ఆదర్శాల దోపిడి

 ఆదర్శాల దోపిడి

-శృంగవరపు రచన
ప్రతి ప్రాంతపు నేలకు ఓ చరిత్ర ఉంటుంది.ఆ చరిత్రలో కనబడే,కనబడని రక్తపు చారికలు మలి దశలోకి ప్రవహిస్తూ ఉంటూనే ఆ ప్రాంతపు అస్తిత్వ పునాదులుగా నిలుస్తాయి.పోరాటాల గడ్డ తెలంగాణ చరిత్రలో జలియన్ వాలా బాగ్ హింసాకాండను తలపింపజేసే ఉదంతమే బైరాన్ పల్లి చరిత్ర పుటల్లో నిక్షిప్తమైంది.భారతదేశం స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుంటున్న సమయంలో ఇంకా నిజాం అరాచకాలకు బలయ్యే స్థితిలోనే ఉంది తెలంగాణ.నిజాం ప్రైవేట్ సైన్యంగా మారిన రజాకార్లు తెలంగాణ గ్రామాల్లో చేస్తున్న అకృత్యాలకు ఎదురుతిరిగిన ప్రాంతమే బైరాన్ పల్లె.రజాకార్లు ఖాసిం రజ్వి నాయకత్వంలో చేసిన దాడులను తిప్పికొట్టినందుకు వారి మీద కోపం పెంచుకున్న రజాకార్లు ఆగస్టు 27,1948 తెల్లవారుఝూమున దాదాపు 1500 మంది సైన్యంతో సృష్టించిన మారణకాండ,స్త్రీలను చెరచి,శవాల చుట్టూ వారి చేత బతుకమ్మ ఆడించడం,వంద పైనే గ్రామస్థులు అమరులవ్వడం,ఈ ఘటనే తెలంగాణ విమోచన త్వరితగతిన అవ్వడానికి మూలమవ్వడం తెలంగాణ చరిత్రలో బైరానా పల్లెకు ఓ శాశ్వత స్థానాన్ని ఏర్పరిచింది.ఈ బైరాన్ పల్లె ఉదంత స్ఫూర్తి ఆరంభంగా,పరాయి పాలన-స్వపరిపాలనల్లో దోచుకునేవారు,దోచుకోబడేవారుగా సమాజం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో,మనుషుల ఆదర్శాలు సమాజ సమిష్టి నైతిక పతనంలో ఎలా కరిగిపోతాయో,మనిషి అంతఃచేతనలోని స్వాభావిక ఉనికి ఎలా ప్రత్యక్ష-అప్రత్యక్ష రూపాలుగా రూపాంతరం చెందుతుందో స్పష్టం చేసే నవలే రామా చంద్రమౌళిగారి 'సూర్యుని నీడ.'
ఈ నవలను కథగా చూస్తే కథావస్తువు లోతు అర్థమవ్వదు.మారుతున్న సమాజ క్రమంలో దోచుకునేవారు,పాలించేవారు ప్రజల్లో చైతన్య స్వరమార్పులకు అనుగుణంగా తమ రూపును వారికి తగ్గట్టు మార్చుకుంటున్నారే తప్ప సమాన సమాజం అనేది ఎక్కడా ఉండదు.దీనికి కారణం మనిషికి వ్యక్తిగతంగా ఉండే ఆశలు,కోరికలు బలహీనతలుగా మారి పరోక్ష పాలక భావనలకు ప్రోద్భలాన్ని ఇవ్వడం.వ్యక్తి బలహీనతలు,వ్యవస్థ బలహీనతలు,సమాజ-దేశ బలహీనతలు స్వఎదుగుదల,దేశాభివృద్ధి అనే పేర్లుతో న్యాయం,నిజాయితీ వంటివి కూడా వినిమయ వస్తువులుగా మారిపోయి,ఆదర్శాలను అంటిపెట్టుకున్న వారు ఈ బలహీనతలను గుర్తించినందుకు,సరిచేసేందుకు ప్రయత్నించినందుకు జీవితం ఓ చిక్కుల వలయంగా మారిపోవడం ఆదర్శాల దోపిడికి మూలమవుతుంది.ఈ నవలలోని ప్రతి పాత్రను ఆ పాత్ర దృక్కోణం నుండి గమనిస్తే వారు తమకున్న అవకాశాలను వినియోగించుకున్నవారిలానే కనిపిస్తారు.వారిని వారు సమర్థించుకునే తీరులో గొప్ప లోతైన విశ్లేషణ ఉంది.
ఇక కథలోకి వెళ్తే బైరాన్ పల్లె లో 1948,ఆగస్టు 27 న జరిగిన ఉదంతంలో కల్పిత పాత్రల పేర్లు తప్ప సంఘటనలు దాదాపు అవేగా ఈ నవల ఆరంభమవుతుంది.రజాకార్ల దారుణ మారణకాండలో రాజవ్వ అనే యవ్వనవతి మాత్రం ప్రాణాలతో బ్రతికి బయటపడుతుంది.ఆమెను రామారావు (ఉద్యమ నాయకుడు) ఆసుపత్రిలో చేర్పించి,తన భార్య లలిత ద్వారా ఆమెను చదువుకునేలా చేస్తాడు.లలిత రాజవ్వ పేరును చంద్రకళగా మారుస్తుంది.ఈ పాటికే తెలంగాణ విమోచన జరుగుతుంది.
లలిత తల్లి రత్నమాల.రత్నమాల తల్లిని రజాకార్లు హత్య చేస్తే,కూతురితో స్వప్రాంతమైన వరంగల్ వదిలి కలకత్తాలో బ్రతకడానికి వస్తాడు రత్నమాల తండ్రి.అక్కడే బ్రతుకు పోరాటం మొదలవుతుంది.అక్కడే రత్నమాలకు బిపిన్ పరిచయమవ్వడం,అతన్ని వివాహం చేసుకోవడం,అతను ఉద్యమంలో చురుగ్గా ఉండటం,అతన్ని దేశద్రోహి అన్న ముద్ర వేసి అరెస్టు చేసి అండమాన్ దంవుల్లో ఉన్న కాలాపానిలో మరణతుల్యమైన శిక్ష విధించడం జరుగుతుంది.రత్నమాలకు లలిత,ఆ తరువాత శేషు అనే కొడుకు పుడతారు.కుటుంబ నేపథ్యంలోనే ఉద్యమ నేపథ్యం ఉండటంతో లలిత క్రమేపీ ఉద్యమం పట్ల ఆకర్షితురాలవుతుంది.ఆ మార్గంలోనే ఉన్న రామారావును వివాహం చేసుకుంటుంది.
ఇకపోతే ఈ నవలలో ఇంకో ముఖ్య పాత్ర నరసింహారెడ్డి.నిజాం పాలనలో జాగీర్దారుగా వెలిగిపోయిన వంశానికి చెందినవాడు నరసింహారెడ్డి.పుట్టుకతోనే తాము ప్రజలను పాలించడానికే పుట్టామని గాఢంగా నమ్మేవాడు.కానీ తెలంగాణకు స్వాతంత్ర్యం రావడంతో రాజకీయనాయకుడిగా రంగు మార్చుకుంటాడు.భారతదేశంలో ఓ భార్య,విదేశంలో ఓ భార్య,ఇంకెన్నో అక్రమ సంబంధాలు.ప్రపంచంలో ప్రేమ కన్నా గొప్పది భయమని,భయపెట్టడం నేర్చుకుంటే ఏ పనైనా జరుగుతుందనే నమ్మకం అతనిది.అతనికి,విదేశీ వనితకు పుట్టిన కూతురు నీల.
చంద్రకళ దీక్షతో చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది.లలిత తమ్ముడు శేషు ఐపీఎస్ ఆఫీసర్.వీరిద్దరికి వివాహమవుతుంది.వీరి కొడుకు తేజ.లలిత,రామారావు ప్రజల అభిమానం వల్ల ఎన్నికల్లో గెలుస్తారు.అదే ఎన్నికల్లో నరసింహారెడ్డి,అతని అనుచరులు కూడా విజయం సాధిస్తారు.
నీల ఓ వర్చువల్ బిజీనెస్ ఎంపైర్ ను సృష్టిస్తుంది.కొన్ని కోట్ల లాభమైన వ్యాపారమది.అవినీతి,అక్రమాలు చేసిపెట్టడం ఇందులోని ముఖ్య కార్యాకలాపాలు.నీలపై తండ్రి ప్రభావం ఎక్కువుంది.అదే ఆమె తెలివిని,ఆలోచనలను నడిపించింది.ఆమె ఓ బిజినెస్ మాగ్నెట్ ను వివాహం చేసుకుంటుంది.వారి కొడుకే ఆదిత్య.
ఇక ఈ కథ అంతా కొన్ని దశాబ్దాల తరువాత 2012 కి వచ్చేసరికి ఈ పాత్రల విలువలు-అభిప్రాయాలు,సమాజ మార్పుల ద్వారా స్పష్టం చేస్తారు రచయిత. నిజాయితీ గల ఆఫీసర్ గా ఉన్న శేషు సమాజంలోని అవినీతికి లొంగకపోవడం వల్ల బదిలీలు,బాధలు ఎదుర్కొంటాడు.దాదాపుగా చంద్రకళ పరిస్థితి అదే.ఇక వీరి కొడుకు తేజ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు.తల్లిదండ్రుల ఆదర్శాలు అతనిలో ఉన్నా మారని అదే భారతం పునరావృతమవుతుంది.
ఇకపోతే నీలలో అంతర్మధనం మొదలవుతుంది.ఆమె కొడుకు ఆదిత్య లోతైన ఆలోచనలు కలవాడు.అపరిమిత సంపద అతనిలో తాత్వికతను పెంచుతుంది.అంతరిక్ష శాస్త్రవేత్త అవుతాడు.తాను సంపాదించినది అవినీతి మార్గంలో అయినా,దానిని సద్వినియోగపరచడానికి ఛారిటీ సంస్థను ఏర్పాటు చేస్తుంది నీల.చివరకు కేదారనాథ్ ఆలయానికి వెళ్ళిన సమయంలో జలప్రళయం సంభవించి నీల,ఆమె భర్త మరణిస్తారు.
ఏదో ప్రజలకు మేలు చేద్దామనుకున్న అది రాజకీయాల ద్వారా సాధ్యమవదని తెలుసుకున్న రామారావు ఓ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తాడు.అతను మరణించాక అతని మార్గాన్నే ఆ గ్రామ ప్రజలు అనుసరిస్తారు.
సమాజంలో బ్యూరోక్రాట్ వ్యవస్థ అంతా రాజకీయ అవినీతిలో భాగమవ్వడాన్ని నిరోధించడానికి,రాజకీయ ఒత్తిడులను అధిగమించడానికి శేషు,తేజ మిగిలిన అధికారులు కలిసి వారంతా సమిష్టిగా ఈ ఒత్తిడులను ఎదిరించాలని నిర్ణయించుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
మనుషుల్లో తమ జీవిత పరిధి గురించి ఆలోచించే మనస్తత్వం ఉండటం సహజం.ఆ సహజత్వం తన జీవితంలో వారిని ఆర్థికంగా బలవంతులని చేయాలనే ప్రయత్నమో లేక వారే జీవితముగా భావించడమో మనిషి ఆలోచనలను వారి కోసం ఏమైనా చేసేందుకు ప్రేరేపిస్తుంది.అదే అవినీతికి మూలమవుతుంది.అధికారులే కాదు సామాన్య జనులు కూడా ఈ సహజత్వంలోనే అవినీతికి పాల్పడతారు.అందుకే సహజాంశంగానే కనిపిస్తుంది.అందుకే ఇన్ని కోట్ల కుంభకోణాలు సహజంగా అనిపిస్తాయి.
మనిషిలోని ఈ ఆలోచనాశైలి విద్య-ఆత్మవీక్షణ ద్వారా సంస్కరించబడతాయని రచయిత స్పష్టం చేస్తారు.సమాజంలోని మార్పుకు మనిషిలోని ఆత్మ-పరిశీలన,ఆత్మవిమర్శలు మొదటి మెట్టని రచయిత సూచనాప్రాయంగా పాత్రచిత్రణల ద్వారా స్పష్టం చేస్తారు.
తాత్విక చింతనలోనే మనిషికి జీవిత అన్వేషణా మార్గం గోచరిస్తుంది.అదే వ్యక్తిని ప్రలోభాలను,బలహీనతలను జయించేలా చేస్తుంది.
2014 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నవలల పోటీలో ఉత్తమ నవలా బహుమతి పొందినఈ నవల సమాజంలో తాత్విక దృక్కోణం ఆవిష్కరించవలసిన ఆవశ్యకతను గురించి ఆలోచించేలా చేస్తుంది.
* * *
May be an image of fire and text that says "సూర్యుని నీడ నవల 1 రామా చంద్రమాళి"
Rachana Srungavarapu, Nageswararao Maddala and 21 others
17 comments
29 shares
Like
Comment
Share

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!