సాహితీవ్యాపారం

 చదువరి

సాహితీవ్యాపారం
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



విలువలు పాటించేవారు ఉంటేనే మనగలుగుతాయి.విలువల అస్థిత్వం వాటి ప్రభావం-ఆచరణల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది అన్నీ రంగాల నీతి,నియమాలకు వర్తిస్తుంది.కానీ వ్యాపార రంగం ప్రపంచంలోని అన్నీ రంగాలను దాదాపుగా తన వైపు మళ్ళేలా ఆకర్షించగలిగింది. విద్య-వైద్య రంగాలకు విస్తరించిన ఈ వ్యాపార ప్రభావం సాహిత్యాన్ని కూడా వదలలేదు. సాహిత్యంలో ఉత్తమ సాహిత్యమేది అన్న ప్రశ్నకు ఒకటే సమాధానానికి రాలేని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.రచయితలు తమకు ఆత్మ సంతృప్తి కలిగించే రచనలు చేస్తున్నారా?లేక పత్రికల కోసం రాస్తున్నారా?అనే ప్రశ్నకు సమాధానం రచయితే చెప్పగలిగిన స్థితి కూడా ఏర్పడింది. రచనల్లో వ్యాపార రచనల ట్రెండ్ వచ్చాక సాహితీ రంగం,రచయితలు,ఎడిటర్లు ఎలా మారిపోయారో చెప్పే ప్రయత్నమే అర్నాద్ గారి ‘ ద ఎడిటర్’ నవల. కచ్చితంగా సాహితీవేత్తలు చదవాల్సిన నవల.
ఈ నవలలో కథ పెద్దది కాదు. కథ చిన్నదే కానీ సాహితీవ్యాపారాన్ని ప్రశ్నించే కథ ఇది. రవిచంద్ర సాహిత్యం పట్ల ఎంతో అభిమానం కలవాడు,సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడగల దృక్కోణం ఉన్నవాడు. ఎంతో కష్టపడి,ఎన్నో అవరోధాలను ఎదుర్కుని సుమతి అనే వారపత్రికను తీసుకువచ్చాడు. ఆ పత్రిక ఆవిష్కరణ సభతో ఈ నవల మొదలవుతుంది. ఈ ఆవిష్కరణ సభలో వ్యాపారవేత్త సంపత్, పాపులర్ రచయిత శ్రీ వాత్సవ ప్రసంగాల ద్వారా సాహిత్యంలో ఉన్న సమస్యలను,సమకాలీన వ్యాపార ధోరణి సాహిత్యంలో చొచ్చుకుపోతున్న వైనాన్ని రచయిత స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.
పత్రిక ఒక్కటే ఉన్నప్పుడూ అది వ్యాపారం అయ్యే ఆస్కారం తక్కువ కానీ, మిగిలిన వ్యాపారాలతో పాటు పత్రికలు కూడా ఒక భాగం అయితే సాహిత్యం వ్యాపార వస్తువుగా మారిపోతుంది.పత్రికను నడపాలంటే అది ఎంతో ఆర్థిక ప్రయాసతో కూడుకున్న పని,అప్పుడు దానిని నడిపించడానికి అయినా సరే కొంతమేరకు వ్యాపారపు ధోరణిని ఆహ్వానించక తప్పదు. ఆ ధోరణితో మొదలై పూర్తిగా పత్రికలు వ్యాపారమయ్యేలా ఈ మార్పు సంభవించింది. ఇది పత్రిక నడిపే వారి కోణం అయితే ఇంకో కోణం పాఠకులకు ఉంది. చదవడం మంచి అలవాటు.అలాగే రాయగలగడం సరస్వతి కటాక్షంగా భావించేవారు గతంలో. కానీ విద్య వ్యాపారమయ్యాక ఆ ప్రభావం పిల్లల తల్లిదండ్రులపై కూడా అదే స్థాయిలో చూపింది. ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్న తమ పిల్లలు అంతే భారీగా సంపాదిస్తే తప్ప ఆ విద్యకు సార్థకత ఉండదని భావించే మనస్తత్వం పెరిగిపోతూ ఉండటం వల్ల డబ్బు సంపాదించిపెట్టలేని సాహిత్యం,లలిత కళల పట్ల పిల్లలను ప్రోత్సహించే వాతావరణం కూడా లోపిస్తుంది. దీని వల్ల తరాలు మారే కొద్ది పాఠకుల స్థాయి తగ్గిపోతూ,పఠనాభిరుచి ఉన్న వారు కూడా మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఉద్రేకపరిచే సాహిత్యం పట్లే మగ్గు చూపడం వల్ల వారిని సంతృప్తి పరిచే దశలో మసాలా ప్రయోగాలు పత్రికల్లో జరుగుతూ ఉండటం వల్ల సాహిత్యంలో సాహిత్యమెక్కడ ఉందో వెతుక్కోవలసిన పరిస్థితి నేడు ఏర్పడింది.
ఇకపోతే రచయితలు కూడా వివిధ పత్రికల్లో తమ రచనలు ప్రచురించబడాలంటే దానికి తగ్గట్టు తమను తాము మార్చుకుని ఆ సెన్సేషన్ రచనా సృష్టిలో మునిగిపోతూ తన ఉనికిని కోల్పోతునే దానిని తనకు లభించే సుఖాల్లో వెతుక్కోవడం వల్ల,ఆ రచయితలు క్రమేపీ తమ శైలిని కోల్పోయి ఆ కృత్రిమ వ్యాపార సాహిత్యానికే అంకితమైపోతున్నారు. ఇది రచయితలు ఇష్టపడి చేయపోయినా సరే తమ జీవితభృతి కోసం ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు.అందులోనూ పత్రికల్లో ప్రచురించబడే రచనలకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది.అక్కడి నుండి సినీ రచయితగా ఎదిగే అవకాశమూ ఉంటుంది. అందుకే రచయిత ఈ ఎదుగుదల కోసం తల ఒగ్గక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇకపోతే ఈ నవలలో రచయిత ‘పాఠక దేవుళ్ళు’అనే పద ప్రయోగ విశిష్టతకు తన చమ్మక్కును చేర్చి ఇంకో దృక్కోణంలో పాఠకుల్ని ఆలోచించేలా చేశారు. వినియోగదారులే దేవుళ్ళు అన్నది వ్యాపార నినాదం. ‘పాఠకదేవుళ్ళు’అనే పదానికి ఇంకో కోణంలో సాహిత్యమనే వ్యాపారానికి వినియోగదారులు పాఠకులు అని ఘాటుగానే చెప్పారు రచయిత. పాఠకులకు ఏది నచ్చుతుందో కూడా వారి పత్రికల ఎడిటర్లే నిర్ణయించి అదే తరహా రచనలకు మసాలా దట్టించి ఓ మార్కెట్ సరుకుగా రచనను మార్చే విధానాన్ని ఈ నవలలో రచయిత స్పష్టం చేశారు. రచయితలు ఉంటేనే రచనలు,రచనలు ఉంటేనే పాఠకులు అని రచయితే కీలకం అన్నట్టు మాట్లాడినా సరే రచయితకు రచనా స్వేచ్చకు సంకెళ్ళు పడుతూనే ఉంటాయని కూడా రచయిత స్పష్టం చేశారు.కథల్లో,కవితల్లో రచయిత స్వేచ్చ స్పష్టమైనా నవలల్లో మాత్రం దానికి కత్తెర పడుతుందనే ఈ నవలలో మీనాక్షి అనే ఎడిటర్ పాత్ర ద్వారా స్పష్టం చేశారు రచయిత.
ఈ నవలలో ముగ్గురు ఎడిటర్లను రచయిత ప్రధాన పాత్రలుగా చిత్రీకరించారు.ఎడిటర్ మీనాక్షి అప్పటికే సెన్సేషనల్ ఎడిటర్ గా ఎదిగింది.ఆమె ఎదిగిన క్రమం కూడా రచయిత చెప్పడం ద్వారా ఓ కోణాన్ని పరిచయం చేశారు.ఆమె మొదట సంపత్ పత్రికలో సినీ పేజీలో పని చేసేది.అప్పుడు ఓ హీరో గురించి ఎక్కువ రాసింది పద పరిమితిని మించి.ఇది మూడు సార్లు జరగటం,ఆమె తన పద్ధతిని మార్చుకోకపోవడం వల్ల ఆమెను అక్కడి నుండి తొలగిస్తే ఆ సదరు హీరో ద్వారా సినీ రచయిత్రిగా,గేయ రచయిత్రిగా విఫలమై ఆమె చివరకు ఆ హీరో ద్వారా చంద్రిక పత్రికలో ప్రవేశించింది.అప్పటికే చంద్రిక వార పత్రికకు ఎడిటర్ గా ఉన్న రాజారావుకు ఆ వ్యాపార సంస్థ అధినేతకు మధ్య అభిప్రాయ భేధాలు ఏర్పడి అతను రెండు నెలలు సెలవు పెడితే ఆ సమయంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అదే సమయంలో ఓ క్షుద్ర సాహిత్య నవలతో వచ్చిన శ్రీవాత్సవ నవలను ప్రచురించి ఆ నవలా ద్వారా చంద్రిక సర్క్యులేషన్ పెంచి ఆ పత్రికకు ఎడిటర్ గా మారింది.ఆ పత్రిక సర్క్యులేషన్ పెరగటంతో మిగిలిన పత్రికల ఎడిటర్లు కూడా తమ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం అవే పద్ధతులను అవలంభించక తప్పలేదు.
శ్రీవాత్సవ,రవిచంద్ర మంచి స్నేహితులు. రవిచంద్ర సాహిత్యపు విలువలు కోల్పోకుండా సుమతి పత్రికను నడపాలని నిర్ణయించుకుంటాడు.అందుకు అతనికి సహకారం అందించే పాత్ర అరుణ.ఆమె రాజారావు కూతురు. వివిధ పత్రికలకు ఎడిటర్ గా పని చేసి వ్యాపారం కోసం రాజీ పడే పత్రికాధినేతలతో పనిచేయలేక ఇక చివరకు ఓ కోళ్ళ ఫారం పెట్టుకుని బ్రతుకుతున్నాడు రాజారావు.
ఇక రవిచంద్రను కూడా తమ బృందంలో చేర్చుకోవడానికి మీనాక్షి అతన్ని రామ్మూర్తి అనే సీనియర్ ఎడిటర్ ద్వారా ఆహ్వానించి మందు పార్టీ పెట్టినా దానిలో నిక్కచ్చిగా తన విలువలను వదులుకోనని చెప్పి నిష్క్రమిస్తాడు రవిచంద్ర. ఆ తర్వాత మీనాక్షి చర్యలకు ఆమెను చంద్రిక పత్రిక యాజమాన్యం తొలగించడం ఆమె ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియకపోవడంతో ఆమె కథ ముగుస్తుంది.
ఇకపోతే రవిచంద్ర కూడా తన పత్రికలో మంచి రచనలు లేక,ఒకప్పుడు గొప్ప రచనలు చేసిన వారు కూడా వాసి తగ్గిన రచనలు పంపడంతో, గత వైభవాన్ని గుర్తుకు తెచ్చే గత కాలపు రచనలతో పత్రికను అసంతృప్తితోనే నడిపిస్తున్నాడు.ఇక వార పత్రికను మాస పత్రిక చేయాలని నిర్ణయించుకోవడంతో నవల ముగుస్తుంది.
వ్యాపారం పత్రికల్లో భాగం అవ్వడం వల్ల ఎడిటర్లు రాజీ పడే వైనాన్ని స్పష్టం చేస్తూనే, ఆ వ్యాపార పత్రికల కోసం రాజీ పడే రచయితల గురించి కూడా రచయిత గట్టిగానే చెప్పారు. ఈ నవల 1988లో స్వాతి మాస పత్రికలో ప్రచురించబడినప్పటికీ,ఇది నిత్య నూతన సమకాలీన అంశమే.పాఠకుల ఆలోచనలను వాస్తవ లోకంలోకి తీసుకువెళ్లే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!