(అ)వివాహిత కథ
(అ)వివాహిత కథ
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
స్త్రీ జీవితంలో వివాహం ఓ సామాజిక భద్రత అంశంగా పరిగణించబడే సంస్కృతి పూర్వం నుండే బలపడి ఉంది. స్త్రీకి వివాహం మానసిక స్థైర్యాన్ని ఏర్పరిచే అనుబంధంగా ముడిపడే ఆస్కారం కూడా తక్కువ. వైవాహిక జీవిత ఆనవాళ్ళు ఓ స్త్రీని కుదిపేసి ఆమెను మానసికంగా బలపరిచి, స్త్రీగా ఆమెలో ఓ రకమైన నిరాసక్తతను ఎలా ఎలా నింపిందో,ఆమెలోని మానసిక ధృఢత్వాన్ని బలపరిచి, వివాహ వ్యవస్థపై ఎటువంటి కాంప్లెకులు కలిగేలా చేసిందో,దానికి ఆమె చుట్టూ ఉన్న సమాజంలోని మగవాళ్ళు ఎలా తోడ్పడ్డారో స్పష్టం చేసే నవలే అర్నాద్ గారి ‘సత్య.’
సత్య ఓ మామూలు చదువు చదివిన అమ్మాయి. తల్లి మరణించాక తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నా,మారుటి తల్లి ఆమెను సరిగా చూడకపోయినా తండ్రి ప్రేమలోనే తల్లిదండ్రుల ప్రేమను దర్శించిన అమ్మాయి.ఆమెకు ఓ ఫ్యాక్టరీలో ఫిట్టర్ గా పని చేసే కృష్ణారావుతో వివాహమవుతుంది.పెళ్ళి సమయంలో కృష్ణారావు నవ్వును చూసి సత్య ఇష్టపడుతుంది. కానీ పెళ్ళయ్యాక అతనిలో శాడిజంను చూసి నవ్వడమే మానేస్తుంది. సత్య మీద అనుమానంతో ఆమెను ఇంట్లో ఉంచి బయట తాళం వేసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చినా ఆమె భరిస్తుంది. సత్య మీద అనుమానం ఉండటం ఒక్కటే కాదు,సత్యను పుట్టింటికి కూడా ఆ అనుమానం వల్లే పంపించకపోవడం, ఆమె పుట్టింటి వారిని కూడా రాకుండా చేస్తాడు కృష్ణారావు.
సత్య పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఆమె తండ్రి,పిన తల్లి సత్యను కృష్ణారావు బంధించిన పరిస్థితి స్వయంగా చూసిన సత్య తండ్రి అక్కడే గుండె పోటుతో మరణిస్తాడు. సత్య వల్లే తన భర్త మరణించాడని సూరమ్మ సత్యను దూషిస్తుంది. ఆ తర్వాత సత్య ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల ఆమె నిర్ణయం మారుతుంది. అదే సమయంలో ఆమె ఇంటికి పొరుగులో రామాయమ్మ వస్తుంది. ఆమె ఇద్దరు కొడుకులు వేరే రాష్ట్రాల్లో ఉంటారు. వారి దగ్గరకు వెళ్ళకుండా తన స్వప్రదేశంలోనే ఉండిపోతుంది ఆమె.రామాయమ్మ కడుపుతో ఉన్న సత్యకు తల్లిలా తోడుగా ఉంటుంది. సత్య గర్భవతి అయ్యాక ఇంటికి తాళం పెట్టడం మానేస్తాడు కృష్ణారావు. ఆ తర్వాత సత్య శిరీషకు జన్మనిస్తుంది.
రామాయమ్మ సాయంతో తనకు,పాపకు కావలసినవి తెప్పించుకుంటుంది సత్య. రామాయమ్మ మాటను పాటిస్తాడు కృష్ణారావు. కృష్ణారావుకు మందు అలవాటు ఉంది. ఫ్యాక్టరీకి కూడా రోజు సారాయి సీసాతోనే వెళ్తాడు.అక్కడి భద్రతా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వల్ల అతని ఆటలు సాగుతూ ఉంటాయి. ఓ రోజు అలానే వెళ్ళిన కృష్ణారావు తాగి బాయిలర్ లో ఫిట్టింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణిస్తాడు.
భర్త మరణించిన సత్యకు అండగా నిలబడుతుంది రామాయమ్మ. కృష్ణారావు మరణానికి యాజమాన్యమే కారణమని కార్మికులు గొడవ చేయడం, ఈ విషయం మీద ఎంక్వైరీ చేయడానికి అదే ఫ్యాక్టరీలో నిజాయితీగా ఉండే స్వామిని నియమిస్తారు. రామాయమ్మ మేనల్లుడు స్వామి. కృష్ణరావు మరణించాక అతని ఉద్యోగం తన చిన్న కొడుక్కి వచ్చేలా చేయాలని కృష్ణారావు తండ్రి ఆది నారాయణ భార్యాసమేతుడై వస్తాడు.అదే ఉద్యోగం తన కొడుక్కి వచ్చేలా చేయాలని సూరమ్మ కూడా కొడుకుతో వస్తుంది. కృష్ణారావు బ్రతికున్నప్పుడు ఒక్కసారి కూడా రాని అత్తామామలు, తాను కష్టంలో ఉన్నప్పుడూ రాని తన పిన్ని ఉద్యోగం కోసం రావడంతో వారి మనస్తత్వాలను అర్ధం చేసుకుంటుంది సత్య.
రామాయమ్మ ఈ ఉద్యోగ విషయం గురించి తన మేనల్లుడైన స్వామితో సంప్రదింపులు జరిపి ఆ ఉద్యోగం సత్యకే వచ్చేలా చేస్తుంది. ఈ ఉద్యోగ విషయంలోనే స్వామి,అతని భార్య పద్మతో సత్యకు ఓ అనుబంధం ఏర్పడుతుంది. సత్యాకు ఉద్యోగం వచ్చాక శిరీషను చూసుకోవడం కష్టమని రామాయమ్మ,పద్మాలు చూసుకునేవారు.
సత్య భర్త మరణించిన స్త్రీ .ఆమె వస్త్రధారణలో ,ఆమె ప్రవర్తనలో అదే భర్తావియోగ శోకం కనబడాలని,తాము ఓదార్పును ఇచ్చే నెపంతో తమకు అనుకూలంగా అవకాశం మలచుకోవాలనుకునే మగ తోడేళ్ళ సామ్రాజ్యం లాంటి ఫ్యాక్టరీలోకి సత్య అడుగుపెడుతుంది. ఆ ఫ్యాక్టరీ మొత్తంలో వేల మంది ఉద్యోగుల్లో ఇరవై మందే మహిళలు. లైంగిక వేధింపులు సహజం అని సత్య అర్ధం చేసుకుంటుంది. పద్మ,స్వామి ఇచ్చిన మానసిక ఆలంబనతో ఆమె వారిని ఎదుర్కోవడం కూడా నేర్చుకుంటుంది సత్య.
ఈ ప్రక్రియలో స్వామి,పద్మలను తన కుటుంబ సభ్యులుగానే భావిస్తుంది సత్య. స్వామితో కలిసి అతని స్కూటర్ మీద ఫ్యాక్టరీకి వెళ్ళి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. స్వామి కూడా ఆమె ఇంటికి స్నేహితునిగా వచ్చి వెళ్తూ ఉండటం,పద్మ కూడా ఈ కల్మషం లేని స్నేహాన్ని ఆమోదించడం జరుగుతుంది. తర్వాత సత్యకు ఫ్యాక్టరీ క్వార్టర్స్ కు బదిలీ అవుతుంది.అక్కడికి తన నివాసం మార్చుకుంటుంది సత్య.
సత్య నివాసం మారాక ఆమెను ముల్లా సోదరుల పేరుతో అజ్ఞాతంగా ఉత్తరాలు రాసి వేధిస్తూ ఉంటారు.సత్య వివాహితుడైన స్వామితో సన్నిహితంగా ఉండటం ఆమెకు మంచిది కాదని,ఆమె వేరే వివాహం చేసుకోవడం పరిష్కారం అని సూచిస్తారు ఆ ఉత్తరాల్లో.ఓ సారి స్వామి ఆమె ఇంటికి వచ్చినప్పుడు తలుపు బయట గడియ పెట్టి కాలనీ అంతా ఏకం చేసి తమ కక్ష తీర్చుకుంటారు. సత్య ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడుతుంది. తన వ్యక్తిగత విషయాల్లో ఎవరికి జోక్యం చేసుకునే అర్హత లేదని స్పష్టం చేస్తుంది. సత్య జీవితం తన వల్ల ఇలా కాకూడదని ఆలోచించిన స్వామి ఆమె ఇంటికి వెళ్ళడం మానేస్తాడు.
సత్య పని చేసే ఫ్యాక్టరీలోనే పని చేస్తున్న ఒకతను ఆమెను వివాహం చేసుకుంటాననే ప్రతిపాదన తీసుకువచ్చినా ఆమె దానిని తిరస్కరిస్తుంది. తనకు మరో వివాహం చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేస్తుంది. స్వామి రావడం మానేసినా సత్య మాత్రం పద్మ దగ్గరకు వెళ్ళి వస్తూనే ఉంటుంది. పద్మ వల్ల సత్యాకు పుస్తకపఠనం అలవాటు అవుతుంది. స్వామికి మందు క్రమేపీ బలహీనతగా మారుతుంది. పద్మకు అబద్ధాలు చెప్పి స్నేహితులతో కలిసి మందులో మునుగుతూ ఉంటాడు. సత్య పరాయి వారి మాటలని పట్టించుకుని ఇంటికి రావడం మానెయ్యవద్దని, ఎప్పటి లానే ఉండమని స్వామిని అడిగితే సత్య పుట్టినరోజున వస్తానని సమాధానం ఇస్తాడు.
ఇంట్లో పద్మకు అబద్ధం చెప్పి తన మిత్రుడితో తాగటానికి వెళ్తాడు స్వామి. తర్వాతి రోజు సత్య పుట్టినరోజు కావడం వల్ల అర్ధరాత్రి కేకు తీసుకువెళ్ళి ఆమె పట్ల కోరికను వ్యక్తం చేయమని మిత్రుడు ప్రోత్సహిస్తాడు. అలా తాగిన మత్తులో కేకుతో సత్య ఇంటికి అర్ధరాత్రి వెళ్తాడు స్వామి.ఆమెను బలవంతం చేయబోయినప్పుడు ఆమె తిరస్కరిస్తుంది. ఆ విషయం పద్మకు చెప్పవద్దని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు.ఆ సమయంలో అతన్ని ఓ పిచ్చికుక్క కరుస్తుంది. దానికి వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్తాడు. సత్య దగ్గరకు వెళ్ళిన విషయం పద్మ దగ్గర దాస్తాడు. తర్వాతి రోజు ఉదయం తన పుట్టినరోజున సత్య పద్మ దగ్గరకు వస్తుంది. అదే సమయంలో శిరీష అంతకుముందు రాత్రి స్వామి వచ్చినట్టు చెప్పడంతో పద్మ సత్యను అపార్ధం చేసుకుని చేయి చేసుకుంటుంది.అప్పటి నుండి శిరీషను కూడా తానే చూసుకుంటుంది సత్య.
సత్యకు ఆ కాలనీలో ముల్లా సోదరుల గొడవలు, పద్మతో అపార్ధం ఏర్పడటంతో తాను అక్కడి నుండి వెళ్ళిపోవడమే పరిష్కారమనుకుని అక్కడి నుండి బదిలీ చేయించుకుంటుంది. భర్త ద్వారా నిజం తెలుసుకున్న పద్మ కూడా సత్యను క్షమాపణ అడుగుతుంది.సత్య జరిగిన అంశాలను తన జీవితంలో నేర్చుకున్న పాఠాలుగా భావించడంతో నవల ముగుస్తుంది.
ఈ నవల కథ సాధారణ అంశమే అయినా, అర్నాద్ గారు సమాజం-వ్యక్తి మధ్య జరిగే మానసిక సంఘర్షణను మానసిక స్థాయిలో చక్కగా చిత్రీకరించారు.జీవితం మీద ఎన్నో మధుర ఊహాలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సత్య మనస్తత్వంలో వివాహం వల్ల ఏర్పడిన భయాలు,గాయాలను కృష్ణారావు పాత్ర ప్రవృత్తి ద్వారా స్పష్టం చేశారు. శారీరక,లైంగిక హింస తో పాటు మానసికంగా కూడా హింసించిన కృష్ణారావునే ఆమె మర్చిపోలేకపోతుంది. ఎంత మంచివాడైనా వివాహమయ్యాక కృష్ణారావులానే మారతాడనే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది సత్య. భర్త మరణించాక సమాజంలోని మగవాళ్ళు లైంగికంగా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నాలు చేయడం, ఆమె మంచి బట్టలు ధరించినా,స్వామితో స్నేహంగా ఉన్నా ఆమెను వేధించడం వంటివి ఆమెకు సమాజ స్వరూపంలో ఎందరిలో అజ్ఞాత కృష్ణారావు ఉన్నాడో తెలుసుకునేలా చేసింది.
పట్టణంలో ఎవరు పట్టించుకోకుండా ఉండే వాతావరణంలో తాను జీవించగలనని అక్కడికి ఆమె బదిలీ చేయించుకోవడం,సమాజంలోని పైశాచిక ప్రవృత్తిలో ఎదుటి వ్యక్తి సంతోషం కన్నా తమ ఆలోచనలకు తగ్గట్టే ఎదుటి వారు అపరిచితులైనా జీవించాలనే కర్కశత్వాన్ని కూడా రచయిత చక్కగా చిత్రీకరించారు. తాము చేసేది సరైనదే అని ఆ చేసేవారికి కూడా నమ్మకం లేక అజ్ఞాతంగా ఉండటం సమాజం లోపలి ముసుగును పాఠకులకు పరిచయం చేస్తుంది. సమాజంలో స్త్రీ-పురుష సంబంధాల మీద తమదైన అభిప్రాయాలు ఏర్పరచుకుని తెలిసిన వారందరి మీద తీర్పులు ఇవ్వడం ఓ అలవాటుగా మారిన సమాజ వైనాన్ని కూడా రచయిత సత్య పాత్ర ద్వారా ప్రశ్నించారు.
నవల ముగింపులో స్వామి పాత్ర మనస్తత్వంలో చివరలో మార్పు ద్వారా స్వామి ఆరేళ్ళు ఎంతో హుందాగా ప్రవర్తించి చివరకు సత్య వివాహం తనకోసమే తిరస్కరించిందని అనుకోవడము,ఆమెను నగ్నంగా చూడాలనే కోరికను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా మనిషి అంతర్ముఖాన్ని స్పష్టం చేసే మలుపులే. కొందరు సమాజంలో అజ్ఞాతంగా ఉంటూ వేధిస్తే, ఇంకొందరు బహిరంగంగా అల్లరి పెడితే, ఇంకొందరు మాత్రం సానుకూలంగా అవకాశం వస్తుందని వేచి చూస్తారని ఈ నవల అంతర్లీనంగా సూచిస్తుంది. పాత్ర చిత్రణ అర్నాద్ గారి నవలల్లో పాఠకులకు ఆలోచించడానికి ఆస్కారం ఇస్తుంది.ఆ ఆలోచనే సామాజికంగా నవలకున్న స్థానాన్ని స్పష్టం చేస్తుంది.
* * *

Comments
Post a Comment