తల్లి చెప్పిన కొడుకు కథ

 చదువరి

తల్లి చెప్పిన కొడుకు కథ
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మహశ్వేతాదేవిగారి రచనా శైలిలో మనుషులు బహిరంగంగా ఒప్పుకోలేని సత్య ఆవిష్కరణ, మనిషి సామాజిక చైతన్యం పొందితే అతని జీవితంలో ఎదుర్కునే వ్యథలు,మనుషుల మనసులకు దూరంగా ఉండే అనుబంధాల మమతలు,మనుషులని కుటుంబాలు అర్ధం చేసుకోలేని తత్వాలు ఎన్నో బోధపడతాయి.ఈ అంశాలన్నింటిని స్పష్టం చేసే నవలే మహశ్వేతాదేవి గారి ‘ఒక తల్లి.’
జనవరి 17 న సుజాత చిన్న కొడుకైన వ్రతి మరణించాడు.అది జరిగిన రెండేళ్ళకు అదే జనవరి 17 న నవల మొదలవుతుంది. తన కొడుకు గురించి సుజాత ఈ రోజే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.ఆ ప్రయత్నంలోనే ఆమె తన గురించి కూడా తెలుసుకుంటుంది. అజ్ఞాతంగానే వ్రతి ఆమెను ఎంతగానో ప్రభావితం చేస్తాడు.
సుజాత భర్త దేవేంద్రనాథ్.ఆమె పెళ్లయిననాటి నుండి ఆమె మీద అధికారం చెలాయించింది ఆమె భర్త,అత్తలే. ఆమెకు ఎదురుతిరగటం,గట్టిగా మాట్లాడటం చేతకాదు. మౌనంగా,సౌమ్యంగా వ్యవహరించడమే ఆమె శైలి.ఆమె అప్పటికే నలుగురు పిల్లలను కన్నది. పెద్ద కొడుకు జ్యోతి,తర్వాత ఇద్దరు కూతుళ్ళు నీపా,తులీ.ఎప్పుడు సుజాత దగ్గరే ఉండే అత్తగారు ఆమె వ్రతిని ప్రసవించే సమయంలో మాత్రం తన చెల్లెలి ఇంటికి వెళ్ళిపోయింది. దానిని ఆమె కొడుకు కూడా సమర్ధించాడు.ఆమెకు ఆ ఏడుపులు,పెడబొబ్బలు పడవని సాకుగా చెప్పి. అలా తనకు తానే ఆ రోజు హాస్పటల్ కు బయల్దేరి తన ప్రాణం మీదకు తెచ్చుకుని మరి వ్రతిని కంది.
ఆ సమయంలోనే సుజాతకు తన ప్రాణం విలువ తెలిసి వచ్చింది.భర్తను దగ్గరకు రానివ్వలేదు.భర్తకు ఉన్న పర స్త్రీ సంబంధాలు ఆమెకు తెలిసినా ఆమె మౌనంగానే ఉన్నది. ఆ తర్వాత ఆమె భర్త ఆర్థికంగా పతనమవ్వడంతో ఆమె బ్యాంకులో ఉద్యోగం చేయడం ప్రారంభించింది.ఆ ఉద్యోగం కూడా ఆమె పుట్టింటి,మెట్టినింటి ప్రతిష్టాల వల్ల వచ్చినదే. ఆ తర్వాత భర్త ఆర్థికంగా మెరుగైనా కోటీశ్వరుడైనా సరే ఆమె భర్తను ఎదురించి ఉద్యోగం చేస్తూనే ఉంది.
ఆమె పెద్ద కొడుకు జ్యోతి అతి వినయంతో ఉంటాడు. తర్వాతి కూతురు నీపా చంచల ప్రవృత్తి వల్ల వెంటనే పెళ్ళి చేసినా సరే ఆ పెళ్ళి తర్వాత భర్త మేనత్త కొడుకుతో ఆమె సంబంధం పెట్టుకుంది. ఇకపోతే ఆమె చిన్న కూతురు తులీ అచ్చంగా సుజాత అత్తలానే ప్రవర్తించేది. ఇంట్లో అందరి మీద పెత్తనం చెలాయించేది. తన తండ్రికి అతని సెక్రటరీతో ఉన్న సంబంధం మొదట తెలిసింది ఆమెకే.ఆమె దానికి గర్వించింది. ఆ సెక్రటరీ ఫోన్ చేసి ఏదైనా సమాచారం అందిస్తే దానిని తండ్రికి చేరవేసేది.దాని ద్వారా తండ్రి మీద అధికారం వచ్చిందన్న భావన ఆమెది.తండ్రి ప్రవృత్తిని ఆమె మగసిరిగా భావించేది.
జ్యోతి తన భార్య అయిన బినీను అంటిపెట్టుకునే ఉంటాడు. వీరందరిలో వ్రతి మొదటి నుండి భిన్నమే. ఆ ఇంట్లో ఉండే పనిమనిషి హేమ అతన్ని పెంచింది. తల్లి బాధల్ని బాల్యంలోనే అర్ధం చేసుకున్నవాడిలా వ్రతి ప్రవర్తించేవాడు. తల్లికి దెబ్బ తగిలినప్పుడు ఆర్తిగా పలకరించి ఆమెకు తోడుండేవాడు. అతన్ని చూసి తండ్రి ఆడంగి వాడన్నా పట్టించుకునేవాడు.బహుశా పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం, జ్యోతిలా అధిక మధ్యం సేవించడం, ఎక్కువ డబ్బు సంపాదించడం,తులీలా ఇతరులపై అధికారం చెలాయించడం వంటివి చేయకుండా విభిన్నంగా ఉండటం వల్ల ఆ కుటుంబంలోని వారంతా సుజాత తప్ప అందరూ అతన్ని శత్రు వర్గంగానే పరిగణించారు.
సుజాత ఉద్యోగం చేస్తూ తన కుటుంబం పట్ల తన కున్న అసంతృప్తిని నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. వ్రతికి తన అభిప్రాయ సామీప్యంలో ఎవరూ కనిపించలేదు. తల్లి మీద అభిమానం,ప్రేమ ఉన్న ఆమె నిస్సహాయత వారిద్దరు అన్నీ విషయాలు మనసు విప్పు చెప్పుకోలేని గోడ కూడా ఒకటి ఎప్పుడో కట్టబడి ఉంది.
రెండేళ్ళ క్రితం అదే రోజు రాత్రి ఫోన్ మోగింది.కాంటా పుష్కర్ మార్గ్ లో వ్రతి శవం ఉందని సమాచారం. వెంటనే తమ కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని తమ కొడుకు పేరు తర్వాతి రోజు పేపర్లలో రాకుండా ఉండటానికి దేవేంద్రనాథ్,జ్యోతి వెంటనే పరిగెత్తారు తప్ప వ్రతిని చూడటానికి కాదు.ఆఖరికి ఇంట్లో ఉండే కారును కూడా తీసుకువెళ్ళవద్దని దాని వల్ల అది తమ కారని తెలిసిపోతుందని సుజాతను శాసిస్తారు. ఆ పరిస్థితుల్లో ఎలాదో వెళ్ళి కొడుకు శవాన్ని చూడటానికి వెళ్తుంది సుజాత. పోల్చుకోలేకుండా ఉంటుంది. కంఠంలో,గుండెల్లో,పొట్టలో బులెట్లు దిగి,ముఖమంతా మాంసపు ముద్దగా మారి ఉంటుంది.ఆఖరికి శవాన్ని కూడా ఇవ్వరు. అప్పటి నుండి ఆ ఇంట్లో వ్రతిని అందరూ మర్చిపోయినా అతన్ని ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుంటుంది సుజాత ఒక్కర్తే. ఆ రోజు సుజాత కొడుకు వ్రతితో పాటు ఇంకో ముగ్గురు యువకులు కూడా మరణించారు.సమూ,విజిత్,లల్టూ ఆ ముగ్గురు.
సమూ తల్లిని వ్రతి మరణించిన ఏడాదికి కలవడానికి వెళ్ళింది సుజాత.ఆమెను కలిశాక తన కొడుకైన వ్రతి గురించి ఆమెకు ఇంకా ఎన్నో విషయాలు తెలిసాయి. ఆ రోజు చనిపోయే ముందు అక్కడే వ్రత్ గడిపాడు.ఆమెను పిన్నమ్మ అని పిలిచేవాడు. తన ఇంట్లో ఉందని ప్రేమాభిమానాలు అక్కడ పొందాడు.
ఇక కథలోని ప్రస్తుతానికి వస్తే ఇదే రోజు సుజాత చిన్న కూతురు తులీ నిశ్చితార్ధం సాయంత్రం ఏర్పాటు చేయబడింది. అదే రోజు సుజాతకు వ్రత్ ప్రేమించిన నందిని ఫోన్ చేస్తుంది. సాయంత్రం కలవమని చెప్తుంది. ఇక మధ్యాహ్నం సుజాత సమూ తల్లి దగ్గరకు వెళ్తుంది. సుమూకి ఓ అక్క.మగపిల్లవాడు కుటుంబాన్ని పోషిస్తాడని సుమూని చదివించినంతగా ఆమెను చదివించలేదు.ఇప్పుడు ఆ కొడుకు చచ్చిపోవడంతో ఆ కుటుంబభారం అంతా ఆ కూతురి మీదే పడింది. సుజాత అక్కడికి రావడం ఆమెకు ఇష్టం లేదు.చనిపోయిన తమ్ముడి గురించి విచారించడం కూడా ఆమెకు ఇష్టం లేదు.
ఇక ఆ రోజు అక్కడికి వెళ్ళాక ఆమె ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. సుమూకి అక్క అవ్వడం వల్ల ఆమె చేత ట్యూషన్లు కూడా చెప్పించుకోవడం కూడా మానేశారని చెప్తుంది.ఆ రాత్రి వారంతా చనిపోయే రాత్రి వ్రత్ తాను సుమూ వాళ్ళని రావద్దని అందించిన సమాచారం గురించి ఏ కబురు రాకపోవడం వల్ల అనుమానం వచ్చి సుముకి ఆ సమాచారం చేరలేదని గ్రహించి అతన్ని హెచ్చరించడానికే అక్కడికి వచ్చాడని సుజాతకు తెలుస్తుంది. ఆ రోజు రాత్రి విరోధి దళంలో చేరిన వ్రత్ దళం సభ్యుడు వల్ల వారి ఉనికి తెలిసి అందరూ ఆ ఇంటిని చుట్టు ముట్టారని వారు బయటకు రాకపోతే ఇంటిని తగలపెడతామని చెప్పారని,వారు బయటకు వెళ్ళాక వారిని హింసించారని,ఇది జరుగుతున్నా సమయంలో వారిని కాపాడటానికి సమూ తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అధికారుల కాళ్ళు పట్టుకున్నా లాభం లేకుండా పోయిందని వారే వారిని ఎన్ కౌంటర్ చేశారని దేశ ద్రోహులుగా చిత్రించి తర్వాతి రోజు పేపర్లో వేశారని సుజాతకు సుమూ తల్లి వల్లే అర్ధమవుతుంది.సుమూ అక్కకు తాను అక్కడికి రావడం ఇష్టం లేదని దానికి కారణం ఆ పేటలోని వాళ్ళంతా ఆ తల్లిలిద్దరూ కలిసి ఏ కుట్రో పన్నుతున్నారని భావిస్తున్నారని సుజాతకు అర్ధమవుతుంది.ఇదే ఆఖరు సారి వారిని కలవడం అని అర్ధం చేసుకుని అక్కడి నుండి వ్రత్ ప్రియురాలు అయిన నందినిని కలవడానికి వెళ్తుంది.
నందిని మిగిలిన కథ ఆమెకు చెప్తుంది. వ్రత్ స్నేహితుడి ద్వారా వారి దళంలోకి అనింద్యా ప్రవేశించాడని,అతని ప్రవేశం ఓ పథకం ప్రకారం జరిగిపోయిందని చెప్తుంది. అతను శత్రువుల మనిషి అని వ్రత్ సుమూ వారిని ఇంటికి రావ్దన్న సమాచారం అందచేయడం బదులు, ఆ పేట లో అందరికీ వారు ఇంటికి తిరిగి వస్తున్నడని చెప్తాడు.ఆ రోజంతా కబురు అందకపోవడం వల్ల అనుమానం వచ్చి వ్రత్ సుమూ దగ్గరకు వచ్చాక అలా జరిగిపోయింది. ఇక ఆ సంఘటన జరిగిన ఉదయమే నందిని అరెస్ట్ అయ్యింది. ఆ ఐసోలేషన్ సెల్ లో వెయ్యి వాట్ల విద్యుత్ ఆమె కళ్ళ మీద ప్రసరింపజేయడం వల్ల ఆమె కుడి కన్ను చూపు పోవడం వల్ల మెడికల్ గ్రౌండ్స్ మీద ఆమె విడుదల అయ్యింది.
వ్రత్ ముందే స్థావరానికి వెళ్ళిపోవాల్సిందని కానీ తన పుట్టిన రోజున లేకపోతే తల్లి బాధపడుతుందని ఆమె కోసం ఆగిపోయాడని,అంతే కాకుండా తన తండ్రి సెక్రటరీతో సంబంధం పెట్టుకోవడంతో తండ్రితో కూడా ఘర్షణ పడ్డాడని నందిని చెప్తుంది. ఇక తాను మామూలు జీవితం గడపలేదని,అందరికి సహజం అనిపించే జీవితం తనకు అబ్నార్మల్ గా ఉంటుందని ఆమె చెప్తుంది. నందిని నుండి సెలవు తీసుకుని ఇంటికి వస్తుంది సుజాత.
తన కోసం ఉండిపోకుండా ఉంటే కొడుకు బ్రతికేవాడేమోనని ఆలోచిస్తుంది. వ్రత్ కు అన్ని తెలుసని అప్పుడు ఆమెకు స్పష్టం అవుతుంది. కొడుకు గురించి తెలిసాక ఆమె బాధ అధికమవుతుంది.ఆమె చుట్టు ఆమె వ్రత్ జ్ఞాపకాలనే ఐసోలేషన్ సెల్ లో జీవించాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే అపెండిసైటీస్ ఉన్నప్పటికీ ఆపరేషన్ చేయించుకోకుండా ఉండటం వల్ల ఆ ఫంక్షన్ లోనే సుజాత ప్రాణాలు కోల్పోవడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో ఓ తల్లి తన కొడుకును ఎలా తెలుసుకుంది అనేది కథ అయినా ఆ కథలో భాగంగా మనం ఓ విప్లవవాది జీవితాన్ని చూస్తాము,అతన్ని నేరస్థుడిగా భావించి అతని ఉనికినే చెరిపేసిన కుటుంబాన్ని చూస్తాము,ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మిగిన వారి స్థితులు ఎలా ఉన్నాయో కూడా చూస్తాము. ఇటువంటి అంశాన్ని తల్లి కోణం నుండి చూడటం ఎంతో కష్టమైన అంశం.జరిగిన గతం లోకి పయనిస్తూ చిన్న చిన్న సంఘటనల ద్వారా ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు.అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రచయిత్రే మహాశ్వేతా దేవి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!