స్వార్థం-బానిస జన్మ

 చదువరి

స్వార్థం-బానిస జన్మ
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మనిషిని పరిస్థితులు ఎలా మనిషిని తన వరకు మాత్రమే ఆలోచించేలా చేస్తాయో స్పష్టం చేసే నవలే వసంత చక్రపాణి గారి ‘తను,తన సుఖం.’ బాల్యం నుండి నిస్సహాయత వాతావరణం ఏర్పడినప్పుడు ఎలా మనుషుల జీవితం వారి అధీనం నుండి పక్క వారి చేతుల్లోకి వెళ్లిపోతుందో,మనుషుల్లో బానిసలు ఎలా తయారవుతారో కుటుంబాల్లో ఈ నవల స్పష్టం చేస్తుంది.
భాగ్య లక్ష్మి,రామ కృష్ణ దంపతుల సంతానం ధనలక్ష్మి,బాలకృష్ణ. భాగ్య లక్ష్మికి ఓ సారి అనారోగ్యం వస్తే మెడికల్ షాపులో ఇచ్చిన సల్ఫా టాబ్లెట్లు వాడుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్ గా ఒళ్ళంతా దద్దుర్లు,దురదలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసినందుకు ఆమె మరణిస్తుంది. తానే తన భార్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానన్న అపరాధ భావంతో రామకృష్ణ కూడా కృంగి కృశించిపోతాడు. ఇక కొన్నాళ్ళకు ఆయన కూడా మరణిస్తాడు. భాగ్యలక్ష్మి తరపు బంధువులు ఉన్న వారు కాదు. ఇకపోతే రామకృష్ణకు ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు కాంతం. కాంతానికి ఆరుగురు సంతానం. ఇంకో చెల్లెలు శివరంజని.ఆమె ముంబయిలో ఉంటుంది.ఆమె భర్తకు ఓ ఫ్యాక్టరీ కూడా ఉంది.ఆమెకు ఒక కూతురు,పుష్ప. ఇక శివరంజని ఆ ఇద్దరు పిల్లలని తన ఇంటికి తీసుకు వెళ్తుంది.
బాలకృష్ణ మగపిల్లవాడు కనుక భవిష్యత్తులో తన కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక అతన్ని మాత్రమే చదివిస్తామని,ధనలక్ష్మి ఆడపిల్ల కనుక అంత అవసరం ఉండదని,తమకు అంత స్థోమత కూడా లేదని స్పష్టం చేస్తుంది శివరంజని. శివరంజని ఇంటికి వెళ్ళాక ఆమె ఎంత ధనవంతురాలో ధనలక్ష్మికి అర్ధమవుతుంది. శివరంజని అప్పటివరకూ ఇంట్లో ఉన్న పనిమనిషిని ధనలక్ష్మి రాగానే ఏదో సాకు చెప్పి తప్పించి ఆ ఇంటి పని అంతా ఆమె మీద పడేలా చేస్తుంది.శివరంజనికి సినిమాలు,షాపింగులు,పార్టీలు లోకం. బాలకృష్ణను మాత్రం చదివిస్తూ ఉంటారు.అప్పటికే ధనలక్ష్మి,బాలకృష్ణ అక్కడికి వచ్చి ఆరేళ్లు గడచిపోయాయి. ధనలక్ష్మికి ఇరవై ఒకటి వచ్చేశాయి.బాలకృష్ణ డిగ్రీ చదువుతున్నాడు.
బాలకృష్ణ అంటే ధనలక్ష్మికి చాలా ఇష్టం.అతని జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది.బాలకృష్ణకు కూడా అక్క అంటే ఎంతో ప్రేమ.ఆ ఇంట్లో పనిమనిషిగా బ్రతుకుతున్న అక్కని తనకు డిగ్రీ తర్వాత ఉద్యోగం రాగానే తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండేవాడు.
ధనలక్ష్మికి సంబంధాలు వస్తూ ఉన్నాయి.అన్ని సంబంధాలకు ఏదో ఒక వంక పెట్టి శివరంజని తప్పించేది.ఓ పెళ్ళికొడుకు కజిన్ బాలకృష్ణ స్నేహితుడు అవ్వడం వల్ల బాలకృష్ణకు అసలు విషయం తెలుస్తుంది. ఆ పెళ్ళికొడుకు కుటుంబానికి ధనలక్ష్మి నచ్చి కట్నం వద్దన్నా సరే ధనలక్ష్మికి ఫిట్స్ వస్తాయని చెప్పి ఆ సంబంధం శివరంజని చెడగొట్టిందని తెలుస్తుంది.ధనలక్ష్మి వెళ్ళిపోతే ఇంతేడు చాకిరీ చేసే వారు ఉండరని,పని మనిషి ఉన్న ఆమెకు జీతం ఇచ్చినా బాధ్యతగా ఉండరని అందుకే ఆమెకు పెళ్ళి కాకుండా చూస్తుందని అంటాడు బాలకృష్ణ.అదే నిజమని తర్వాత వచ్చిన సంబంధాలు కూడా చెడగొట్టడంతో ధనలక్ష్మికి అర్ధమవుతుంది.అయినా తన తమ్ముడు బాగా చదువుకుంటే చాలని,అతనికి ఉద్యోగం వస్తే తన జీవితం కూడా బాగుపడవచ్చని భావిస్తూ ఉంటుంది ఆమె.
పుష్ప స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఓ యాక్సిడెంట్ అవుతుంది.దాని వల్ల ఆమె కాళి ఎముకలు విరుగుతాయి.అక్కడి వైద్యం సరిగ్గా పని చేయకపోవడం వల్ల మిత్రుని సలహాపై ఆమెను పుత్తూరు తీసుకువెళ్దామని నిర్ణయించుకుంటారు శివరంజని దంపతులు. పుత్తూరులో రెండు నెలలు ఉండాల్సి రావడంతో తన ఫ్యాక్టరీ ఆర్డర్లు దెబ్బ తింటాయని,రామచంద్రం పుష్పా,శివరంజనీలకు అక్కడ ఏర్పాటు చేసి తాను ఇంటికి వచ్చేస్తాడు.
ధనలక్ష్మి మీద ఇంటి భారం పడుతుంది. ధనలక్ష్మి మీద రామచంద్రం కన్ను పడుతుంది.అసలే నెమ్మదస్తురాలు,భయస్థురాలు అయినా ధనలక్ష్మిని తనకు లొంగకపోతే ఆమె తమ్ముడి చదువు తరువాతి రోజు ఆగిపోతుందని బెదిరించి,బాలకృష్ణను అనుమానం రాకుండా అతన్ని సినిమాకు పంపించి ఆమెను లోబర్చుకుంటాడు. తర్వాత ధనలక్ష్మి గర్భవతి అవుతుంది. పుష్ప, శివరంజని ఇంటికి తిరిగి వస్తారు. అప్పటికే ధనలక్ష్మికి నాలుగు నెలలు.గర్భస్రావం చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు. రామచంద్రం తన పేరు బయటపెట్టవద్దని వేడుకుంటాడు. శివరంజని ఓ ఉపాయం ఆలోచించి కాంతాన్ని పిలిపించి ఆమె కూతురు పెళ్ళికి ధన సాయం చేసి కాంతం దగ్గర ధనలక్ష్మిని ఉంచుతుంది. ధనలక్ష్మి మెడలో ఓ పసుపుతాడు వేసి ఆమె భర్త మిలిటరిలో ఉన్నాడని నమ్మించి ఆమె కాన్పు అక్కడే జరిగేలా చూస్తారు.అక్కడ కూడా కాన్పు వచ్చే వరకు ధనలక్ష్మి వంటింటికే అంకితం అవుతుంది. ధనలక్ష్మికి బాబు పుడతాడు.
ధనలక్ష్మికి అక్కడకు వచ్చాక తమ్ముడి నుండి ఉత్తరాలు రావడం కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత తమ్ముడు వస్తాడు. ఆమెకు పుట్టిన బాబును అనాధాశ్రమంలో వదిలేస్తే ఇక ఆమెను తన అత్త శివరంజని ఇంటికి వెళ్ళవచ్చని,ఆమెను మాత్రమే తీసుకురమ్మని పంపించారని చెప్తాడు. తాను ఉద్యోగం చేయబోవడం లేదని మామయ్య ఫ్యాక్టరీలో పార్టనర్ గా చేరబోతున్నానని,పుష్పను వివాహం చేసుకోబోతున్నానని చెప్తాడు. తాను లేని ఈ ఆరునెలల్లో తన తమ్ముడిని పూర్తిగా మార్చేశారని,ఇప్పుడు అతనికి డబ్బు తప్ప ఏమి కనిపించదని ధనలక్ష్మికి స్పష్టం అవుతుంది.ఇక తనకి ఈ లోకంలో ఎవరు లేరని అర్ధమైన ఆమె నీళ్ళల్లో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ నవలను ఏ రకంగా మలుపు తిప్పినా సరే ముగింపు మాత్రం ఇలానే ఉంటుందని ఊహించవచ్చు. ఒకవేళ ధనలక్ష్మి దుస్థితికి కారణం రామచంద్రం అని తెలిసినా ఆమె భార్య శివరంజని సంపాదించే మొగుడుని తప్పు పట్టదు,నిస్సహాయంగా ఉన్న ధనలక్ష్మినే తప్పు పడుతుంది. ఎందుకంటే బలవంతులు బలహీనులనే తమ బానిసలుగా చేసుకోగలుగుతారు.ఇకపోతే బాలకృష్ణ కూడా చదువు కోసం వారి మీద ఆధరపడ్డవాడే కనుక తనకు లాభించే కోణంలోనే ఆలోచించేవాడు.ఇది మనుషుల అవసరాలకు,వాస్తవాలకు మధ్య ఏర్పడే లోటు నుండి జన్మించే సంఘర్షణ వల్ల స్వార్ధంగా పరిణమిస్తుంది. మనుషుల స్వార్ధాన్ని ఈ నవలలోని అన్ని పాత్రలు స్పష్టం చేస్తాయి.వీరందరి స్వార్ధానికి బలయ్యే పాత్రగా ధనలక్ష్మి మనకు కనిపిస్తుంది.ఆమె పాత్ర కేవలం నిస్సహాయత వల్ల అలా ప్రవర్తించింది అని కూడా మనకు అర్ధమవుతుంది. మనిషికి తనను తాను కాపాడుకోవడానికి ఆత్మవిశ్వాసం,ధైర్యం కూడా లేకపోతే ఎలా వ్యాపారంలో లాభం లేని ఉత్పత్తి సరుకుగా మారిపోతారో స్పష్టం చేసే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!