సగటు మనిషి కథ

 చదువరి

సగటు మనిషి కథ
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



ఆది విష్ణు గారి నవలల్లో ‘ సగటు మనిషి’ ఓ మామూలు మనిషి స్వగతం లాంటిది. గోపిచంద్ గారి ‘ అసమర్ధుని జీవయాత్ర’ నవలలో నాయకుడు ఏమి చేయకుండా ఎలా జీవితం గురించి రకరకాల సిద్ధాంతాలు ఏర్పరచుకుంటూ ఉంటాడో,అలానే ఆదివిష్ణు గారి ‘సగటు మనిషి’లో శ్రీనివాసరావు ఇంకో రకంగా తనలోని సుపీరియర్ పర్సనాలిటిని అప్పుడప్పుడు బయటకు తీసుకువస్తూ ఆ లోకంలో కాసేపు విహరిస్తూ ప్రస్తుతంలోకి వచ్చి ఈ జీవితం పట్ల అసంతృప్తిని వెలిబుచ్చుతూ ఉంటాడు.
ఈ నవల ఓ నాటక రిహార్సల్ తో మొదలవుతుంది. ఆ నాటకం పేరు ‘దేవుడు.’ఆ నాటకంలో నాయక పాత్రైన ఆఫీసరు పాత్ర రావుది. అతని కన్నా తక్కువ పాత్రలు సుబ్బారావు,ముకుందాలవి. ఈ నాటకంతో శ్రీనివాసరావుకు ఎంతో పేరు వస్తుంది. అంతకు ముందు కూడా అతని నటనకు ఎంతో పేరు ఉంది. ఇది గతం.
ఆ గతంలోకి వెళితే శ్రీనివాసరావు తండ్రి కౌన్సిలర్. అతనికి ఓ అన్న. నిర్లక్ష్యంగా ఉండేవాడు అన్న. తండ్రికి మంత్రి అవ్వాలనే కోరిక కలుగుతుంది.అప్పటికే ఎన్నోసార్లు గెలిచిన లోకనాథానికి పోటీగా తన అనుచరుల ప్రోత్సాహంతో సిద్ధమవుతాడు.ఎంతో డబ్బు ఖర్చు పెడతాడు. కానీ ఆరు ఓట్ల మెజారిటీతో లోకనాథం గెలుస్తాడు. ఆ తర్వాతి రోజే శ్రీనివాసరావు తండ్రి మరణిస్తాడు. శ్రీనివాసరావు అన్న దేశం పట్టుకు పోతాడు. తర్వాత అతను మిలిటరిలో చేరతాడు.ఇకపోతే శ్రీనివాసరావుకి చదువుకోవాలనే కోరిక ఉన్నా కూంబ పరిస్థితులు అనుకూలించక గుమాస్తాగా మారతాడు.
ఇక శ్రీనివాసరావు గత జీవితంలోని ఇంకో ముఖ్య సంఘటన అతను పద్మ అనే తన క్లాస్ మేట్ ను ప్రేమిస్తాడు. ఇది అతను చదువుకుంటున్న రోజుల్లో జరిగిన కథ. పద్మ తండ్రి ఓ లాయర్. అతను గిరీశం పాత్ర నాటకాల్లో బాగా వేయడం వల్ల అతన్ని అందరూ అతన్ని గిరీశం పేరుతోనే పిలుస్తారు. శ్రీనివాసరావు నటన మెచ్చి ఆయన శ్రీనివాసరావును తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అలా ఆ కుటుంబానికి శ్రీనివాసరావు వెళ్తూ ఉంటాడు. ఇక తన ప్రేమ విషయం పద్మకు సూటిగా చెప్పలేక తన స్నేహితుడైన సుబ్బారావు చేత ఓ ఆకాశరామన్న ఉత్తరం రాయిస్తాడు. ఆ సాయంత్రమే పద్మ తన పెళ్లి తన బావ విద్యాసాగర్ తో కుదిరిందని త్వరలోనే తమ వివాహమని చెప్తుంది. ఇక అప్పటి నుండి తన హద్దుల్లో తాను ఉంటాడు శ్రీనివాసరావు.పద్మ మీద ఆశలు ఒదులుకుంటాడు. తర్వాత వచ్చిన విద్య సాగర్ ను కూడా ఆదరణతోనే చూస్తాడు. ఓ సారి విద్యాసాగర్ పద్మకు ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం గురించి ప్రస్తావించినప్పుడు తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని చెప్తాడు. ఈ సంఘటన ద్వారా శ్రీనివాసరావులో ధైర్యం లేదని స్పష్టం అవుతుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే శ్రీనివాసరావుకు భార్య,తల్లి,ముగ్గురు మగపిల్లలు.పెళ్ళయి ఏడేళ్లు. తల్లికి మందు కొనలేక,తనకంటూ మంచి సైకిలు కొనుక్కోలేక ఎలాగో జీవితాన్ని నిస్పృహతో గడిపేస్తున్నాడు. అతనితో పాటు నాటకాల్లో వేసిన ముకుందం గొప్ప నటుడిగా ఎదిగాడు. ఇక సుబ్బారావు లోకనాథం అల్లుడయ్యాడు. అతని స్నేహితులండరు గొప్ప హోదాల్లో ఉన్నా వారందరూ అతనికి ఉత్తరాలు రాస్తూ ఉన్నా సరే అతను తన పరిస్థితులు,పేదరికం వారికి తెలియకూడదనే వారికి దూరంగా ఉంటాడు.ఇది శ్రీనివాసరావులోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు నిదర్శనం.
శ్రీనివాసరావు తనలోని రావు పాత్రను అప్పుడప్పుడు బయటకు తెచ్చి, వర్తమానంతో తన అసంతృప్తిని వెలిబుచ్చుతూ ఉంటాడు. శ్రీనివాసరావు బాసు తన కూతురికి ట్యూషన్ చెప్పవలసిందిగా కోరితే ఒప్పుకుని వెళ్తాడు.దానికి డబ్బులు అడగడు. అది అతని మంచితనంగా అతను చెప్పుకున్నా అది తన మంచితనాన్ని ప్రదర్శించుకునే లక్షణం లేదా అధికారి అంటే భయం కూడా అయ్యి ఉండవచ్చు. ఆ క్లార్కు పోస్టులో లంచాలు తీసుకునే అవకాశం ఉన్న అతను తీసుకోడు. ఇక అతని బాసు కూతురికి సినిమా పిచ్చి.శ్రీనివాసరావు స్నేహితుడు ముకుందం అని తెలుసుకున్న ఆమె ఓ రోజు చెప్పా పెట్టకుండా మద్రాసు వెళ్ళి ముకుందాన్ని కలుస్తుంది. తనను శ్రీనివాసరావు పంపించాడని చెప్తుంది. ఆ విషయం స్పష్టం చేస్తూ ముకుందం అతనికి ఉత్తరం రాస్తాడు. అప్పటి వరకు అతని బాసు తన కూతురికి బాగా లేదని ఎందుకు చెప్పాడో అప్పుడు రావుకు అర్ధం అవుతుంది. తరువాత శ్రీనివాసరావు సాయంతో అతని బాసు కూతురును ఇంటికి తెచ్చుకోగలుగుతాడు. శ్రీనివాసరావు తరపు వారని తెలిసి వారిని ఎంతో ఆదరంగా చూస్తాడు ముకుందం. దానితో ఆఫీసులో శ్రీనివాసరావు హోదా కూడా పెరుగుతుంది. ఆ తర్వాత సుబ్బారావు తనని వచ్చి కలుసుకోమని చెప్పడంతో వెళ్తాడు శ్రీనివాసరావు అతను తన ఇంటికి కూడా వచ్చి వెళ్ళడంతో. అక్కడికి శ్రీనివాసరావు వెళ్ళాక శ్రీనివాసరావు బాసు సుబ్బారావును తన ట్రాన్సఫర్ విషయమై కలవడానికి రావడంతో అక్కడ ఉన్న శ్రీనివాసరావును చూసిన బాసుకు అతనికిఉన్న గొప్ప స్నేహితుల గురించి అర్ధమవుతుంది. నాటి నుండి ఆఫీసులో శ్రీనివాసరావుకు ఒక అసిస్టెంట్ కూడా ఉండే ఏర్పాటు జరుగుతుంది.
శ్రీనివాసరావు ఓ సగటు మనిషి తాను ధైర్యం చేసి ఏది చేయలేకపోయినా ఏదైనా అవకాశం వచ్చి సదుపాయాలు లభిస్తే కాదనలేని మనో దౌర్బల్యం కూడా అతనిలో ఉంది. ఇక శ్రీనివాసరావు అన్న తిరిగి వస్తాడు. పేదరికం వల్ల సౌకర్యాలు అనుభవించకుండా ఉన్న అతని కుటుంబన్ ఆ ఆ టీనా బహుమతులకు లొంగిపోతుంది.తల్లిని డాక్టరుకు చూపించమని చెప్తాడు అన్న.అభిమానం కొద్ది పౌరుషం వచ్చి అన్న సాయాన్ని తిరస్కరిస్తాడు శ్రీనివాసరావు.
శ్రీనివాసరావుకు తనకు జబ్బు ఉందని అనుమానం ఉన్నా సరే డాక్టరుకు చూపించుకునే స్థోమత లేక అతను అలానే ఉండిపోతాడు. ఆ తర్వాత ముకుందం,సుబ్బారావు పట్టుబట్టి వారు తమ పూర్వ విద్యార్థి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అందులో మరలా ‘దేవుడు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నామని అందులో అప్పటి పాత్రలు అప్పటి వారే పోషించాలని పట్టుబట్టి శ్రీనివాసరావును ఒప్పించి ఆ నాటకం వేయిస్తారు. ఆ నాటకంలో రావును చూసిన అందరికి ముకుందం కన్నా రావే గొప్ప నటుడని అనిపిస్తాడు. ఆ తర్వాత కుప్పకూలిన శ్రీనివాసరావును అతని మిత్రులే ఆసుపత్రిలో చేర్పిస్తారు.అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ విద్యాసాగర్. అప్పుడు కలిసిన పద్మ తనకు శ్రీనివాసరావే సుబ్బరావు చేత ఆకాశరామన్న ఉత్తరం రాయించిన విషయం అప్పుడే తన తండ్రి కనుక్కున్నాడని,సుబ్బారావు చేత ఎప్పటికీ అది శ్రీనివాసరావుకు తాలియకుండా జాగ్రత్త పద్ద్రని తెలియజేస్తుంది. మొత్తానికి ఆ జబ్బు నుండి బయటపడతాడు శ్రీనివాసరావు.అతనికి ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే అతని తల్లి మరణిస్తుంది. శ్రీనివాసరావు దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ప్రసాద్ ఆమెకు అంత్యక్రియలు చేస్తాడు. ఇక ఆ ఆపరేషన్ తర్వాత మారాలని నిర్ణయించుకున్న శ్రీనివాసరావు ఎలా మారతాడో భవిష్యత్తే నిర్ణయించాలి. ఇక్కడితో నవల ముగుస్తుంది.
సగటు మనిషి అంటే భయం,సమాజం ఏమనుకుంటుందో అనే జంకు,ఆత్మాభిమానం,తన ఊహ లోకంలో విహరిస్తూ దానిలోనే సంతృప్తి పొందుతూ వాస్తవంలో దానికి దూరంగా అసంతృప్తితో జీవితాన్ని నిట్టూరిస్తూ,బయటి సమాజానికి,తన మిత్రులకు,బంధువులకు తన అభిమాన ధనుడనే భావనలో ఉంచాలనే ప్రయత్నం చేసే వ్యక్తి. ఆ లక్షణాల రూపమే శ్రీనివాసరావు.అతనిలో నటనా ప్రతిభా ఉన్నా సరే ధైర్యం చేయకుండా రాజీ పడిపోయి తన బాధ్యతను సాకుగా పెట్టుకుని, తన పేరుకు కాకుండా తన ‘బీ వన్’ అనే పోస్టుగా చూడబడే గుమాస్తా జీవితంలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నానని తెలిసి అందులోనే తన జీవితం అని బ్రతికేసే పాత్ర అతనిది. మనం కూడా శ్రీనివాసరావులో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాము. ఎందుకంటే మనలో చాలా మంది ఆ సగటు మనుషులమే కనుక.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!