వివిధ సందర్భాల్లో మనిషి

 చదువరి

వివిధ సందర్భాల్లో మనిషి
-శృంగవరపు రచన



తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఎన్నో నవలలు వచ్చాయి, వస్తున్నాయి.చారిత్రక నేపథ్యంలో కల్పన జోడించినప్పుడు పాత్ర కేంద్రిత నవలలుగా అవి పరిణమించే ప్రమాదం ఉన్నది.నవలలోని పాత్ర చిత్రణలో,వస్తుధ్వనిలో,రసానుభూతిలో,కథావస్తువులో రచయిత భావజాలం-భావాలు పాఠకులకు స్పష్టపరిచేవే పాఠకులను ఆలోచింపజేసే రచనలు.నవలల్లో ఈ భావాలను గట్టిగా బలపరిచేలా పాత్రల పరిమితిని దాటి ప్రయత్నించడం సాహసమే.కారణం ఈ సాహసం వల్ల కథలను మాత్రమే ఇష్టపడేవారికి కథానుభూతిని పూర్తిగా ఆస్వాదించే అవకాశం పరిమితమౌతుంది.కానీ చరిత్రలో ఉద్భవించిన ఉద్యమాలను,వాటి ప్రభావాలను,వాటిలో భాగమైన వారి ఆలోచనా రీతులను,ఆ ప్రాంతాల వారి జీవన చిత్రాలను ఒక రచనలో స్పష్టం చేయాలన్నా కథను దాటి రచయిత పయనించాల్సిందే.అలా కథను దాటి పయనించారు తన తొలి నవల 'పొత్తి' ద్వారా యువరచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి.
ఈ కథా వస్తువును ఓ ప్రేమ కథ అనలేము,కేవలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే పరిమితం అనలేము,వ్యవసాయ చిత్రమని అనలేము.సాధారణంగా వ్యక్తిలో,వ్యవస్థలో ఉండే నిస్సహాయతలను అవకాశాలుగా మార్చుకునే వ్యాపార ప్రవృత్తులను,తమ ప్రత్యేక అస్తిత్వం కోసం విసిగిపోయిన వారి మార్గాన్ని,సహానంతో సాధించిన వారి నడతను,పల్లె జీవన చిత్రంలో 'ప్రత్యేక తెలంగాణ' రాకపోవడం వల్ల రైతులు గురైన దోపిడిని,పల్లె జీవనంలో దోపిడి వర్గాల వల్ల సమిష్టి కుటుంబ స్థాయి-వ్యక్తిగత ప్రయోజనాలకు ఎలా పరిమితమౌతుందో లాంటి పెద్ద అంశాల్లో ఓ చిన్న ప్రేమ కథ ఈ నవల.
పొత్తి(The Boundary) అన్నది ఈ నవలా శీర్షిక.వ్యవసాయ అర్థాన్ని పక్కన పెడితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది.దాని విస్తీర్ణం వ్యక్తుల మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది.మనుషుల్లో భయంతో భరించగలిగేవారు కొందరు, అసహనంతో భరించలేని వారు ఇంకొందరు,భరిస్తే ప్రయోజనముంటుందనే సహించేవారు మరికొందరు.ఇలా భరించడంలో వివిధ రకాల మనుషులు,అలాగే వివిధ దశలు కూడా ఉంటాయి.
'ప్రత్యేక తెలంగాణ' కోసం విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తున్న రోజులవి.ఉస్మానియా ఈ త్యాగాలకు ఆనవాలు.ఈ ఉస్మానియాలో విద్యార్థి శంకర్ ఈ నవల కథానాయకుడు.శంకర్ కాలేజీ జీవితం ద్వారా "ప్రత్యేక తెలంగాణ" లో విద్యార్థుల పాత్రను,శంకర్ వ్యక్తిగత జీవితం ద్వారా తెలంగాణలోని ఓ గ్రామ పరిస్థితులను,ఆ గ్రామంలోని వివిధ మనస్తత్వాలను స్పష్టం చేశారు రచయిత.
శంకర్ ఆ గ్రామంలో పటేల్ మల్లారెడ్డి కొడుకు అయితే,గంగ మల్లారెడ్డి దగ్గర పని చేసే వీరయ్య కూతురు.వీరి మధ్య ప్రేమ సన్నివేశాలు,గాఢతలు అధికంగా ఉండవు.వీరు కలిసే ముఖ్య సన్నివేశాలు మూడే.డిగ్రీ చదివిన గంగ పిజీ కోసం ఉస్మానియాలో ఎంట్రన్స్ పరీక్ష రాయడం,ఆ సమయంలో చదువు విషయమై కలవడం,ఆ క్షణంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ అంకురించడం,ఆ తరువాత కాలేజీలో ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమిస్తున్న ర్యాలీలో ఇద్దరు భాగమై ఉండటం,ఉద్యమంలో గాయపడిన శంకర్ ను గంగ చూసుకోవడం.ఈ మూడు సన్నివేశాలతొ వీరి ప్రేమ-పెళ్ళి నిర్ణయాలు పాఠకులకు స్పష్టమైపోతాయి.ఆర్థిక భేదం ఉన్న వీరిద్దరి మధ్య వివాహానికి శంకర్ తండ్రి ఒప్పుకోని సందర్భంలో రచయిత కధను సాగతీయకుండా 'సర్వ మానవ సమానత్వ' అంశంతో జోడించి ఈ ప్రేమ కథను సుఖాంతం చేసారు.మనుషులు కష్టాల్లో తమతో ఉన్న వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు.మల్లారెడ్డి గాయాలతో ఉన్నప్పుడు వీరయ్య కాపాడటం,తన రక్తం ఇవ్వడం సంఘటన ద్వారా చాలా క్లుప్తంగా ఈ ప్రేమ కథను ముగించేసారు రచయిత.దీని ద్వారా ఈ నవలలోని అన్ని అంశాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఓ సంతృప్తికరమైన సమగ్ర చిత్రాన్ని పాఠకుల ముందు ఉంచగలిగారు రచయిత.
ఇక గ్రామ విషయానికి వస్తే గ్రామజీవనంలో మనుషుల్లో ఉండే సహజసిద్ధమైన ప్రేమ భావనను స్పష్టం చేసే పాత్ర యాదమ్మది.యాదమ్మ తన గేదె బంగారం మీద పెంచుకున్న ప్రేమ,అభిమానం ద్వారా కేవలం పాలు ఇచ్చే వ్యాపార ఉత్పత్తిగా కాకుండా జీవితంలో ఓ భాగంగా భావించే ఓ మనిషి మనసు ఆవిష్కృతమవుతుంది.
ఇదే నవలలో మల్లారెడ్డి,సోమిరెడ్డి అన్నాదమ్ముల్లు.పదెకరాల పొలంను ఆ సోదరులు సగం సగంగా పంచుకున్నారు.వ్యవసాయం వల్ల లాభం వచ్చే పరిస్థితులు లేవు.యాదమ్మ బంగారం మీద పెంచుకున్న ప్రేమే మల్లారెడ్డికి తన పొలం మీద ఉంది.పరిస్థితులు-అప్పులు-ప్రలోభాలు అన్నింటికి దూరంగా ఉన్న వ్యక్తి మల్లారెడ్డి.వ్యవసాయంలో నష్టాలు,అప్పులకు భయపడి దీనిని అమ్మేసిన వ్యక్తి సోమిరెడ్డి.చివరకు పొలం అమ్మేసాక ఫైనాన్సింగ్ మోసానికి గురై ఆ సొమ్ము కూడా పొగొట్టుకున్న వ్యక్తి సోమిరెడ్డి.
ఈ నవల పాత్రచిత్రణలో 'Comparative Characters' మనకు కనిపిస్తాయి.ఈ పాత్రల ఆశయాలు ఒకటే అయినా,వారి మనస్తత్వాలకు అనుగుణంగా మార్గాలు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది.ఇదే చిత్రణ మనకు శంకర్ స్నేహాతులైన రవి,సూరి పాత్రల్లో కూడా కనిపిస్తుంది.
ప్రత్యేక తెలంగాణ కోసం కలలు కన్న వారిలో శంకర్,రవి,సూరి పాత్రలను ప్రత్యక్ష-పరోక్ష రూపాల్లో రచయిత పాఠకులకు పరిచయం చేస్తారు.రవి ఆత్మహత్య చేసుకుంటే,సూరి ఉద్యమం నుండి కామ్రేడ్ దిశలో పయనించి ఎన్ కౌంటర్ లో మరణిస్తాడు.ఈ ముగ్గురి ఆశయం ప్రత్యేక తెలంగాణ.కానీ వీరి మార్గాల్లో ఉన్న వ్యత్యాసం,వారు ఒకే సమస్య సందర్భంలో ప్రతిస్పందించిన తీరు ద్వారా ఓ కథలోనే వివిధ మనస్తత్వాలతో పాఠకులకు పరిచయం కలిగేలా చేసారు.
ఈ నవలలో అవకాశవాద పాత్ర ఆ గ్రామ సర్పంచ్ పుల్లయ్య.ప్రజల ఎన్నుకున్న ఈ ప్రజాస్వామ్యంలో సర్పంచ్ అయిన పుల్లయ్య తన గ్రామంలో గ్రామస్థులు బాధల్లో ఉండటం గమనించి వారి నిస్సహాయతలను తన వ్యాపార ఉత్పత్తిగా మార్చుకుని వారి పొలాలను అతి తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ రంగానికి అమ్మి,తాను లాభపడుతూ ప్రజాభక్షకుడిగా మారడం మనుషుల్లోని 'మనీయిజం'కు దర్పణం.
చివరకు ప్రత్యేక తెలంగాణ రావడం,దాని వల్ల రైతుల్లో చిగురించిన ఆశను మల్లారెడ్డి పాత్ర ద్వారా స్పష్టం చేయడం,బొడ్రాయి(ఊరికి కీడు రాకుండా పెట్టేది,కొలిచే రాయి,నాభిశిల) పండుగ చేసుకోవడం,తమను,తమ పంటను రక్షించుకోవాలనే నిర్ణయం ఆ గ్రామం తీసుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ నవలలో సజీవ పరిస్థితుల చిత్రం నిక్షిప్తమై ఉంది.మనస్తత్వాల వైరుధ్యం ఉంది.గంగపాత్ర ద్వారా మనం ఇంకొకరి కోసం మారకూడదని,మన ఆలోచనలు రూపొందించే మనను దాటి మనం ఇంకొకరిగా కృత్రిమ నకలు కాకూడదనే అంశాన్ని కూడా రచయిత స్పష్టం చేస్తారు.కొత్తగా యూనివర్సిటీకి వచ్చిన గంగ తన తోటి అమ్మాయిల వేషధారణకు అనుకరించదు.అవమానాలు-అవహేళనలు ఉంటాయని తెలిసినా తన అస్తిత్వాన్ని ఏ అంశంలోనూ మార్చుకోవడానికి ఇష్టపడదు.పాత్రల వ్యక్తిత్వ మూలాల ద్వారా కూడా రచయిత ఉద్యమంలోనైనా,జీవితంలోనైనా వ్యక్తికి తన అభిప్రాయాల్లో,విలువల్లో ఉండాల్సిన స్థిరత్వం గురించి రచయిత గట్టిగా చెప్పారు.
తను చెప్పాలనుకున్న అభిప్రాయాలను,విలువలను,మానవీయ సిద్ధాంతాలను గట్టిగా 'పొత్తి' నవల ద్వారా చెప్పిన ఈ యువ రచయిత ఇంకెన్నో మంచి రచనలు చేయాలని ఆశిద్దాం.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!