గర్భస్థ శిశువు ఘర్జన

 చదువరి

గర్భస్థ శిశువు ఘర్జన
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మనకు తెలిసిన రచనలకన్నా తెలియని రచనలే అధికం.అటువంటి వాటిల్లో నాకిమధ్య దొరికిన అటువంటి నవలే గంగులనరసింహరెడ్డిగారి 'జీవనసమరం.' ఈ నవల బహుమతి పొందిన నవల.ఓ పత్రికలో ప్రచురితమైంది.బహుశా 1980 ల్లో అనుకుంటా.ముందు పేజీలు లేకపోవడం వల్ల ఆ పత్రికేమిటో తెలియలేదు.
ఓ గర్భిణి జైలులో ప్రసవవేదన అనుభవిస్తూ ఉండటంతో ఈ కథ మొదలవుతుంది.ఆ సమయంలో నైతిక బాధ్యత తీసుకుని ఆమెను హాస్పటల్ కు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఆ జైలు సిబ్బందిదే అయినా ఎవరు లేని దేవమ్మను పట్టించుకోకపోగా ఆమె వేదనను చిరాకుగా భావించి ఆమెను ఇంకా వేదనకు గురి చేస్తారు.ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ శిశువు అక్క,తండ్రి,బాబాయి,అన్న ఆత్మలు ఆ శిశువును బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.తన రక్త సంబంధీకులే తన జననానికి ఎందుకు అడ్డుపడుతున్నారో ఆ శిశువుకు అర్థం కాదు.అదే ప్రశ్నిస్తే ఈ సమాజం పేద వాళ్ళను బ్రతకనివ్వదని,తమ జీవితానికి విలువ లేదని ఆ శిశువుకు తమ కథలను చెప్తారు.
మొదట ఆ శిశువు అక్క సీత తన కథ చెప్తుంది.ఆ రోజే ఆమెకు పెళ్ళి చూపులు.దాని కోసమని ఆమె తల్లి దేవమ్మ ఇంట్లో పనితో తీరిక ఉండటం వల్ల తాము పని చేసే ఇంటికి సీతను పంపిస్తుంది.ఆ ఇంటి యజమాని రామరాజు,ఆ ప్రాంతానికే మొదటి ధనవంతుడు.ఆ రోజు పనికి వచ్చిన సీతను అతను చెరుస్తాడు.ఇంట్లో ఎవరికి చెప్పవద్దని బెదిరిస్తాడు.
ఇంటికి వచ్చిన సీతను ఆ పెళ్ళిచూపుల హడావుడిలో ఎవరూ పెద్దగా పట్టించుకోరు.వారి కులంలో పెళ్ళి చూపులంటే భోజనాలు,తాగుడికే పరిమితమైంది.తరువాతి రోజు తమ ఇంటి పక్కన ఉండే లక్ష్మిని చూడటానికి వెళ్తుంది.ఆమెకు పెళ్ళయినా సరే కట్నాల గొడవ వల్ల ఆమె పుట్టింట్లోనే ఉండిపోతుంది.కానీ ఆమె గర్భవతి అవుతుంది.భర్తకు దూరంగా ఉండి ఆమె గర్భవతి అవ్వడం వల్ల ఆ ఇంట్లో వారు ఆమెను దూషించడం,చుట్టుపక్కలవారు అదే చేయడంతో తరువాతి రోజు ఆమె ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంది.ఆ సంఘటన చూసిన సీత తనకు కూడా కడుపు వస్తుందేమో అన్న భయంతో బాధపడుతూ చిక్కి శల్యమవుతుంది.క్రమంగా పిచ్చిదానిలా అవుతుంది.పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు.డాక్టర్ ఆమె తన స్నేహితురాలైన లక్ష్మి గర్భవతి అయి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తనకు కూడా గర్భం వస్తుందేమోనన్న భయంతో అలా తయారయ్యిందని చెప్తాడు.ఆ తరువాత కొంతకాలానికి సీత మరణిస్తుంది ఆ ఆసుపత్రిలోనే.ఇది ఆ శిశువు అక్క సీత చెప్పిన కథ.
ఇక ఆ శిశువు తండ్రి నారాయణ తన కథ చెప్తాడు.డాక్టర్ సీత గురించి చెప్పింది విని సీత మాటలు పిచ్చి మాటలు కావని ఆమెను రామరాజు చెరాచాడని అర్థం చేసుకుంటాడు ఆ తండ్రి.రామరాజు రైసుమిల్లులో పని చేస్తున్న సాధారణ వ్యక్తిని తానని మరిచిపోయి కేవలం ఓ పసిపిల్ల జీవితం నాశనం చేసినవాడిని చంపడానికే బయల్దేరుతున్నాననుకుని బయల్దేరతాడు నారాయణ.ఊరవతల అతని రహస్య ఇంటిలో అనుచరుల దగ్గర ఉంటాడని తెలుసుకుని అక్కడికే వెళ్తాడు.ఆ అనుచరులు తన సన్నిహితులే అయినా సీతకు జరిగిన అన్యాయం చెప్పినా రామరాజు ఇస్తానన్నా డబ్బుకు ఆశపడి నారాయణను ఆ అనుచరులు హతమారుస్తారు.ధనవంతులు పేదవారినే పేదవారిని చంపేలా చేస్తారని,ఆ పేదవారికి రేపు తమకు ఆ దుస్థితి వస్తుందన్న ఆలోచన వారికి లేదని చనిపోయేటప్పుడు కూడా దుఃఖిస్తాడు నారాయణ.ఇది తండ్రి చెప్పిన కథ.
ఇప్పుడు ఆ శిశువు చిన్నాన్న శివరాం తన కథ చెప్తాడు.సీతను చెరిచి,నారాయణను హత్య చేశాడని పోలీసులు శివరాంను అరెస్ట్ చేస్తారు.అతను నేరం ఒప్పుకోనందుకు అతన్ని ఎన్ కౌంటర్ చేసి చంపేస్తారు.ప్రజలు ఈ అన్యాయాన్ని నిరసించినందుకు ఓ న్యాయ విచారణ కమిటీని నియమిస్తారు.ఆ కమిటీ శివరాం సీతను చెరిచినందుకు నారాయణ హత్య చేయడానికి వస్తే,శివరామ్ అతన్ని చంపాడని తేలుస్తుంది.ఇది శివరామ్ కథ.
ఇక శిశువు అన్నయ్య చిన్నా తన కథ చెప్తాడు.తల్లిదండ్రులు ఆ పదేళ్ళ పిల్లవాడిని స్కూలుకు పంపి చదివిస్తున్నారు.కానీ తండ్రి,పినతండ్రి,అక్క మరణాలతో ఆ కుటుంబం అతలాకుతలమైపోయింది.తల్లి అప్పటికే గర్భవతి.ఆ పెంకుటిల్లు అద్దె కట్టలేక ఓ స్లమ్ము ఏరియాలోకి మారుతుంది.అక్కడంతా వేశ్యలే ఉండేది.రామరాజు ఇంట్లో ఇప్పుడు చిన్నా పనిచేస్తున్నాడు.అతని తల్లి దేవమ్మ బిడీలు చుట్టి ఇంటిని గడుపుతుంది.ఓ రోజు చిన్నా పనికి వెళ్ళాక రెయిడ్ కు వచ్చిన పోలీసులు ఎవరూ దొరక్క దేవమ్మను,ఇంకో వేశ్యను పట్టుకుపోతారు.అలా జైలులో పడుతుంది దేవమ్మ నాలుగు నెలల శిక్ష మీద.ఆ సమయంలో చిన్నాను రామరాజు దొంగతనం మోపి ఇంటి నుండి గెంటేస్తాడు,ఎందుకంటే చిన్నాను చూసినప్పుడు అతనికి నారాయణ,శివరామ్ గుర్తుకు రావడం వల్ల.ఇక చిన్నా ఆకలితో అడుక్కున్నా అక్కడి దందాల వల్ల ఆకలి తీరక ఓ బ్రెడ్ ప్యాకెట్ దొంగతనం చేస్తాడు.అతన్ని వెంబడించి మరి జనాలు కొడతారు.
ఇక్కడ ఈ జనుల మనస్తత్వం గురించి రచయిత చక్కగా చెప్తాడు.ఈ కొట్టే జనాల్లో చాలా రకాల మంది ఉంటారు.తిరిగి కొట్టరని తెలిసి,తాము పడిన అవమానాల్ని,బాధల్ని తలచుకుని కొందరు,దెబ్బలు తినడమే తప్ప ఎదురుతిరగని వారు,బాక్సింగ్ ,కరాటే లాంటివి నేర్చుకుని ప్రయోగించేవారు,పిరికివాళ్ళు,నిస్సహాయులు అందరూ అసలు ఎందుకు,ఎవరిని కొడుతున్నామో తెలియకుండా తిరిగి కొట్టరని ఈ కార్యక్రమంలో భాగమవుతారు.వీరిలో ఉండే అవ్యక్త పైశాచిక ప్రవృత్తిని రచయిత చక్కగా స్పష్టం చేస్తాడు.ఆ దెబ్బలకు చిన్నా మరణిస్తాడు.
ఇందరి కథలు విన్నాక కూడా ఆ శిశువు జన్మించాలని కోరుకోవడం వారిని ఆశ్చర్యపరుస్తుంది.తాను తనవారికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి జన్మిస్తానని చెప్తాడు ఆ శిశువు.ఆ శిశువు జన్మిస్తూ చేసిన శబ్దం ఏడుపులాగా కాకుండా ఘర్జనలా ఉంటుంది.అది విని అక్కడ ఉన్న పోలీసులిద్దరూ పారిపోతారు.తల్లి దేవమ్మ మరణిస్తుంది.ఆ బిడ్డ అలా ఘర్జనతో పుట్టడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో జీవితం అందమైనదనే ఊహాతో మనుషులు జన్మిస్తూ ఉన్నా,అది కొందరికే అలా అగుపిస్తుందని,సమాజంలో సమానత్వం లేనప్పుడు పేదల జీవితాలకు విలువ లేనప్పుడు వారి పుట్టుకకు అంత గొప్పతనం ఉండదని,సమాజంలో న్యాయం పరిఢవిల్లినప్పుడు మాత్రమే అందరికి జువించే హక్కు ఉంటుందని రచయిత స్పష్టం చేస్తాడు.
కదిలించే నవల.దొరికితే తప్పక చదవండి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!