అజ్ఞాత వ్యూహం

 చదువరి

          అజ్ఞాత వ్యూహం

              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          కాన్స్పిరసీ థియరీల కేంద్రంగా అద్భుతమైన నవలలు రాసిన రచయిత డాన్ బ్రౌన్. ఆయన రాసిన డేవిన్సీ కోడ్ ,ఏంజెల్స్ అండ్ డెమన్స్ ,ఇన్ఫెర్నో,ఆరిజిన్ ,లాస్ట్ సింబల్ వంటివి క్రైస్తవ కాన్సిపిరసి లేదా మత పరమైన కాన్స్పిరసీ థియరిలా కేంద్రంగా ఉంటే డిసెప్షన్ పాయింట్ నవల మాత్రం పోలిటికల్ సస్పెన్స్ మరియు స్పేస్ కాన్స్పిరసీ కేంద్రంగా వచ్చిన నవల. ఈ నవలకు మిగిలిన నవలలకు వచ్చిన ప్రాధాన్యత దక్కకపోయినా డాన్ బ్రౌన్ అన్ని నవలల్లో ఉండే అంకిత భావం, రీసెర్చ్,ప్రతి నాయకుడిని చిత్రీకరించే విధానం అన్ని మిగిలిన నవలలను పోలి ఉంటాయి. డాన్ బ్రౌన్ రచనా శైలిలోని వైవిధ్యం,గొప్పతనం అంతా అతని నవలల్లోని ప్రతి నాయకుని  చిత్రీకరణలో ఉంటాయనడం అతిశయోక్తి కాదు.అందుకే ఓ ఇంటర్ వ్యూ లో మీ నవలలో ముందు మీరు ప్రతి నాయకుడిని నిర్మిస్తే అతనే మీ నాయకుడిని చిత్రీకరిస్తాడు అని ఆయన అన్నారు.

          ఇక కథలోకి వెళ్తే ఇది పైన ఓ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో గెలవడం కోసం ఓ సెనేటర్ చేసే ప్రయత్నాన్ని తిప్పి కొట్టడానికి ప్రెసిడెంట్ కు తెలియకుండానే ప్రెసిడెంట్ ను కాపాడే ప్రయత్నంలో జరిగిన కుట్రే ఈ నవల. సెనేటర్ సెడ్విక్ సెక్స్ టన్ తాను ప్రెసిడెంట్ అవ్వడానికి వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. అతని కూతురు రేచెల్ సెక్స్ టన్. ఆమెకు,తండ్రికి మధ్య ఘర్షణ ఉంటుంది.ఆ ఇద్దరి మధ్య ఉన్న విభేధాలు కూడా స్పష్టమే అందరికి. అమెరికన్ ప్రెసిడెంట్ జాక్రి హెర్ని. సెడ్విక్ కు గాబ్రియల్ అనే ప్రైవేట్ అసిస్టెంట్ ఉంటుంది. సెనేటర్ గా ఉన్న సెడ్విక్ కు ప్రెసిడెంట్ నేతృత్వంలో నాసా వైఫల్యాల వల్ల పెరిగిపోతున్న బడ్జెట్ మరియు దాని ప్రభావం టాక్స్ పేయర్స్ మీద ఉండటం గురించి రహస్య సమాచారం సేకరించిన గ్యాబ్రియల్ దానిని సెడ్విక్ కు ఇవ్వడంతో దానినే అస్త్రంగా వాడి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటాడు. నాసా వైఫల్యాలు నిజమే కనుక ఇక ప్రెసిడెంట్ కు ఈ విషయం మీద మాట్లాడే ఆస్కారం ఉండదు. తాను కనుక ప్రెసిడెంట్ అయితే నాసా లాంటి వాటికి పెట్టే ఖర్చును అమెరికన్ పౌరుల పిల్లలకు నాణ్యమైన విద్యను ఇవ్వడానికి వెచ్చిస్తానని బహిరంగంగా ప్రకటిస్తాడు సెడ్విక్. ఇక అందరూ సెడ్విక్ ఈ సారి గెలవడం ఖాయం అనుకుంటారు.

          ఇక సెడ్విక్ కూతురు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నేషనల్ రికనోజెన్స్ ఆఫీసులో(ఎన్ ఆర్ ఓ )  పని చేస్తూ ఉంటుంది. అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ డిజైనింగ్,బిల్డింగ్ ,లాంచింగ్ ,మెయింటెనింగ్ వంటివి దీని బాధ్యతలు. ఇక నాసా పూర్తిగా స్పేస్ సంస్థ.ఎన్ ఆర్ ఓ కు డైరెక్టర్ విలియం పెకరింగ్. ఇతనికి నేషనల్ సెక్యూరిటీ అన్నది అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం.నాసా మీద పెట్టె ఖర్చు భారం అనే ఇతని భావన కూడా. ఇతను కూడా నాసా అంటే వ్యతిరేకత కలిగి ఉంటాడు.

          రేచెల్ ను ప్రెసిడెంట్ ప్రత్యక్షంగా కలవాలని వర్తమానం పంపిస్తాడు. అలా రేచెల్ ప్రెసిడెంట్ ను కలుసుకోవడానికి వెళ్తాడు.ఆమె వెళ్ళే ముందు విలియం పెకరింగ్ ఆమెను తన రాజకీయ పావుగా వాడుకోవడానికే ప్రెసిడెంట్ ఆమెను పిలిచి ఉండవచ్చని, ఏ సమస్య వచ్చినా తనకు చెప్పమని తన ఉద్యోగులను కాపాడుకోవడం తన బాధ్యత అని చెప్తాడు. రేచెల్ ను కలిసిన ప్రెసిడెంట్ నాసా ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసిందని దానిని రేచెల్ కూడా చూసి తన అభిప్రాయం చెప్పాలని అడుగుతాడు.ఆమె తన అభిప్రాయం చెప్పే అవకాశం కూడా లేకుండా ఆమె సెల్ ఫోన్ తీసుకుని,ఆమెను ఆర్క్ టిక్ లోని మిల్న్ ఐస్ షెల్ఫ్  దగ్గరికి పంపిస్తాడు.

          అక్కడ నాసా అడ్మినిస్ట్రేటర్ ను కలుస్తుంది రేచెల్. ప్రెసిడెంట్ ఈ ఎన్నికల సమయంలో చేసిన స్టంట్ గా ఈ నాసా ఆవిష్కరణను ప్రజలు భావించకూడదన్న ఉద్దేశ్యంతో ఆ ఆవిష్కరణను గమనించి,దానిని నిర్ధారించడానికి సమాజంలోని వివిధ రంగాల్లో ఉన్న వారిని ఆహ్వానిస్తారు. వారు నలుగురు. అందులో మైఖేల్ టోలాండ్ అనే ఓషనోగ్రాఫర్ మరియు టెలివిజన్ సెలబ్రిటీ,నోరాహ్ మాంగర్ అనే గ్లేసియాలజిస్ట్,వాలి మింగ్ అనే పెలియాంటాలజిస్ట్,కార్కి అనే ఆస్ట్రో ఫిజిస్ట్ ఉంటారు. వీరందరూ ద్వారా రేచెల్ కు నాసా ఓ మీటొరైట్ ను కనుగొన్నదని,అది దాదాపు కొన్ని మిలియన్ సంవత్సరాల వయస్సు కలదని,దానికి ఓ వైపు ఓ ఫాజిల్ (ఓ కీటకం)కూడా ఉందని,తమ టెస్టుల ద్వారా అది భూమి మీద లభించేది కాదని,అది ఎక్స్ట్రా ట్రెయిస్ట్రియల్ స్పేస్ ది అని స్పష్టం చేస్తారు. రేచెల్ కూడా నికిల్ ఖనిజం,మరియు కాండ్రిల్స్ వంటి ప్రమాణ ఆధారాలుగా నిర్ధారించిన ఈ మీటరైట్ నాసా అద్భుత ఆవిష్కరణ అని నమ్ముతుంది.

          ఆమెకు ఆ స్పష్టత వచ్చాక ప్రెసిడెంట్ ఆమెకు కాల్ చేస్తాడు.ఆమె తాను చూసినది తన స్టాఫ్ కు వీడియో కాల్ లో చెప్పాలని,తన మీద నమ్మకం కోల్పోయిన తన స్టాఫ్ ఆ విషయాన్ని ఆమె నోటి వెంట వింటే నమ్ముతారని చెప్తాడు.రేచెల్ అలానే చేస్తుంది. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు నాసా చేసిన ఈ అద్భుత ఆవిష్కరణ గురించి మీడియా ద్వారా చెప్పాలనే నిర్ణయం జరుగుతుంది.

          ఇక అదే సమయంలో ప్రెసిడెంట్ అడ్వైజర్ మేజరి టెంచ్ గేబ్రియల్ ను అజ్ఞాతంగా ఆహ్వానిస్తుంది. అప్పటి వరకు తాను నాసా గురించి సమాచారం ఇచ్చిన వారు వైట్ హౌస్ లోని వారే అని తెలిసినా అది టెంచ్ అని ఊహించదు గేబ్రియల్. టెంచ్ సెక్స్ టన్ నాసాను ప్రైవేట్ పరం చేయడానికి చూస్తాడని,అతనికి ప్రస్తుతం ఫండింగ్ చేస్తుంది ప్రైవేట్ స్పేస్ కంపెనీలు అని, దానికి తన దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారాలు ఉన్నాయని చూపిస్తుంది. వాటితో పాటు గేబ్రియల్,సెడ్విక్ రహస్య శారీరక సంబంధాన్ని బట్టబయలు చేసే ఫోటోలు కూడా ఉన్నాయని చూపిస్తుంది. సెడ్విక్ ఎలాగూ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు కనుక అతను జెయిలుకు వెళ్ళడం ఖాయం అని టెంచ్ చెప్తుంది.దీని నుండి తప్పించుకోవాలంటే తనకు,సెడ్విక్ మధ్య సంబంధం ఉందని గేబ్రియల్ చెప్పాలని ఎనిమిదింటి లోపు చెప్పాలని లేకపోతే దానిని తర్వాతి రోజు మీడియాకు ఇస్తానని హెచ్చరిస్తుంది. ఏం చేయాలో తెలియని సందిగ్దతలో ఉన్న గేబ్రియల్ సెడ్విక్ ను కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది.అతను తరచుగా ప్రైవేట్ మీటింగులు ఇంట్లో పెట్టుకుంటున్నాడని, ఆ సమయంలో ఎవరిని రానివ్వడని ఆమెకు తెలిసినా ఈ పరిస్థితుల్లో అతనికి ముఖ్యంగా చెప్పాలనుకుని సెక్యూరిటీ గార్డుకు చెప్పి లోపలికి వెళ్తుంది గేబ్రియల్.

          ఇక రేచెల్ మరియు అక్కడ టీం కు ఆ మిటోరైట్ మీద అనుమానం వస్తుంది.అజ్ఞాతంగా కొందరు ఆ విషయం గురించి మళ్ళీ కనుక్కోవడానికి వెళ్లినప్పుడు నోరాహ్ ను వాలి మింగ్ ను  చంపేస్తారు.మైఖేల్ ,కార్కి ,రేచెల్ తప్పించుకుంటారు. ఆ తప్పించుకునే క్రమంలో వారు అక్కడికి దగ్గరిలోని సబ్ మేరైన్ కు చేరుకుంటారు. ఆపాటికే ఆ మిటోరైట్ సముద్రంలోనిదే తప్ప స్పేస్ ది కాదని రేచెల్ కు మిగిలిన వారికి అర్ధమవుతుంది. ఆ విషయం ప్రెసిడెంట్ కు చెప్పే ప్రయత్నం చేస్తుంది రేచెల్.కానీ టెంచ్ తో చెప్పినా ఆమె నమ్మదు.ప్రెసిడెంట్ ఈ నాసా ఆవిష్కరణ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు.అది విజయవంతం అవుతుంది.దానిలోనే మైఖేల్ దీని మీద చేసిన డాక్యుమెంటరీ కూడా ఉంటుంది.  

           టెంచ్ విలియం పెకరింగ్ కు ఫోన్ చేస్తుంది. ఆ మిటోరైట్ ఫేక్ అని నిరూపించే సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది.జాగ్రత్తగా ఉండమని తాను ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తానని చెప్తాడు. టెంచ్ పెకరింగ్ కు ఫోన్ చేసి తాను అతన్ని రేచెల్ చెప్పిన విషయాలన్నీ దేశ ద్రోహం క్రిందకే వస్తాయని,ఈ విషయం గురించి స్పష్టత కోసం కలవాలని అడుగుతుంది.అలా కలవడానికి వెళ్ళిన ఆమె కార్ ప్రమాదంలో మరణిస్తుంది. ఇక రేచెల్ మైఖేల్ కొలీగ్ అయిన జేవియాను అతని షిప్ లో కలవడానికి వెళ్తారు.అప్పుడు ఆమె మైఖేల్ చేసిన డాక్యుమెంటరిలో ఓ తప్పు ఉందని చెప్తుంది. ఆ మిటోరైట్ కు ఉన్న ఇంకో ప్రమాణం ప్రకారం అది సముద్రపు రాక్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. ఇక దాని మీద ఉన్న ఫాజిల్ సముద్రంలో తాజాగా కనుగొనబడిందని మైఖేల్ కనుక్కుంటాడు. ఇక తమను చంపడానికి వస్తున్నారని తెలుసుకున్న  రేచెల్ ఆ ఆధారాలను విలియం పెకరింగ్ కు పంపాలని నిర్ణయించుకుంటుంది. కానీ అతన్ని కూడా చంపే ఆస్కారం ఉంది కనుక దానిని తన తండ్రికి  ఫ్యాక్స్ చేస్తుంది.తాను ప్రమాదంలో ఉన్నానని కాపాడమని కూడా పేర్కొంటుంది.

          ఇక తమ వెంట పడుతుంది విలియం పెకరింగ్ అని తెలిసి షాక్ అవుతుంది రేచెల్. నాసా ప్రైవేట్ పరం అయితే ఇక దానికి స్వేచ్చ ఉండదని, స్వార్ధ వ్యాపార వ్యవస్థగా మారిపోతుందని అందుకనే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తాడు. అలా ఆ ఘర్షణలో విల్యం పెకరింగ్,అతని కింద ఉన్న ముగ్గురు అధికారులు మరణిస్తారు.

          గేబ్రియల్ సెనేటర్ మీటింగ్ జరుగుతున్న చోటుకు వచ్చాక టెంచ్ చెప్పిన విషయాలు నిజమేనని నమ్ముతుంది. ఇక అక్కడి నుండి ఏబిసి మీడియా స్టూడియోకి వెళ్తుంది. ఆమె ఫ్రెండ్ తొందర పడి ఆ ఫోటోలు బయట పెట్టవద్దని చెప్తుంది. ఆ సమయంలోనే అది నాసా గురించి కావడంతో ఇక తన ఫోటోలు బయట పడవని అర్ధమవుతుంది గేబ్రియల్ కు.కానీ తనను సెనేటర్ మోసం చేశాడని,తనకు చెప్పకుండా ఎన్నో చేస్తున్నాడని అర్ధం చేసుకుంటుంది.అదే సమయంలో గేబ్రియల్ అక్కడికి వచ్చిన విషయం సెక్యూరిటీ గార్డ్ చెప్పడంతో జరిగింది అర్ధం చేసుకున్నా సెడ్విక్ ఆమెకు ఫోన్ చేసి తాను స్పేస్ కంపెనీలను కలవడాన్ని సమర్ధించుకుని మళ్ళీ ఆమె నమ్మకాన్ని పొందుతాడు.తనకు ఆ మిటోరైట్ ను కనుగొనే పాడ్స్ సాఫ్ట్వేర్ విఫలం అయ్యిందని కొన్ని వారాల క్రితమే చెప్పి,ఆ తర్వాత అది బాగయ్యిందని చెప్పడం  అనుమానం కలిగిస్తుందని ఆ అధికారిని కలుసుకుని నిజాలు సేకరించమని చెప్తాడు.అలానే చేస్తుంది గేబ్రియల్. ఆ అధికారిని భయపెట్టి నిజాలు తెలుసుకుంటుంది.పాడ్స్ పని చేయని మాట నిజం అని, ఆ మిటోరైట్ ను ఓ  కెనడియన్ జియాలజిస్ట్ కనుగొన్నాడని, అతను ఆ తర్వాత మరణించాడని, అప్పుడు పాడ్స్ అక్కడికి తీసుకువెళ్లి అమర్చి ఆ ఆవిష్కరణ నాసా చేసినట్టే నమ్మించామని చెప్తాడు. ఆ కనుక్కున్న నిజాలు చెప్పడానికి సెడ్విక్ కు కాల్ చేస్తుంది.అదే సమయంలో బిజీ రావడంతో  సెక్యూరిటీ గార్డ్ ఫోన్ అటెండ్ చేస్తాడు.అంతకు ముందు ప్రైవేట్ మీటింగ్  కు ఆమెను పంపినందుకు సెనేటర్ సంతోషించాడని చెప్పడంతో జరిగింది ఆమెకు అర్ధమవుతుంది. సెనేటర్ రహస్యాలు తెలుసుకోవడానికి అతని ఆఫీసులోకి రహస్యంగా చొరబడుతుంది.అనుమానించిన సెనేటర్ వచ్చినా ఆ సమయానికి తన ఆఫీసులో ఉండి తనను తాను కాపాడుకుంటుంది.అప్పటి వరకు గేబ్రియల్ తో అవసరం ఉండటం వల్ల అలా ఉన్న సెనేటర్ తన కూతురు పంపిన సాక్ష్యాలు చూడటంతో ఇక తనకు గాబ్రియేల్ సహాయం అవసరం లేదని గమనిస్తాడు. ఈ లోపు ఆ ఫాక్స్ గురించి తెలుసుకున్న పెకరింగ్ తాను చనిపోక ముందు అతనికి వాయిస్ మెసేజ్ పెడతాడు.ఆ సాక్ష్యాలు బయటపెడితే అతని కూతురి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని. అయినా లెక్క చేయకుండా వాటిని తరువాతి రోజు ప్రెస్ కు ఇవ్వడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు సెడ్విక్. తన కూతురి గురించి పట్టించుకోడు.

          ఆ సమయంలో ఆపదలో ఉన్న రేచెల్ ను ప్రెసిడెంట్ రక్షిస్తాడు. నాసా,ప్రెసిడెంట్ తప్పు అందులో లేదని తెలుసుకుంటుంది రేచెల్.తండ్రిని ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేయమని చెప్పిన వినకపోవడంతో చివరి నిమిషంలో అతను ఇవ్వాలనుకున్న సాక్ష్యాల బదులుగా తనకు,అతనికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేసే ఫోటోలను ఉంచుతుంది గేబ్రియల్.అలా సెడ్విక్ కెరియర్ అంతమవుతుంది. ప్రెసిడెంట్ జరిగిన తప్పును ప్రెస్ ద్వారా తెలియజేస్తాడు,మైఖేల్,రేచెల్ ఒకటవుతారు.

          పదవి కోసం దేనిని లెక్కచేయని సెడ్విక్, పాలన అంటే నిజాయితీ,ప్రజల నమ్మకం ఆధారంగా ఉండాలని నమ్మి దాని కోసం నిలబడి తాను ఓడిపోయే దశలో ఉన్నా తన ప్రత్యర్ధికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా అతని వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యం చేయకూడదని దాని వల్ల ప్రజల్లో పాలకుల పట్ల నమ్మకం పోతుందని భావించే ప్రెసిడెంట్ కు మధ్య ఇది జరిగే ప్రత్యక్ష యుద్ధం అయినా దీనిలో ముఖ్య అంశంగా నాసా ఆవిష్కరణను,దాని చుట్టూ ఉన్న కుట్రలను రచయిత నిర్మించిన విధానం,చివరి వరకు ఎవరు ప్రతి నాయకుడో తెలియజేయకుండా,చివరి వరకు కథను నడిపించిన శైలి,ఎంతో పరిశోధనతో రాసిన అంశాలు ఈ నవలకు ప్రాణం పోశాయి. డాన్ బ్రౌన్ అభిమానులు కచ్చితంగా చదవాల్సిన నవల ఇది.

               *    *    * 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!