అమిష్ కోణంలో సీత

చదువరి

                           అమిష్ కోణంలో సీత

                                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



           సీతను ఓ సాధ్విమణిగా,భర్తకు విధేయత ప్రకటించే భార్యగా,భర్త కోసమే జీవించిన స్త్రీగా ఓ దైన్యత,త్యాగం వంటి పార్శ్వాలతో ఉన్నట్టు మనకు ఇతిహాసాల ద్వారా అనిపిస్తుంది.కాలం మారే కొద్ది  ముఖ్య పాత్రల చిత్రణల్లో కూడా ఎటువంటి మార్పులు సంభవిస్తాయో అమిష్ 'సీత'లో ఆమె పాత్రచిత్రణ ద్వారా స్పష్టమవుతుంది.'సీత' లో సీత బాల్యం నుండి ఆమెను రావణుడు అపహరించే వరకు కథ నడుస్తుంది.ఈ కథలో సీత రాముడికన్నా తెలివైనదిగా,గొప్ప యోధురాలిగా కనిపిస్తుంది.ఓ రకంగా సీతా బాల్యానికి,రామునికి బాల్యానికి ఉన్న పోలికలే వారి ఆలోచనల్లో సామీప్యత ఉండేలా చేసాయేమోనని అనిపిస్తుంది.

          మిథిలా రాజ్యం రాజు జనకుడు,రాణి సునయిన. ఈ కథ ప్రస్తుతం సీతా అపహరణం జరిగాక,38 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో మొదలుపెట్టడంతో సీత బాల్యం నుండి పాఠకులకు రచయిత పరిచయం చేస్తాడు. జనక మహారాజుకి సంతానం లేదు. జనకుడు,అతని భార్య సంతానం కోసం ప్రార్ధించడానికి త్రికుట కొండల్లోని కన్యాదేవత అయిన కన్యాకుమారిని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఓ చెట్టు కింద ఓ రాబందు తన చుట్టూ ఉన్న తోడేళ్లతో యుద్ధం చేస్తుంది. దానిని కాపాడటానికి అక్కడికి వెళ్ళిన సునయినకు ఆ రాబందు తనను తాను కాకుండా తన దగ్గర ఉన్న పసి కందును కాపాడటానికి పోరాటం చేస్తుందని దాని దగ్గరకు వెళ్ళాక అర్ధమవుతుంది. ఆ బిడ్డను సునయిన తీసుకుని,ఆ రాబందును నిమురుతుంది. కాసేపటికే ఆ రాబందు మరణిస్తుంది. ఆ రాబందు దగ్గర తీసుకున్న పాపనే సీత అని పేరు పెట్టి సునయిన పెంచుకుంటుంది. జనక దంపతులకు సంతానం లేకపోవడం వల్ల అలా దొరికిన సీతనే రాజ్యం అంతా యువరాణిగా చూస్తుంది.

          ఇకపోతే రాజ్య విషయానికి వస్తే జనకుడు జ్ఞానం పట్ల ఆసక్తి కలవాడు. అహింసను నమ్మే రాజు. విద్యావంతులకు,జ్ఞానులకు.గురువులకు ఆ రాజ్యంలో ప్రాధాన్యత ఉండేది. జనకుడు రాజ్య పాలన పట్ల కూడా వేదాంత చింతన కలిగి ఉండేవాడు, ఒకప్పుడు మిథిలా రాజ్య వైభవం నేడు లేదు.జనకుడు రెండేళ్ల క్రితం సునయినను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం రాజ్యాన్ని పాలిస్తుంది. గండకి నది పరివాహక రాజ్యమైన మిథిలా రాజ్యం నేడు ఆ నీరు కూడా రాజ్యానికి దక్కక, ఆ రాజ్యం నుండి పక్క రాజ్యమైన సంకశ్య రాజ్యం మిథిలాలో భాగమైనప్పటికి కూడా దాని రాజు కుశధ్వజుడు మిథిలను ఆక్రమించుకోవడానికి  అవకాశం కోసం చూస్తున్నాడు. కుశధ్వజుడు జనకుని సోదరుడు.సప్త సింధుపై రావణుని విజయం అక్కడి రాజ్యాలన్నింటిని ప్రభావితం చేసింది.వ్యాపారం పేరుతో స్పత సింధులోని రాజ్యాలన్నీ లంకకు చెల్లిస్తూ పేద రాజ్యాలుగా మారిపోతున్నాయి. ఆ రాజ్యాలలో మిథిలా కూడా ఒకటి. సునయిన వచ్చిన తర్వాత మిథిలలో ఎన్నో మార్పులు వచ్చాయి,దానికి కారణం ఆమె పరిపాలన దక్షత,ధైర్యం.

          సీతను తన సొంత కూతురిలానే ప్రేమించేవారు జనక దంపతులు.సీతకు బాల్యం నుండే అస్త్ర శస్త్ర విద్యలను నేర్పించింది సునయిన. బాల్యంలో సునయిన స్లమ్ ప్రాంతాల్లో నివసించే వారి గురించి సీతతో చెప్తూ వారి జీవనంలో మార్పులు తీసుకురావాలని చెప్పేది. ఓ సారి కుతూహలం కొద్ది రాజ్యం నుండి తప్పించుకుని ఆ ప్రాంతాలకు వెళ్తుంది సీత. అదే సమయంలో కొందరు తుంటరి అబ్బాయిలు ఆమెను వెంబడిస్తారు.ఆ సమయంలో ఆమెను సమిచి అనే అమ్మాయి కాపాడుతుంది. ఈ సంఘటనతో సమిచి రాజ్యంలో ముఖ్య వ్యక్తి అవుతుంది.

          జనక మహారాజు గురువు అష్టావక్రుడు. మిథిలా రాజ్యం సప్త సింధులో రాజకీయ పరంగా బలహీనమైన రాజ్యం.అందుకే ఈ రాజ్యానికి ఓ శాశ్వతమైన రాజగురువు లేరు.కానీ అష్టావక్రా మాత్రం ముఖ్యమైన గురువు. ఈ రాజ్యంలో జ్ఞానవంతులకు సముచిత స్థానం ఉండటం వల్ల ఎందరో రాజగురువులు ఈ రాజ్యానికి వస్తూ ఉండేవారు. వారిలో మలయపుత్ర జాతి నాయకుడైన విశ్వామిత్రుడు కూడా ఒకరు.

          కుశధ్వజుడు ఇక తన స్వతంత్ర ప్రతిపత్తి కోసం తన రాజ్యానికి ఓ రాజ్య ముద్ర తయారు చేయిస్తాడు.అప్పటి వరకు కూడా మిథిలా రాజ్య ముద్రే శంకస్య రాజ్యానికి కూడా వర్తించింది. దానిని సునయిన ఆమోదించదు.అదే సమయంలో సీత కోపంతో ఆ రాజ ముద్రను విరగ్గొడుతుంది. ఓ రాజు రాజముద్రను విరగొట్టడం అంటే ఆ రాజును అవమానించినట్టే. ఈ సంఘటనతో ఈ కుశధ్వజుడు ఈ రాజ్యం పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడు. మిథిలా రాజ్యానికి రావాల్సిన వారు శంకస్య రాజ్యాన్ని దాటల్సిందే. వ్యవసాయం,వ్యాపారం పరంగా ఈ రెండు రాజ్యాలకు పరస్పర సంబంధం ఉంది. ఈ సంఘటనతో శంకస్య రాజు మిథిలాను ఈ అంశాల్లో అవరోధాలు కలిగేలా చేస్తాడు. దీని ప్రభావం మిథిలా ప్రజల మీద ఉండటం వల్ల దీనికి కారణమైన సీతను వారు ద్వేషించేవారు. గమనిస్తే రాముణ్ణి కూడా కరచాప యుద్ధం రోజు జన్మించడం వల్ల రాజ్యం అంతా ద్వేషించింది. అలానే సీత కూడా అలానే ద్వేషించబడింది.

          సీతను గురుకులానికి పంపిస్తారు. ఆ గురుకుల గురువు శ్వేతకేతు.ఈ సీతా పుస్తకంలో మలయపుత్రులు,వాయుపుత్రుల గురించి అమిష్ స్పష్టం చేస్తాడు.మహాదేవుడు,విష్ణువు ఇద్దరు అసురులు మరియు సప్త సింధు రాజులు ఆరాధించే దైవాలు.భూమి మీద చెడు పెరిగిపోతున్నప్పుడు విష్ణువు ఒక్కో రూపంలో వచ్చి భూమిని కాపాడతాడని రెండు జాతుల వారి నమ్మకం కూడా. ఇద్దరు ఆరాధించే దైవాల్లో వ్యత్యాసం ఉన్నప్పటికి కూడా ఆ మంచిని నెలకొల్పడానికి వచ్చే విష్ణువును కాపాడాల్సిన బాధ్యత ఇద్దరికి ఉంది. అంతకు ముందు విష్ణువు పరశురాముడు. ఇకపోతే రుద్రుడు,మోహిని లలో మలయపుత్రులు మోహిని రూపంలో (స్త్రీ రూపం)లో విష్ణువు రాక ఉంటుందని మలయపుత్రులు నమ్మితే,పురుష రూపంలో ఉంటుందని వాయుపుత్రులు నమ్ముతారు.మలయపుత్రుల నాయకుడు విశ్వామిత్రుడు. సీత గురుకులానికి వచ్చాక ఆమె గురువు ద్వారా ఆమె ప్రతిభను,పోరాడే స్ఫూర్తిని గుర్తిస్తాడు.ఆమె విష్ణువు అని నమ్ముతాడు.

          ఇక పోతే వాయుపుత్రులు గురు వశిష్టుడిని నమ్ముతారు. వశిష్టుడు మాత్రం రాముడు లేదా భరతుడు విష్ణువు అని  నమ్ముతాడు. విశ్వామిత్రుడు,వశిష్టుడు ఒకప్పుడు మంచి స్నేహితులైనప్పటికి నేడు ఎందుకు విరోధులుగా మారారో పాఠకులకు ఈ పుస్తకంలో స్పష్టత రాదు. గురుకులంలో సీత స్నేహితురాలు అయిన రాధిక తండ్రి వరుణ్ అసలు పేరు వరుణ్ రత్నాకర్. అతను వాల్మికి జాతికి చెందినవాడు. మోహిని రూపంలో విష్ణువు రాక ఉంటుందని నమ్ముతారు.కానీ విష్ణువు ఎవరైనా సరే వారికి సహకారం అందించడం దేశానికి మంచిది కనుక రామ,భరతులకు ఆశ్రయమివ్వడం తమ జాతి నియమాలకు వ్యతిరేకమైనప్పటికి కూడా వారిని గురుకులంలో ఉండేలా చేస్తాడు.అతని కూతురు రాధిక భరతుణ్ణి ప్రేమించడం వల్ల,సీతకు అప్పటికే రాముడు,భరతుడి గురించి తన స్నేహితురాలి ద్వారా విశేషాలు తెలుస్తూ ఉంటాయి. రాముడి బాల్యంలో గమనిస్తే రాముడికి సీతను గురించి తెలియదు. రాధిక మాటలను బట్టి రాముడు లేదా భరతుడు విష్ణువు అయ్యే అవకాశం ఉందని ఆమె భావిస్తుంది.గురుకులం పూర్తయ్యాక ఆమెకు విశ్వామిత్రుడు ఆమెను తాము విష్ణువుగా భావిస్తున్నామని స్పష్టం చేస్తాడు. గురుకులం పూర్తయ్యాక మలయపుత్రుల రాజధాని అయిన అగస్త్యకుటానికి (కేరళలో ఉన్నట్టు రచయిత చెప్తాడు)కూడా సీతా వెళ్తుంది.అక్కడ లంక రాజైన రావణుడు నీటిపై ప్రయాణించే ప్రతి పడవకు రుసుము చెల్లించేలా చేసినా,మలయపుత్రులకు మాత్రం మినహాయింపు ఉండటం సీతాకు అర్ధం కానీ విషయం అవుతుంది. తనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయని కూడా సీతా అర్ధం చేసుకుంటుంది.

          వరుణ్ రత్నాకర్ సోదరుడు అయిన వాయు కేసరి తమ జాతికి చెందని స్త్రీ అయిన వానర జాతి స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల అతనికి హనుమాన్ జన్మిస్తాడు. ఆ హనుమాన్ అప్పుడప్పుడు గురుకులం లో ఉన్న వశిష్టుడిని కలుస్తూ రామ లక్ష్మణుల గురించి వివరాలు తెలుసుకుంటాడు. వాయుపుత్రుడు కనుక అతనికి విష్ణువు రాముడే అని నమ్మకం ఉంటుంది. హనుమాన్ రాధిక అన్నగా అప్పుడప్పుడు ఆమెను చూడటానికి గురుకులం వస్తూ ఉన్నప్పుడూ సీతను రాధిక అతనికి పరిచయం చేయడం,యుద్ధంలోని ఎన్నో మెళుకువలు ఆమెకు హనుమాన్ నేర్పించడం జరుగుతుంది. మనకు ఈ సిరీస్ లో దీని కన్నా ముందు పుస్తకమైన రామ్ లో ఆశ్రమంలో వశిష్టుడుని కలవడానికి ఎవరో నాగ జాతికి చెందిన వ్యక్తి రావడం,ఆ విషయాన్ని లక్ష్మణుడు రాముడితో చెప్పడం మనం గమనిస్తాము. అతను హనుమాన్ అన్న విషయం ఈ పుస్తకంలో స్పష్టమవుతుంది.

          సీత గురుకులం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన స్నేహితురాలు,బాల్యంలో తనను కాపాడిన సమిచిని తన రాజ్యంలో పోలీస్ ఫోర్సుకు నాయకురాలిగా నియమిస్తుంది. సీత గురుకులంలో ఉండగానే ఆమె తల్లి సునాయిన అనారోగ్యం బారిన పడి చివరకు సీత  చేతుల్లోనే కన్ను మూస్తుంది. సీతను విష్ణువు అని భావించిన విశ్వామిత్రుని మలయపుత్ర సైన్యం సీతా సైన్యంలో కలిసిపోయి ఎప్పుడు సీతను రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ మలయపుత్ర సైన్యంలో ఒకరు జటాయువు. తనను పుట్టినప్పుడు ఓ ర్డు కాపాడటం గుర్తున్న సీతకు జటాయువు ముక్కు కూడా రాబందులా ఉండటం వల్ల అతని మీద ప్రత్యేక అభిమానం పెంచుకుంటుంది.

          మిథిలా రాజ్యం సప్త సింధు రాజ్యాల్లో బలహీనమైన రాజ్యం. అయోధ్య లాంటి గొప్ప రాజ్యంతో పోటీ పడగల శక్తి లేని రాజ్యం అది.ఇక మిథిలలో సీతను తాము విష్ణువు అని ప్రకటిస్తే అయోధ్య నుండి రాముడు పోటీ అయితే వారిని ఎదుర్కోవడం కష్టమవుతుందని రాముణ్ణి,స్వయంవరం ద్వారా ఆమెకు భర్తను చేసి ఆ ఘర్షణ నుండి బయటపడాలి అనే విశ్వామిత్రుడు రాముణ్ణి  తనతో తీసుకువెళ్తాడు తప్ప,రాముడు తమ జాతిని కాపాడగలడు అని కాదు. విశ్వామిత్రుడికి రాముడి శక్తి సామర్ధ్యాల మీద నమ్మకం ఉంది. సీత మాత్రం ఒక్క విష్ణువే ఉండాలని లేదు కనుక,తను రాముడు ఇద్దరు విష్ణువులుగా ఉంది భార్యా భర్తలుగా మారితే ఇక మంచి పాలన అందుతుందని భావిస్తుంది. కానీ తన ఆలోచనలను బయటపెట్టదు. విశ్వామిత్రుడు,రావణుడు ఒకే ప్రాంతానికి చెందిన వారని,వారి మధ్య ఏదో సంబంధం ఉందని తనను,రాముడిని ఓ పావుగా వాడే ప్రయత్నం కూడా కావచ్చని భావిస్తుంది. విశ్వామిత్రుడి ద్వారా రాముడు సీతాస్వయంవరంలో విజయం సాధించి ఆమెను భార్యగా పొందుతాడు. కానీ పరాజయం పాలైన రావణుడు మిథిలపై తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధం ప్రకటిస్తాడు.

          ఇక్కడ స్వయంవరంలో రావణుడు పాల్గొనడు. రావణుడు స్వయంవరానికి వచ్చినప్పుడు అతన్ని విశ్వామిత్రుడు రాముడి తర్వాత పోటీలో పాల్గొనమన్నప్పుడు అతను దానిని అవమానంగా భావించి,అక్కడి నుండి వెళ్ళిపోతాడు.అలా రావణుడు యుద్ధం ప్రకటించిన సమయంలో మిథిలా రాజ్యం దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడూ విశ్వామిత్రుడు దైవీ అస్త్రాన్ని ప్రయోగించి ఆ రాజ్యాన్ని కాపాడమని రాముడికి ఇస్తాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాజ్యాన్ని కాపాడటానికి రాముడు దాన్ని ప్రయోగిస్తాడు. సీత వచ్చేసరికి ఆ అస్త్రం ప్రయోగించబడటం మరియు రావణుని సైన్యానికి స్పృహ తప్పడం జరుగుతుంది. జరిగింది తెలుసుకున్న సీతకు ఆ అస్త్రాన్ని విశ్వామిత్రుడు లేదా అతని మలయపుత్రుల్లో ఎవరైనా ప్రయోగించవచ్చు కానీ రాముడి చేత ప్రయోగింపచేయడం వెనుక ఓ కారణం ఉందని అర్ధమవుతుంది. కానీ దీని వల్ల రావణుడిని భవిష్యత్తులో సీతా సంహరిస్తే అప్పుడు ఆమె విష్ణు రూపం అని అందరికి స్పష్టం అవుతుందని విశ్వామిత్రుడు అలా భావించి చేసినప్పటికీ కూడా రావణడి మీద విజయంతో రాముని పేరు మారుమ్రోగిపోయింది జనుల్లో.

          దైవీ అస్త్రాన్ని వాయుపుత్రుల అనుమతి లేకుండా వాడినందుకు 14 ఏళ్ల వనవాసం. రాముడంటే వాయుపుత్రులకు అభిమానమే కనుక అతన్ని ఆ శిక్ష అనుభవించమని చెప్పారనే అందరూ భావించినా,రాముడు మాత్రం చట్ట వ్యతిరేకంగా తాను ప్రవర్తించలేనని వనవాసానికి భార్యతో వెళ్తాడు. ఆ అరణ్యవాసంలో 13 ఏళ్ళు గడచిపోయి ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడూ శూర్పణక,విభీషణుడు రావడం,వారికి రాముడు ఆశ్రయమిచ్చినప్పుడు సీతకు-శూర్పణకకు జరిగిన గొడవలో సీతను కాపాడటానికి లక్ష్మణుడు ఆమెను గాయపరచటం జరుగుతుంది. వారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి రావణుడు కనుక్కోకుండా మారుతూ వెళ్ళినా సరే రావణుడు రాముడు,లక్ష్మణుడు వేటకు వెళ్ళిన సమయంలో మలయపుత్రుల మీద దాడి చేసి సీతను అపహరిస్తారు. పుష్పక విమానంలో ఉన్న సీతకు మత్తు మందు ఇస్తారు.ఆమెకు స్పృహ వచ్చాక అక్కడ సమిచి ఉండటం చూసి ఆశ్చర్యపోవడంతో సీత నవల ముగుస్తుంది.

          ఇక ఈ సిరీస్ లో దీనికి కొనసాగింపుగా రావణ్ వచ్చింది. రామాయణంలో ముఖ్య పాత్రలైన రామ,సీత,రావణుల గురించి వారి నేపథ్యాలు,చర్యల గురించి స్పష్టత ఇచ్చాక వారి మీద అభిప్రాయాలను పాఠకులకు వదిలేసే స్వేచ్చ ఈ రచనా శైలిలో ఉంది. సీతను ముఖ్యంగా మిథిలా రాజ్య ప్రధానమంత్రిగా,పేదల కోసం పాటుపడే యోధురాలిగా అమిష్ చిత్రీకరించారు.అలాగే దేశం బావుండాలని కోరుకుని దాని కోసం రాముడిని ఎన్నుకోవడం ద్వారా ఆమె సమిష్టిగా అభివృద్ధిలో భాగం కావాలనుకున్న విషయం పాఠకులకు స్పష్టం అవుతుంది.

   *   *  * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!