నోట్లతో రద్దయిన జీవితాలు

 నోట్లతో రద్దయిన జీవితాలు

-శృంగవరపు రచన




            సామాజిక అంశాల మీద కవిత్వం,కథలే తప్ప నవలా సాహిత్యం అరుదుగానే వెలువడుతుంది.ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే సందర్భ రచనల శైలి కూడా కొందరు రచయితలకే పరిమితమయ్యింది.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజల జీవితాన్ని ముఖ్యంగా ఓ  మధ్య తరగతి కుటుంబాన్ని ఎలా ధ్వంసం చేసిందో స్పష్టం చేసే నవలే మెట్టు మురళీధర్ గారి ఆ యాభై రోజులు.

            సమాజంలో మార్పును సూచించే ఏ ప్రభుత్వ నిర్ణయమైనా ముందుగా  పేద,మధ్య తరగతి వర్గాల మీదే తన దుష్ప్రభావాలను చూపిస్తుంది. 2016 నవంబర్ 8 రాత్రి ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించాలని తీసుకున్న నిర్ణయం,ఎందరి జీవితాలనో కూల్చి వేసింది. మనుషుల్లో డబ్బుతనమే తప్ప మనిషితనం లేదా అన్న ప్రశ్నకు లేదు అనే సమాధానమే నాడు ఆ నిర్ణయం నేడు సమకాలీనంగా కోవిడ్ కూడా స్పష్టం చేసింది.

            మనిషిలోని ఆ డబ్బుతనమే కొందరికి అవకాశాలను సమస్యల్లో సృష్టిస్తుందిమనుషుల్లోని నిస్సహాయతను ఆ డబ్బుతనానికి పెట్టుబడిగా మార్చి,కోలుకోలేని దెబ్బలు వేస్తుంది.అలా ధ్వంసమై మరలా చిగురించాలనే ఆశతో ఉన్న  కుటుంబ కథను వస్తువుగా మలిచారు రచయిత.

            జీవితంలో ఎన్నో ఒదుదుడుకులు ఎదుర్కున్న కుటుంబం సాయమ్మది. సాయమ్మ భర్త బాలరాజు రాళ్ళు కొట్టేవాడు.ఓ సారి రాళ్ళు కొట్టే ప్రక్రియలో ఏర్పడిన ప్రమాదం వల్ల అతను మరణించడంతో కుటుంబ బాధ్యత సాయమ్మ మీద పడుతుంది.అప్పటికే ఆరేళ్ళ కొడుకు చంద్రం,మూడేళ్ళ కూతురు లత. అయినప్పటికి ధైర్యం కోల్పోకుండా ఓ ఫ్లాటును కొనుక్కుని,కష్టపడి పిల్లలను పెద్ద చేసింది సాయమ్మ.

            పదవ తరగతి తప్పిన చందు పాలు,పేపర్లు వేసి కుటుంబానికి సాయంగా ఉన్నాడు.ఆ తర్వాత విలాసరావు అనే కోటేశ్వరుడి దగ్గర కారు డ్రైవరుగా చేరాడు.    లత తొమ్మిదో తరగతి వరకు చదివింది.ఆ సమయంలో నాగరాజు అనే దూరపు బంధువు లత వెంటపడటం,అతను చివరకు యాసిడ్ పోసే ప్రయత్నం కూడా చేయటం,కానీ అది తప్పిపోవడం వల్ల లత సురక్షితంగా బయటపడటం జరిగినా,ఆ తరువాత కూడా నాగరాజు చందు మీద కూడా దాడి చేయడంతో ఓ సంవత్సరం జైలు శిక్ష పడటంతో అతను తిరిగి వచ్చేలోపు లత పెళ్లి చేస్తే ఆమె క్షేమంగా ఉంటుందని భావిస్తుంది సాయమ్మ.అందుకే లత పెళ్ళిని  ఐటి చదివి, ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న అతనితో ఖాయం చేస్తుంది.ఆ పెళ్లికొడుకు తల్లిదండ్రులు డబ్బు మనుషులు. ఆ పెళ్లి కోసం ఆ ఇంటిని అమ్మేస్తుంది. ముందు వచ్చిన రెండు లక్షలు వారికే ఇస్తుంది.ఆ తర్వాత మిగిలిన 16 లక్షలు వారి చేతికి అందిన రోజు రాత్రే పెద్ద నోట్ల రద్దు ప్రకటించబడుతుంది.

            ఇక అప్పటి నుండి ఆ నోట్లు మార్చడానికి వారు పడే కష్టాలు, ఈ క్రమంలో ఆ కుటుంబం కోల్పోయిన జీవితేచ్చ,కుటుంబంలో నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలను ఎంతో చక్కగా రచయిత అక్షరీకరించారు. ఆ నోట్లు ఆ వియ్యంకుల వారు తీసుకోకపోవడం,వారికి ముందుగా ఇచ్చిన రెండు లక్షలు కూడా తిరిగి ఇచ్చి,వాటిని కూడా కొత్త నోట్లగానే ఇమ్మని  తిరిగి ఇచ్చేయ్యడంతో ఆ కుటుంబ పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది.

            తమ డబ్బు కూడా తమకు ఎందుకు అవసరాలకు అందదో సామాన్య ప్రజలకు అర్ధం కానీ పరిస్థితి,యాభై రోజులు ఓపిక పడితే నల్ల ధన నిర్మూలన అవుతుందని ప్రభుత్వ స్వరం,తప్పు చేసింది నల్ల ధన కుబేరులు అయితే తమకు శిక్ష ఎందుకో సామాన్య ప్రజానీకానికి అర్ధం కానీ గందరగోళ పరిస్థితులు అవి.

            మొదట మూడు ఖాతాలుగా అకౌంట్లు తెరిస్తే ఒక్కో దాంట్లో రెండున్నర లక్షలు డిపాజిట్ చేయవచ్చని,అంతకు మించి చేస్తే పన్ను కట్టాలని,పాన్ కార్డు ఉండాలని చందుకు స్పష్టం చేస్తారు అధికారులు. ఈ హడావుడిలో పాన్ కార్డు రావడానికి ఓ నెల పట్టవచ్చని తెలియడంతో,వచ్చినా మొత్తం డబ్బును మార్చలేని పరిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు చంద్రం.

            అదే సమయంలో విలాసరావు మాత్రం తన కూతురు పెళ్ళికి విలాసంగా ఖర్చు పెట్టడం,ఎంతో తేలికగా అధికారులకు లంచాలు ఇచ్చి తన నల్ల డబ్బును తెలుపు చేసుకోవడం,ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను పేద వారికి కాకుండా తమకు అనుకూలంగా మార్చుకోవడం చూసిన చంద్రానికి ఈ మార్పు ప్రయోజనమేమిటో అర్ధం కాకుండా ఉంటుంది.

            ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో నెలలో నాగరాజు విడుదల అవ్వబోతుండటంతో ఎలా అయినా చెల్లెలి పెళ్ళి చేయాలనుకోవడంతో చంద్రం ఆనంద్ కమిషన్లు తీసుకుని నోట్లు మారుస్తూ ఉండటంతో అతని ద్వారా మార్చడానికి ఆ డబ్బు వారి చేతిలో పెడతాడు. వారు పలాయనం చిత్తగించటంతో ఈ వ్యథతోనే సాయమ్మ కన్ను మూస్తుంది.కోల్పోయిన తల్లి,పోయిన ఇల్లు,ఆగిపోయిన చెల్లెలి పెళ్ళి మధ్య చంద్రం మరలా కొత్త  జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడితో నవల ముగుస్తుంది.

            వ్యక్తికి-సమాజానికి-దేశాలకు-ప్రపంచానికి కూడా తమ స్థాయి ప్రయోజనాలు ఉంటాయి.ఆ ప్రయోజనాల్లో స్వార్ధం ఉండవచ్చు,సంక్షేమము ఉండవచ్చు.ఉద్దేశ్యాలు ఏవైనా సరే అధికారం ఉన్నవారు దేశాన్ని సమూలంగా మార్చివేయాలనే లక్ష్యంతో అందరి గురించి ఆలోచించాలనే స్పృహను కోల్పోతున్నారు.ముఖ్యంగా స్వరం లేని వారు భరించమంటే భరించాల్సిందే తప్ప తమ హక్కులను కోల్పోయే సందర్భాలు వచ్చినా ఎదురు తిరిగే పరిస్థితులు తక్కువే.దానికి కారణం కుటుంబం గడవని పరిస్థితుల్లో ప్రశ్నించే ధైర్యం వారిలో సన్నగిల్లుతుంది.కింది వర్గాల ఆర్థిక నిస్సహాయతే  ఎన్నో సార్లు ప్రజాస్వామ్యంలో నియంతృత్వాన్ని  ప్రేరేపిస్తుంది.

            రచయిత ఈ నవలలో తాను చెప్పాలనుకున్న అంశానికి తగ్గట్టు నాటి ఎన్నో వాస్తవ వ్యథల్లో ఓ కథకు ప్రాణం పోసి,కథా పరిధి దాటకుండా పాఠకులకు సూటిగా తాను చెప్పాలనుకున్నది స్పష్టం చేశారు.

           *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!