మగ స్నేహం

 చదువరి

మగ స్నేహం
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)


మనిషి జీవితంలో ఎవర్ని ఇష్టపడినా,అది ఏ పరిస్థితుల్లో సంభవించినా సరే,వాటిని నిజాయితీగా భావించి ఆ జీవితపు పుటలను జీవితపు భాగస్వామితో పంచుకుంటే,అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో స్పష్టం చేసే నవలే ఇచ్చావరపు జగన్నాథరావు గారి’ముళ్ళ గులాబీ’నవల. ఇది యువ మాసపత్రికలో ప్రచురించబడింది.
రేఖ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి మరణించాడు.తల్లి తన తమ్ముడైన ప్రకాశం చేతుల్లో కూతురిని పెట్టి మరణిస్తుంది. అక్క ఆస్తిని కబళించడమే కాకుండా రేఖ జీవితాన్ని కూడా నాశనం చేసే తరుణంలో ఆమె తన తండ్రి స్నేహితుడైన నరసింహారావుగారి సాయంతో అక్కడి నుండి బయటపడి పట్టణానికి వెళ్తుంది. అక్కడ నరసింహరావుగారి కూతురైన మాలతితో కలిసి ఉంటుంది.
ఎలాగో ఓ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ యజమాని జీవన్. జీవన్,రేఖాల మధ్య అభిమానం చిగురించింది. జీవన్ భార్య సవిత. ఆమె ఆస్తి వల్లే జీవన్ ధనవంతుడయ్యాడు. ఆ మాట మీదే అతన్ని సవిత సాధిస్తూ ఉంటుంది.జీవన్ కు.రేఖకు మధ్య శారీరక సంబంధం ఉండకపోయినా మానసిక సామీప్యత ఉన్నట్టే రేఖ భావిస్తుంది. పెళ్ళయిన అతనితో తనకున్నది స్నేహమే కనుక దానిని ఆమె తప్పుగా భావించదు.వారిద్దరు మహాబలిపురం వంటి ప్రదేశాలకు వెళ్ళడం వంటివి చేస్తూ ఉంటారు.
జీవన్ రేఖతో తనకు ఆమె మీద ఉన్న ప్రేమ ఆమె సంతోషంగా ఉండటానికి మాత్రమే అని తన వల్ల ఆమెకు ఏ విధమైన మచ్చ రాదని హామీ ఇస్తాడు.జీవన్ ఆమెకు ఓ ఇల్లు కొంటాడు.ఆమెకు వచ్చే జీతం కన్నా కూడా ఎక్కువే సమకూరుస్తాడు.
జీవన్ కంపెనీ ఫ్యాక్టరీలకు సరుకు సప్లై చేసే కంపెనీ. అలాంటి ఓ సప్లై ఫ్యాక్టరీలో పని చేస్తున్న గోపాల్ అనుకోకుండా రేఖను కలిసి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు.దాని పట్ల ఎలా స్పందించాలో తెలియకపోయినా జీవన్ ఏమనుకుంటాడో అని అతన్ని అడిగితే ఆమెకు ఇష్టమైతే పెళ్లి చేసుకోమని మంచి వాడేనని వాకబు చేశానని కాస్త తొందరపడే మనస్తత్వం అని చెప్తాడు.
పెళ్ళయిన ఆర్నెల్ల వరకు వారిద్దరు శారీరకంగా దూరంగానే ఉండిపోయారు. రేఖ మధ్యలో జీవన్ ను కలుస్తూనే ఉంది.ఆమె అక్కడికి వెళ్తుందో తెలియకపోయినా ఆమెను ఏనాడూ గోపాల్ అడ్డుకోలేదు.ఆ తర్వాత క్రమంగా గోపాల్ పట్ల రేఖకు ప్రేమ కలుగుతుంది.అతను ఆమెకు దగ్గరవ్వడానికి చేసే ప్రయత్నాలన్నీ ఆమె మనసు అతని మీదకు మరల్చుకునేలా చేస్తాయి.
ఓ సారి జీవన్ ను కలిసినప్పుడు అతను శారీరకంగా చనువు తీసుకోబోతే వ్యతిరేకత వ్యక్తం చేసి వచ్చేస్తుంది రేఖ. ఇంట్లో బాధలను మర్చిపోవడానికి రేఖ దగ్గర సాంత్వన పొందాడు జీవన్.
ఇక గోపాల్ కు ఎన్నాళ్ల నుందో వేచి చూస్తున్న అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది.కానీ రేఖను తీసుకువెళ్లే అవకాశం లేకపోవడం వల్ల తిరస్కరించినా ఫ్యాక్టరీ యజమాని లాల్ వచ్చి అడగటంతో రేఖ కూడా ప్రోత్సహించడంతో ఒప్పుకుంటాడు. గోపాల్ మీద ప్రేమతో మిగిలిన జీవితం గడపాలంటే తన గురించి అంతా చెప్పాలనుకుని అతనికి జీవన్ గురించి చెప్తుంది రేఖ.
ఈ విషయం వినగానే అతను కోపంతో ఊగిపోయి ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. ఆమె ఉంటున్న ఇల్లు,సౌకర్యాలు జీవన్ వల్ల అయినా,ఆమె అతన్ని శారీరకంగా దగ్గర కానివ్వకుండా సెంహితుడిగా ఉంచుతూనే,తన భర్తతో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేసింది.
కానీ దానిని స్నేహంగా అర్ధం చేసుకునే మనస్తత్వం గోపాల్ కు ఉంటుందో లేదో అని ఆమె ఆలోచించలేదు. ఆమెకు జీవన్ తో ఉన్న స్నేహం గురించి తప్పు అనే భావన లేదు.కానీ సమాజం తన ఇష్టాలను మనిషి ఇష్టాలుగా దానికి భిన్నమైనవి తప్పులుగా భావించేలా చేస్తుంది. దానికి లోబడే వ్యక్తులు ఆ రేఖను దాటితే తప్పు చేయకపోయినా ముళ్ళ గులాబీ లాంటి జీవితాన్నే అనుభవించాలి.రేఖ వ్యక్తిత్వం మంచిదే అయినా జీవన్ తో ఆమె స్నేహం ఆమె గులాబీ లాంటి జీవితానికి ముల్లు లాంటిదే అని రచయిత స్పష్టం చేశాడు.
ఈ నవలలో కథని నడిపిన తీరు చాలా బావుంటుంది.రేఖ మనస్తత్వం,ఆమెలో వచ్చే మార్పులు,ఆమె పరిస్థితుల గురించి స్పష్టం చేసే తీరు ఆమె స్నేహితురాలైన మాలతి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే తాను ప్రేమించిన అరుణ్ ఆమెను బలవంతపెట్టినా గట్టిగా నిలబడి పెళ్ళి వరకు తెచ్చిన తీరు కథలో ఎలా ఇటువంటి పరిస్థితుల్లో బలహీనం కాకుండా స్త్రీ ఉండాలో కూడా స్పష్టం చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!