నేనే హంతకుడిని!

 నేనే హంతకుడిని!

-శృంగవరపు రచన



లీగల్ థ్రిల్లర్స్ లో మర్డర్స్ ను ఆసక్తికరమైన పరిస్థితులతో ఊహించని మలుపులతో కథగా మలచడం కత్తి మీద సామే. అటువంటి కథల్లో కనిపించే నేరం, కనబడని నేరం రెండింటి చుట్టూ కథ నడుపుతూ ఓ క్రైమ్ స్టోరీలో ఒక నేరం ఉన్న చోట రెండో నేరం కూడా ఉండేలా కథ రాయడం కూడా సులభం కాదు. ఎన్నో మలుపులతో 2016 లో వచ్చిన స్పానిష్ సినిమానే 'The Invisible Guest.' ఈ సినిమాను మూడు రిమేకులు చేసారు తర్వాత. ఓ ఇటాలియాన్ సినిమా, ఆ తర్వాత హిందీలో 'బదలా', తెలుగు లో అడవి శేషు 'ఎవరు' ఈ సినిమా ఆధారంగా వచ్చినవే.
ఏడ్రియన్ అనే వ్యాపారవేత్త తన గర్ల్ ఫ్రెండ్ లారాను హత్య చేసాడన్న నేరం మీద అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉంటాడు. అతన్ని కలవడానికి లాయర్ వర్జినా వస్తుంది. కేసుకు కీలకమైన ఓ సాక్ష్యం కోసం అడ్రియన్ లాయర్ ఫిలిక్స్ వేరే దేశం వెళ్లడటం వల్ల ఆ సమయంలో వర్జినా వస్తుందని చెప్తాడు.వర్జినా ఏడ్రియన్ ఉన్న హోటల్ కు వస్తుంది. ఏడ్రియన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరో ఉన్నారని ఇంకో మూడు గంటల్లో ఆ సాక్షి జడ్జి ముందుకు వెళ్తాడని ఈ లోపు తనకు నిజం చెప్తే తాను అతన్ని కాపాడగలనని చెప్తుంది.
ఏ నేరస్తుడు అయినా సరే సాధ్యమైనంత మేరకు తాను చేసిన నేరాన్ని కప్పిచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అటువంటి నేరస్తుడి నుండి నిజాలు రాబట్టడం లాజిక్ తో ఆలోచిస్తూ నేరస్తుడు చెప్పే వాటిల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెల్చుకోగలగడం, సహేతుకంగా ఆలోచించి, నిజాన్ని కనుక్కోవడం అన్న ప్రక్రియ ఈ సినిమా.
ఏడ్రియన్ కు వివాహమై భార్య, కొడుకు ఉన్నారు. అతనికి వివాహిత అయిన లారాతో సంబంధం ఉంది.ఓ రోజు ఆలస్యం అయిపోవడం వల్ల వారిద్దరూ ఓ షార్ట్ కట్ లో వెళ్తున్నప్పుడు మధ్యలో ఓ జింక అడ్డు రావడంతో వారి కారు ఇంకో కారును యాక్సిడెంట్ చేయడం, అందులోని వ్యక్తి మరణించడం జరుగుతుంది. ఇక ఆ సమయంలో ఏడ్రియన్ ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుండగా లారా అడ్డుకుని, ఆ కేసు తమకు చుట్టుకుంటుందని అందుకని ఆ కారును, శవాన్ని మాయం చేయమని చెప్తుంది. వారు అక్కడ ఉండగానే ఓ కారు అటువైపు వెళ్తుంది. ఆ డ్రైవర్ కు ఏదో చెప్పి పంపేస్తారు. ఆ తర్వాత ఆ కారును, శవాన్ని మాయం చేయడానికి ఆ యాక్సిడెంట్ అయిన కారులోనే వెళ్తాడు ఏడ్రియన్.
అదే సమయంలో లారా ఏడ్రియన్ కారు ఆగిపోవడంతో అక్కడే ఉన్న సమయంలో తోమా అనే అతను అటు వైపు వెళ్తూ తాను కారు బాగుంది చేస్తానని దగ్గరలో ఉన్న తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అలా అక్కడికి వెళ్లిన లారాకు వారి కొడుకే తాము యాక్సిడెంట్ చేసిన అతను అని, అతని పేరు డేవిడ్ అని తెలుస్తుంది. డేవిడ్ కు యాక్సిడెంట్ అయ్యాక అతని ఫోన్ లారా తీసుకుంటుంది. అదే సమయంలో ఆమె అక్కడ ఉండగానే ఆమె తల్లి ఆ ఫోన్ కు కాల్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఆ ఫోన్ ను ఆ ఇంట్లో సోఫా కింద పెడుతుంది. కారు బాగుంది కాగానే తీసుకుని ఏడ్రియన్ కాల్ చేసిన దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తుంది. ఆ పాటికే ఏడ్రియన్ కూడా ఆ కారును, అందులోని శవాన్ని ఓ దగ్గరలోని నదిలోకి తోసేస్తాడు.ఆ తర్వాత ఆ తన కారు పోయిందని ఫిర్యాదు ఇవ్వడం కాకుండా, ఆ సమయంలో తాను పారిస్ లో ఉన్నట్టు సృష్టిస్తాడు ఏడ్రియన్. ఇక ఆ తర్వాత లారా డేవిడ్ తాను పని చేసే బ్యాంకులో కొంత డబ్బును తీసుకున్నాడని, అందుకే పరారిలో ఉన్నాడన్నట్టు సృష్టించిందని చెప్తాడు. అలా దొంగగా పారిపోయాడనే ప్రపంచం నమ్ముతుంది. ఆ తర్వాత తమకు ఎవరో కాల్ చేసి ఆ హోటల్ కు రమ్మన్నారని ఆ ఫోటోలు పంపారని, డబ్బు కూడా అడిగారని, అందుకే తాను, లారా అక్కడికి వచ్చామని కానీ ఆ తర్వాత తన తల మీద ఎవరో బలంగా కొట్టారని, తాను లేచేసరికి లారాను హత్య చేసారని, ఆ నేరం తన మీద మోపారని చెప్తాడు ఏడ్రియన్.
ఏడ్రియన్ చెప్పింది విన్న వర్జినా డేవిడ్ ను దొంగగా చిత్రికరించేంత పలుకుబడి లారాకు లేదని అది ఏడ్రియన్ చేసి ఉంటాడని, లారా మీద తోసినప్పటికి అవి అతనే చేసి ఉంటాడని చెప్తుంది వర్జినా.ఏడ్రియన్ వర్జినా చెప్పింది వాస్తవం అని ఒప్పుకుంటాడు. అంతే కాకుండా ఆ రోజు ఆ కారులో అతను చనిపోయాడని అనుకున్నా తాను తోసే సమయంలో బ్రతికే ఉన్నాడని ఇక తానే అయినా తోసేశానని చెప్తాడు. అతను చెప్పిన మిగిలిన కథ కూడా అబద్ధమే అని అతని ద్వారానే వర్జినా నిజం చెప్పిస్తుంది.
లారా జరిగిన దాని గురించి బాధ పడుతూ దానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని జరిగింది డేవిడ్ తల్లిదండ్రులకు చెప్తుంది. తానే ఏడ్రియన్ కు ఎవరో డబ్బు కోసం బెదిరిస్తున్నారని చెప్పి ఆ డబ్బు ఆ తల్లిదండ్రులకు ఇపిద్దామని అనుకుంటుంది, దాని వల్ల కొంత మేరకైనా న్యాయం జరుగుతుందని, దానితో పాటు ఆ బాడీ ఎక్కడ ఉందో చెప్తే తల్లిదండ్రులకు ఉపశమనం ఉంటుందని భావిస్తుంది. అక్కడికి వచ్చాక ఆమె చేసింది అర్ధం చేసుకున్న ఆమెను హత్య చేస్తాడు ఏడ్రియన్. ఆ తర్వాత తప్పించుకునే మార్గం లేకపోవడం వల్ల అక్కడే ఉండిపోతాడు.
వర్జినా రూపంలో వచ్చింది డేవిడ్ తల్లి అని, అసలు ఏ సాక్షి లేరని, తానే వర్జినా అని నమ్మించి నిజాలు చెప్పించి రికార్డ్ చేసిందని, మధ్యలో ఫిలిక్స్ ఫోన్ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసిందని ఏడ్రియన్ కు అర్ధం అయ్యేసరికి డేవిడ్ తండ్రి పోలీసులకు ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఫోన్ చేస్తాడు. దీనితో సినిమా ముగుస్తుంది.
థ్రిల్లర్ సినిమాలు అంటేనే ఓ హత్య చుట్టూ నడిచేవి, అందులో మనిషి తనను తాను తప్పించుకునే ప్రయత్నంలో చేసే తప్పులు, అతను ఆ తప్పులు చేసేలా చేసి నిజాలు తెలుసుకోవడం వంటివి మలుపులతో ప్లాన్ చేసి కథను నడిపించడం ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఒకవేళ మీరు ఏ రిమేక్ అయినా చూసి ఉంటే ముందు ఊహించగలుగుతారు కనుక ఆసక్తి ఉండదు. కానీ ఒరిజినల్ సినిమా కనుక తప్పక చూడండి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!