డబ్బు వర్సస్ బంధుత్వాలు
చదువరి
డబ్బు వర్సస్ బంధుత్వాలు
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)
ద్వివేదుల విశాలాక్షి గారి నవలల్లో ఎన్నో మలుపులు తిరిగే కథ,ద్వంద్వ మనస్తత్వ సంగ్రామాలు వంటివి అంతర్లీనంగా పాఠకులకు దర్శనమిస్తాయి.విశాలాక్షిగారి 'గ్రహణం విడిచింది' నవల డబ్బు మనుషుల మనస్తత్వాలను ఎలా మారుస్తుందో,ముఖ్యంగా పరుల సొమ్ము వారిని ఎలా నడిపిస్తుందో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.మనిషి తనకున్నది దాచుకుంటాడు.కానీ పరులది మాత్రం ఇష్టానుసారంగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తే దానిని వదులుకోడు.మనిషికి డబ్బంటే ఓ అధికారం,ఓ అహం,ఓ హోదా కూడా.అటువంటి డబ్బు మనుషులలో నిర్మించే ఓ రకమైన వింత ప్రవర్తనను ఈ నవల స్పష్టం చేస్తుంది.
భారతి ఈ నవలలో ప్రధానపాత్ర.ఆమెకు ఓ అన్న.వీరి తల్లిదండ్రులు బాల్యంలోనే మరణిస్తే వారిని అత్తయ్య,మావయ్యలు పెంచి పెద్దచేశారు.భారతి అన్నకు అప్పటికే వివాహమైంది,పిల్లలు కూడా.భారతికి మాధవ్ అనే పైలట్ తో పెళ్ళవుతుంది.మాధవ్ కు తల్లిదండ్రులు లేరు.పిన్ని,బాబాయి పెంచారు.వారి ఆడపిల్లల పెళ్ళిళ్ళ బాధ్యతలు తీర్చాకే మాధవ్ భారతిని వివాహం చేసుకున్నాడు.మాధవ్,భారతిల వివాహమైన మూడేళ్ళకు విమానప్రమాదంలో మాధవ్ మరణిస్తాడు.
మాధవ్ మరణించాక భారతి తనను పెంచిన అత్తయ్య,మావయ్యల దగ్గరకు వచ్చేస్తుంది.మాధవ్ చనిపోయాక కొంత సొమ్ము నష్టపరిహారంగా భారతికి వస్తుంది.ఆ డబ్బును తమ ఇష్టప్రకారం ఖర్చు చేయాలని ఇటు ఆమె అన్నా,అటు ఆమెను పెంచిన అత్తామామలు తర్జనభర్జన పడుతుంటారు.అదే సమయంలో మాధవ్ పిన్ని,బాబాయి భారతితో మంచిగా ఉండి మాధవ్ కొన్న స్థలం,ఇల్లు తమ సొంతం చేసుకుంటారు.ఆ తరువాత భారతికి క్రమక్రమంగా వీరంతా తన డబ్బు కోసమే తన మీద ప్రేమ చూపిస్తున్నారని అర్థమవుతుంది.ఇటు అన్న వ్యాపారంలో పెట్టడానికి,అటు మావయ్య స్థలం కొనడానికి సగం,సగంగా ఆ డబ్బు ఖర్చు చేయాలనే నిర్ణయం ఆమె అన్న,మావయ్య తీసుకుంటారు.దీనిలో భారతి అభిప్రాయం గురించి వారు పట్టించుకోరు.
మాధవ్ స్నేహితుడు జగదీష్ భారతి పెళ్ళయిన తొలి సంవత్సరంలోనే మాధవ్ స్నేహితుడిగా ఆమెకు పరిచయం.ఇప్పుడు భారతిని అతను ప్రేమిస్తూ ఉంటాడు,భారతి ఉండే చోటుకు బదిలీ చేయించుకుంటాడు.క్రమేపీ భారతి కూడా అతన్ని ప్రేమిస్తుంది.
వీరందరిలో జగదీష్ ఒక్కడే తనను తప్ప,తన డబ్బును ప్రేమించలేదని భారతి భావిస్తుంది.జగదీష్,భారతి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.ఆ సమయంలోనే జగదీష్ పిన్ని తమ వివాహానికి ఒప్పుకోవడానికి కారణం తన డబ్బు అని భారతికి అర్థమవుతుంది.జగదీష్ కు వచ్చిన ఉత్తరాలను బట్టి అతను కూడా తన డబ్బునే ఇష్టపడ్డాడని ఆమెకు అర్థమవుతుంది.ఆమె అన్నావదినలు,అత్తయ్య-మావయ్యలు తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడానికి కారణం ఆ డబ్బు తమ అధీనంలో నుండి జగదీష్ కు వెళ్తుందని కూడా ఆమెకు స్పష్టమవుతుంది.అందరూ తన డబ్బునే తప్ప తనను ఎవరూ మనిషిగా ప్రేమించడం లేదని బాధతో ఆమె ఇల్లు వదిలి ఓ ట్రెయిన్ ఎక్కుతుంది.ఆ రైలులో ఉన్న స్వామిజీని అంతకుముందే మాధవ్ తో కలిసి హానీమూన్ కు వెళ్ళినప్పుడు చూడడం వల్ల ఆయన మీద నమ్మకం ఏర్పడి ఆయన ఆశ్రమానికి వెళ్తుంది.అక్కడ అందరూ చన్నీళ్ళతో స్నానం చేయాలి.కానీ భారతికి మాత్రం వేడినీళ్ళ ఏర్పాటు చేస్తారు.కొన్నాళ్ళ తరువాత ఆమెను తమ ఆశ్రమానికై విరాళం అడుగుతాడు ఆ స్వామిజీ.
తనకున్న ప్రత్యేక ఏర్పాటులు కూడా తన డబ్బు కోసమే అని ఇక్కడ కూడా భారతికి అర్థమవుతుంది.అందుకనే ఆమె ఆశ్రమం వదిలి వెళ్ళాపోతుంది.రైల్వే స్టేషన్ లో స్వామిజీ భక్తుడు ఆమెకు ఓ కాగితం ఇచ్చి వెళ్ళిపోతాడు.అది స్వామిజీ రాసి పంపింది.
భారతి తన డబ్బు కోసం తననందరూ ఇష్టపడుతున్నారనుకుంటుంది,కానీ ఆమె కూడా ఆ డబ్బు కోసమే వారందరిని వదిలేసి వెళ్తుందనే విషయాన్ని ఆలోచించలేదని,వారు డబ్బు మీద ప్రేమతో చేస్తే,భారతి కూడా అదే డబ్బు మీద ప్రేమతో వారందరిని వదిలేసిందని,ఆ డబ్బు వలనే తన మీద కూడా దురభిప్రాయం ఏర్పరచుకుందని,ఆ డబ్బుని పక్కన పెట్టి మనుషులతో బ్రతకమని రాస్తాడు ఆయన.భారతి మనసు మార్చుకుని తన వారి దగ్గరకు వెళ్ళిపోవడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో కనిపించని కాంప్లెక్సిటి ఉంది ముగింపులో.
డబ్బు మనిషి అవసరాలకు అవసరం,దాని మీద వ్యామోహం ఉండకపోయినా మనిషి తనను తాను నిలబెట్టుకోవడానికి డబ్బు అవసరమే.ఆర్థిక భద్రత మనిషి ఆలోచనల్లో సుస్థిరతను ఏర్పాటు చేస్తుంది.కానీ దానిని అవసరాల పరిధిని దాటి విస్తరిస్తేనే అత్యాశగా మారుతుంది.అవసరాలకు,ఆడంబరాలకు మధ్య ఉండే సన్నని గీతను అనుసరిస్తూ డబ్బుతో అనుబంధం పెంచుకోవడం కష్టమే అయినా,అది డబ్బుకున్న వాస్తవిక స్థానం పట్ల మనిషికి స్పష్టతను ఇస్తుంది.
ఈ నవలలో మొదటి నుండే వీరందరూ భారతి పట్ల ప్రేమ కలిగి ఉన్నారు.ఆమె తమ మనిషే కనుక ఆమె డబ్బు కూడా తమకే చెందాలనుకున్నారు.ఆమె భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించలేదు.
మనిషికి కష్టపడకుండా వచ్చే డబ్బు విలాసంగా ఖర్చు పెట్టడం అలవాటయ్యేలా చేస్తుంది.అది డబ్బుకున్న లక్షణం.ఆ లక్షణం మనుషులను ప్రభావితం చేయడమే మనుషుల్లో స్వార్ధానికి మూలమవుతుంది. అదే మనుషుల్లో అహం అనే గోడను కూడా నిర్మిస్తుంది.తమ వారి సొమ్మును సొంతం చేసుకోవాలనే మనస్తత్వం మనకు కుటుంబాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది.
తల్లిదండ్రుల ఆస్తులు,సంతానం లేని బంధువుల ఆస్థులు ఇలా ఎన్నో రూపాలలో పక్క వారి డబ్బు మనది చేసుకోవాలన్న మనస్తత్వం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది.ఆ మనస్తత్వమే మనుషుల్లో అది తమకు కాక ఇంకెవరికో దక్కుతుందన్న భయాన్ని కూడా పెరిగేలా చేస్తుంది.డబ్బు గురించి ఆలోచిస్తే ఎన్నో కోణాలు.అది మనిషిని 'డబ్బు మనిషి'ని చేస్తుంది.
నవలలో మనకు కథ ఏదైనా రచయిత చెప్పాలనుకున్న అంతర్లీన సందేశాన్ని అన్ని కోణాల్లో ఆలోచించగలిగేతేనే మనకు ఊహా-వాస్తవ ప్రపంచం కూడా విస్తీర్ణమవుతుంది.
* * *
Comments
Post a Comment