'ద సీక్రెట్' లో ఉన్న సీక్రెట్స్

 'ద సీక్రెట్' లో ఉన్న సీక్రెట్స్

-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)




మోటివేషనల్ పుస్తకాల కన్నా నేను నవలలు,కథలే ఎక్కువ చదువుతాను.మన జీవితాన్ని అవి మార్చేంత ప్రేరణ వాటిలో ఉందో,లేదో పక్కన పెడితే,అవి చదివి మారిపోయేంత శక్తి నాలో లేదనే నేను ఇన్నాళ్ళు నమ్మాననుకుంటా!అందుకే అందులో ఏమి గొప్ప అంశాలు ఉండవనే అనుకుంటూ, పూర్తిగా వాటిని పక్కన పెట్టేశాను.గత నెల రోజులుగా ఏమి చదవలేదు.ఏమి చదివే మూడు లేదు.కానీ నిన్న ఎందుకో నా అభిప్రాయాలను,నమ్మకాలను నేనే విభేదించి 'ది సీక్రెట్ ' చదవడం మొదలుపెట్టాను.ఇప్పుడే చదవడం పూర్తయ్యింది.
జీవితంలో సాధారణ అంశాలు,తెలిసిన అంశాలే పాటించడం కష్టమని,అందుకే వాటిని సాధారణ అంశాలుగా మనమందరం కొట్టి పారేస్తాము కూడా.మనుషుల ఆలోచనలకున్న శక్తిని శాస్త్రీయ పద్ధతిలో చెప్పే పుస్తకమే 'ది సీక్రెట్.' ఇది 'లా ఆఫ్ అట్రాక్షన్'ను మన జీవితంలో అనుకున్నవి సాధించడానికి ఎలా ఉపయోగించాలో స్పష్టం చేసే పుస్తకం.
మనం పదివేలు సంపాదించే జీతగాళ్ళమైతే మనకు ఏ నెల అయినా ఇరవై వేలు వస్తే గొప్ప సంతోషం.నెలకు రెండు వేలు కరెంట్ బిల్లు వచ్చేది వెయ్యి రూపాయలే వస్తే సంతోషిస్తాము.మన జీవితంలో చిన్న చిన్నగానే ఎదుగుతామని,ఎంతో కష్టపడితేనే ఫలితమని నమ్మే మనస్తత్వాలు మనవి.అది మన పరిబాషలో నిజాయితీ,మన కష్టం ఏదైనా కావచ్చు,కానీ 'ద సీక్రెట్' బాషలో మాత్రమే మనకు కావలసింది బలంగా కోరుకునే ధైర్యం లేకపోవడం,అలా కోరుకోవడాన్ని పగటి కలలు అనుకోవడం.వీటిని పక్కన పెడితే తప్ప 'ద సీక్రెట్' ను అర్థం చేసుకోలేము.
శాస్త్రీయంగా Quantum Physics చెప్పేదేమిటంటే ప్రపంచంలో ప్రతిది ఎనర్జీయే.మన ఆలోచనలు కూడా ఎనర్జీయే.వాటికి ఓ ఫ్రీక్వెన్సి ఉంటుంది.మన ఆలోచనలు మన నుండి యూనివర్స్ లోకి ప్రవేశించి మన ఆలోచనల ఫ్రీక్వెన్సికి సమీపంలో ఉండే ఫ్రీక్వెన్సితో మాగ్నెట్ లా జతకట్టి అది దాని మూలం(Source) అయిన మన దగ్గరికి ఆ అధిక ఫ్రీక్వెన్సితో మనకు తిరిగి వస్తుంది.మన ఆలోచనల్లో పరిమితులు ఉంటాయి కానీ యూనివర్స్ కు అవేమి ఉండవు.మీరు వంద రూపాయలు కోరుకుంటే బలంగా వస్తుంది,కోటి రూపాయలు కోరుకుంటే రాదు అనే నమ్మకంతో ఉంటే అదే జరుగుతుంది.కానీ యూనివర్స్ కు మంచికి,చెడుకు భేదం లేదు.మనం కోరుకున్నది లేదా ఆలోచించింది ఏదైనా సరే ఇంకొన్ని రెట్లై మనని చేరుకుంటుంది.
'నాకు కావలసినంత డబ్బు లేదు,నాకు రోగముంది,నన్నెవరు ఇష్టపడరు' ఇలాంటి ఆలోచనలు మీలో ఉంటే వాటి సమీప ఫ్రీక్వెన్రీలతో కలిసి మీకు ఆ నెగిటివిటి రెట్టింపు అవుతుంది.ఇక్కడ పాజిటివ్ ,నెగిటివ్ అనే భేదం లేదు.
ఇందులో ఇంకో రకం ఏమిటంటే అనుకోవడమే కాదు,నమ్మాలి,అది సొంతమైనట్టే భావించాలి నిజంగా ఏదైనా కావాలనుకుంటే.
మన భయాలు మనల్ని ఎమోషనల్ గా ఫీల్ అయ్యేట్టు చేసినట్టు మన ఆశలు,కోరికలు చేయలేవు.దీనికి కారణం అవి గాలిలో మేడలు అని మన అభిప్రాయం.
'లా ఆఫ్ అట్రాక్షన్ 'ద్వారా మనం అనుకున్నది సాధించాలంటే మూడు అంశాలను మన జీవితం లో భాగం చేసుకోవాలి.
మనకున్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం,ఆ కృతజ్ఞత తెలపడం.తరువాత మనకున్న వాటిని లేదా మనతో ఉన్న వారిని,ఏదైనా సరే,ఎవరినైనా సరే ప్రేమించడం,మనల్ని మనం ప్రేమించుకోవడం.ప్రేమకు,కృతజ్ఞతకు పాజిటివ్ ఫ్రీక్వెన్సి చాలా ఎక్కువ.అవి మీ నుండి యూనివర్స్ లోకి ప్రవేశించగానే కొన్ని రెట్లు ఎక్కువై మిమ్మల్నే చేరుకుంటాయి.
'ద సీక్రెట్ 'ద్వారా సాధించాలంటే మనకు కావలసిన దాని పైన స్పష్టత కలిగి ఉండాలి.ఆ తరువాత అది మీకు దక్కుతుందని నమ్మాలి.ఆ నమ్మకం ద్వారా మీరు ఫీల్ అవ్వాలి.ఆ తర్వాతే మీరు పొందగలరు.మీ ఫీలింగ్సే మీ ఫ్రీక్వెన్సి గురించి చెప్తాయి.మీరు మంచి ఫీలింగ్ తో ఉంటేనే మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నట్టు లెక్క.
'ద సీక్రెట్ ' ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ను ఏ వైద్యం లేకుండా జయించిన స్త్రీ గురించి,విమాన ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుపడినా వెంటనే కోలుకున్న వ్యక్తి గురించి,డబ్బు సంపాదించిన వారి గురించి కూడా అనుభవాలు పేర్కొన్నారు.
ప్రపంచపరంగా ఆలోచిస్తే 'ఈ యుద్ధం వద్దు,ఈ డ్రగ్స్ వద్దు,ఈ నాయకుడు వద్దు' వంటి ఉద్యమాల వల్ల యూనివర్స్ అందులో ఆ నెగిటివ్ ఆలోచనల ఫ్రీక్వెన్సియే అధికమవుతుంది.దాని బదులు శాంతి ర్యాలీలు,ఉత్తమ నాయకుడి గురించి వంటివి సానుకూల ఫ్రీక్వెన్సీలతో జత చేరి వెనక్కి తిరిగి వస్తుంది.
మీ ఆలోచనలు మంచిగా ఉండాలనుకుంటే సరిపోదు,వాటిని నమ్మాలి,వాటికి వ్యతిరేకంగా మీ చర్యలు ఉండకూడదు.అవి జరిగితే మీరు పొందే సంతోషాన్ని అనుభవిస్తూ కూడా ఉంటే ఆ విజువలైజేషన్ ద్వారా వచ్చే మంచి ఫీలింగులకు ఎంతో బలమైన పాజిటివ్ ఫ్రీక్వెన్రీ ఉంటుంది.మీకు ఏది కావాలో అది దక్కినట్టు,దాని ద్వారా మీరు అనుభవించే సంతోషాన్ని ఊహా చిత్రంగా ఏర్పరచుకోవడం కూడా 'లా ఆఫ్ ఎట్రాక్షన్'ను ఆకర్షిస్తాయి.
ఈ పుస్తకం చదివాక నేను నిన్నటి నుండి 'Gratitude List' రాస్తూ ఉన్నాను.విజువలైజేషన్ ప్రయత్నిస్తూ ఉన్నాను.మీరు మీకు అనుకూలమైనవి ప్రయత్నించండి మరి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!