వినాశనంలో వ్యాపారం

 వినాశనంలో వ్యాపారం

-శృంగవరపు రచన
(అమిరిశెట్టి గోపాల్ గారి ‘బెరెట్టా 606824’ నవలా సమీక్ష)


తెలుగు నవలా సాహిత్యంలో చారిత్రక,పల్లె జీవన,రాజకీయ,నేర దృక్కోణ,మనోవిశ్లేషణ వర్గాల్లో ఎన్నో నవలలు వచ్చాయి. కానీ చరిత్ర అడుగుజాడల్లో నడుస్తూ అనేక సమకాలీన దృక్కోణాలను జోడించిన నవలలు అరుదు. ఇటువంటి ప్రక్రియలు రెండు ప్రపంచ యుద్ధాలు,ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సివిల్ వార్స్ సందర్భంగా ఎన్నో ఆంగ్ల నవలలుగా ,సినిమాలు గా వచ్చాయి. ప్రాంతీయ సాహిత్యంలో ఈ ప్రయోగాలు తక్కువ. అటువంటి వినూత్న ప్రయోగాత్మక అంశంతో తన మొదటి నవల ‘బెరెట్టా 606824’ ను రాశారు అమిరిశెట్టి గోపాల్ గారు.
జాతి పిత మహాత్మా గాంధీను చంపిన ఆయుధంను కథలో ముఖ్య భాగం చేస్తూ, ఓ దేశభక్తుడు నాయకుడిగా, ఆ నాయకుడు కాలంలోకి ప్రయాణించగలిగే జాకెట్ ద్వారా మహాత్మాను కాపాడాలనుకోవడం,ఎన్నో యుద్ధాలలో అతను భాగం కావడం,ఆ ఆయుధం ఖండంతారాలు దాటడం వంటి అంశాల ద్వారా రచయిత ఈ నవలలో ఎన్నో వినూత్న కోణాలను ఆవిష్కరించారు.
ప్రపంచంలో కొన్ని యుద్ధాలను పక్కనపెడితే,ఎన్నో యుద్ధాలు పాలకుల-దేశాల మధ్య ఉన్న అహాలు-ఇగోలు-మధ్యలోని అవకాశవాదత్వాల వల్లే జరిగాయి. అటువంటి యుద్ధం నేటి కాలంలో రాగల ఓ కాల్పనిక పరిస్థితిని కథకు బలాన్ని ఇచ్చే ఘటనగా రచయిత ఎన్నుకున్నారు.
ఇటలీ మిలిటరికి అనుసంధానంగా పని చేసే ‘ఇంటర్ గెలాక్సీ’ నావ థాయిలాండ్ నుండి ఇటలీకి బయలుదేరుతుంది. ఆ సమయంలో ఆ సముద్రంలో పెనుతుఫాను సంభవించే ప్రమాదం ఉండటంతో దాని దారి విశాఖపట్టణం వైపు మళ్ళించవలసి వస్తుంది.ఆ సమయంలో వారికి దగ్గరగా వచ్చిన జాలరులను పైరేట్స్ గా భావించి ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు వారిని కాల్చి చంపేస్తారు. నిజం తెలిసాక కూడా వారు అంతే నిర్లక్ష్యంగా తమ దేశం తమను కాపాడుతుందన్న అతిశయంతో వ్యవహరిస్తారు.
ఇది జాతీయ సమస్యగా మారుతుంది. మత్స్యకారులంతా తమకు న్యాయం జరగాలని ఉద్యమిస్తారు. ఆ ఉద్యమానికి నాయకుడిగా మద్ధతును ఇస్తాడు జై. జై అనాధ. అప్పటికే అంతకు ముందు కూడా సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. సైనికుడిగా దేశం కోసం బ్రతకాలన్నది అతని ఆశయం. మిలిటరిలో అన్నీ పరీక్షలు పూర్తి చేసి ట్రైనింగ్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఓ పక్క ఇటలీ ప్రభుత్వం తమ దేశస్థులను కాపాడుకోవడం తమ దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా భావిస్తే,వారిని ఇక్కడ ప్రాసిక్యూట్ చేసి శిక్ష విధించేలా చేయడం భారత దేశం తన బాధ్యతగా భావిస్తుంది.
దేశంతో సంబంధం లేని ఒకే అంశం మనిషిలోని అవకాశవాదత్వం. అటువంటి అవకాశవాదుల్లో ఒకరైన ఎమ్మెల్యే గంగారాంను తమ ఆయుధంగా మలుచుకుంటుంది ఇటలీ. గంగారాం కూడా ఆ ఉద్యమంలో ఉండి తన సంపూర్ణ మద్ధతు,సహకారం అందిస్తానని మాట ఇచ్చి, ఇటలీ వారితో ఓ ఒప్పందం కుదుర్చుకుని పది లక్షల నష్ట పరిహారం కూడా అందజేసి, ఆ తర్వాత ఇందులో చురుగ్గా ఉన్న జై వారితో లేకుండా చేసి ఇటలీ ప్రభుత్వానికి సహకరించి తన లాభాన్ని పెంచుకోవాలనుకుంటాడు. ఇటలీ వారి మాట మేరకు వారికి ఇంకాస్త డబ్బు ముట్ట జెప్పి మరణించిన జాలరుల కుటుంబ సభ్యుల చేతే వారి విడుదలకు ఓ ఉత్తరం రాయించాలని,అది జరగాలంటే జై అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుంటాడు.
ఇది ఓ వైపు భారతదేశంలో జరుగుతున్న కథ. ఇకపోతే ఇథియోపియా లో ఇంకో కథ జరుగుతూ ఉంటుంది. అడీస్ అబాబా యూనివర్సిటీలోని ఆర్కియాలజీ విద్యార్ధులకు ఫీల్డ్ వర్కులో భాగంగా ఓ కొండ ప్రాంతంలో త్రవ్వకాలకు అనుమతి లభిస్తుంది. అందులో ఒక విద్యార్ధిని వసాబా.ఆమెకు ఆ త్రవ్వకాల్లో భాగంగా దాదాపు డెబ్బై ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి అస్థిపంజరంతో పాటు అతను తన చేతుల్లో గట్టిగా పట్టుకున్న ఓ ఎర్రటి సంచి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ డిఎన్ ఏ టెస్ట్ ద్వారా ఆ వ్యక్తి జై పూర్వీకుడని తెలుసుకుని ఆ ఎర్రటి సంచిని,అస్థికలను అతనికి పంపిస్తుంది.
ఆ ఉద్యమం నుండి తిరిగి వచ్చిన జైకి ఆ వస్తువులు,వసాబా ఉత్తరం ఆశ్చర్యం,ఆనందాన్ని కలిగిస్తాయి. తన పూర్వీకులు అప్పటి ఇథియోపియా యుద్ధంలో పాల్గొనడం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ వస్తువులో ఉన్న ఓ జాకెట్ ద్వారా ఏ కాలంలోకి అయినా పయనించవచ్చని అతనికి అర్ధమవుతుంది. అదే సమయంలో జై ను గంగారాం పిలిపిస్తాడు. తనతో పాటు ఇథియోపియాకు రమ్మని ఆహ్వానిస్తాడు. జై మిత్రుడు జర్నలిస్టు అయిన సలీం కూడా అతనితో జాగ్రత్తగా ఉండమని వారించినా గంగారాం మోసాలను బయటపెట్టవచ్చని అలానే బయలుదేరతాడు జై. తనతో పాటు జాకెట్ ను కూడా తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జై పాస్ పోర్టు,ఫోన్ రెండు కనిపించవు.గంగారాం కూడా అక్కడి నుండి జారుకుంటాడు. ఇక విదేశంలో డాక్యుమెంట్స్ కూడా లేని పరిస్థితుల్లో ఏమి చేయలేని పరిస్థితుల్లో జాకెట్ లో ఉన్న తేదీ అయిన సెప్టెంబర్ 30,1935 కు వెళ్ళిపోతాడు.
జాతి పిత మహాత్మా గాంధీ స్వాంతత్ర్యం కోసం విదేశాల సహకారానికి కూడా ప్రయత్నిస్తున్న రోజులవి. ఆ ప్రయత్నంలోనే ఇటలీ ముస్సోలినిని కూడా కలిసి ఉన్నాడు ఆయన. దానిని తన విశ్వ ఆధిపత్యానికి అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ముస్సోలిని. ఆఫ్రికాలో ఇథియోపియా ఎప్పటి నుండో స్వాతంత్ర్యంగా ఉంటున్న దేశం. దానికి అనుకుని ఉన్న సరిహద్దు దేశాలు కొన్ని ఇటలీ ఆధిపథ్యంలోనే ఉన్నాయి.కానీ ఇథియోపియా మాత్రం ఏనాడూ తన స్వాతంత్ర్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఎలా అయినా ఇదే సమయంలో తన కోరికను కూడా తీర్చుకోవాలనుకున్నాడు ముస్సోలిని. అత్యాధునిక ఆయుధాలను తయారీ చేయించే పనిలో పడ్డాడు.అవి తయారు అయ్యాక యుద్ధం మొదలుపెట్టాడు.
ఆ ఆయుధాల్లో ఒక శాంపిల్ ఆయుధమే ‘బెరెట్టా 606824.’ అది స్వయంగా ముస్సోలినికి బహుకరించబడింది.ఆ ఆయుధం అక్కడి నుండి ఇటలీ సైన్యాధికారి చేతుల్లోకి వచ్చింది.1935 లో ఇథియోపియా మీద ఇటలీ యుద్ధం చేస్తున్న కాలానికి ప్రస్తుతం జై వచ్చాడు. అక్కడే అతనికి సేవలు అందిస్తున్న యాంజెలీనా తారసపడుతుంది.ఆమె సేవా దృక్కోణానికి ఆకర్షించబడతాడు జై. జై తన ముత్తాత చనిపోతుండగా చూస్తాడు. యుద్ధంలో పాల్గొనాలన్న జై కోరిక ఇలా నెరవేరుతుంది. యాంజెలీనా గాయపడిన సమయంలో ఆమెను కాపాడే ప్రయత్నంలో జై తన జాకెట్ ను కోల్పోతాడు. యాంజెలీనా కూడా మరణిస్తుంది. ఆ జాకెట్ ను వెతుక్కుంటూ అక్కడే యుద్ధాలలో పాల్గొంటూ 12 ఏళ్ళు గడుపుతాడు జై.
ఇథియోపియా మీద యుద్ధ విజయం తర్వాత ముస్సోలిని సైన్యాన్ని అల్బేనియా మీదకు పంపిస్తాడు.అక్కడి విజయంతో మరలా గ్రీస్ మీద కూడా దండెత్తి పరాజయం పాలవుతాడు ముస్సోలిని. చివరకు ఎలాగో జైకు జాకెట్ దొరకడం అతను మరలా మహాత్మాను కాపాడే ప్రయత్నం చేసి విఫలమవటం,మహాత్మాను చంపిన ఆయుధం కూడా ‘బెరెట్టా’ అవడం జరుగుతుంది. గతాన్ని మార్చలేమని తెలుసుకున్న జై భవిష్యత్తులోకి వెళ్తాడు.ఆ భవిష్యత్తులో కూడా దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఆ ఇటాలియన్ మెరైన్లు మరణించడం. ఎలా అయినా వారిద్దరి మరణాన్ని అడ్డుకుని ఆ యుద్ధం నుండి దేశాన్ని కాపాడాలనుకుని నిర్ణయించుకున్న జై ఇథియోపియా వెళ్ళిన తరువాతి రోజుకి విశాఖపట్నం వచ్చేలా తేదీని సెట్ చేస్తాడు.
ఇకపోతే ప్రస్తుతంలో బ్రిటన్ మేయర్ జాన్సన్ ఇటలీ మెరైన్లు ద్వారా దేశాల మధ్య యుద్దాన్ని సృష్టించి తన వ్యాపారం సాగించాలనే ఆలోచనలో ఉంటుంది. అందుకోసం భారతీయ వ్యాపారి అయిన ముఖర్జీ ద్వారా ఆ ఇద్దరు ఇటాలియన్ మెరైన్లను హత్య చేయించాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇక్బాల్ ను ఎన్నుకుంటుంది. మొత్తానికి జై ఆ సంఘటన జరగకుండా కూడా ఇక్బాల్ ను అజ్ఞాతంగా ఆ బెరెట్టాతోనే కాలుస్తాడు.
ఇక వసాబా త్వరలోనే జైను కలవడానికి వస్తున్నానని చెప్తుంది. ఈ నవలలో జై 12 ఏళ్ళు గతంలోకి పయనించి వచ్చాక అతని ప్రస్తుతంలో ఆ 12 ఏళ్ళు కలిపిన వయసులోనే ఉంటాడు.అందుకే అతన్ని అతని పక్కింటి వారు గుర్తించలేరు. టైమ్ ట్రావెల్ కాల్పనిక అంశమైనా సరే రచయిత లాజిక్ కు వ్యతిరేకంగా కథ నడవకుండా ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ప్రపంచ చరిత్ర,టైమ్ ట్రావెల్, ప్రపంచ రాజకీయ నాయకులు వంటి గురించి రచయిత చేసిన విశేష కృషి ఈ నవలలో స్పష్టమవుతుంది. నవలా శీర్షికా,కథను నడిపిన తీరు అంతా కూడా పాఠకులకు ఓ సినిమా చూస్తున్న భావనను కలిగిస్తుంది.
ఈ నవలలో పాత్ర చిత్రణ,సన్నివేశాల సమాహారం అంతా కూడా దేశం-కాల పరిస్థితులు-రాజకీయాలను దాటి పోకుండా ఉంటుంది. సినిమాటిక్ శైలి ఈ నవలలో స్పష్టమవుతుంది. సినీ,సిరీస్ రచనల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నా అమిరిశెట్టి గోపాల్ గారి అక్షర కవాతు బిగ్ స్క్రీన్ లో విజయవంతం అవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుందాము

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష