ఆకర్షణ
చదువరి
ఆకర్షణ
-శృంగవరపు రచన
సాహిత్యమంటే కొన్ని సార్లు మనిషి తనలోపలి మనిషిని తడిమి చూసుకోవడమే.జీవితంలో యవ్వన దశ దాటాక ఆ వయసు ఓ ఆకర్షణ వలయం అని భావిస్తాము.యవ్వనంలో కలిగే ఆలోచనల్లో వాస్తవికత ఉన్నా లేకపోయినా ఆ ఊహలు మధురంగా అనిపిస్తాయి.తెలివైన వారినో,అందమైన వారినో,లేక ఏదో ఒక అంశంలో నచ్చిన వారినో చూసి ఆకర్షణకు లోనవ్వడం సహజం. అటువంటి ఆకర్షణలో ఓ అమ్మాయి సామాజిక వాస్తవికతను గుర్తించక ఎలా మూర్ఖంగా ప్రవర్తించిందో,చివరకు ఆమె ఎలా వాస్తవాన్ని తెలుసుకోగలిగిందో స్పష్టం చేసే నవలే అల్లూరి(పెన్మెత్స)గౌరీ లక్ష్మి గారి ‘అనుకోని అతిధి’ నవల.
ఈ నవలలో ప్రధాన పాత్రలు నాలుగు. ఒకరు కృష్ణ మోహన్,ఓ ఆఫీసులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. అతని భార్య శిల్ప. వారిద్దరి వివాహమై రెండేళ్ళయింది. వారిద్దరి అన్యోన్య దాంపథ్యంలో అప్పటి వరకు ఏ కలతలు లేవు. మూడో పాత్ర శ్వేత.శ్వేత కృష్ణ మోహన్ ఆఫీసులో అతనికి పి.ఏ గా పని చేస్తుంది. శ్వేత స్వస్థలం రాజమండ్రి అయినా ఉద్యోగం కోసం హైదరబాద్ వచ్చింది. ఆమెకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు,అయినా సరదాకు చేస్తుంది. నాలుగో ముఖ్య పాత్ర రవి.శిల్ప మేనత్త కొడుకు. ఇతను ఓ హై స్కూల్ లో టీచర్ గా పని చేస్తూనే,తనకున్న పొలాన్ని చూసుకుంటున్నాడు.
శిల్ప వయసు ఇరవై ఒకటి.ఉద్యోగరీత్యా వచ్చిన ఆమె బంధువులింట్లో ఉంటుంది.ఆమెకు కృష్ణమోహన్ ను చూడగానే అతని పట్ల ఆకర్షణ కలిగింది. కృష్ణమోహన్ రూపం,స్మార్ట్ నెస్,సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి ఇష్టపడింది. అతనికి పెళ్ళయింది అని తెలిసినా సరే తన ఆలోచనలు మార్చుకోలేదు.ఆమెకు తాను చేస్తుంది తప్పు అన్న ఆలోచన కలగలేదు. అతన్ని పెళ్లి చేసుకున్నా,ఆమె అతని మొదటి భార్యకు అడ్డు కానని,అతని నుండి డబ్బు ఆశించనని,లీగల్ హక్కులు అవసరం లేదని తనను తాను సమర్ధించుకుంటుంది. ఈ విషయాన్ని కృష్ణ మోహన్ కు చెప్పే ముందే సరాసరిగా అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శిల్పకు చెప్తుంది.
శిల్ప షాకవుతుంది. కృష్ణ మోహన్ కు చెప్తుంది. కృష్ణ మోహన్ ఆమె జోక్ చేసిందేమో అనుకుంటాడు.కానీ తర్వాత శ్వేతతో మాట్లాడితే అది నిజమేనని అర్ధమవుతుంది.అందుకని మూడు రోజులు ఆమె బదులు ఇంకొకరి చేత పని చేయించుకుంటాడు.ఆ మూడు రోజులు ఏమి తినకుండా ఉండటం వల్ల శ్వేత హాస్పటల్ పాలవ్వడంతో ఆమెను చూడటానికి కృష్ణమోహన్ వెళ్తాడు.అలా ఆమెను చూడటానికి రెండు మూడు సార్లు వెళ్తాడు కృష్ణమోహన్. ఆ విషయం తెలుసుకున్న శిల్ప తన మాట దాటి ఆమెను చూడటానికి భర్త వెళ్ళాడని భావించి అతనికో ఉత్తరం రాసి పుట్టింటికి వెళ్ళిపోతుంది.
కృష్ణ మోహన్ కు ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలుపోదు. శిల్ప పుట్టింట్లో ఉన్నప్పుడు వచ్చిన రవి శిల్ప సమస్య తెలుసుకుని తాను పరిష్కరిస్తానని చెప్తాడు.శిల్పతో కలిసి రవి కూడా ఆమె ఇంటికి వస్తాడు. కృష్ణ మోహన్ ది మృదువైన మనస్తత్వం కావడం వల్ల గట్టిగా చెప్పలేకపోవడం వల్ల శ్వేత కృష్ణ మోహన్ కు కూడా తన మీద ప్రేమ ఉందనుకుందని భావించిన అతను ఆమెకు అర్ధం అయ్యేలా లోకం పోకడ చెప్పడం,దానికో చిన్న నాటకం ఆడటంతో ఆమె నిజం తెలుసుకుంటుంది. రవి బాల్యం నుండే శిల్పను ఇష్టపడినా ఆర్థిక వ్యత్యాసం వల్ల చేసుకోకపోయినా ఆమె కాపురంలో కలతలు తీర్చడానికి చేసిన ప్రయత్నం శ్వేతకు రవిని ఓ మిత్రుడిని చేస్తుంది.
మనిషి చుట్టూ ఉండే ఒంటరితనం,మనసులోని ఒంటరితనమే ఒక్కోసారి మనిషిని ఎవరో ఒకరికి దగ్గరయ్యేలా చేస్తుంది.ఆ ఒంటరితనం కొన్నిసార్లు వయసుకు కూడా వర్తిస్తుంది. భద్రతా వలయంలో ఉన్నప్పుడూ ఏది చేసిన తప్పు కాదనే అనిపిస్తుంది. ఆ భద్రత అభద్రత ఆ తప్పు వల్ల మారుతుందని మనిషి ముందే గ్రహించగలిగితే తప్పక ఎన్నో అనివార్యమైన వయసులో చేసే తప్పులను నివారిస్తాడు.
అదే ఒంటరితనం,కొత్త వాతావరణం శ్వేతను సౌమ్యంగా ఉండే కృష్ణ మోహన్ వైపు ఆకర్షితురాలు అయ్యేలా చేసింది.ఎప్పుడైతే రవి ఆమెకు నిజాన్ని చెప్తూ మిత్రుడిలా ప్రవర్తించాడో ఆమె జీవితంలోని విస్తృత్వాన్ని చూసే ప్రయత్నం చేసింది. మనిషి ఎంత ఎక్కువ తన గురించి,తన జీవితం గురించి తెలుసుకుంటాడో అన్ని తక్కువ తప్పులు చేస్తాడు.
* * *
Comments
Post a Comment