ప్రేమ వర్సస్ వ్యక్తిత్వం

 చదువరి

ప్రేమ వర్సస్ వ్యక్తిత్వం
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మనిషికి స్వీయనిర్ణయాలు తీసుకునే లక్షణం స్వేచ్ఛ నుండే ఉద్భవిస్తుంది.మన కుటుంబ,సామాజిక వాతావరణంలో మనకు నచ్చిన వారి కోసం నచ్చినవి చేయాలనే ప్రేరణ లేదా మనల్ని పెంచిన వారి మీధ భయభక్తులు వ్యక్తుల జీవితాల్లో అతి పెద్ద నిర్ణయాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి.ఈ పరిధి వ్యక్తి స్థాయి నుండి మొదలై ప్రపంచ స్థాయి వరకు విస్తరిస్తుంది.
కథాంశాలు సాధారణమైనవే అయినా వాటి ద్వారా రచయిత చెప్పదలుచుకున్న అంశాలే ఆ రచనకు విశిష్టతను సంతరించేలా చేస్తాయి.అటువంటి సాధారణ ప్రేమాంశంలోనే ఓ జీవన తత్వాన్ని స్పష్టం చేసే నవలే ఊరిటి సులేఖ గారి 'ప్రేమంటే?'
మనిషిని యవ్వనం ప్రభావితం చేసి,మత్తు జల్లునట్టు ఇంకే దశ చేయలేదు.ఆ యవ్వనంలో ఓ యువకుడు ప్రేమలో పడి తన జీవితం ఎలా ఉండాలో తనను మార్చుకునే ప్రయత్నంలో తనను తాను కోల్పోవడమే కాకుండా తన ప్రేమను కూడా ఎలా పొగొట్టుకున్నాడో ఈ నవల స్పష్టం చేస్తుంది.
శరత్ ఓ తెలివైన విద్యార్థి.డిగ్రీ చదువుతున్నాడు.అతనికి ఐఏయస్ అవ్వడమే ధ్యేయం.ఆ సమయంలో అతని సహాధ్యాయిని దివ్యతో ప్రేమలో పడతాడు.అతని తెలివితేటలు చూసి ఆమె అతన్ని ఇష్టపడుతుంది.ఆమె కోటీశ్వరురాలు.తన విలాసాలకు అతను సరితూగలేడని ఆమెకు ఆలోచిస్తే అర్థమయి అతనితో పయనం అక్కడే ఆపేయాలని నిర్ణయించుకుంటుంది.ఆ పరీక్షలయ్యాక శరత్ తన ప్రేమను వ్యక్తపరచి,తను అతని తెలివితేటలను ఇష్టపడినా,అతనిలో మగసిరి లేదని,తన దృష్టిలో మగసిరి అంటే విలాసంగా ఉండటం,తాగటం,ఖరీదైన జీవితం జీవించడం.అవి లేకుండా సాధారణంగా మధ్యతరగతి జీవితం గడపుతూ అదే స్థాయిలో ఉండటం తన దృష్టిలో మగాడు చేసేది కాదని చెప్తుంది.
అప్పటివరకు కష్టపడి చదివి తన లక్ష్యం సాధించడమే జీవితమనుకున్న శరత్ దివ్య తనను తిరస్కరించడానికి చెప్పిన కారణాలు విని అలా ఉంటే తాను ఎంతో సాధించినట్టు అనుకుని చదివి ఐపిఎస్ అవుతాడు.ఆ తరువాత ఆ విలాసవంతమైన జీవితమే లక్ష్యంగా చేసుకుని,మందు-సిగరెట్లు తాగడం,బార్లకు వెళ్ళడం వంటివి జీవితంలో భాగంగా చేసుకుంటాడు.
ఆ సమయంలో అతని దగ్గర అసిస్టెంట్ గా కావ్య వస్తుంది.ఆమెను ప్రేమిస్తాడు.కావ్య కూడా అతన్ని ప్రేమిస్తుంది.అతని తెలివితేటలను ఆరాధిస్తుంది.కావ్య స్వస్థలం మద్రాసు.ఉద్యోగరీత్యా బొంబాయి వచ్చినా మధ్యలో తల్లిదండ్రుల నుండి పిలుపు రావడంతో వెళ్తుంది.కావ్య తన చదువు పట్ల ఆసక్తి చూపించడం,ప్రోత్సహించడంతో శరత్ ఐఏఎస్ కు సిద్ధమవుతూ ఉంటాడు.ఆమె తన ఊరు వెళ్ళిన సమయంలో ఆమెను చూడకుండా ఉండలేక అక్కడికి వెళ్తాడు.
శ్రావ్య ఇంట్లో అప్పటికే ఆమె పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి.దాని గురించి
ఆమె అతనికి ఏం చెప్పదు.శరత్ తాను ఐఏఎస్ పరీక్షలో నెగ్గి ఆమె తల్లిదండ్రులతో తమ పెళ్ళి గురించి మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ సమయంలో శరత్ కున్న దురలవాట్లు,అతని గతం అన్ని ఆమెను ఆలోచించుకునేలా చేస్తాయి.తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా దురలవాట్లు ఉన్న అతన్ని పెళ్ళి చేసుకోకూడదనే ఆమె నిర్ణయించుకుంటుంది.శరత్ సివిల్స్ లో ఐఏఎస్ గా సెలక్ట్ అవుతాడు.అప్పుడు శ్రావ్య తనకు అప్పటికే తల్లిదండ్రులు పెళ్ళిసంబంధం చూశారని,త్వరలో తన పెళ్ళని చెప్తుంది.
శరత్ ను తాను పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం అతనికంటూ స్వంత వ్యక్తిత్వం లేకపోవడం వల్లే అని చెప్తుంది.గతంలో దివ్య వెళ్ళిపోయిన తరువాత ఆమెకు నచ్చిన ధోరణిలో జీవించడం అలవాటు చేసుకుని,ఇప్పుడు శ్రావ్య కోసం మారడం ఇదంతా ఒకరికోసం మారిపోయే చంచల వ్యక్తిత్వ లక్షణాలను తనకు అలాంటి వాడు వద్దని చెప్పి తిరస్కరిస్తుంది.ఇక్కడితో నవల ముగుస్తుంది.
మనిషి తాను ఎలా బ్రతకాలనుకుంటాడో దానికి వ్యతిరేకంగా మనగలిగే ప్రయత్నాలు చేసినా అవి వ్యక్తిని తిరోగతి పాలయ్యేలా చేస్తాయని ఈ నవల అంతర్లీన సందేశం.
స్వేచ్ఛ-స్వీయశిక్షణ-నిర్భందం మధ్య మనిషి తన జీవితాన్ని సమన్వయపరచుకోగలగాలి.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ