కులంలో కాలిన మనిషి

 చదువరి

కులంలో కాలిన మనిషి
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ తమిళ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న కుల వ్యవస్థ గురించి, దాని వల్ల కులాంతర వివాహాల వల్ల ఆ దంపతులు ఎదుర్కునే వ్యథల గురించి రాసిన నవలే ‘చితి’గా తెలుగులో ‘పైర్’ గా ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ నవలలోని వాతావరణం వల్ల మనకు కులం ఎలా జీవితాలని శాసిస్తుందో, మనిషి ఇష్టాలకు ఎలా అడ్డుగా నిలబడుతుందో స్పష్టం చేస్తుంది. ప్రేమతో తమ జీవితాన్ని కొనసాగించాలనుకుని కుల వ్యవస్థలోని మార్పును సహించలేని హింస మనకు ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో రచయిత ఎక్కడ కులం పేరు స్పష్టం చేయకపోయినా కుల అంతరాలు పాఠకులకు స్పష్టమయ్యేలా రచయిత రాశారు.
సరోజ,కుమరేశన్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇక వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే తప్ప ఆ ప్రేమ వారి జీవితాల్లో ఎలా బాధగా మారేలా చేసిందో అర్ధం కాదు. సరోజు కేరళ రాష్ట్రలోని తోలూరు అనే పట్టణ వాతావరణంలో పెరిగింది.ఆమె తల్లి ఆమె బాల్యంలోనే మరణించింది.ఆమె ఎలా మరణించిందో సరోజకు తెలియదు,తండ్రి ఎప్పుడు చెప్పలేదు.ఆమెకు ఓ అన్న. వారిద్దరు ఓ తోళ్ళ పరిశ్రమలో వర్కర్లుగా పని చేస్తున్నారు.వారిది విలాసవంతమైన జీవితం కాకపోయిన సంతృప్తికరమైన జీవితం. సరోజ రోజు వంట చేసి భోజనాల సమయానికి అన్నకు,తండ్రికి వెళ్ళి ఇచ్చి వచ్చేది.వరి అన్నం,కూరలు,చిరుతిండ్లు వారి ఇంట్లో సాధారణమే.
సరోజ ఇల్లు ఓ గదే. అది గచ్చుతో ఉంది. ఆమె ఇంటి బయటకు అడుగు పెట్టగానే ఎవరో ఒకరు ఆమెను పలకరిస్తారు.ఆ సందడికరమైన పట్టణ వాతావరణంలో ఆమె పెరిగింది.ఆ పట్టణంలో బిల్డింగులు పెరిగిపోయి అన్నీ చోట్లా అవే ఉన్నా,వాటిలోని కొందరైనా ఆమెను పలకరించే ఆత్మీయత ఆమె అక్కడ గెలుచుకోగలిగింది.
కుమరేశన్ కాట్టుప్పట్టి అనే గ్రామంలో జన్మించాడు.అతని తల్లి మరియ.తండ్రి అతని బాల్యంలోనే మరణించాడు.అతని తండ్రి మరణించేటప్పటికి తల్లి వయసు ఇరవై ఏళ్ళే. మరియకు తల్లిదండ్రులు,అన్నలు తోడుగా పక్క ఊరిలోనే ఉండటం,కుమరేశన్ కు వయసు వచ్చేవరకు మరియ తండ్రి ఆమెకు తోడుగా రాత్రుళ్లు ఉండటం వంటి జాగ్రత్తల వల్ల మరియ తన పరువును కాపాడుకుంది. మరియ వాళ్ళ ఇల్లు బండ మీద ఉన్న ఓ పూరిల్లు.మరియ మేకలను మేపుతూ ఆమెకున్న పొలం మీద జీవన్ సాగించేది.వారు మంచి నీరు తెచ్చుకోవాలనుకున్నా సరే ఎన్నో మైళ్ళు నడిచి బావి నుండి తెచ్చుకోవాల్సిందే. కుమరేశన్ ను అతని మేనమామలు,తాతయ్య ఎంతో ప్రేమగా చూసుకున్నారు.తమ కులౌ పిల్లను ఇచ్చి పెళ్ళి చేయాలని,ఆ తర్వాత అతనికో పెంకుటిల్లు కట్టించాలని కూడా అనుకున్నారు.అతని మేనమామల కూతుళ్ళు ఉన్న ఆ కుటుంబానికి ఇచ్చాక మరియ విధవ అవ్వడంతో అక్కడికి తమ కూతుళ్లను పంపడం వారికి ఇష్టం లేదు.
భాయ్ అనే అతను వేరే చోటు నుండి వచ్చి అక్కడి ఊర్లలోని కోడి గుడ్లను కొనుక్కుని పట్టణంలో అమ్ముకుంటున్నాడు.అతన్ని ఆ ఊరి వారంతా తమలో ఒకరి గానే చూస్తారు. కుమరేశన్ కు కూడా పట్టణంలో ఏదైనా పని చేయాలనే ఆసక్తి కలిగి భాయ్ ని అడుగుతాడు.అలా భాయ్ ద్వారా అతను తోళ్ళూరుకి వెళ్తాడు. భాయ్ కు తెలిసిన ఓ సోదా దుకాణంలో పనికి పెడతాడు భాయ్. వారే అతనికి గది కూడా ఇస్తారు. అతనితో పాటు పెరియార్ కూడా ఉండేవాడు. అక్కడ సోడా బుడ్డిలను కడగటం,సోడా నింపడం,దానిని దుకాణాలకు పంపిణి చేయడం కుమరేశన్ పని.
కుమరేశన్ ఇంటికి పక్కనే సరోజ కుటుంబం ఉండేది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరకు కుమరేశన్ తో ఆమె పారిపోవడం, పెళ్ళి చేసుకుని కుమరేశన్ ఇంటికి రావడం జరుగుతుంది. ఒకవేళ తిట్టినా తన తల్లి తమ పెళ్ళిని ఆమోదిస్తుందన్న నమ్మకంతోనే కుమరేశన్ అక్కడికి సరోజతో వస్తాడు. కుమరేశన్ సరోజది తమ కులమే అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఆమె శరీరపు తెల్లటి రంగు,ఆమె సుకుమారమైన శరీరం చూడగానే ఆమెది తమ కులం కాదని అందరూ గుర్తిస్తారు.
అక్కడికి వారు వచ్చినప్పటి నుండి ఊరంతా వారిని ద్వేషిస్తూనే ఉంటుంది. మరియ సరోజను ఎప్పుడు పరోక్షంగా తిడుతూనే ఉండేది. కుమరేశన్ తన తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అతన్ని కొట్టి తరిమేసినంత పని చేస్తాడు. ఆ తర్వాత ఆ ఊరిలో జాతర సంబరాలు దగ్గరపడతాయి. కానీ సరోజ వల్ల ఊరు మైల పడుతుందని భావించిన ఆ ఊరి వారంతా ఆ సంబరాలు ముగిసేవరకు ఆ ఇంటిని వెలి వేస్తారు.ఆ ఇంటి వారితో ఎవరు మాట్లాడకూడదు.వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు.aఆ సంబరాలు ముగుసిన తర్వాత ఆ పిల్ల బంధువులను తీసుకువచ్చి ఆమె కులం తెలుసుకుని దాని బట్టి ఏం చేయాలో నిర్ణయించుకోవాలని అనుకుంటారు. ‘
అదే సమయంలో పొరుగురిలో ఉంటున్న కుమరేశన్ అక్క వరసయ్యే ఆమె తన కూతురు పుష్పవతి అవ్వడంతో ఆ ఊరికి ఈ వెలి వర్తించకపోవడం వల్ల కుమరేశన్ దంపతులను ఆమె ఆహ్వానిస్తుంది.ఇటువంటి వేడుకలకు వెళితేనే తమను ఎప్పటికైనా సరే ఒప్పుకుంటారన్న భావనతో ఈ వేడుకకు ఆ దంపతులు వెళ్తారు.అక్కడ కుమరేశన్ మేనమాలు గొడవ చేయడంతో మధ్యలోనే వెనుదిరుగుతారు.
కుమరేశన్ తన సోడాల వ్యాపారాన్ని దగ్గరలోని పట్టణమైన విరించిపాళయంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని మొదలుపెడతాడు.అక్కడకు ఓ రోజు సరోజను తీసుకువెళ్తాడు. అక్కడ వాతావరణం చుట్టూ పక్కల వాళ్ళు కలుపుగోలుగా ఉండటం వంటివి చూసి ఇక్కడ తన కులం గురించి ఎవరు పట్టించుకోరని, మెల్లగా కుమరేశన్ ను ఒప్పించి ఇక్కడే కాపురం పెట్టించాలని సరోజ నిర్ణయించుకుంటుంది. ఆ దంపతులు ఇంటికి వచ్చాక ఆమె గర్భవతి అనే తెలుస్తుంది. కుమరేశన్ ఎంతో సంతోషిస్తాడు.కానీ తల్లికి ఆ విషయం చెప్తే ఎలా స్పందిస్తుందో అన్న భయంతో ఆమెకు ఏమి చెప్పాడు.
ఆ తర్వాతి రోజు మరియ మేకలను కాయడానికి వెళ్తుంది. సరోజకు ఎంతో ఆకలి వేస్తుంది. ఇక తినడానికి ఏమి లేక మరియ పాకలోని జావను దొంగిలించి ఆమెకు అనుమానం రాకుండా తాగుతుంది. తన దుస్థితికి తానే బాధపడుతుంది. ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చిన కుమరేశన్ మనసు బావుండదు. ఆ రోజు విరించిపాళయానికి వెళ్తున్నానని తిరిగి తరువాతి రోజు సాయంత్రమే తిరిగి వస్తానని చెప్పి వెళ్తాడు.
ఆ రోజు సాయంత్రం మరుగు కోసం ఇంటికి దూరంలో ఉన్న పొదల దగ్గరకు వెళ్ళిన సరోజకు అక్కడ ఆమె అత్త మరియ,ఇంకెవరితోనే మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి.ఆ మాటలు సరోజను చంపడం గురించే అనే అర్ధం అవుతుంది.అన్నాళ్లు అత్త తిట్టినా ఆమె అంత దారుణానికి పూనుకోదని భావించిన ఆమె ఆ సంఘటనతో ఏం చేయాలో తెలియక అక్కడే దాక్కుని ఉండిపోతుంది. ఆమె గురించి ఇంటి దగ్గర వెతికినా ఉండకపోవడంతో ఆమెను గాలిస్తూ ఉంటారు.సరోజకు తన భర్త తరువాతి రోజే వస్తానని భర్త చెప్పడంతో అత్త ఈ ఏర్పాటు ఇప్పుడు చేసిందని అర్ధమవుతుంది.తాను ఎలా అయినా తప్పించుకోవాలని అనుకుంటుంది.ఆ పొదల్లో కూడా ఆమె ఉండవచ్చని భావించిన వారు అక్కడ కూడా వెతకడం మొదలుపెట్టడంతో అక్కడ తుమ్మ ముళ్ళు ఉన్నా సరే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది.ఆమె కదలికల ద్వారా చెట్లు,పొదలు కదలడంతో ఆమెను వెంబడిస్తూ ఉన్న ముళ్ళు వాళ్ళను గుచ్చుకుంటూ ఉండటంతో అక్కడే ఆగిపోతారు. ఇక ఇలా లాభం లేదని ఆ పొదకు నిప్పు అంటిస్తారు. ఆ మంట తన చుట్టూ వ్యాపిస్తున్న సమయంలోనే సరోజకు భర్త సైకిల్ శబ్దం వినిపిస్తుంది. ఇక్కడితో నవల ముగుస్తుంది.ఒకవేళ భర్త అడ్డుపడితే అతన్ని అంతం చేస్తారు కనుక ఇక ఆ ఆశ గురించి పాఠకులు ఆలోచించాల్సిన అవసరమే లేదు.
మార్పును సహించలేని కుల వ్యవస్థలో హింస ఎలా ప్రజ్వరిల్లుతుందో ఈ నవల స్పష్టం చేస్తుంది.కులం అనే గోడ మనుషుల మనసుల మధ్య ఎంత ధృఢంగా కట్టబడిందో,దానిని దాటి ఏ ప్రేమ,అనుబంధాలు ఎలా దాటి రాలేవో కూడా ఈ నవల స్పష్టం చేస్తుంది.మనుషుల్లో మానవత్వం,సాటి మనుషుల పట్ల కరుణ కూడా ఈ వ్యవస్థ వల్ల ఎలా ధ్వంసం అవుతున్నాయో రచయిత ఈ నవలలో స్పష్టం చేశారు.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!