మార్పు పరిధి
మార్పు పరిధి
-శృంగవరపు రచన
(అన్వర్ గారి ‘జమీలా బాయి’ నవలా సమీక్ష)

అన్వర్ గారి 'జమీలాబాయి' నవల స్త్రీవాద నవలగా నాకనిపించలేదు.'ఓ వేశ్య కాని వేశ్య' జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ పురుషుడు ఇందులో ఉన్నాడు,ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సంకుచిత భావజాలం,మనిషి మంచితనానికి హద్దులు ఎందుకు ఏర్పడతాయో స్పష్టం చేసిన ఓ జీవన చిత్రం ఈ నవల.
జీవితం గొప్పదా?మనిషి గొప్పవాడా? స్త్రీ గొప్పదా?పురుషుడు గొప్పవాడా?ఓటరు గొప్పవాడా?పాలకుడు గొప్పవాడా?వంటి ప్రశ్నలకు సిద్ధాంతపరమైన జవాబులకు,వాస్తవ కోణాలకు మధ్య వైరుధ్యముండే తీరుతుంది.ఎందుకీ వైరుధ్యత?ఎందుకు గొప్పతనాల ప్రదర్శనలు? అంటే మనిషి తన అవగాహన పరిమితి మేరకే తనను విస్తరించుకుంటూ,ఆ విస్తృతిలోనే అంతమైపోవడం వల్ల.
ఆ విస్తృతి మనుషుల అహాలకు,విజయానుభవాలకు,పరాజయ ఉద్రేకాలకు చుట్టుకుని ఆ కేంద్రాన్ని దాటే మనుషులు,పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి దూరంగా పారిపోవడమో,లేక ఆ కొత్త పరిధిని కూడా కలుపుకోవడమో జరుగుతుంది.మనిషి జీవితంలో మూల మనస్తత్వాన్ని వారి విజయాలకనుగుణంగా మార్చుకున్నా సరే,మార్చగల మానసిక సత్తా ఉన్న మనుషులు ఎదురైనప్పుడు మారాల్సిందే,ఆ మార్పు ప్రభావాలు ఎలా ఉన్నా,మారడం ఆ మనిషిలో మిగిలి ఉన్న విధేయతను,మంచితనాన్ని పరిచయం చేస్తుంది.ఆ మార్పు ఆకర్షణ,మోహం ...పేరు ఏదైనా ఎలా కలిగినా సరే ఆ మార్పు మంచిదే.ఆ మార్పు గురించే ఈ నవల గట్టిగా చెప్తుంది.ఆ మార్పును,అవగాహన విస్తృతిని మానసిక స్థాయిలో చర్చించిన నవల ఇది.
కథలో జమీలా బాయి ఓ వేశ్య.కానీ రచయిత ఆ పాత్ర చిత్రీకరణలో ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే,ఆమె అభిప్రాయాలను,విలువలను,స్థిరత్వాన్ని స్పష్టం చేయడానికే కథను నిర్మించారు తప్ప,ఓ సానుభూతిని జన్మింపజేసే స్త్రీగా కాదు.ఆమె దగ్గరకు వచ్చిన మగవాళ్ళలో సురేందర్,వీరాస్వామి,బాలరాజు,హెడ్ మాష్టరు,ఇక మిగిలిన వారైన ఆ ఊరిలోని వారి ద్వారా కేవలం జమీలాబాయి ధృఢ మనస్తత్వాన్నే పాఠకులకు వీలున్నంతవరకు చెప్పడానికి ప్రయత్నించారు.జమీలాబాయి మీద రచయితకు సానుభూతి లేదు,గౌరవం ఉంది.మనిషిని పరిస్థితులు కాదు,పరిస్థితులైనా మనిషి వ్యక్తిత్వం ముందు తల దించుకోవలసిందే అని గట్టిగా చెప్పే పాత్ర ఇది.స్త్రీ కోణం నుండి రాస్తే స్త్రీ వాద నవల అనే ముద్ర వేయడం సహజం. ఈ నవలలో స్త్రీ ఉన్నా,ఆమె జీవితంలో మార్చగల ధృడత్వం,కృతజ్ఞతను ప్రదర్శించగల మానవత్వం,ఆహుతైన జీవితంలో అర్ధాన్ని వెతుక్కోగల కార్యదీక్ష కనిపిస్తూ,ఇది మనిషి కథ అని అంతర్లీనంగా చెప్పినట్టు ఉంటుంది.
అసలు స్త్రీల గురించి కథలు,నవలలు ఎందుకు రాస్తారు? ఎందుకు రాయాలి?వాటి సామాజిక ప్రయోజనాత్వానికి ప్రమాణాలు ఏమిటి అనే ప్రశ్నకు రచయితల,పాఠకుల అభిప్రాయాలను అనుసరించి అనేక రీతుల్లో సమాధానాలను ఇవ్వవచ్చు. బాధలున్న స్త్రీ జీవితంలో ఎదిగిపోవడం,బాధలు పడుతూనే అన్నీ సాధించడం ఆమె పట్ల సానుభూతిని కలిగించవచ్చు. కానీ ఏది భరించాలి? ఎవరితో ,ఎక్కడి వరకు భరించాలి అన్నది చెప్పే రచయిత రచనకు ప్రయోజన ప్రమాణాలను అందుకున్న రచనగానే భావించవచ్చు. అది చెప్పే ప్రయత్నమే అన్వర్ ఈ ‘జమిలా బాయి’ ద్వారా చేశారు.
జమీలా బాయి చదువుకుంటున్న సమయంలో తల్లి పిలుస్తుందని చెప్పి ఆమెను తీసుకువెళ్ళి వేశ్యాకేంద్రమైన ‘సీతామహల్ సెంటర్’ లో వదిలివేస్తారు.ఆమె అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికే. తనను తల్లి కావాలనే పంపించిందా? తన జీవితం ఇలా అవుతుందని తెలిసే పంపిందా అన్న అంతర్మథనం ద్వారా జమీలా బాయిని గురించిన నేపథ్యం పాఠకులకు స్పష్టం అవుతుంది.ఆమెను ఓ జర్నలిస్టు అక్కడి నుండి విడిపించి గర్ల్స్ హోమ్ లో చేర్పిస్తాడు. అక్కడ జరిగింది పాఠకులకు స్పష్టంగా తెలియకపోయినా జమీలా బాయి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే బ్రతికిందని పాఠకులకు స్పష్టమవుతుంది.
ఆ తర్వాత ఆమె ఆటో ఎక్కడం ఆమెను ఓ పాడుపడిన బంగ్లాకు తీసుకువెళ్ళి చెరిచే ప్రయత్నం చేయడం, ఓ పాము బుసలు కొట్టడం చూసి వారు పారిపోవడం వల్ల ఆమె రక్షించబడుతుంది. ఆ ఊర్లో గూండాగా బ్రతుకుతున్న సురేందర్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోకుండానే ఆమె ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఉంటాడు.ఆమె ఎప్పటికైనా తనతో ఉండటానికి అంగీకరిస్తే ఆమెతో కలిసి బ్రతుకుదామనే ఆలోచనలో ఉంటాడు. చివరకు అతన్ని హత్య చేయడం,అతను తన ఆస్తులన్నీ జమీలా బాయి పేరున రాసినా ఆమె మాత్రం అతని వల్ల నష్టపోయినా వారికి ఇవ్వడంతో నవల ముగుస్తుంది.
ఈ కథలో ఎక్కువ సన్నివేశాలు లేవు జమీలా బాయి పాత్రను బలపరచడానికి,సానుభూతి చూపించే వ్యథలు లేవు. భౌతిక స్థాయిలో ఇవేమీ లేకపోయినా మానసిక స్థాయిలో ఉన్న సంఘర్షణను,వ్యథలను,అభిమానాలను గురించి మాత్రం చెప్పడం రచయిత మర్చిపోలేదు.
వేశ్య దగ్గరకు మగవాళ్ళు ఎందుకు వెళ్తారు? వారిలో అందం,విధేయత ఏది వారికి సుఖం కన్నా ఎక్కువ అనుభూతినిస్తాయి? అన్న విషయంలో విధేయత,తమ ఆధిక్యతను నిరూపించుకునే అవకాశంగానే ఎక్కువ శాతం భావించవచ్చు. జమీలా బాయి అందమైన స్త్రీ. ‘నీకు అందమున్నది కానీ అందలాలు ఎక్కే బుద్ధి లేదు’ అని సురేంద్ర ఆమెతో అంటాడు.
మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి. ఉద్యోగం చేసేవాళ్ళు జీతం కోసం అధికారుల మాటకు ఎదురుచెప్పకుండా చేస్తారు.ఇక్కడ ఆత్మాభిమానం కన్నా ఆధిక్యతను తమ అధికారానికి అనుగుణంగా ప్రదర్శించాలన్న తపనే మనిషి ఆహాన్ని తృప్తి పరిచే సాధనంగా పని చేస్తుందేమో అని అనిపించేలా చేస్తుంది. జమీలా బాయి కూడా అలాంటి స్త్రీ అనే మొదట భావిస్తాడు సురేంద్ర.కానీ అతను ఆమె అభిమానాన్ని దెబ్బ కొట్టిన ప్రతిసారి,అదే వేగంతో ఆమె కూడా ప్రతిస్పందించి అతని ఆహాన్ని కూడా గాయపరుస్తుంది.బలహీనుల మీద,తనకు ఎదురు చెప్పని వారి మీద దౌర్జన్యంగా ప్రవర్తించే ప్రవృత్తి ఉన్న సురేంద్ర తనకు ఎదురుచెప్పిన జమీలా బాయి పట్ల గౌరవం పెంచుకుని,ఆమె బాధ్యతను కూడా తీసుకుంటాడు.
సురేంద్ర జమీలా బాయి స్త్రీ కనుక అలా ప్రవర్తించాడా? అన్న ప్రశ్నకు సమాధానంగా బాలరాజు పాత్రను నిర్మించారు రచయిత. ఓ హోటల్ లో పని చేస్తున్న బాలరాజు బాలుడైనా సురేంద్రను అన్యాయాలను ప్రశ్నించినప్పుడు అతని బాధ్యతలు కూడా తీసుకుంటాడు సురేంద్ర. ఒకవేళ బాలరాజు పాత్ర లేకపోతే ఈ నవలలో సురేంద్ర,జమీలా బాయి వ్యక్తిత్వ పునాదులు బలంగా ఉండేవి కాదేమో!
ఆధార్ కార్డ్ కూడా లేని జమీలా బాయిని ఓ కొత్త కార్డును కూడా ఇచ్చాడు.ఏనాడూ ప్రత్యక్షంగా ఆమెను కలవకుండా బాలరాజు ద్వారా ఆమెకు సరుకులు,డబ్బులు అందించేవాడు సురేంద్ర. ఒకవేళ సురేంద్ర పాత్ర బ్రతికే ఉంటే జమీలా బాయిని పొందాక అతని మనస్తత్వంలో మార్పులు సంభవిస్తే రచయిత చెప్పాలనుకున్న భావానికి బలం ఉండేది కాదేమో. అందుకేనేమో ఏ మార్పు అయితే మనుషుల్లో అంతర్లీనంగా ఉండి ప్రోద్బలం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో ఆ మార్పు సురేంద్రలో వచ్చే వరకే ఆ పాత్ర సజీవంగా ఉంది. కానీ ఆ మార్పు అతన్ని మనిషిని చేసినా,క్రూరత్వంలో బలహీనున్ని చేసి అతని ప్రత్యర్ధుల చేతిలో మరణానికి కారణమైంది? సురేంద్రలో మార్పు వచ్చింది.కానీ ఆ మార్పే అతని మరణంగా కూడా మారింది? అదే మార్పు జమీలా బాయిని కోటీశ్వరురాలిని కూడా చేసింది.
మార్పు మనుషుల్లో రావడం సహజం.ఆ మార్పును ఆ మనుషులు ఎలా తమ జీవితంలోకి ఆహ్వానించారు అన్నది ఆ మార్పు కన్నా కూడా ముఖ్యమైన అంశం. జమీలా బాయికి ముందు సురేంద్ర పట్ల ప్రేమ లేదు,గౌరవం లేదు,అభిమానం లేదు.కానీ తనతో సంబంధం లేకుండానే తన బాధ్యతలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకు అతని పట్ల ఆసక్తి కలిగింది.ఆ తర్వాత అతను మరణిస్తే ఆ ఊరిలో ఎవరు బాధ పడకపోయినా తానే ఎలాగో అంత్యక్రియలు జరిపించి,అతని ఆస్తులను బాధితులకే ఇవ్వాలనుకుంది. ఈ మార్పు జమీలా బాయిలో సురేంద్ర తెచ్చింది.అతని మీద ఉన్న ఆసక్తి అతని మరణంతో అతని మీద ఆమెకు ప్రేమగా మారింది.
నిజానికి సమాజంలో చెడ్డవారుగా ముద్ర పడే ఇద్దరి జీవితాలు ఇవి. కానీ ఆ మంచి,చెడ్డ తో వారు నిజంగా ఎంత దూరం పయనించారు అన్నది పాఠకులు నిర్ణయించుకోవలసిన అంశమే. జమీలా బాయిని చూడని వారు కూడా ఆమె మీద పుకార్లు పుట్టించారు.వారంతా సమాజంలోని మంచివారే.
మంచి,చెడు పరిస్థితులను బట్టి ప్రలోభాలను బట్టి మారవు,మనుషుల మనస్తత్వాలను బట్టి మారతాయి అని గట్టిగా చెప్పే నవల ఇది. రచయితకున్న భావావేశం,మనుషుల్లో మార్పు ప్రదర్శించబడే అంశం కాదని,మనుషులను మంచి-చెడు అని వర్గీకరించేముందు వారి జీవితాల గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి అనే అభిప్రాయం ఈ నవల పాఠకులకు చేరుస్తుంది. దీనిని స్త్రీ వాద నవలగా నేను ఎందుకో భావించలేకపోయాను. దానికి కారణం ఈ నవలలో జమీలా బాయికి సమంగా సురేంద్ర పాత్ర ప్రవేశంనిష్క్రమణ కూడా ఉండటం వల్లే కావచ్చు.
ఇది నవలలోని ప్రధాన పాత్రల కథ అయితే ఈ కథలో ఉన్న ఓ అపరిచిత పాత్ర అయిన హెడ్ మాస్టర్ పాత్ర కూడా జమీలా బాయికి,సమాజానికి మధ్య లంకెగా నిలబడుతుంది. హెడ్ మాస్టర్ సర్వేలో భాగంగా జమీలా బాయి వివరాలు అడిగినప్పుడు ఆమె సమాధానాలు ఆమె అనామాకత్వాన్ని స్పష్టం చేస్తుంటే,ఆమె ఉనికిని ఏది స్పష్టం చేయకపోయినా ఆమె సౌందర్యానికి,వ్యక్తిత్వానికి ఆకర్షించబడ్డ పాత్ర ఇది. మనిషికి సామాజిక గుర్తింపు కన్నా స్వీయ వ్యక్తిత్వ గుర్తింపు ముఖ్యమైనదని ఈ ఉదంతం స్పష్టం చేస్తూనే,అనామకురాలిగా ఉంటూనే జమీలా బాయి తన వ్యక్తిత్వం,తనకు అనవసరం అనుకున్న వారిని,విషయాలను పట్టించుకోకపోవడం ఆమె వ్యక్తిత్వ బలాన్ని బలపరిచే ఉదంతం.
ఇక ఈ కథలో ఇంకో ముఖ్య పాత్ర వీరాస్వామి. సురేంద్రకు,వీరస్వామికి వైరమున్నప్పటికి కూడా జమీలా అతన్ని సురేంద్ర అంత్యక్రియల విషయంలో సాయం అందించేలా చేయడం,జమీలా బాయి ఆ ఊరిలో అనామకురాలైన తెలిసిన వ్యక్తి అయినా తను అనుకున్నది చేయడానికి తనను గాయపరిచిన వారిని సైతం తనకు అనుగుణంగా మార్చుకోగలగడం ఆమెకు ఏదైనా సాధించడంలో ఉన్న ఒడుపును స్పష్టం చేస్తుంది.
ఇకపోతే బాలరాజు సురేంద్ర మరణం తర్వాత కొడుకుగా జమీలా బాయికి దగ్గరవ్వడం ఆమె జీవితంలో ఎటువంటి వ్యక్తులను ఎన్నుకుంటుందో స్పష్టం చేస్తుంది.
చివరిగా జమీలా బాయికి ఎవరినైనా కలిసే నేర్పు ఉన్న స్త్రీ అయినప్పటికి కూడా తన అహాన్ని గాయపరిచినవారి గౌరవాన్ని సైతం వారికి చేరువ కాకుండానే అందుకోగల మనిషి. ఆమె ఈ అంశాలను తన సౌందర్యంతో సాధించలేదు,వ్యక్తిత్వంతో సాధించింది.అందుకే ఇది లింగ వ్యత్యాసాలు వర్తించని మనిషి కథ.
* * *
Comments
Post a Comment