భయంలో సానుభూతి
చదువరి
భయంలో సానుభూతి
-శృంగవరపు రచన
సాహిత్యంలో,సినిమాల్లో భయానికి ఓ విశిష్ట స్థానముంది. ఆ భయాన్ని మరణాలు,ప్రేతాత్మలు,మనుషుల్లోని క్రూరత్వాలు వంటివెన్నో బలపరుస్తాయి. సాహిత్యం వల్ల ప్రయోజనం ఉండాలి అనే వాదనకు ఎటువంటి ప్రయోజనం అన్నది ఇంకో అంతర్లీన ప్రశ్నగానే మిగిలిపోతుంది.సాహిత్య ప్రయోజనం అవగాహనా విస్తృతిని సువిస్తీర్ణం చేయడం అయితే ఆ శక్తి అన్నీ అంశాలకు ఉండే ఉంటుంది. నేను ప్రయోజనం కోసమే పనికట్టుకుని చదవాలనే కంకణం కట్టుకోలేదు కనుక అన్నీ రకాలవి చదవడంలో ఉన్న అనుభూతుల్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. అలా నేను చదివిన నవలే చందు సొంబాబు గారి 'మాన్ స్టర్.' ఈ నవల పల్లవి సచిత్ర వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడి ఓ సంచలనం సృష్టించింది.
నవలాంశంలో ముఖ్య భావోద్వేగ అనుభూతులు భయం,ఉత్కంఠ.మామూలు ప్రేతాత్మ కథే.కథ ఎక్కువగా నన్ను ఆకర్షించలేదు కానీ రచయితకున్న పద సంపద,ఆ కాలం నాటికి నేటికీ నవలా రచనా శైలిలో కథా సమన్వయానికి మధ్య వచ్చిన ముఖ్య మార్పులు నాటి నవలా సాహిత్యంలో ప్రస్పుటమవ్వడం వంటివి నన్ను ఆకర్షించాయి.
బదిరి,అలకానంద భార్యాభర్తలు.వ్యాపారం పని మీద ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లినప్పుడు అలాకానందను ఓ ప్రేతాత్మ ఆవహిస్తుంది.అక్కడి ఆ గదిలోనే ఒకప్పుడు అలకనందను ప్రేమించిన సంజీవరావు బలవన్మరణం పొందడం వల్ల అతను ప్రేతాత్మ అవుతాడు.ఆ తర్వాత అతను ఆవహించడం వల్ల ఆమె ప్రవర్తనంలో మార్పులు రావడం, డాక్టరుగా దేవర్షి అడుగుపెట్టడం జరుగుతుంది.ఓ మాంత్రికుడు ఆ ఆత్మను బంధించడం ఎవరో ఆ ఆత్మను విడిపించడం ఆ తర్వాత మాంత్రికుడు మరణించడం జరుగుతుంది.
అలకానందకు ఓ కూతురు శ్వేత. ప్రస్తుతం ఆవహించాక ఇంకో కొడుకు పుడతాడు. ఆ బాబు పేరు మహేంద్ర.దేవర్షి సంజీవరావు తండ్రి. తన కొడుకు ఆత్మను కాపాడుకున్న అతను దానిని ఆ బాలునిలో ప్రవేశపెడతాడు. ఆ తర్వాత ఆ బాలుని ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. చివరకు ఆ బాలుడే తల్లిదండ్రులను కాపాడటం, తన కొడుకు మరణం మీద అలకానంద కుటుంబం మీద కక్ష సాధించాలనుకున్న తండ్రినే హతమార్చి,ఆ ప్రయత్నంలో తాను మరణించడంతో నవల ముగుస్తుంది.
చదవాల్సిన నవల అని నేను సూచించను. ఇప్పుడు సాహిత్యంలో ఇటువంటి రచనలు తక్కువే. ఒకవేళ భయానక రసాన్ని సాహిత్యంలో అయినా,సినిమాల్లో అయినా భాగం చేసినా చివరకు సైన్స్,లేదా పాత్రల మానసిక ప్రవృత్తులతో ముడిపెట్టి ఓ సమన్వయాన్ని ఏర్పరచడంలో రచయితలు,దర్శకులు శ్రద్ధ తీసుకుంటున్నారు.
తెలిసిన కారణాల వల్ల మనిషికి ఏర్పడే భయానికి పరిష్కారాలు ఉంటాయి.కానీ మనుషులకి తెలియని కారణాల వల్ల,నిస్సహాయులయ్యే పరిస్థితుల వల్ల ఏర్పడే భయానికి పరిష్కారాలు ఉండవు.ఆ స్థితిలో ప్రతి సందర్భం కథలు ఒకటే అయినా ఆసక్తికరంగానే ఉంటాయి. భయం అంటే ఏ మనిషి ఒప్పుకోడు. అదే ఊహాతీత శక్తి వల్ల ఏర్పడే భయంకు సానుభూతి లభిస్తుంది.అందుకే కథల్లో ఇటువంటి భయమే ఇటువంటి సాహిత్యానికి,సినిమాలకు ఓ స్థానాన్ని కల్పించింది.సరదాగా చదవాలనుకుంటే అన్ని రకాల రచనలు చదవండి.ఓ రకమైన ప్రయోజనం కావాలనుకుంటే పరిమితమవ్వండి.నచ్చినా,నచ్చకపోయినా ప్రతి పుస్తకం తాను ఏదో ఒక భావనను పాఠకులకు కలిగిస్తూనే ఓ కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. ఈ నవల చదివాక ఈ భయం గురించే నేను చాలా సేపు ఆలోచించాను.ఏదైనా చదవండి,కానీ చదివాక మాత్రం ఆలోచించండి.ఆ ఆలోచనే ఆ పఠన ప్రయోజనం.
* * *
Comments
Post a Comment