పందించారు, దానిలో మార్పు తీసుకురావడానికి. రాముడు కాలానికి తగ్గట్టు మారే లౌక్యం కలవాడు కాదు,న్యాయాన్ని ఎవరి కోసం మార్చనివాడు. భరతుడు తిరుగుబాటు,వ్యక్తి స్వేచ్చ మాత్రమే దీనికి పరిష్కారం అని నమ్మినవాడు. ఈ పాత్రలను చిత్రించడం వల్ల పాలన పట్ల ఉన్న వివిధ అభిప్రాయాలూ స్పష్టమవుతూ రాజ్యాల విజయాలకు,పరాజయాలకు ఉన్న కారణాలు స్పష్టం చేశాడు అమిష్.

          అలాగే అయోధ్య క్షీణించడానికి ఒక కారణం ఆ రాజ్యంలో వైశ్యులుగా భావించే వర్తకులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా చులకన చేయడం వల్ల వారిలో ఒకరైన కుబేరుడు,రావణుడితో కలిసి ఆ రాజును ఓడించాడన్న విషయం కూడా స్పష్టమవుతుంది. సమాజంలో సమానత్వం ముఖ్యమని, మనుషుల్లో వర్గాల పేరిట వారిలో విభజన ఏర్పరిచి ,కొందరిని చిన్న చూపు చూస్తే వారిలో రగిలే ప్రతీకారా జ్వాలా కూడా ఆ రాజ్యంలో శత్రుత్వంగా మారుతుందని అమిష్ స్పష్టం చేస్తారు.

          ఈ ముఖ్య భావనలను ముఖ్య సంఘటనలు మార్చకుండా భావనల మూలాలననుసరించి మనిషి-రాజుల మనస్తత్వాలను గమనించి రాసిన అమిష్ రచన పాఠకులకు ఎలా ఆలోచించాలో కూడా అంతర్లీనంగా నేర్పిస్తుంది. ఇంకా దీనికి కొనసాగింపుగా సీతా,రావణ్ పుస్తకాలు వచ్చాయి.

  *    *   *

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!