మారిపోయే నిజాలు

 మారిపోయే నిజాలు

-శృంగవరపు రచన



ఏ మనిషి తప్పు చేయాలనుకోడు. కానీ అతని భావోద్వేగాలు, అణుచుకోలేని ఆవేశం అతన్ని దాటి ఆ తప్పు వరకు పయనిస్తుంది. కొందరు తాము చేసిన తప్పులకు బాధ పడితే, ఇంకొందరు తాము అసలు ఆ తప్పే చేయలేదన్న భావనతో ఓ 'Alternate Reality'ని సృష్టించుకుని దానిలో జీవిస్తూ ఉంటారు. ఆల్టర్నేట్ రియాలిటీ మీద సినిమాలు నేడు థ్రిల్లర్స్ లో ఓ భాగమైపోయాయి. షట్టర్ ఐలాండ్ ఈ వర్గానికి చెందిన సినిమానే. ఇదే కోవకు చెందిన ఇంకో సినిమానే Fractured.
సినిమా లో రే మున్రో తన భార్య, కూతురుతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అతనికి అతని భార్యకు మధ్య ఏవో మనఃస్పర్ధలు ఉన్నాయన్న విషయం మాత్రం వారి మాటల ద్వారా ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఆ తర్వాత మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగి అతను తన భార్యకు కోక్ తీసుకుని వచ్చాక అతని కూతురు పెరి తన మేకప్ కిట్లోని కాంపాక్ట్ ను అక్కడి వాష్ రూమ్ లో మర్చిపోయానని చెప్పడంతో అతని భార్య అక్కడికి వెతకడానికి వెళ్తూ, అతన్ని కారులో వెతకమని చెప్తుంది.
కారులో అతను వెతుకుతున్న సమయంలో పెరి అక్కడ ఉన్న ఓ బొమ్మ లాంటి దాన్ని చూసి దానిని తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఓ కుక్క ఉండటంతో అప్పుడే కూతురిని చూసిన రే ఆమె దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసేటప్పటికే ఆ పాప ఆ కనస్త్రక్షన్ సైట్ లో పడిపోతుంది. ఆమెను కాపాడటానికి రే కూడా కిందకి దూకుతాడు. అతను కాసేపు స్పృహ కోల్పోయినా తిరిగి అతని భార్య వస్తుంది. కూతురికి పెద్ద దెబ్బ తగలదు, కానీ నొప్పిగా ఉందనడంతో హాస్పటల్ కు వెళ్తారు.
హాస్పటల్ కు వెళ్ళాక అతని భార్య, కూతురు ఎక్స్ రే స్కానింగ్ కు వెళ్తారు. వారి కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎదురు చూసిన వారు తిరిగి రారు. అతనికి అనుమానం కలిగి అడిగితే అసలు వారు ఎవరూ రాలేదని, పేషంట్ గా వచ్చింది రే ఒక్కడే అని చెప్తారు. తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్లిన సిసి కెమెరాల్లో కూడా అతను ఒక్కడే ఉంటాడు, అతని కుటుంబం ఉండదు.
నిజానికి జరిగింది ఏమిటంటే రే మొదటి భార్య యాక్సిడెంట్ లో మరణించింది. ఆ తర్వాత రెండవ భార్యతో సంబంధం సరిగ్గా లేదు. ఆ రోజు కారులో వెళ్తున్న సమయంలో కూతురు బొమ్మ కోసం వెళ్లడం, ఎదురుగా కుక్క ఉండటం ఆమె పడిపోయి మరణించడం జరుగుతుంది. ఆమె కోసం పడిన రే తలకు దెబ్బ తగులుతుంది. అతనికి స్పృహ వచ్చేసరికి అతని భార్య అక్కడే బిడ్డ దగ్గర ఉండిఏడుస్తూ ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆమెను గట్టిగా పక్కకు తోసేస్తాడు. దానితో ఆమె కూడా మరణిస్తుంది. ఆ తర్వాత ఆ నిజాన్ని జీర్ణించుకోలేక 'Alternate Reality'ని సృష్టించుకుంటాడు.
తనతో పాటు తన భార్య, కూతురు వచ్చారని, వారి అవయవాల కోసం తీసుకువెళ్లారని నమ్మి కిందకు వెళ్ళి ఎవరో ఆపరేషన్ లో ఉంటే అతన్ని భార్య కూతురు అనుకుని కారులో వేసుకుని వెళ్ళిపోతూ ఉండటంతో సినిమా ముగుస్తుంది.
Alternate Reality ని వాస్తవిక ప్రపంచంగా నిర్మించి రెండు కథలను ప్యారలల్ గా నడపటం చాలా కష్టం. Alternate Reality ప్రపంచంలో ఆర్గాన్ మాఫియా అన్నట్టు ప్రేక్షకులకు అనిపిస్తుంది. నిజానికి లేని వారిని ఉన్నట్టు తనను తాను తప్పు చేయలేదు అని నమ్మించుకోవడానికి బలంగా ప్రయత్నించడం ఈ సినిమా అంతర్జాతీయ దృష్టిలో పడేలా చేసింది. తప్పక చూడాల్సిన సినిమా.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!