నైతిక సమాజ ఆకృతి

 చదువరి

నైతిక సమాజ ఆకృతి
-శృంగవరపు రచన
కొందరు రచయితల రచనలు వరుసగా చదువుతుంటే వారి భావాలను పాఠకులు అర్థం చేసుకోవచ్చు.నేను రామా చంద్రమౌళిగారి నవలలు రెండు ముందే చదివి ఉండటం వల్ల ఆయన ఏ నవలలోనైనా సమాజ పతన మూలాలను వివిధ దృక్కోణాల్లో ఆవిష్కరిస్తూ,విద్య ఆవశ్యకతను స్పష్టం చేస్తూ,వైజ్ఞానిక ప్రగతిని భారతీయ వేద-ఇతిహాస-పురాణాల మూలాల నుండి పాఠకులకు పరిచయం చేస్తూ,సమాజగతి మారడానికి మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే,సమాజ పతనంలో తాను ఎలా భాగమయ్యాడో తెలుసుకుంటూ,ఆ కోణంలో తన కర్తవ్యంగా చేయవలసిన బాధ్యతను గురించి ఓ నిర్ణయాన్ని తీసుకుని ఆచరించడం అన్ని నవలల్లో అంతర్లీనంగా ఉండటం గమనించాను.ఇక కథాంశానికి అనుగుణంగా ఎన్ని అంశాలను స్పృశించిన మానసిక శూన్యత గురించి ప్రతి రచనలోను ఉంటుంది.ఇక 'మొదటి చీమ' నవలలో విద్యా రంగ ,వైజ్ఞానిక రంగ పతనం గురించి రచయిత గట్టిగా చెప్పారు.
రామా చంద్రమౌళిగారి నవలల్లో కథ కన్నా భావ గాఢతకే ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.కథలో ముఖ్య పాత్రలు ముగ్గురు దంపతులు నందాదేవి,జయకర్,సదాశివం,అనూరాధ రామకృష్ణ-సుహాసిని.నందాదేవి,జయకర్ ఇద్దరూ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నవారు.ఇద్దరూ వైజ్ఞానిక రంగంలో కొత్త ఆవిష్కరణల ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారే.జయకర్ 'ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్' లో పని చేస్తుంటే,నందాదేవి 'వాయిస్ టైపింగ్'మీద పని చేస్తూ ఉంది.వీరిద్దరి కుటుంబ నేపథ్యాల్లో పేదరికం,కుటుంబ నిర్లక్ష్యం,కష్టాలు ఉన్నాయి.కానీ వారు వాటిని అధిగమించి ఎదిగారు.లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు.
జయకర్ కు 'నాన్ అబ్ స్ట్రాక్టివ్ అజూ స్పెర్మియా' అనే లోపం ఉండటం వల్ల అతని స్పెర్మ్ లో క్రోమోజోంలు లేకపోవడం వల్ల అతని వల్ల నందాదేవికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదని తెలుస్తుంది.జయకర్ దగ్గర ఆ విషయం రహస్యంగా ఉంచుతుంది నందాదేవి.తన స్నేహితురాలైన డాక్టర్ అనూరాధ ద్వారా అజ్ఞాత దాత స్పెర్మ్ ద్వారా 'ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్' ప్రక్రియ ద్వారా గర్భం దాలుస్తుంది నందాదేవి.జయకర్ కు అది అతనే బిడ్డ అని చెప్తుంది.ఇక్కడ నందాదేవికి తల్లి కావాలనే కోరిక ఉండటం వల్ల,తన భర్తకున్న లోపానికి అతను కారకుడు కాడు కనుక,తను ఈ పద్ధతి ద్వారా తల్లినవ్వడం సరైనదే అనుకుంటుంది.ఈ నిర్ణయం పట్ల ఆమెలో నైతిక సంఘర్షణ ఏర్పడినా ఆమె దానిని జయిస్తుంది.
ఇక సదాశివం గొప్ప రచయిత,ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కూడా.విద్యారంగంలో జరుగుతున్న అవినీతి,విద్యా ప్రమాణాల దిగజారుడు అన్ని అతన్ని కలచివేస్తాయి.ఓ సారి ఓ యూనివర్సిటీలో స్టాఫ్ రిక్రూట్ మెంట్ కు ఇష్టం లేకపోయిన వెళ్ళిన అతనికి అక్కడ ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేనివారిని అతను వద్దని చెప్పినా లంచాల ద్వారా నియమించడం బాధిస్తుంది.పుట్టగొడుగుల్లా వచ్చే ఇంజనీరింగ్ కాలేజీల నుండి బయటకు వచ్చే నిరుద్యోగ కాలుష్యం గురించి రచయిత గట్టిగానే ప్రశ్నిస్తారు ఈ పాత్ర ద్వారా. సదాశివం శిష్యుడు రామకృష్ణ.ఎంతో తెలివైనవాడు.కానీ బ్రతకడం కోసం ఇంజనీరింగ్ విద్యార్దులకు ప్రాజెక్టులు సుహాసినితో కలిసి అమ్ముతూ జీవిస్తుంటాడు.తన మేధ ఇలా నిరూపయోగం అవుతుందనే బాధ అతనిలో కూడా ఉంటుంది.
ఇకపోతే జయకర్ పాత్ర ఈ సాంకేతికతో పరుగెత్తి మరమనిషిని తయారుచేసే మనిషి కూడా దాని లానే మారిపోవడం పట్ల విసుగు చెందుతాడు.నందాదేవికి విశ్వ జన్మిస్తాడు.
ఈ నాలుగు పాత్రల్లోనూ అంతఃసంఘర్షణే వారి భావస్వారూప్యాన్ని సూచించే సూచి.వీరందరూ ఎలాన్ మస్క్ అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రాజెక్టులో భాగమైనా అక్కడ ఉన్న అవినీతిని మెట్లను చూసి అవాక్కవుతారు.
నందాదేవి సమాజంలోని అవినీతిని నిర్మూలించాలంటే నైతిక విలువల పునఃప్రతిష్ట జరగాలని,అలా జరగాలంటే ప్రజల్లో తాము చేసే పనుల పట్ల చింతన,తప్పు చేస్తే అది తప్పు అన్న భావన కలగాలని భావించి 'డాగ్' అనే సంస్థను స్థాపిస్తుంది.ఈ సంస్థలో అన్ని రంగాలలో ఉన్న నిజాయితీపరులను సభ్యులను చేసి,మొదట ఏ మార్పుకైనా
మూలం స్త్రీ అని భావించి స్త్రీలను తమ భర్తలు అవినీతి ద్వారా సంపాదిస్తే నిలదీయమని చైతన్యపరుస్తుంది.కొందరు వెనుకంజ వేసినా,కొందరు ముందుకు వస్తారు.ఈ సంస్థ ఆశయాల గురించి ముఖ్యమంత్రిని ఒప్పించి,అవినీతిపరులను శిక్షించే విధంగా నడిపిస్తూ ఉంటుంది.చీమల దండులో మొదటి చీమ రాగానే ఎన్నో చీమలు వెంటే నడుస్తాయి.ఆ మొదటి చీమే నందాదేవి. తన కొడుకైన విశ్వాన్ని నిజాయితీపరుడైన రాజకీయనాయకుణ్ణి చేయాలనుకుంటుంది నందాదేవి.
సమకాలీన సమస్యల మీద వచ్చే సాహిత్యం ఎప్పుడు పాఠకులను కొంతసేపైనా ఆలోచించేలా చేస్తుంది.ఈ నవలలో వైజ్ఞానిక ప్రగతిని అన్ని స్థాయిల్లో వివరించడం పాఠకులకు తెలియని ఎన్నో విషయాలను తెలియపరుస్తుంది.నవలలో భారతీయ ఇతిహాసాల-పురాణాల్లో దాగి ఉన్న శాస్త్రీయతను గురించి ప్రస్తావించడం కూడా ఈ నవలకు ఓ ఆకర్షణ అంశంగా చెప్పుకోవచ్చు.కథ కన్నా కథను నడిపించే మూలాలు,పాత్రలలోని ఘర్షణ పాఠకులను ఆలోచింపజేసే ప్రశ్నలుగా ఉండటం కూడా ఈ రచయితలోని ప్రత్యేక శైలి.
* * *
May be an image of 1 person and text that says "మొదటి చీమ నవల -రామా చంద్రమాళి U"
Rachana Srungavarapu, Chandra Mohan and 35 others
32 comments
35 shares
Like
Comment
Share

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!