చావు రాజకీయం

 చదువరి

చావు రాజకీయం
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



దేశంలో కాశ్మీర్ సమస్య ఎందుకు ఎంతో తెలివైన వారు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిష్కారం కాలేదు అని అడిగిన ప్రశ్నకు దేశంలో ఏ సమస్య అయితే లాభకారిగా ఉంటుందో అది ఎప్పుడు పరిష్కరించకుండానే ఉంటుంది అని అయ్యారే సినిమాలో నాయకుడు జవాబిస్తాడు. వాస్తవానికి మన సమాజంలో ప్రతి ఒక్క సమస్య ఏదో ఒక వర్గానికి లాభాన్ని చేకూరిస్తూనే ఉంటుంది.అలా ఓ గూడెంలో ఓ ఆడపిల్ల సమస్య రాజకీయ లబ్దికి ఓ పావులా ఉపయోగపడిందో స్పష్టం చేసే నవలే కాకాని కమల గారి ‘ నిశాని.’ఈ నవలకు ఆంధ్రభూమి పొట్టి నవలల పోటీల్లో బహుమతి లభించింది.
ఆ గూడెంలోని ఓ కుటుంబ పెద్ద రామయ్య. అతని భార్య మల్లమ్మ. వారి కూతురు పదహారేళ్ళ వరలక్ష్మి. కొడుకు పదేళ్ళ చంద్రం. ఇంకో పిల్లవాడు ఏడాది వయసున్న వాడు. రామయ్య ఓ బిజీ సినిమా సెంటరు దగ్గర బజ్జీ బండి నడుపుకుంటూ ఉండేవాడు.అతనికి అక్కడ పోటీగా ఇంకే బండి రాకుండా అటు ఆ సినిమా హాలు యజమాన్యానికి,ఇటు పోలీసులకు లంచాలు ఇచ్చి తన బజ్జీ బండికి గిరాకీ పెరిగేలా చూసుకున్నాడు.
రాములు భార్య మల్లమ్మ అయిదిళ్ళల్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది.అలా వారిద్దరి సంపాదనను కాస్త పొదుపు చేస్తూ తమ కూతురు లక్ష్మికి ఆ సంవత్సరం పెళ్లి చేయాలనుకున్నారు ఆ దంపతులు. చంద్రం చదువుకుంటున్నాడు. రాములుకు ఓ జ్వరం రావడం అది క్రమేపీ టైఫాయిడ్ గా మారడంతో రాములి వైద్యానికి దాచుకున్నది కూడా ఖర్చు అయిపోసాగింది. అదే సమయంలో సినిమా సెంటరు వాళ్ళు బజ్జీ బండి రాములు నడపకపోతే ఇంకెవరికైనా ఇవ్వాల్సి వస్తుందని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మి తండ్రి బదులు ఆ బజ్జీ బండిని నడుపుతూ ఉంటుంది.ఆమెకు తోడుగా కొన్నిసార్లు ఆమె తమ్ముడు చంద్రం కూడా వచ్చేవాడు.
లక్ష్మి అక్కడ బండి నడుపుతున్న సమయంలో ఓ నలుగురు రౌడీలు ఆమెను ఏడిపించేవారు. ఆ విషయం తల్లితో చెప్తుంది లక్ష్మి. తాను చంటి బిడ్డను ఎత్తుకుని ఆ బండి నడపలేనని, ఇంకో రెండు వారాలు నడిపితే తండ్రికి నాయమైపోతుందని తల్లి సర్దిచెప్పి పంపిస్తుంది మల్లమ్మ. రౌడీల వేధింపులు తప్పకపోవడంతో మల్లమ్మ ఆ విషయం ఆ సినిమా హాలు యజమాన్యంతో చెప్పి,ఆ రౌడీలను హెచ్చరించేలా చేయడం వల్ల ఓ నాలుగు రోజులు ఆమెకు వారి బెడద ఉండకుండా ఉంటుంది.
ఓ రోజు చంద్రం తనకు పరీక్ష ఉందని చెప్పి తోడు రాలేదు. ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ జనారణ్యంలేని సందు గుండా వెళ్తుండగా ఓ ఆటోలో ఆమెను ఎక్కించుకుని పోతారు.ఆమె తమ్ముడు ఆమెను చూసినా రక్షించలేకపోతాడు. ఆ తర్వాత వారు ఆమెను మానభంగం చేసి ఆ గూడెం దగ్గరలోని మురికి కాలవ దగ్గర గట్టిగా విసిరేయడంతో లక్ష్మికి అక్కడే ఉన్న రాయి తగిలి మరణిస్తుంది.
కూతురు రాలేదని ఆ తల్లిదండ్రులు కంగారూ పడుతూ ఉంటారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తర్వాత పోలీసులు లక్ష్మి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. తమ కూతురికి జరిగిన అన్యాయానికి బాధ పడుతున్న ఆ కుటుంబానికి ఆ గూడెం అంతా తోడవుతుంది.
ఆ గూడెం నాయకుడు మల్లేశ్ ఎలా అయినా లక్ష్మికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్తాడు. ఎన్నికల కాలం కూడా దగ్గర పడింది. పాలక పక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలా అని ఆలోచిస్తున్న ప్రతిపక్షానికి లక్ష్మి మరణం ఓ గొప్ప అవకాశంగా కనిపించింది. ప్రతిపక్షం,రాడికల్స్ కలిసి లక్ష్మికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి మల్లమ్మ చేత ఫిర్యాదు పెట్టించి, ఓ స్ట్రైక్ కూడా ఆ గూడెం అంతటితో చేయిస్తారు. ఆ తర్వాత ఆమెకు ముఖ్యమంత్రి ద్వారా ఐదు వేల నష్టపరిహారం అందేలా చూస్తారు.
జరిగింది ఏమిటంటే పాలక పక్షంలో అసంతృప్తి వర్గం ప్రతిపక్షంతో చేతులు కలిపింది. ముఖ్యమంత్రి వారి కోరికలు తీర్చి బుజ్జగించాక వారు నెమ్మదించారు. ఇక అందుకోసమే శాంతిగా ముఖ్యమంత్రి నష్టపరిహారం ఇప్పించాడు. ఆ తర్వాత ఎవరో ప్రొఫెషనల్ గా లొంగిపోయేవారిని దోషులుగా మల్లమ్మకు చూపించి వారికి శిక్ష పడిందని చెప్పి ఆమెను నమ్మించారు. వారు అసలు వారు కాకపోయినా వారు తర్వాతి రోజే బయట పడ్డారు. తన కూతురిని హత్య చేసిన వారు ఆ తల్లికి తెలియదు.ఆమె ఎందుకు సమ్మె చేసిందో,దీనికి పాలకపక్షానికి వ్యతిరేకంగా సమ్మె చేయడానికి కారణాలు ఆ గూడెంలో ఎవరికి తెలియదు.కానీ లక్ష్మి మరణం మాత్రం రాజకీయ లబ్దికి చక్కగా ఉపయోగపడింది. రాజకీయం అంటే సమస్యలను అనుకూలంగా మలచుకోవడమే అనే అంతర్లీన సందేశంతో ఈ ముగుస్తుంది.
సమాజంలో సమస్యలు ఉన్నంతకాలం రాజకీయ నాయకులు పక్షాలుగా మారినా సరే వారి ఉనికిని కాపాడుకోగలుగుతూనే ఉంటారు. కానీ ప్రజల్లో ఈ కోణం నుండి ఆలోచించే లోతైన దృష్టి వచ్చేవరకు అవకాశ రాజకీయాలకు ముగింపు ఉండదు.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!